మల్కా ఇన్ ఫ్యారీస్

మల్కా ఇన్  ఫ్యారీస్ - Sakshi


సిటీ డిజైనింగ్ పతాక ఈఫిల్ టవర్‌పై ఎగరనుంది. ఫ్యాషన్ వరల్డ్‌కు కేరాఫ్ అనిపించుకునే పారిస్‌లో హైదరాబాద్ తొలి అడుగు వేయనుంది. తెలంగాణ చేనేత  వైభవం ఎల్లలు దాటనుంది. ఈఫిల్ టవర్ మీద ఫ్యాషన్ వేడుకతో ఈ సంచలనాలను మనకు చవి చూపించనున్నారు తెలంగాణ ఫ్యాషన్ సెన్సేషన్ శిల్పారెడ్డి.

 

 సిటీ డిజైనర్లు అంతర్జాతీయ యవనికపై రాణిస్తున్న తరుణంలో శిల్పారెడ్డి... సిటీ ఫ్యాషన్ ను ఫ్యాషన్‌ల స్వర్గమైన పారిస్ దాకా తీసుకెళ్లనున్నారు. తద్వారా హైదరాబాద్ నుంచి ఈ క్రెడిట్ సాధించిన ఫస్ట్ డిజైనర్‌గా నిలవనున్నారు. ఆమెతో బాటే తెలంగాణకు చెందిన మల్‌ఖా ఫ్యాబ్రిక్ కూడా ర్యాంప్‌పై తళుకులీననుండటం విశేషం. ఈఫిల్ టవర్‌ను వేదికగా చేసుకుని ఈ నెల 31న  ఈ ఫ్యాషన్ వండర్ జరుగనుంది.

 

 తనను తాను మలచుకునే ‘శిల్ప’ం..

 మోడల్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, న్యూట్రిషనిస్ట్, డిజైనర్.. మిసెస్ ఇండియా.. ఇలా తన పేరుకు ముందు బోలెడన్ని విశేషణాలు చేర్చుకుంటూ విభిన్న రంగాల్లో విజయాలు నమోదు చేస్తున్నారు శిల్పారెడ్డి. ప్రస్తుతం డిజైనర్లకు కలల గమ్యం లాంటి పారిస్‌లో తొలిసారి కాలు మోపుతున్నారు. ‘ ఈఫిల్ టవర్ అనే ఆర్కిటెక్చర్ అద్భుతంపై నా డిజైన్లను ప్రదర్శించే అవకాశం రావడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు శిల్పారెడ్డి.  తన డిజైన్ల కోసం తెలంగాణ, ఆంధ్రప్రాంతాల్లో మాత్రమే వినియోగించే, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం లాంటి మల్‌ఖా చేనేతను వినియోగించనున్నారు. ‘మన ప్రాంతానికి విశిష్టత తేవడం, సంప్రదాయ ఫ్యాబ్రిక్స్‌ను ఉపయోగించుకుని కూడా ఫ్యాషన్‌ను నిలబెట్టవచ్చునని తెలియజెప్పడమే పారిస్‌లో మల్‌ఖా ప్రదర్శనకు కారణం’ అన్నారామె. ఇప్పటిదాకా ఈ ఫ్యాబ్రిక్‌ని ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌లో ప్రదర్శించలేదని ఆమె గుర్తు చేస్తున్నారు.

 

 ప్లాంట్ బేస్డ్  డైస్‌ను ఉపయోగించి చేసిన పర్యావరణహిత ఫ్యాబ్రిక్ మల్‌ఖా అని చెప్పారు. దీన్ని ఉపయోగించి ఫుట్‌వేర్‌ను సైతం శిల్పారెడ్డి సృష్టించడం విశేషం. ‘ఈ అవకాశం నన్ను ఉత్తేజితురాల్ని చేస్తోంది. అదే సమయంలో కాస్త నెర్వస్‌గానూ ఫీలవుతున్నాను. నన్ను ఒక డిజైనర్‌గా కాకుండా ఒక భారతీయ ఫ్యాషన్ ప్రతినిధిగా చూస్తారు. ఇది పెద్ద బాధ్యత. మన భారతీయ ఫ్యాషన్‌కే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాను’ అని అంటున్నారు శిల్ప.

 

 ‘వండర్’ ఫుల్.. జెస్సికా

 ఆర్కిటెక్చర్ అద్భుతాలపై డిజైనింగ్ ఆవిష్కరణలు చేయడంలో విదేశీ మోడల్, జెస్సికా మినాహ్ స్పెషలైజ్ చేశారు. న్యూయార్క్‌కు చెందిన జెస్సికా ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో నివసిస్తున్నారు. ఐకానిక్ వెన్యూలను అద్భుతమైన క్యాట్‌వాక్‌లకు వేదికలుగామలచడం ద్వారా జెస్సికా పేరొందింది. ఈ తరహా వేదికలపై ర్యాంప్‌వాక్‌లు నిర్వహించడానికి అనుమతి ఉన్న ఏకైక ఫ్యాషన్ డిజైనర్ ఈమే.

 

  గ్రాండ్ కెన్యన్ స్కైవాక్ (అమెరికా), లండన్స్ టవర్ బ్రిడ్జ్ (యూకే), పెట్రొనాస్ ట్విన్ టవర్స్ స్కై బ్రిడ్జ్ (మలేషియా), కోస్టా అట్లాంటా (దుబాయ్), గార్డెన్స్ బై ది బేస్ ఒసిబిసి స్కై వే (సింగపూర్), సియెనె రివర్ (పారిస్), వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (న్యూయార్క్)లలో ఆమె ఇప్పటిదాకా షోస్ నిర్వహించి ఫ్యాషన్ ప్రపంచాన్ని అబ్బుర పరిచింది. విశేషమేమిటంటే వీటిలో ఇప్పటిదాకా ఒకే ఒక ఇండియన్ డిజైనర్ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత సిటీడిజైనర్ శిల్పారెడ్డికి మాత్రమే ఆ అవకాశం లభించింది.  ఆమెతో పాటు ఈ షోలో మరో 10 దేశాల నుంచి డిజైనర్స్ పాల్గొంటున్నారు.

 

 పల్లెల నుంచి... పారిస్ దాకా...

 సున్నితత్వాన్ని ప్రతిబింబించే మల్ మల్, గట్టిదనాన్ని చెప్పే ఖాదీల కలయికకు మల్‌ఖా పేరు పెట్టారు. ఎక్కువగా తెలంగాణ, తక్కువగా ఆంధ్ర రీజియన్స్‌లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది మల్‌ఖా. మహబూబ్‌నగర్‌లోని బూర్గుల గ్రామం, కరీంనగర్ జిల్లా  సిరిసిల్ల, ఎల్లంటకుంట, ఖమ్మం జిల్లాలోని పునుకుల గ్రామం అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల, ఈస్ట్‌గోదావరి పులకుర్తిలో తయారవుతుంది.  ఈ మల్‌ఖా బ్రాండ్ ఫ్యాబ్రిక్‌ని తరుణ్‌తహిల్యానీ, సవ్యసాచి ముఖర్జీ తదితర టాప్ డిజైనర్లు సైతం వినియోగిస్తున్నారు.

 ప్రధానంగా మెహిదీపట్నంలోని ఖాదీబోర్డు షోరూం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోంది.

 - ఎస్.సత్యబాబు

 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top