టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో 'ఐ' వివాదం

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో 'ఐ' వివాదం - Sakshi


టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌లో కోలీవుడ్‌ టాప్ డైరెక్టర్‌ శంకర్‌, వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో విక్రమ్‌ కాంబినేషన్లో వచ్చే 'ఐ' సినిమాపై పెద్ద వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.  మనదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  



 భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ నిర్మాతగా 180 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.  సినీ దిగ్గజాలతో పాటు సాధారణ ప్రేక్షకులు  కూడా ఎప్పుడెప్పుడా అని ఈ మూవీ రిలీజ్ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల తెలిసిన సమాచారం ప్రకారం  సంక్రాతికి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నిరాశపరిచే విధంగా ఉండనుంది.



ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జనవరి రెండవ వారంలో విడుదల కానుంది. టాలీవుడ్‌లో మాత్రం ఆ తేదీన విడుదలయ్యే అవకాశం లేదంటున్నారు. ఇక్కడ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్‌ రూల్స్‌ ప్రకారం పండగ సమయాల్లో కేవలం డైరెక్ట్‌ తెలుగు చిత్రాలనే విడుదల చేయాలి.  'ఐ' డబ్బింగ్‌ మూవీ కావడంతో దానీ విడుదలను వాయిదా వెయ్యాలని ఛాంబర్‌లో పెద్ద వివాదమే చెలరేగుతున్నట్లు సమాచారం.



ఇదిలా ఉంటే ఇప్పటికే గోపాల గోపాల, టెంపర్‌, రుద్రమదేవి వంటి భారీ చిత్రాలు సంక్రాతి బరిలో ఉన్నాయి.  ఈ పరిస్థితులలో 'ఐ' కూడా విడుదలైతే థియేటర్స్‌ కొరత ఏర్పడే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడితేనే మంచిదనే అభిప్రాయం టాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలలో వినిపిస్తోంది. అదే నిజమైతే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతికి 'ఐ' సినిమా చూసే అవకాశం ఉండదు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top