జెన్‌... ఒక జీవనవిధానం!

జెన్‌... ఒక జీవనవిధానం!


సందేశం

మంచి భోజనం చేస్తే ఎంత తృప్తి లభిస్తుందో ఒక మంచి కథ విన్నా, చదివినా అంతే ఆనందం, తృప్తి లభిస్తాయి. కథ చదవటమే కాకుండా దాని గురించిన విశ్లేషణ వల్ల కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అసలు కథలు అన్నమాట వినగానే పిల్లల దగ్గరనుంచి పెద్దల దాకా అందరికీ ఎంతో ఉత్సాహం వస్తుంది. మనకి తెలిసి ఎన్నో రకాల కథలున్నాయి. పంచతంత్ర కథలు– జంతువుల పాత్రలలో నీతిని బోధించే కథలుగా ప్రసిద్ధి పొందాయి. జాతక కథలు కూడా పంచతంత్ర కోవకే చెంది నీతిని అందిస్తాయి. ఇక హాస్యంతో నిండినవి తెనాలి రామకృష్ణ కథలు, అక్బర్‌ బీర్బల్‌ కథలు. ఇవి పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఉల్లాసాన్నిస్తాయి.



రామాయణ భాగవతాలు మొదలైన పురాణ గ్రంథాలు కూడా కథల రూపంగా వచ్చాయి. ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు వారి ఉపన్యాసాలలో సత్సంగాలలో మధ్యమధ్య సందర్భానుసారంగా ముల్లాకథలని ప్రస్తావిస్తూ ఉంటారు. మన దైనందిన జీవితంలో నిరాశానిస్పృహలు ఎదురైనప్పుడు కథలు చదవడం వల్ల కొత్త ఉత్సాహం తెచ్చుకోవచ్చు. కథలంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. కథ చెప్పేవారి నేర్పు, సామర్థ్యం మీద, వినేవారి ఉత్సాహాన్ని బట్టి అందులో ఆనందం పొందవచ్చు.



ప్రస్తుతం మనం చెప్పుకోబోయే జెన్‌ కథలు కూడా చాలా పురాతనమైనవే. భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం, చైనాలో చెన్‌గా మారి 12వ శతాబ్దంలో జెన్‌గా పరిణతి చెందింది. భారతదేశంలోని బౌద్ధం చైనాలోని తావోయిజం కలిపి జెన్‌గా మారింది. బోధి«దర్ముడు ఈ జెన్‌ను చైనాకు తీసుకువెళ్లాడు. జెన్‌ గురించిన సమాచారం, విజ్ఞానం సుజుకి అనే వ్యక్తి అక్కడివారికి తన ప్రసంగాలతో ప్రాచుర్యాన్ని కల్పించాడు.

జెన్‌ అంటే ఒక తత్వం కాదు, ఒక జీవన విధానం. జెన్‌ అంటే అప్రమత్తత. జెన్‌ అంటే ధ్యానం. నిశ్శబ్దంగా, కళ్లు మూసుకొని మౌనంగా బుద్ధిని కేంద్రీకరించి ధ్యానం చెయ్యడం ఒక విధమైన ప్రక్రియ. దీనివలన మన బుద్ధిని, మనస్సును ఒకే విషయం మీద లగ్నం చేసిన ఏకాగ్రత పెంచుకోవచ్చు.



మనం చేసే ప్రతిపనినీ ధ్యానంగా మార్చుకోమని చెబుతుంది జెన్‌. నడిచినా, మాట్లాడినా, తిన్నా, నిద్రపోయినా ఏ పని చేస్తున్నా ఏకాగ్రతతో, ఎరుకతో చేస్తే ఆ పనిలోనూ ఉత్సాహం ఉంటుందని అంటుంది జెన్‌ సిద్ధాంతం.



జర్మనీకి చెందిన ఓ మానసిక శాస్త్రవేత్త ఇలా చెప్పారు. ఎదుటివారి ప్రవర్తనలో పొరపాట్లు, లోపాలు చెప్పి వారిని సరిదిద్దటానికి ప్రయత్నిస్తే వారు తమ తప్పులు తెలుసుకోకపోగా తమని తాము సమర్థించుకోవడానికి యత్నిస్తారు. వారి ప్రవర్తన సరిదిద్దటానికి ప్రయత్నించినపుడు నేరుగా చెప్పక ఒక కథ రూపంలో చెప్పడం వల్ల వారి ప్రవర్తన అద్దంలో ప్రతిబింబంలాగా చేసుకుని చూసుకుని ఆత్మపరిశీలన చేసుకుని సరిచేసుకునే అవకాశం లభిస్తుంది అని. ముఖ్యంగా జెన్‌ కథలు చదివిన ప్రతిసారి వాటిలో ఒక కొత్త అర్థం స్ఫురిస్తుంది. మన సమస్యలకి తగినట్లుగా మనం సమాధానాలు తీసుకోవచ్చు. ఎన్నిసార్లు చదివితే అంత ఉపయోగం. చదివిన ప్రతిసారి ఒక మానసిక ఊరట, కొత్తదనం కనిపిస్తుంది. కాబట్టి కథలు చెప్పడం, వినడం, కథలు చదవడం ఎంతో మంచి అలవాటు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top