ఈ వారం యూట్యూబ్ హిట్స్‌


అతడిలా గన్‌ ఎవరూ తిప్పలేరు.. పేల్చలేరు

ది డార్క్‌ టవర్‌ : ట్రైలర్‌ : నిడివి : 2 ని. 55 సె.  ::: హిట్స్‌ : 99,74,990



కష్టాల్లో పడిన ప్రపంచాన్ని కాపాడ్డానికి ఎప్పుడూ సూపర్‌ హీరోలే దిగిరావాలా?! అవసరం లేదు. ఒక్క గన్‌స్లింగర్‌ కూడా సరిపోతాడు. ఎవడీ గన్‌స్లింగర్‌? నీ చేతిలో గన్‌ ఉండి, నీ గుండెలో దమ్ము ఉంటే నువ్వే గన్‌స్లింగర్‌. డూడ్‌ వింటున్నావా? నువ్వే గన్‌స్లింగర్‌. ఉత్తర ఆమెరికాలో పాతకాలం నాటి దొంగచాటు ఉద్యోగం గన్‌స్లింగింగ్‌. గన్‌స్లింగర్‌లా ఎవరూ గన్‌ తిప్పలేరు. వాడిలా కిరాయి తీసుకుని ఎవరూ కిల్‌ చేయలేరు! ‘ది డార్క్‌ టవర్‌’ సినిమాతో అలాంటి గన్‌స్లింగర్‌ ఒకడు బయల్దేరుతున్నాడు. ది లాస్ట్‌ గన్‌స్లింగర్‌ వాడు. తాడో పేడో తేల్చేసేవాడు. పేరు రొనాల్డ్‌ డెస్‌చైన్‌. వాడికి వాల్టర్‌ ఓ డిమ్‌ అనేవాడితో పడుతుంది. వాల్డర్‌ ఓ డిమ్‌. డార్క్‌ టవర్‌ని కూల్చేసేపనిలో ఉంటాడు. అది కూలిపోతే ప్రపంచం వెన్నెముక విరిగినట్లే! ఇద్దరి మధ్యా ఫైటింగ్‌ మొదలౌతుంది. టవర్‌ని కూల్చేలోపు, వాల్టర్‌ ఓ డిమ్‌ని పేల్చేయాలి. అదీ రొనాల్డ్‌ టార్గెట్‌. చివరికి ఏం జరుగుతుంది? మంచే జరగాలని ఎవరిమైనా కోరుకుంటాం కదా. పిక్చర్‌ ఆగస్ట్‌ 4న థియేటర్స్‌కి వస్తోంది. ఇదొక వెస్ట్రన్‌ సైన్స్‌ ఫాంటసీ యాక్షన్‌ హారర్‌ ఫిల్మ్‌. తీస్తున్నవాడు తక్కువవాడేం కాదు.



నికోలా ఆర్కర్‌. డానిష్‌ డైరెక్టర్‌. 2012 హిట్‌ మూవీ ‘ఎ రాయల్‌ అఫైర్‌’ అతడిదే. ఇప్పుడు స్టీఫెన్‌ కింగ్‌ నవల ‘ది డార్క్‌ టవర్‌’ను పట్టుకుని స్క్రీన్‌పైకి ఎక్కేశాడు. ఇక ట్రైలర్‌లో ఏముందో చూద్దాం. 11 ఏళ్ల కుర్రాడు ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు.  ‘వన్‌–నేనొక్కడినే’ సినిమాలో మహేశ్‌బాబు లేచినట్లు లేస్తాడు. నిద్రలో వాడికి ఊహాలోకపు ‘క్లూ’లు ఏవో అందుతుంటాయి! ఆ నిద్రలోనే ‘డార్క్‌ టవర్‌’ అనే ఒక కట్టడం కనిపిస్తుంది. దానిని చేరుకోవాలని అతడి కల. ఆ కలకు మన గన్‌స్లింగర్‌ ఒక నిజంలా తోడవుతాడు. అప్పుడే వాళ్లిద్దరికీ తెలుస్తుంది. వాల్టర్‌ ఓ డిమ్‌ అనే దుష్టుడు టవర్‌ని ధ్వసం చేయబోతున్నాడని. ఇక ఆట మొదలౌతుంది. అంతం... మీరు సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడే!



పక్కపక్క ఇళ్లలో పెరిగితే అన్నాచెల్లెళ్లేనా!

బెహెన్‌ హోగి తేరి  : ట్రైలర్‌ : నిడివి : 2 ని. 46 సె.  ::: హిట్స్‌ : 44,48,186



రాజ్‌కుమార్‌రావ్‌... పక్కింట్లో ఉన్న శ్రుతీహాసన్‌ని ప్రేమిస్తాడు. హవ్వ! చిన్నప్పట్నుంచీ పక్కపక్క ఇళ్లల్లో పెరిగారన్న ఇంగితం లేకుండా ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ప్రేమిస్తాడా అని లోకులు బుగ్గలు నొక్కుకుంటారు. రావ్‌కి ఈ లాజిక్కేంటో అర్థం కాదు. ‘‘నేను నిక్కర్లేసుకుంటున్నప్పటి నుండి బిన్నీని లవ్‌ చేస్తున్నాను కదా’’ అంటాడు. బిన్నీ అంటే శ్రుతీహాసన్‌.  ఆమె మీద ప్రేమను చంపుకోలేకపోతాడు. కాలనీలో అంతా బెహన్‌ అంటుంటే మాత్రం నేనెందుకు తనని బెహన్‌ అనాలి అని అడుగుతాడు కూడా. తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక శ్రుతికీ, ఆమె కుటుంబానికీ... అవసరం ఉన్నవీ లేనివీ సహాయాలు చేస్తుంటాడు. ఆమెను బైక్‌ ఎక్కించుకుని తిప్పుతుంటాడు. ఇది చుట్టుపక్కల పెద్ద మనుషులకు నచ్చదు.



తిప్పితే తిప్పావు కానీ, వేరే ఆలోచనతో తిప్పకు అని మధ్యమ«ధ్య హెచ్చరిస్తుంటారు. చివరికి ఏమౌతుంది? ప్రేమకోసం అతడు పడే పాట్లు చూసి మనకు నవ్వొస్తుంటుంది. అన్ని పాట్లు పడ్డాకైనా... ‘మీ చెల్లెలు మీకే చెల్లెలు... నాకు కాదు’ అని రాజ్‌కుమార్‌ రావ్‌ ధైర్యంగా చెప్పగలిగాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ‘బెహెన్‌ హోగి తేరి’ రిలీజ్‌ దాకా ఆగాలి. జూన్‌ 2న ఈ బాలీవుడ్‌ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ విడుదల అవుతోంది. లక్నో సంస్కృతీ సంప్రదాయాల్ని, అధునికత ప్రాచీనత కలగలిసిన ఆచారాలను కూడా ఈ చిత్రంలో చూడొచ్చు.

ఇక ఈ ట్రైలర్‌ సంగతి. ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ అనే స్టేట్‌మెంట్‌తో మొదలై... ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ నాట్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ అనే మాటతో ఎండ్‌ అవుతుంది. రాజ్‌కుమార్‌ రావ్‌  పేరు ఎక్కడో విన్నట్లుందా? కాయ్‌ పో చె సినిమా అతడికి మంచి పేరు వచ్చింది. పాపం ఇప్పుడు శ్రుతిని ప్రేమించి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. బయట కాదు. ‘బెహెన్‌ హోగి తేరి’ చిత్రంలో.



అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి ఏమైంది?

ఫ్యామిలీ విత్‌ ఇన్‌ఫాంట్‌ చిల్డ్రన్‌ బూటెడ్‌ ఆఫ్‌ డెల్టా ఫ్లయిట్‌ : నిడివి : 8 ని. 1 సె.  ::: హిట్స్‌ : 64,90,682



ఇటీవల అమెరికా వారి యునైటెడ్‌ ఎయిర్‌ లైన్స్‌ ఓ ప్యాసింజర్‌ని బయటికి ఈడ్చి పడేసిన వార్త మీకు గుర్తుండే ఉంటుంది! సీట్లకు మించి టిక్కెట్లు అమ్మి, సీట్ల ‘సర్దుబాటు’లో భాగంగా ఆ ఎయిర్‌లైన్స్‌ అలా అమానుషంగా ప్రవర్తించింది. అంతకు మించిన దారుణాన్ని ఇప్పుడు మీరీ వీడియోలో చూస్తారు. ఇందులో కనిపించే విమానం... డెల్టా ఫ్లయిట్‌ వాళ్లది. అదీ అమెరికాదే. వాళ్లు కూడా సీట్లకు మించి టిక్కెట్లు అమ్ముకున్నారు. తర్వాత ఏమైందంటే... షీయర్‌ అనే అతడు తన భార్య, ఇద్దరు పిల్లలతో డెల్టా ఫ్లయింట్‌ ఎక్కి కూర్చున్నాడు. నలుగురికీ టిక్కెట్లు ఉన్నాయి. కూతురు వయసు రెండేళ్లు, కొడుకు వయసు ఏడాది. కొడుకుకి కూడా టిక్కెట్‌ తీసుకున్నాడు. ఈ కుటుంబం యు.ఎస్‌.లోని మాయి ద్వీపం నుంచి లాస్‌ఏంజెలెస్‌ వెళ్లాలి. ఆ రోజు ఏప్రిల్‌ 23. ఆ ఫ్లయిట్‌ నెంబర్‌ 2222. విమానం బయల్దేరడానికి ముందు విమానం సిబ్బంది వచ్చి ఏడాది బిడ్డ పేరుతో ఉన్న సీటు ఇంకెవరి పేరుతోనో ఉందని, బిడ్డను తీసుకుని సీటు ఖాళీ చెయ్యమని అడిగారు. షీయర్‌ నివ్వెరపోయాడు. ‘‘డబ్బు పెట్టి కొన్న సీటును నేను వేరొకరికెందుకు ఇవ్వాలి’’ అని అడిగాడు.



ఫ్లయిట్‌ వాళ్లు ఏవో రూల్స్‌ మాట్లాడారు. ‘‘నేనూ అదే రూల్‌ మాట్లాడుతున్నాను. నేను టిక్కెట్‌ కొన్నాను. ఆ టిక్కెట్‌ని మీరే అమ్మారు. ఇప్పుడు ఇంకొకరి కోసం మమ్మల్ని ఎందుకు లేవమంటున్నారు?’’ అని అడిగాడు షీయర్‌. వాదన తెగలేదు. చివరికి షీయరే దిగిపోవలసి వచ్చింది. బిడ్డను ఒళ్లో పడుకోపెట్టుకుని ప్రయాణం చేయవచ్చు కానీ, అతడు అలా చేయదలచుకోలేదు. సత్యాగ్రహంతో ఎయిర్‌లైన్స్‌ వైఖరికి భార్యను, ఇద్దరు పిల్లల్నీ తీసుకుని ఫ్లయిట్‌ నుంచి వెళ్లిపోయాడు. మిగతా ప్రయాణీకులు ఇదంతా చూస్తూనే ఉన్నారు కానీ ఒక్కరూ షీయర్‌ వైపుగానీ, సిబ్బంది వైపు గానీ మాట్లాడలేదు. గగనవీధిలో ప్రయాణించవలసిన ఆ కుటుంబం ఆ అర్ధరాత్రి అలా నడివీధి పాలైంది. డెల్టా వంటి పౌరవిమానయాన సంస్థ సిగ్గుపడవలసిన ఘటన ఇది. మే 3న షీయర్‌ ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఈ ఘటనను షూట్‌ చేసిందెవరో... ఆ వివరాలను మాత్రం షీయర్‌ వెల్లడించలేదు. బహుశా అతడి భార్య తన సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసుండొచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top