ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్  హిట్స్‌ - Sakshi


స్లోమోషన్‌లో చచ్చి బతికాడు

క్రష్‌డ్‌ బై ఎ జెయింట్‌వాటర్‌ బెలూన్‌

నిడివి : 8 ని. 57 సె.

హిట్స్‌ :75,89,044


యూట్యూబ్‌లో ‘దిస్లోమోగైస్‌’ అనే చానల్‌ ఉంది. దాన్ని గవిన్‌ డేవిడ్‌ ఫ్రీ అనే బ్రిటిష్‌ కుర్రాడు నడిపిస్తుంటాడు. వాడికో ఫ్రెండ్‌ ఉంటాడు... గాన్‌ గ్రచీ అని. అతడిదీ బ్రిటనే. వీళ్ల చానల్‌లో వీళ్లిద్దరే నటీ నటులు. నటులు అనడానికి లేదు. వీళ్లు చేసేవన్నీ రియల్‌ థింగ్స్‌. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వండర్స్‌. ఆ వండర్స్‌ని వీళ్లు స్లోమోషన్‌లో చూపిస్తారు. లేటెస్టుగా గవిన్‌ ఏం చేశాడంటే.. తన కో–స్టార్‌ గ్రచీని నీళ్లు లేని ఒక స్విమ్మింగ్‌పూల్‌ లాంటి పెద్ద పాలిథీన్‌ తొట్టిలో పడుకోబెట్టి, అతడిపై ఆరు అడుగుల వాటర్‌ బెలూన్‌ను ఉంచాడు. ఉంచాడూ అంటే ఒకేసారి ఉంచడం కాదు. బెలూన్‌ తిత్తిని అతyì  కడుపు మీద పెట్టి, ట్యూబ్‌లోంచి మెల్లిగా నీళ్లు పంపించాడు. అది పెరిగి పెరిగి రాక్షసావతారం ఎత్తుతుంది. ఇక చూడండి గ్రచీ కదలడానికి లేదు. కదలాలంటే బెలూన్‌ను చిన్న సూదితో గుచ్చి, నీటినంతా బయటికి పంపాలి. గ్రచీ చేతిలో సూది కూడా సిద్ధంగా ఉంది. కానీ అంత పెద్ద నీటి బుడగను సూదితో గుచ్చితే ఒక్కసారిగా గ్రచీ పేలిపోడూ!!



పేలిపోడు కానీ, పేలిపోయినంత పని అవుతుంది అతడి బాడీకి. ఇదీ లేటెస్టుగా ‘దిస్లోమోగైస్‌’ చానల్‌ అప్‌లోడ్‌ చేసిన వీడియో. దీన్ని గవిన్‌.. స్లో మోషన్‌లో చూపించాడు. ఇప్పుడీ వీడియోకు ఫట్‌ ఫట్‌ మని హిట్‌లు వచ్చిపడుతున్నాయి. గతంలో కూడా ఓసారి జెల్లి బాల్‌ను షటిల్‌ బాట్‌లో కొట్టినప్పుడు ఆ జెల్లీ సూక్ష్మాతిసూక్ష్మంగా తునాతునకలైపోవడం స్లో మోషన్‌లో చూసి యూట్యూబ్‌ వ్యూయర్లు ‘వావ్‌’ అని ఎక్సైట్‌ అయ్యారు. ఆ రేంజ్‌లోనే ఉంది ఈ తాజా ‘అప్‌లోడ్‌’. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నా ఓపిగ్గా చూస్తే.. గ్రచీలా మీరూ షేక్‌ అయి షాక్‌ అవడం ఖాయం.  2010 పది నుంచీ వీళ్లిలా ప్రపంచానికి ఏదో ఒక జలక్‌ ఇస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో కనిపించే అనేకానేక స్లో మోషన్‌ వీడియో చానళ్లలో వీళ్లదే.. ‘ది బిగ్గెస్ట్‌’. పెద్ద పెద్ద వెబ్‌ అవార్డులు కూడా వచ్చాయి ఈ చానల్‌కు.



ఆశను వదులుకోని అమ్మాయి

మ్యాండీ హార్వే :డెఫ్‌ సింగర్‌

నిడివి : 6 ని. 6 సె.

హిట్స్‌ :1,08,20,332


మాండీ హార్వే అనే ఒక.. వినికిడి శక్తి లేని యువతి ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’ షోలో అత్యద్భుతంగా పాడి, జడ్జిలలో ఒకరు ఇచ్చిన ‘గోల్డెన్‌ బజర్‌’తో విజేత కావడాన్ని ప్రపంచం ఇప్పుడు ఈ వీడియోలో సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తోంది. అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ షో అన్నది ఒక రియాలిటీ టెలివిజన్‌ షో. ఎన్‌.బి.సి. నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంటుంది. సింగర్స్, డ్యాన్సర్స్, కమెడియన్స్, ఇంకా ఇతరత్రా ఆర్టిస్టులు ఈ షోలో తమ ప్రతిభను ప్రదర్శించి సెలబ్రిటీ స్థాయికి చేరుకుంటారు. లేటెస్టుగా ఆ సెలబ్రిటీ స్థాయిని మాండీ హార్వే చేరుకుంది. ‘యుకలేనీ’ (గిటార్‌ వంటి సంగీతవాద్యం) సహాయంతో గీతాలాపన చేసిన మాండీ, వేదిక మీద చెప్పులు విడిచి, పాదాలలోంచి వచ్చే సహవాద్యకారుల సంగీత ప్రకంపనలను బట్టి ‘ట్రై’ అనే పాటను పాడుతున్నప్పుడు ఆడియెన్స్‌ కళ్లు చెమర్చాయి.



మాండీ నాలుగేళ్ల వయసు నుండీ పాటలు పాడుతోంది. 18 ఏళ్ల వయసులో ‘కనెక్టివ్‌ టిస్యూ డిజార్డర్‌’ కారణంగా పూర్తిగా శబ్దగ్రాహ్యతను కోల్పోయింది. ఈ షోకి వచ్చేటప్పుడు జడ్జిల మాటలను సైగల ద్వారా తెలియజెప్పే ఒక సహాయకురాలిని వెంట తెచ్చుకున్నారు. మాండీ వయసు 29 ఏళ్లు. ‘ట్రై’ అనేది స్వయంగా ఆమె రాసుకున్న పాట! పాటను ప్రారంభించడానికి ముందు ‘ఆ పాటలోని అంతరార్థం ఏమిటి’ అని జడ్జిలలో ఒకరైన సైమన్‌ కావెల్‌  అడిగినప్పుడు..  ‘నా చెవులు ఇక పనిచేయవు అన్న చేదు నిజం తెలియగానే జీవితంపై ఆశలు వదులుకున్నాను. కానీ ఆశలు వదులుకోవడం కన్నా ఇంకా గొప్ప పని ఏదైనా చేయాలనుకున్నాను. అదే నేను నా పాటలో రాశాను’ అని మాండీ చెప్పడంతో ఒక్కసారిగా జడ్జిలు, ఆడియెన్స్‌ కరతాళధ్వనులతో ఆమె అభినందించారు.



ఇద్దరు తల్లుల డిస్నీ కామెడీ

రేవన్స్‌ హోమ్‌:డిస్నీ చానల్‌

నిడివి : 29 సె.

హిట్స్‌ : 24,26,285


డిస్నీ చానల్‌లో జూలై 21న మొదలౌతున్న కొత్త కామెడీ సీరీస్‌ ‘రేవన్స్‌ హోమ్‌’ ట్రైలర్‌ ఇది. ఇదే చానల్‌లో 2003లో మొదలై, 2007లో ముగిసిన ‘దటీజ్‌ సో రేవన్‌’కు ఇది సీక్వెల్‌. ఈ మధ్యలో ‘కోరి ఇన్‌ ద హౌస్‌’ అని ఆటలో అరటిపండు లాంటి (స్పిన్‌ ఆఫ్స్‌ అంటారు వీటిని) ఎపిసోడ్‌లు వచ్చాయి కానీ, ఇప్పుడు రాబోతున్నది ఫుల్‌ హౌస్‌ సిచ్యుయేషనల్‌ కామెడీ సీరీస్‌. కథ ఏంటంటే.. రేవన్, చెల్సీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరూ విడాకులు ఇచ్చేసిన తల్లులు. ఒకే ఇంట్లో ఈ ఇద్దరు తల్లులు, వాళ్ల పిల్లలు కలిసి ఉంటారు. ఒక కుటుంబంలా ఉంటారు. రేవన్‌కు ఒక అతీంద్రియ శక్తి ఉంటుంది. ఎదుటి వాళ్ల ఆలోచనల్ని తను తెలుసుకోగలదు. అయితే ఓ రోజు రేవన్‌కొడుకు బుకర్‌కు కూడా అలాంటి ‘సైకిక్‌’ పవరే ఉన్నట్లు బయటపడుతుంది. ఇక అక్కడి నుంచి కామెడీ పంట పండుతుంది. తల్లులు కూడా పిల్లల్లాగే ఉల్లాసంగా గడిపే కొన్ని మెరుపు శాంపిల్స్‌ ఈ వీడియోలో ఉన్నాయి.



ఉరితాడు వణికింది

నేనే రాజు నేనే మంత్రి: టీజర్‌

నిడివి : 40 సె.

హిట్స్‌ : 26,48,035


శేఖర్‌ కమ్ముల ‘లీడర్‌’ సినిమాలో రానా దగ్గుబాటిని మీరు ఒకలా చూసి ఉంటారు. ఇప్పుడు తేజ చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’లో మరొకలా చూడబోతున్నారు. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ రిలీజ్‌ ఎప్పుడో ఇంకా ఖరారు కాలేదు కానీ, టీజర్‌ను డి.రామానాయుడు 81వ జయంతి సందర్భంగా జూన్‌ 6న విడుదల చేశారు. రానా దగ్గుబాటి తెల్లవారుజామునే జైలు సెల్‌లోంచి చేతులకు, మెడకు గొలుసులతో, తెల్లపంచె కట్టుతో, ముఖానికి ముసుగుతో బయటికి రావడంతో టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. పక్కనే పోలీసులు కాపలాగా నడుస్తుండగా రానా ఉరికంబానికి చేరుకుంటూ ఉంటాడు.



బ్యాక్‌గ్రౌండ్‌లో పోసాని కృష్ణ మురళి.. ‘పుట్టినవాడు మరణించకా తప్పదు. మరణించినవాడు మళ్లీ పుట్టకా తప్పదు.. ఆమెన్‌’ అంటాడు. ఈ లోపు రానా ఉరితాడు ముందు నిలబడతాడు. అయితే అప్పుడు ముసుగు ఉండదు. సిగరెట్‌ పీలుస్తుంటాడు. పంచె పైకి ఎగ్గట్టుకుంటూ... ‘నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్‌ చేస్తా... నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్‌ చేస్తా. నా జీవితానికి నేనే రాజు. నేనే మంత్రి’ అని సిగరెట్‌ పీక విసిరేస్తాడు. అక్కడితో టీజర్‌ అయిపోతుంది. మరికొంత సేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎందుకో తెలుగులో టీజర్‌ల ఆయుఃప్రమాణం నిముషం కన్నా తక్కువే ఉంటుంది! ‹ప్చ్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top