ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌


నటన నచ్చదు మాకు.. నిక్కచ్చిగానే ఉంటాం!

నో ఫ్రాడ్స్‌ నిక్కీ మినాజ్, డ్రేక్, లిల్‌ వేన్‌ : నిడివి : 5 ని. 24 సె. ::: హిట్స్‌ : 90,51,765



ముప్పై నాలుగేళ్ల ట్రినిడాడ్‌– అమెరికన్‌ ఫిమేల్‌ సింగర్‌ నిక్కీ మినాజ్‌.. కెనడియన్‌ రేపర్‌ డ్రేక్, అమెరికన్‌ ర్యాపర్‌ లిల్‌ వేన్‌ (వీళ్లిద్దరూ పురుష పుంగవులు) లను కలుపుకుని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ బ్రిడ్జి దగ్గర దృశ్యీకరించిన ఈ ‘నో ఫ్రాడ్స్‌’ సింగిల్‌ సాంగ్‌  యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. ఇండియాకు పార్లమెంటు భవనం ఎలాగో, బ్రిటన్‌కు వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌ అలాగ. ఈ ఏడాది మార్చి 22న వెస్ట్‌మినిస్టర్‌ ప్రాంగణానికి సమీపంలో తీవ్రవాదుల దాడి జరగడానికి సరిగ్గా ముందు రోజే నిక్కీ మినాజ్‌ ఈ పాటను చిత్రీకరించారు. దాడి జరిగి, ప్రపంచం అంతా భయాందోళనలలో ఉన్నప్పుడు ఈ వీడియోను రిలీజ్‌ చెయ్యడం బాగుండదని నిక్కీ మొదట అనుకున్నప్పటికీ.. ఆపి ఉంచీ ఉంచీ ఈ నెల 17న విడుదల చేసేశారు! వెంటనే విమర్శకులు ‘బ్యాడ్‌ టేస్ట్‌’ అని విరుచుకు పడ్డారు.



అంటే.. వీడియోలోని సాంగ్‌ బ్యాడ్‌ టేస్ట్‌ అని కాదు... గాయపడిన వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌ను ఇలా గుర్తుచెయ్యడం బ్యాడ్‌ టేస్ట్‌ అని. ఆ సంగతి అలా ఉంచితే ఈ ‘నో ఫ్రాడ్స్‌’ మ్యూజిక్‌ వీడియో యూత్‌ని కిందామీదా చేసేస్తోంది. పాటలో మొదటి పార్ట్‌నంతా నిక్కీనే కిక్కెక్కించేస్తారు. వీడియో చివర్లో డ్రేక్, లిల్‌ వేన్‌ ప్రత్యక్షమౌతారు. ఇందులోని మొత్తం మూడు చరణాలలో మొదటి దాన్ని నిక్కీ, రెండోదాన్ని డ్రేక్, మూడో దాన్ని లిల్‌ వేన్‌ ఆలపిస్తారు. ఘాటుగా మొదలై, మర్యాదపూర్వకమైన ఒప్పుకోలుతో వీడియో పూర్తవుతుంది. ‘సూన్‌ యాజ్‌ ఐ వేక్‌ అప్‌ కీన్‌ యాన్‌ ఐ (్ఛy్ఛ) అవుట్‌ ఫర్‌ ది స్నేక్స్‌’ అనే పల్లవి మిమ్మల్ని సరాసరి తీసుకెళ్లి.. ‘ఐ డోన్ట్‌ నీడ్‌ నో ఫ్రాడ్‌ బిచ్చెస్‌ ఇన్‌ అండ్‌ అవుట్‌ మై లైఫ్‌..’ అనే లైన్‌ దగ్గర దించుతుంది. జీవితంలో నటించడాన్ని ఇష్టపడని ముగ్గురు గాయకుల ముక్కుసూటి భావనల నిక్కచ్చి గీతం ఇది!



హి ఈజ్‌ రెడీ స్టాన్‌... యు ఆర్‌ నాట్‌ రెడీ!

అమెరికన్‌ అసాసిన్‌ టీజర్‌ ట్రైలర్‌ : నిడివి : 2 ని. 27 సె.  ::: హిట్స్‌ : 28,16,639



హాలీవుడ్‌ నుంచి మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ రాబోతోంది! పొలిటికల్‌ థ్రిల్లర్‌ల ప్రఖ్యాత అమెరిన్‌ రచయిత విన్స్‌ ఫ్లిన్‌ 2010లో రాసిన ‘అమెరికన్‌ అసాసిన్‌’ నవల ఆధారంగా అదే  పేరుతో వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌ 15న విడుదల అవుతోంది. రెండు రోజుల క్రితం చిత్రం ట్రైలర్‌ విడుదల అయింది. అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ సి.ఐ.ఎ.లోని ‘బ్లాక్‌ ఆప్‌’ విభాగంలో కొత్తగా చేరుతాడు మీచ్‌ రాప్‌. (బ్లాక్‌ ఆప్‌ అంటే బ్లాక్‌ ఆపరేషన్‌). ఇది సి.ఐ.ఎ. సీక్రెట్‌ ఏజెన్సీ. ఉగ్రవాదాన్ని, విద్రోహుల్ని మట్టుపెట్టేందుకు బ్లాక్‌ ఆప్‌లోని గూఢచారులు పనిచేస్తుంటారు. వారిలో మీచ్‌ రాప్‌ ఒకడు. పాతికేళ్ల యువకుడు. (ఈ పాత్రను సినిమాలో డిలాన్‌ ఓబ్రియన్‌ పోషించాడు). మీచ్‌ రాప్‌ ఉగ్రవాదుల దాడిలో తన గర్ల్‌ఫ్రెండ్‌ని పోగొట్టుకుంటాడు. ఆ విషాదంలో మునిగిపోతాడు.



అతడికి ట్రైనింగ్‌ ఇవ్వడానికి ప్రచ్ఛన్న యుద్ధకాలం (అమెరికా–రష్యాల మధ్య కోల్డ్‌వార్‌) నాటి సైనిక అధికారి స్టాన్‌ హర్లీని నియమిస్తుంది సి.ఐ.ఎ. మహిళా డిప్యూటీ డైరెక్టర్‌ ఇరీన్‌ కెన్నెడీ. మీచ్‌ రాప్‌ దుఃఖంలో ఉండానికైతే ఉంటాడు కానీ, ట్రైనింగ్‌లో షార్ప్‌గా ఉంటాడు. గురుశిష్యులిద్దరూ కలిసి సైన్యం స్థావరాలు, పౌర నివాసాలపై దాడులకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఛేదించి ప్రపంచాన్ని యుద్ధం నుంచి కాపాడతారు. ఇదీ అమెరికన్‌ అసాసిన్‌ స్టోరీ. కొన్నిసార్లు గురువు శిష్యుడిపై కంప్లైంట్‌ చేస్తుంటాడు ఇరీన్‌ కెన్నెడీకి.. ‘హి ఈజ్‌ నాట్‌ రెడీ’ అని. ‘హి ఈజ్‌ రెడీ స్టాన్‌.. యు ఆర్‌ నాట్‌ రెడీ’ అని ఇరీన్‌ అనడంతో టీజర్‌ ముగింపునకు వస్తుంది. మీచ్‌ రాప్‌ బాల్య స్మృతులతో వీడియో మొదలౌతుంది.



నువ్వు ఆక్రమించుకున్న సామ్రాజ్యాన్ని కాదు నేను!

రాబ్తా  ట్రైలర్‌ : నిడివి : 2 ని. 19 సె.  ::: హిట్స్‌ : 2,37,40,747



ఉర్దూలో ‘రాబ్తా’ అంటే ‘సంబంధం’ అని అర్థం. దినేశ్‌ విజన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతీ సనన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతం ప్రీతమ్‌. చిత్రం జూన్‌ 9న విడుదల అవుతోంది. మొదట కృతీ సనన్‌ స్థానంలో అసిన్‌ని అనుకున్నారు. తను పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం లేదని చెప్పడంతో అలియా భట్‌ దగ్గరకు వెళ్లారు. తనకూ ఖాళీ లేకపోవడంతో కృతి దగ్గరకు వచ్చారు. ఈ వీడియో.. తొలుబొమ్మలాటతో మొదలౌతుంది. అతడు అంటాడు.. ‘నా రాణీ.. మరీ అంత దగ్గరగా రాకు. మనం ప్రేమలో పడిపోతాం’ అని.



అప్పుడు ఆమె అంటుంది... ‘నా రాజా.. నువ్వలా చూడకు. నేను నువ్వు ఆక్రమించుకున్న సామ్రాజ్యాన్ని కాదు’ అని! ‘మరి నువ్వెవరివి?’ అంటాడు. ‘నువ్వెప్పటికీ ప్రేమించే వ్యక్తిని’ అంటుంది. ఆ తొలుబొమ్మలాటను హీరోహీరోయిన్లు చూస్తుంటారు. తమకు అన్వయించుకుంటారు. సినిమాలో వీళ్లిద్దరూ రెండు భిన్నమైన కాలాలకు చెందిన ప్రేమికులుగా కనిపిస్తారు. కలలకు, కఠినమైన విధి విలాసానికి మధ్య ఊగిసలాడుతుంటారు. ప్రేమ, పగ, అసూయ, ప్రతీకారం వంటి రకరకాల ఉద్వేగాలతో కథ నడుస్తుంది. వీడియో లవ్‌లీగా ఉంది. కొంచెం రొమాంటిక్‌గా కూడా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top