ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌


వచ్చి నలభై ఏళ్లు.. వచ్చేశాయి కన్నీళ్లు

ఎ ట్రిబ్యూట్‌ టు క్యారీ ఫిషర్‌ : నిడివి : 4 ని. 56 సె. ::: హిట్స్‌ : 12,49,627


హాలీవుడ్‌ చిత్రం ‘స్టార్‌ వార్స్‌’ విడుదలై 40 ఏళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఫ్లోరిడాలో కలుసుకున్నారు. చిత్ర దర్శకుడు జార్జి లూకాస్‌ (72), నటులు మార్క్‌ హ్యమిల్‌ (65), హ్యారిసన్‌ ఫోర్డ్‌ (74) జాన్‌ విలియమ్స్‌ (85) ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. కానీ వారి టీమ్‌లోని ఒక ముఖ్యమైన సహచరురాలు, ‘స్టార్‌ వార్స్‌’ ప్రధాన నటి క్యారీ ఫిషర్‌ ఆ వేడుకలో మిస్‌ అయ్యారు. గత ఏడాదే ఆమె మరణించారు. అయితే ఆమె కుమార్తె బిల్లీ లార్డ్‌..  ప్రిస్సెస్‌ లీయా దుస్తులు ధరించి క్యారీ ఫిషర్‌ లేని లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు. స్టార్‌ వార్స్‌లో క్యారీ ఫిషర్‌ ప్రిన్సెస్‌ లీయాగా నటించారు. చిత్రంలో లీయా ‘ఇంపీరియల్‌ సెనెట్‌ సభ్యురాలు. సంకీర్ణ తిరుగుబాటు దళ నాయకురాలు.



అందులో క్యారీ ఫిషర్‌ నటించిన సన్నివేశాలను జోడించి చిత్ర నిర్మాతలు ఓ అందమైన, భావోద్వేగ భరితమైన నివాళిని సమర్పించారు. ఇంకా.. అరుదైన ఇంటర్వూ్యలు, ఆఖరి నిముషంలో సినిమా నుంచి తొలగించిన రీళ్లు (ఔట్‌టేక్స్‌), క్యారీ ఫిషర్‌కి మాత్రమే ప్రత్యేకమైన విట్టీ సీన్స్‌ను చేర్చారు. ఈ నివాళి వీడియోలోని ‘యు ఆర్‌ అవర్‌ ఓన్లీ హోప్‌’ పార్ట్‌ను చూసిన వాళ్లు కన్నీళ్లను ఆపుకోలేరు. క్యారీ ఫిషర్‌ అమెరికన్‌ నటి, రచయిత్రి, హ్యూమరిస్టు. స్టార్‌ వార్స్‌ సీరీస్‌తో ఆమె వెలుగులోకి వచ్చారు. షాంపూ (1975), ది బ్లూస్‌ బ్రదర్స్‌ (1980), హన్నా అండ్‌ హర్‌ సిస్టర్స్‌ (1986), ది బర్బ్స్‌ (1989), వెన్‌ హ్యారీ మెట్‌ శాలీ (1989) ఆమెకు పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి. ఆమె నటించిన చివరి చిత్రం ‘స్టార్‌ వార్స్‌: ది లాస్ట్‌ జేడి’ ఈ ఏడాది డిసెంబర్‌ 15న విడుదల అవుతోంది. ఆ లోపే తన 60 ఏళ్ల వయసులో 2016 డిసెంబర్‌ 27న కన్నుమూశారు క్యారీ ఫిషర్‌. ఈ వీడియోలాగే, ఆ చిత్రం కూడా క్యారీకి మంచి నివాళి అవుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.



గుండె నొక్కేశావ్‌ పిల్లా... ఒక్క బటన్‌తో..!

మేజర్‌ లేజర్‌ – రన్‌ అప్‌ : నిడివి : 3 ని. 48 సె. ::: హిట్స్‌ : 22,26,234


అమెరికన్‌ ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ త్రయం ‘మేజర్‌ లేజర్‌’.. (డిప్లో, జిలియనీర్, వాల్షీ) ఫ్రెష్‌గా రిలీజ్‌ చేసిన ‘రన్‌–అప్‌’... కుర్రాళ్ల చేత గెంతులు వేయిస్తోంది. కెనడియన్‌ ర్యాపర్‌ పార్టీనెక్స్‌›డోర్‌ (ఇది నిక్‌నేమ్‌. అసలు పేరు ఏంథోనీ), అమెరికన్‌ ర్యాపర్‌ నిక్కీ మినాజ్‌ (అసలు పేరు తాన్యా) ఇందులో నటించారు. ‘యా! వాళ్లంతా నువ్వు బిడియస్థురాలైన అమ్మాయివి అని అనుకున్నారు... నువ్వు నా స్నేహితురాలివి అవకముందు వరకు. ఓ పిల్లా... నా గుండె నొక్కి వదిలిపెట్టావు..’ అంటూ పాట మొదలౌతుంది. ఈ భావాలకు దృశ్య చిత్రీకరణ లిరిక్‌ కన్నా బలంగా ఉంది. ‘నువ్వు నాకు ఫోన్‌ చేస్తే చాలు.. వచ్చి వాలిపోతాను’ అని ఏంథోనీ.. తాన్యా కోసం పడి చచ్చిపోతాడు.



ఆర్డీఎక్స్‌ లాంటి టన్నుల కొద్ది ప్రేమ పేలుడు పదార్థాలతో వీపున కట్టుకుని, చిన్న రాపిడికే విస్ఫోటనం చెందేందుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను మీరు ఈ వీడియోలో చూడవచ్చు. రుబ్బుడు రోలులా తిరుగుతూ స్మార్ట్‌ ఫోన్‌లలోంచి టెక్స్‌టింగ్‌ చేయడం అనే ఆధునిక ఆయోమయాన్ని బహుశా ఇంత ఎఫెక్టివ్‌గా ఏ పాప్‌ బ్యాండూ ఇప్పటి దాకా చూపించలేదు. ఇంకా విడుదల కాని మేజర్‌ లేజర్‌ స్టుడియో ఆల్బమ్‌ ‘మ్యూజిక్‌ ఈజ్‌ వెపన్‌’లోని ఒక గీతమైన ‘రన్‌ అప్‌’ను చూస్తూ, అందులోని మిగతా పాటలపై నిస్సందేహంగా ఆశ పడొచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ల చుట్టూ వచ్చిన రొటీన్‌ కొరియోగ్రఫీకి భిన్నమైన ఈ మ్యూజిక్‌ వీడియోను చూడకపోతే చాలా మిస్‌ అయ్యే అవకాశం ఉంది.  ఏం మిస్‌ అవుతామంటారా? ప్రకంపించి సొమ్మసిల్లే గిటార్‌ తీగల్ని, కుర్రకారు కరీబియన్‌ సంగీతాన్నీ!




ఐ యామ్‌ నాట్‌ యువర్‌ గర్ల్‌ఫ్రెండ్‌

హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ : ట్రైలర్‌ : నిడివి : 2 ని. 42 సె. ::: హిట్స్‌ : 1,97,87,058


మాధవ్‌ పల్లెటూరు నుంచి పట్నం వచ్చి కాలేజీలో చేరిన అబ్బాయి. రియా అదే కాలేజీలో చదువుతున్న అందమైన అమ్మాయి. అందంగా ఉంటుంది. చలాకీగా ఉంటుంది. ఇంగ్లిష్‌ మాట్లాడుతుంది. మాధవ్‌తో కూడా చక్కగా మాట్లాడుతుంటుంది. మనవాడు ఫ్లాట్‌ అయిపోతాడు. ‘మాధవ్‌... వద్దు... రియా నిన్ను ఆటపట్టిస్తోంది. నిన్ను ప్రేమించట్లేదు’ అని ఫ్రెండ్స్‌ చెప్తారు. కానీ మాధవ్‌ మానసికంగా రియా నుంచి విడిపోలేడు. అయితే ఇద్దరి మధ్య మాటిమాటికీ ఇంగ్లిష్‌ భాష... విలన్‌లా అడ్డుపడుతుంటుది. ‘నేను నీకు ఏమిటి?’ అని అడుగుతాడు ఓ రోజు. రియా సమాధానం చెప్పదు. ‘నువ్వు నాకు ఏమిటి?’ అని అడుగుతాడు. ‘ఐ యామ్‌ నాట్‌ యువర్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటుంది రియా. ‘కానీ నీ హాఫ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ గా ఉండగలను’ అంటుంది. మాధవ్‌ కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాడు. ‘ఈ క్షణానికి ఇది నిజం. రేపటికి ఇది నిజం కాకపోవచ్చు’ అంటుంది రియా. అప్పుడు మాధవ్‌ అంటాడు.. ‘గర్ల్‌ ఫ్రెండ్‌ అంటే గర్ల్‌ ఫ్రెండే. హాఫ్‌ గర్ల్‌ ఫ్రెండ్, క్వార్టర్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ ఉండదు’ అని.  ‘నువ్వు ఆ అమ్మాయికి ఫ్రెండ్‌ కన్నా ఎక్కువ.



బాయ్‌ఫ్రెండ్‌ కన్నా తక్కువ’ అంటాడు మాధవ్‌ ఫ్రెండ్‌. హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అనే మాటకు అర్థం అదే అని కూడా చెబుతాడు. మాధవ్‌ గుండె బద్దలు అవుతుంది. మాధవ్‌ మొండితనం కారణంగా రియా దూరం అవుతుంటుంది. అదే మొడితనంతో మాధవ్‌ రియాకు దగ్గరవాలని ప్రయత్నిస్తుంటాడు. తర్వాత ఏమైందన్నది స్టోరీ. ఏమైందో, ఏమౌతుందో.. ట్రైలర్‌ చూస్తే పూర్తిగా అర్థం అవుతుంది. మాధవ్‌గా అర్జున్‌ కపూర్, రియాగా శ్రద్ధాకపూర్‌ నటించారు. చేతన్‌ భగత్‌ నవల ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’కు ఇది సినిమా వెర్షన్‌. డైరెక్టర్‌ మొహిత్‌ సూరి. సినిమా మే 19న విడుదల అవుతోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top