యోగా... బెస్ట్‌ డాక్టర్‌

యోగా... బెస్ట్‌ డాక్టర్‌


యోగాడే ప్రత్యేకం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.
..



2015 పుదుచ్చేరిలో అంతర్జాతీయ యోగా పోటీల్లో ప్రథమ స్థానంతో పాటు చాంపియన్‌ ఆఫ్‌ ది చాంపియన్‌. అదే ఏడాది మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చైనా రాజధాని బీజింగ్‌ పోటీల్లో 4వ స్థానం. అంతకుముందు జాతీయ, రాష్ట్రస్థాయుల్లో ఆరు పతకాలు.



విజయాలకు వయసుతో పని లేదు... ప్రతిభ తప్ప. పతకాలకు చదువు అక్కర్లేదు... నిరంతరం నేర్చుకునే సుగుణం తప్ప.

అందుకేనేమో ఆమె మెడలో పతకాలు వెల్లువలా వచ్చి చేరాయి. 56 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ... రికార్డులపై శీర్షాసనం వేసే పట్టుదల ఆమెది. ’మిస్‌ యోగా యూనివర్స్‌’ ఇంటర్‌ నేషనల్‌ యోగా చాంపియన్‌ లగుడు లక్ష్మి,

ఆమె గురువు, భర్త అప్పన్నల ఇంటర్వూ్య.



ఈ వయసులో యోగా చెయ్యాలనిపించిందా?

లక్ష్మి: 2001లో గర్భసంచి ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. అప్పటికే వెన్నునొప్పి బాధించేది. ఆపరేషన్‌ చేస్తే మంచానికే పరిమితమవుతావని కొంతమంది భయపెట్టడంతో నాలో ఆందోళన మొదలైంది. మా ఆయన(అప్పన్న) మేడపై గదిలో యోగా సాధన చేసే సమయంలో అప్పుడప్పుడు కిటికిలోంచి చూసే దానిని. ఎవరికీ చెప్పకుండానే భుజంగాసనం, శలభాసనం, సూర్య నమస్కారాలు ప్రారంభించా. కొద్ది రోజుల్లోనే కాస్త తేలికగా అనిపించింది.



మరి డాక్టర్‌ దగ్గరికి వెళ్లలేదా!

యోగ సాధన ప్రారంభించిన నెల రోజుల తర్వాత డాక్టర్‌ని కలిశాను. పరీక్షలు చేసి... గతంలో కనిపించిన సమస్య తీవ్రత బాగా తగ్గిందని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్‌ని కలవలేదు, యోగాను విడిచి పెట్టలేదు.



ప్రొఫెషనల్‌గా ఎప్పుడు మారారు?

మా వారు చిన్నా, చితకా పోటీల్లో గెలుపొంది కప్పులతో ఇంటికి వస్తుండేవారు. నేనెందుకు ప్రయత్నించకూడదనే ఆలోచన మొదలైంది. ఈ విషయం చెప్పగానే ఆయన ప్రోత్సహించారు. అలా తొలిసారి 2004లో శ్రీకాకుళం జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాను.



ఆసనాలు వేయడం కష్టంగా అనిపించలేదా?

మొదట్లో కష్టంగా అనిపించేది. ఆయన వేకువజాము 3 గంటలకే శిక్షణ ప్రారంభించేవారు. మళ్లీ సాయంత్రం 7 గంటల తరువాత సాధన.



అంటే మీ గురువు...?

అవును... మా వారే నా గురువు.



మొదటి పతకం సాధించినçప్పటి ఫీలింగ్‌?

2006లో హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 3వ స్థానం. అదే నా మొదటి పతకం. కొన్ని కారణాలతో జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అవకాశం దక్కలేదు. కాంస్యం సాధించాననే ఆనందం కంటే పై స్థాయికి వెళ్లలేదనేది ఎక్కువగా బాధించింది. పోటీలకు నాలుగు రోజుల ముందు నిర్వాహకుల నుంచి ఫోన్‌ వచ్చింది. అప్పటికే ఎంపికైన ఆమె తప్పుకోవడంతో నాకు అవకాశం వచ్చింది. హరిద్వార్‌లో జాతీయ స్థాయి పోటీల్లో కాంస్యం సాధించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి పతకం అందుకోవడం సంతోషంగా ఉంది.



అంటే అదృష్టం కలిసొచ్చిందా?

జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు మాత్రం అదృష్టం తలుపు తట్టిందనే చెప్పాలి. అక్కడి నుంచి వరుసగా జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తునే ఉన్నా.



మీకెప్పుడూ విసుగు అనిపించలేదా?

అనిపించలేదు కానీ, 2010లో మా పెద్దబ్బాయి మోహన్‌ మరణం కుంగదీసింది. వైజాగ్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో అనారోగ్య కారణంతో మృతిచెందాడు. అప్పుడు యోగాను వదిలేద్దామనుకున్నా. కానీ ఆ దిగులు నుంచి యోగసాధనతోనే సాంత్వన పొందాను.



అటువంటి సందర్భాలు ఇంకేమన్నా!

హా.... 2013లో థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ యోగా చాంపియన్‌షిప్‌ ఉంది. దానికి కొన్ని నెలల ముందే మా అమ్మనాన్న చనిపోయారు. అందులో పాల్గొనకూడదనుకున్నా. అప్పటికే ఆమదాలవలసలో చాలా మంది నా ప్రయాణ నిమిత్తం చందాలు పోగేసి సుమారు లక్ష రూపాయలు చేతికిచ్చారు. కనీసం వారి కోసమైనా పాల్గొనాలని వెళ్లా. నాలుగు విభాగాల్లో నాలుగు బంగారు పతకాలతో పాటు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచి మిస్‌ యోగా యూనివర్స్‌గా బిరుదు పొందా.



చందాలు పోగెయ్యడమేంటీ..?

దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నా, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహకారం అందలేదు. 2015లో బీజింగ్‌ వెళ్లినప్పుడు కూడా 2 లక్షలకు పైగా అప్పుచేశాం. ప్రభుత్వ ప్రోత్సాహం లభించకపోవడం కలిచివేస్తుంది.



కేంద్రం ప్రోత్సహిస్తుంది కదా..?

రెండేళ్ల నుంచే ప్రోత్సహిస్తోంది. మరి అంతకు ముందు పరిస్థితి? అయినా యోగాను కూడా ఒక క్రీడగా గుర్తించనంత వరకు పరిస్థితి మారదేమో! మా ఇంటి దగ్గరే కొంతమందికి ఉచితంగా యోగా నేర్పిస్తున్నా. అకాడమీ పెట్టి మరింత మందికి సేవ చేయాలని ఉన్నా, ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆ కల తీరలేదు.



యోగా దినోత్సవంతో మార్పురాదా?

యోగా దినోత్సవ నిర్వాహణకు జిల్లాకు ఇచ్చే 50 వేలు ఫొటోలు, ప్రకటనలకే సరిపోతోంది.  



మీపై విమర్శలు ఉన్నాయా?

నా విజయాల్లో విమర్శల పాత్రే ఎక్కువ.  ఎప్పుడు పోటీలకు వెళ్లినా ఇంత వయస్సులో బయట తిరగడమేంటని చెవులు కొరుక్కునే వాళ్లు.్ల విజయాలతో అవన్నీ కొట్టుకుపోయాయి.



మీ సక్సెస్‌ సీక్రెట్‌ ఎవరైనా ఉన్నారా?

ప్రతి మగవాడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్టే, మహిళ విజయం వెనుక కూడా భర్త సహకారం తప్పనిసరి. నా ప్రతి అడుగులో ఆయన ప్రోత్సాహం వెలకట్టలేనిది. నా విజయాల్లో సగభాగం ఆయనదే. ఇక కుటుంబ సభ్యులు కూడా.



జీవిత లక్ష్యం?

పది మందికి ఆరోగ్యాన్ని పంచాలన్నదే నా లక్ష్యం. అంతకు మించిన సంపాదన అవసరం లేదు. అనారోగ్యంతో ఎవరూ ఆస్పత్రుల చుట్టూ తిరిగి డబ్బులు, సమయం వృథా చేసుకోకుండా యోగా తో సంపూర్ణ ఆరోగ్యం అందిచాలనే కోరిక ఉంది.



మీ సందేశం?

మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో? యోగా కూడా అంతే. అందుకే యోగా చేయండి... రోగాలను తరిమికొట్టండి.



ఇద్దరూ అనారోగ్య కారణాలతోనే ప్రారంభించారా!

అప్పన్న: అవును... ప్రారంభించిన రెండేళ్లకు కానీ తెలియదు. దీనిని ప్రొఫెషనల్‌గా తీసుకోవచ్చని. 2006లో నీటి పారుదల శాఖలో పదవీ విరమణ పొందినప్పటి నుంచి పూర్తిస్థాయి శిక్షకుడిగా, ప్రొఫెషనల్‌గా మారా.



మీ భార్య పతకాలు సాధిస్తుంటే ఏమనిపించింది?

అప్పన్న: ఆమె సాధించిన విజయాలు భర్తగా కంటే గురువుగానే ఎక్కువ సంతోషాన్నిచ్చాయి. ఎందుకంటే శిష్యుల ప్రతిభ ద్వారా వచ్చే సంతృప్తి మరెందులోనూ దొరకదు.

– శివప్రసన్న కుమార్‌ అవదూత,సాక్షి, శ్రీకాకుళం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top