బట్టతలతళతళ

బట్టతలతళతళ - Sakshi


జాబిల్లి రోమసంహితం అయితే బాగుంటుందా? వెండి పళ్లెంలో వెంట్రుకలొస్తే సబబుగా ఉంటుందా? ఇదే మగాడి ఆలోచన.

 

యువకులుగా మారడానికి తమ జుట్టు కాస్తంత వెనక్కు జరిగినా వాళ్లకు బాధ ఉండదు. హెయిర్‌లైన్ వెనక్కుపోతుందన్న ఇబ్బందీ, అందానికి లోపం కలుగుతుందన్న విచారం కంటే పురుషత్వపు లక్షణాలు కనబడుతున్నాయనే ఆనందమే ఎక్కువ.

 

తళతళలాడే చందమామ మెరుపును చూసి ఆశ్చర్యం పొందని వారెవరైనా ఉంటారా? మిలమిలలాడే బంగారం తళుకులు చూసి సంబరపడనివారెవరైనా ఉంటారా? సేమ్ బట్టతల కూడా. కానీ బట్టతల అంటే పురుషులు ఇష్టపడరని అందరూ అనుకుంటుంటారు. అది అపోహ మాత్రమే. పురుషులు దాన్ని ఇష్టపడరని అనుకోవడం జస్ట్ ఒక దురభిప్రాయం మాత్రమే. వాస్తవం వేరే. చందమామనూ, బంగారాన్నీ ఇష్టపడ్డట్టే పురుషులూ బట్టతలనూ ఇష్టపడతారు. కాకపోతే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు రెండు ఉంటాయి.

 

మొదటిది... మనిషి అనగానే దేనినైనా పెంచుకోవాలనే తాపత్రయం అధికం. దాన్ని బాగా సాకాలనేది అతడిలో మరీ మిక్కుటమైన మక్కువ. గుబురు మీసాలూ, గడ్డాల మాటున నక్కి అంతగా కనపడదు గానీ పురుషులకు పెంపక కాంక్ష మరీ ఎక్కువ.

 

ఈ పెంపకం సాగించాలన్న తపనతో, ఆ తీవ్రమైన ఇన్‌స్టింక్ట్‌తో కొందరు మొక్కలూ, ఇంకొందరు కుక్కలూ పెంచుతుంటారు. ఇక కోళ్లూ, బాతులు, తాబేళ్లూ... వెర్రిబాగా ముదిరితే తొండలూ కొండచిలువలూ పెంచేవారు కూడా ఉన్నారు. ఈ తీవ్రమైన కోరికవల్లే కాలం బాగా లేకపోయినా రైతులు పొలాలను సాగు చేస్తూ ఉంటారు. చెరువుల్లో చేపలు పెంచుతుంటారు.

 

ఈ పెంచాలన్న తీవ్రమైన తపన ఉండటం వల్లనే జుట్టు పెంచడం అన్నది కూడా జరుగుతుంది. కుక్క పెంచితే ఇంటి దగ్గర అది ఎలా ఉందో తెలియని భయం ఉండొచ్చు. మొక్కకు నీళ్లు అందుతాయో లేదో అన్న ఆందోళన కలగవచ్చు. నీళ్లూ, తెగుళ్ల దిగుళ్లతో కుంగిపోవచ్చు. కానీ జుట్టు పెంచుకుంటే అది నెత్తి మీదే పదిలంగా ఉంటుంది. కావాలనుకుంటే వర్క్‌ప్లేస్‌లోనూ బాత్‌రూమ్‌లోకి వెళ్తే అద్దంలో కనిపిస్తుంది. కుక్కను చేతులతో లాగే దాన్ని దువ్వెనతో దువ్వవచ్చు.



కాస్త చేయ్యి సాచితే అందుతుంది. సర్దుకుంటే ఒదుగుతుంది. కుక్కా, మొక్కా ఇంటి అందాన్ని ఇనుమడింపజేసినట్లు రోమాలూ అందానికి హామీగా ఉంటాయి. కాబట్టి పెంచుకోవాలనే కాంక్ష తప్ప... మెరిసే బట్టతలను నిరసించాలన్న భావన ఏ పురుషుడిలోనూ ఉండదు.

 

ఇక రెండోది పురుషులకు చాలా ఇష్టమైన విషయం. ఇది ఒకింత సీక్రెట్. అయినా కాస్తంత బహిరంగంగానే మాట్లాడదాం. మగపిల్లలు టీన్స్‌లోకి రాగానే తమ ముఖం కాస్త అందవికారంగా మారుతున్నా పెద్ద లెక్కచేయరు. ఆ ఏజ్ నుంచి తాము యువకులం కాబోతున్న ఫీలింగే వాళ్లకు సంతోషంగా ఉంటుంది. యువకులుగా మారడానికి తమ జుట్టు కాస్తంత వెనక్కు జరిగినా వాళ్లకు బాధ ఉండదు. హెయిర్‌లైన్ వెనక్కుపోతుందన్న ఇబ్బందీ, అందానికి లోపం కలుగుతుందన్న విచారం కంటే పురుషత్వపు లక్షణాలు కనబడుతున్నాయనే ఆనందమే ఎక్కువ.



అయితే పాపం... కొందరిలో కాస్తంత వెనక్కు జరగాల్సిన హెయిర్‌లైన్, బ్యాలెన్స్ తప్పి, గబుక్కున పడిపోయినట్లుగా వెనక్కు జారిపోతుంది. జుట్టు అంతా అంతర్జాతీయ షేర్ మార్కెట్లలాగా కుప్పకూలి కుదేలైపోతుంది. షేర్‌కు జూలు మొలవడం ఎలాగో, కిశోర బాలకులకు జుట్టు రాలడం అలాగ. అందుకే జుట్టు రాలిపోతుందన్నా లెక్క చేయరు. ఈ ఒక్క దృష్టాంతం చాలదా. వాళ్లు బట్టతలను ఇష్టపడకపోవడం ఏదీ లేదని. కాబట్టి పురుషులకు బట్టతల అంటే ఇష్టపడకపోవడం అంటూ ఏదీ ఉండదు. స్త్రీలకు బంగారం లాగే పురుషులకు బట్టతల.

 

జాబిల్లి రోమసంహితం అయితే బాగుంటుందా? వెండి పళ్లెంలో వెంట్రుకలొస్తే సబబుగా ఉంటుందా? ఇదే మగాడి ఆలోచన. మీరు నమ్మకపోయినా పురుషులకు బట్టతల ఇష్టం ఉండదన్న విషయమంతా ఈ పాడు లోకం అల్లిన కల్పితాలే.

- యాసీన్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top