మహిళా డ్రైవర్లకు మహా ముంబయి స్వాగతం!

మహిళా డ్రైవర్లకు మహా ముంబయి స్వాగతం!


మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించడం, సరైన ఉద్యోగం దొరకనప్పుడు సొంతకాళ్ల మీద నిలబడటం స్ఫూర్తిమంతమైన విషయం. అందుకే ఇలాంటి శక్తిసామర్థ్యాలున్న మహిళలకు స్వాగతం పలుకుతోంది మహాముంబయి ఆర్టీఏ. ఈ ఏడాది నుంచి టాక్సీ పర్మిట్ల విషయంలో మహిళల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించారక్కడ. ఈ మేరకు ఆర్టీఏ అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. దానికి మంచి స్పందన వస్తోంది.



ఇప్పటి వరకూ దాదాపు 210 మంది మహిళల నుంచి టాక్సీ పర్మిట్ కోసం దరఖాస్తులు వచ్చాయని రోడ్డు రవాణా అధికారులు ప్రకటించారు. మొత్తం ఏడువేల టాక్సీల పర్మిట్‌లు జారీ చేయడానికి ఇచ్చిన ప్రకటనలో మహిళల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా పేర్కొన్నామని... దానికి ఈ మాత్రం స్పందన రావడం కూడా విశేషమేనని అధికారులు అభిప్రాయపడ్డారు. నాలుగు చక్రాల వాహనం నడపడానికి లెసైన్సు ఉన్న మహిళలకు టాక్సీ నడపడానికి పర్మిషన్ ఇస్తున్నారక్కడ.



తద్వారా స్వయం ఉపాధికి అవకాశాన్ని ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈ అనుమతి కోసం యువకులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకొంటున్నారు. తొలిసారి మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లోని మహిళలే ఈ టాక్సీ డ్రైవింగ్ వృత్తి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వారిలో చాలా మందికి ఫోర్ వీలర్ డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. అయినప్పటికీ ఈ మాత్రం అప్లికేషన్‌లు రావడం గొప్ప విషయమేనని ఆర్టీఎ అధికారులు అంటున్నారు.



మహిళలు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే... టాక్సీ నడుపుకొంటూ సొంతకాళ్ల మీద నిలబడటం పెద్ద కష్టం కాదని ధైర్యం చెబుతూనే దీన్ని ఒక ఆసక్తికరమైన వృత్తిగా స్వీకరించమని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. మహిళా టాక్సీ డ్రైవర్‌లు ముందుకు రావాలని కోరుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top