పిల్లలకు తాళాలు ఇస్తే!

పిల్లలకు  తాళాలు ఇస్తే!


‘విత్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ’... ఇది స్పైడర్‌మాన్ సినిమాలో పిల్లలు వినే ఉంటారు కాని వినిపించుకుని ఉండరు. దీని అర్థం... అధికారంతోపాటు గొప్ప బాధ్యత ఉండాలని! గొప్ప కారు, గొప్ప హాలిడే, గొప్ప పార్టీ... ఈ రోజుల్లో పిల్లలు చూసిందల్లా కావాలంటున్నారు. ఇతర పిల్లలతో పోటీ పడి మరీ కొనిపించుకుంటున్నారు. పేరెంట్స్ ప్రేమకు ఇదొక గొప్ప పరీక్షగా మారింది!! మరి, పిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కోరికలతో పాటు పిల్లలకు కొంచెం బాధ్యత ఇస్తే ఎలా ఉంటుందని.. సాక్షి ఫ్యామిలీ ఒక ప్రయోగం చేసింది. నెగ్గింది. ఈ ప్రయోగం మీరూ చెయ్యగలరు. మన పిల్లల కోరికలకు తాళాలెయ్యడం కంటే...

 

‘మమ్మీ... మా ఫ్రెండ్ వాళ్లు యు.ఎస్. టూర్ వెళ్లారు. మనమెప్పుడు వెళ్తున్నాం?’ పన్నెండేళ్ల జాహ్నవి నిలదీసింది. ఆ మాటకు ప్రశాంతి ఆశ్చర్యపోయింది. వారం రోజులుగా ఫ్రెండ్ వెళ్లడం వరకే మాట్లాడేది. ఇప్పుడు తాను వెళ్లడం గురించి నిర్థారణ చేయమని అడుగుతోంది. ఎలా బుజ్జగించడం?

 

జాహ్నవి చిన్నపిల్ల కాదు. పన్నెండేళ్లు వచ్చాయి. మెల్లిగా ఇంటి  పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సిన వయసు. వేటిలో పోటీ పడాలో వేటిలో సర్దుకుపోవాలో ఇప్పటి నుంచే చెప్పకపోతే ముందు ముందు ఇంకా సమస్య కావచ్చు. అందుకే నోట్ బుక్, పెన్నూ తీసుకుని ‘ఇలా రా నాన్నా’ అంటూ కూతురిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది. ఇంటి బడ్జెట్ వేసి చూపించడం మొదలు పెట్టింది.

 

అమ్మ పద్దు

 


‘మీ నాన్న నెలకు 40 వేలు ఇస్తారు ఇల్లు నడపడానికి. వంటింటి ఖర్చులు. బియ్యం, పప్పు, ఉప్పు... మీరడిగే నూడుల్స్, కార్న్ ఫ్లేక్స్, పాస్త వీటన్నింటికి కలిపి ఎనిమిదివేలు. సూపర్‌మార్కెట్‌కి వెళ్లినప్పుడల్లా నువ్వు, తమ్ముడు చాక్లెటు,్ల ఐస్‌క్రీమ్‌లు అడిగినా అవసరమవుతాయని మరో రెండు వేలు కూడా ఉంచుకుంటా. మిగిలిన 30 వేలల్లో మీ స్కూల్ ఫీజులకే పదిహేను వేలు పోతాయి. నీ స్టేషనరీ ఖర్చు మూడు వేలు. పన్నెండు వందలు కేబుల్ కనెక్షన్. మధ్య మధ్యలో డాడీ ఖర్చులకు డబ్బులడుగుతుంటారు. అవో మూడువేలు. ఎంత మిగిలింది? సెవెన్ థౌజెండ్ ఎయిట్ హండ్రెడ్ కదా. అందులోంచి 2500 నీ పేర, తమ్ముడి పేర బ్యాంక్‌లో ఆర్డీ కడుతున్నా. మిగిలిన ఫోర్ థౌజండ్‌లో కరెంట్ బిల్, అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ పోనూ మంత్ ఎండ్ కొచ్చేసరికి నా దగ్గర ఎంతెంటుందో తెలుసా?’ అంటూ కూతురి మొహంలోకి చూసింది తల్లి. సీరియస్‌గా ఏదో ఆలోచిస్తోంది జాహ్నవి. కాపేప టికి ఏదో తట్టిందాన్లా ‘మమ్మీ... నేను ప్లాన్ చేస్తా.. నోట్‌బుక్ ఇటివ్వు’ అంటూ తల్లి చేతుల్లోంచి బుక్ తీసుకొని ప్లాన్ చేయడం మొదలెట్టింది.

 

కూతురి పద్దు



 ‘వంటింటి ఖర్చుల కోసం ఫైవ్ థౌజెండ్ ఇస్తా మమ్మీ’ అంది. ‘ఐదు వేలకు ఏమొస్తుందే?’ అంది ప్రశాంతి నవ్వుతూ. ‘మా చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్, నూడుల్స్, పాస్త ఎట్‌సెట్రా కట్. నువ్వేం వండితే అదే తింటాం’ అంటూ మిగిలిన పద్దులోకి వెళ్లిపోయింది. ‘మిల్క్, కేబుల్ కనెక్షన్, కరెంట్ బిల్ అండ్ అపార్ట్‌మెంట్ మెయిన్‌టెనెన్స్ అన్నీ కలిపి 5000. నీకు, డాడీకి పాకెట్ మనీ 4000, అదర్ ఎక్స్‌పెండీచర్‌గా ఓ 2000 ఇస్తా దగ్గర పెట్టుకో. ఇవన్నీ కలిపి 16 థౌజెండే. ఇంకా ఫోర్టీన్ థౌజెండ్ ఉన్నాయ్. నువ్వు నెట్ కనెక్షన్ అంటే ఒప్పుకోవట్లేదు కదా.. నా బడ్జెట్‌లో డబ్బులున్నాయ్ కాబట్టి కనెక్షన్ పెట్టించుకుంటా. 1500 ఇంటర్‌నెట్ బిల్. నా స్టేషనరీ తగ్గించుకుని 1000 వేసుకుంటున్నా. తమ్ముడికి, నాకు కావాల్సిన టాయ్స్ కోసం ఓ 2000. ఓల్డేజ్ అండ్ పూర్ పీపుల్ కోసం ఓ 2000. ఇవన్నీ పోను లెవెన్ అండ్ హాఫ్ థౌజెండ్ ఉన్నాయ్. నాకు ట్యాబ్ కావాలని అడుగుతున్నా కదా. డాడిని 1500 రుపీస్ అడిగి ఈ లెవెన్ అండ్‌హాఫ్ థౌజెండ్‌కి కలిపి ట్యాబ్ కొనేసుకుంటా. నెక్ట్స్‌మంత్ ఈ డబ్బు మిగులుతుంది కాబట్టి దాన్ని మనం ఔటింగ్స్‌కి ఖర్చు పెట్టుకోవచ్చు. ఓకేనా?’ అంటూ పెన్ను చివరను నోట్లో పెట్టుకొని తల్లి వంక చూసింది జాహ్నవి.



‘అబ్బో.. భలే ప్లాన్ చేశావ్. ఇందులో మీ స్కూల్ ఫీజులు, బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లు, చుట్టాలొచ్చినా, సడెన్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా  సేవింగ్స్.. ఏవి..? అయినా నువ్వు గ్రేట్ నాన్నా.. నాకెప్పుడూ రాని థాట్‌ని నీ బడ్జెట్‌లో వేశావ్’ అంటూ, ఓల్డేజ్ అండ్ పూర్ పీపుల్ కోసం డబ్బులిచ్చి కూతురిని ప్రశంసించింది ప్రశాంతి. ‘సరేగానీ ఈ బడ్జెట్‌తో ఏం తెలుసుకున్నావో చెప్పు ఒక్క మాటలో’ అడిగింది కూతురుని. ‘డబ్బుని వేస్ట్‌గా ఖర్చు పెట్టొద్దు అని. అట్లాగే ఫుడ్ కూడా వేస్ట్ చేయొద్దని. దానివల్ల కిచెన్ బడ్జెట్ తగ్గించుకోవచ్చు కదా.. ఆ డబ్బుని మిగిలిన వాటికోసం ఉపయోగించు కోవచ్చు కదా’ గొప్ప పాఠం నేర్చుకున్న దానిలా చెప్పింది జాహ్నవి. కావాల్సింది మారాం చేసి తీసుకునే అమాయకత్వం తప్ప ఇంటి పరిస్థితిని అర్థంచేసుకునే వయసు కూతురికి లేదనుకున్న ప్రశాంతికి తన అభిప్రాయం తప్పనిపించింది.

 

ఇంకో ఇంట్లో..




టెన్త్ చదువుతున్న కొడుకు, సెవెన్త్ చదువుతున్న కూతురికీ తనకొచ్చే శాలరీ 40 వేలతో బడ్జెట్ వేయమని చెప్పింది తల్లి జానకి. బియ్యం, పప్పులు ఊరు నుంచి వస్తాయి కాబట్టి కొనక్కర్లేదు. వాటికి తప్ప మిగిలిన వాటికి పద్దులు వేయమని చెప్పింది.

 అన్నాచెల్లెళ్లు  రుత్విక్, గౌరీలు మనీమ్యాటర్స్‌తో కుస్తీలు పట్టి చివరకు ఎవరి లెక్కలు వాళ్లు వేశారు.



‘మమ్మీ.. గ్రాసరీస్‌కి తొమ్మిది వేలు’ అని గౌరీ చెప్తుంటే ‘వేస్ట్. నానమ్మ వాళ్లే అన్నీ పంపించాక అంత ఖర్చు ఎందుకవుతుంది నేనైతే ఐదు వేలు వేస్తా’ అన్నాడు రుత్విక్. ‘సరే వేసుకో. కరెంట్, గ్యాస్, కేబుల్, మిల్క్ అండ్ అదర్స్‌కి కలిపి ఓ పది వేలు’ అంది గౌరి. ‘నేను రెండు వేలు తగ్గించి 8 థౌజెండ్ వేస్తా’ అన్నాడు రుత్విక్. ‘ఎందులో తగ్గిస్తావ్?’ ఉక్రోషంగా అడిగింది చెల్లెలు. ‘కేబుల్ ఎందుకు? పొద్దునంతా ఎవరం ఇంట్లో ఉండం. సాయంకాలం వచ్చాక హోంవర్క్, చదువుతో మనకు, ఇంటి పని, స్కూల్ వర్క్‌తో మమ్మీకి, డాడీ అయితే షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికొచ్చేసరికి నైట్ లెవెన్ అవుతుంది. టీవీ ఎవరం చూస్తాం. అందుకే కట్’ అన్నాడు. ‘సినిమాలు చూడాలనుకుంటే’  చెల్లి సందేహం. ‘కంప్యూటర్ లేదా?’ అన్న వెక్కిరింపు.



‘సర్లే.. మెడికల్ ఎక్స్‌పెండీచర్‌కి నేను ఐదు వేలు వేస్తున్నా’ అని గౌరీ అంటే ‘నేను టూ థౌజండే. ఎందుకో ఎక్స్‌ప్లెయిన్ చేయనా?’ అని రుత్విక్ అంటుంటే.. ‘వద్దులే దానికీ ఏదో పిచ్చి లాజిక్ చెప్తావ్’ అంటూ ‘నా స్టేషనరీకి 500, నీ స్టేషనరీకి 300’ ఇంకో లెక్కలోకి వెళ్లింది గౌరి. ‘ఏం పాపం.. నీ లెక్కలో నా స్టేషనరీ తగ్గించావ్’ అన్నాడు. ‘నువ్వు పొదుపరివి కాదా’ వెక్కిరించింది అన్నయ్యని. ‘కదా.. అందుకే నా స్టేషనరీకి నేను ఏమీ వేసుకోలేదు. రీజన్ స్కూళ్లు ఓపెన్ అయ్యే ముందే మమ్మీ ఈ అకడమిక్ ఇయర్‌కి సరిపడా తెస్తుంది’ చెప్పాడు. ‘నాకూ తెలుసు. అయినా నేను ఎక్స్‌ట్రా వేసుకున్నా’ అని చెప్పి ‘నా షాపింగ్‌కి 2000, నీ షాపింగ్‌కి 2000’అంది. ‘నీ షాపింగ్ తగ్గించుకో.. నాకసలు వద్దు’ అన్నాడు. ‘నీకొద్దయితే వద్దను. నన్ను తగ్గించుకొమ్మని నీ సలహా ఏంటి?’ అంది ఉక్రోషంగా. ‘దాని బదులు స్టోరీ బుక్స్‌లాంటివి పనికొచ్చేవేమైనా కొనుక్కో’అన్నాడు. వీళ్ల సంభాషణను వింటున్న వాళ్లమ్మ జానకి ‘ఇంతకీ నువ్వే వస్తువు కావాలని అన్నిటి ఖర్చు తగ్గించుకుంటున్నావ్?’ అని అడిగింది.



‘మమ్మీ..’ అంటూ అమ్మ దగ్గరకి చేరాడు. ‘నీకు తెలుసు కదా.. ‘గోల్డెన్ రిట్రీవర్’ పప్పీ కావాలని’ అన్నాడు చిన్నగా. ‘ఓ మై గాడ్.. దాని రేటెంతో తెలుసా?’ అంది చెల్లి. ‘జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ థౌజెండ్’ అన్నాడు. ‘మమ్మీ.. దాని రేట్ ట్వెల్వ్ థౌజెండే కానీ మంత్లీ మెయింటెనెన్స్ 6000. మనం ఒక అనాథకి చక్కగా చదువు చెప్పించొచ్చు’ అంది చెల్లెలు గౌరి. ‘నిజమే. ఏమంటావ్?’ అన్నట్టు చూసింది కొడుకు వంక. ‘నా బడ్జెట్‌లో ఎయిటీన్ థౌజెండ్ మిగులుస్తానమ్మా. దాంతో కొనుక్కుంటా’ అన్నాడు. ‘మీరు వేసిన బడ్జెట్ ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు నాన్నా... మీకు మనీ వాల్యూ తెలియాలని ప్లాన్ వేయమన్నానంతే’ పిల్లలిద్దరినీ ఉద్దేశించి చెప్పింది జానకి. ‘నిజమే కావచ్చు. కానీ పప్పీ కోసం అన్ని ఖర్చులు తగ్గించుకుంటా. మాటిమాటికీ షూ కొనివ్వమని అడగను. నాకసలు పాకెట్ మనీయే వద్దు. పప్పీ కొనివ్వండి చాలు’ అని అన్నయ్య అమ్మను బతిమాలుకుంటుంటే ఏమనుకుందో ఏమో చెల్లి ‘వాడికి పప్పీ కొనివ్వు మమ్మీ.. నేను షాపింగ్ చేయడం మానేస్తా.. మనం హోటల్లో డిన్నర్ చేయడం మానేద్దాం.. మూవీస్ కూడా ఇంట్లోనే చూద్దాం థియేటర్‌కి వెళ్లొద్దు. పనమ్మాయిని మాన్పించెయ్. నేను హెల్ప్ చేస్తా.. అట్లా మిగిలిన డబ్బులతో పప్పీ కొనుక్కుందాం...’ అంది గౌరి.



‘నా కూతురు, కొడుకు ఆ త్యాగాలన్నీ చేయనక్కర్లేదు. వాళ్లు అడిగితే కొండమీది కోతినైనా తెచ్చివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటొచ్చీ వాళ్లు అడిగే వస్తువు విలువ వాళ్లకు తెలియాలి. అది ఎంత కష్టపడితే వస్తుందో అర్థం కావాలి. అలాగే డబ్బు విలువ, దాన్ని సంపాదించేందుకు పడే శ్రమ విలువా తెలియాలి. దాన్ని అర్థంచేసుకునే ఇంగితంతో నా పిల్లలున్నందుకు గర్వంగా ఉంది’ అని  మనసులో అనుకుంది గవర్నమెంట్ టీచర్ అయిన  జానకి.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top