వీలునామా@ ఆన్‌లైన్..


ప్రస్తుతం బ్యాంకింగ్ మొదలు షాపింగ్ దాకా అన్ని ఆర్థిక లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. తాజాగా వీలునామాలు కూడా ఈ జాబితాలో చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, ఎన్‌ఎస్‌డీఎల్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. వార్మండ్ ట్రస్టీస్ అండ్ ఎగ్జిక్యూటర్స్‌తో కలిసి ఈజీవిల్‌డాట్‌కామ్ పేరిట ఎన్‌ఎస్‌డీఎల్, లీగల్‌జినీతో కలిసి హెచ్‌డీఎఫ్‌సీ ఈ సర్వీసులు అందిస్తున్నాయి.



ఈ పద్ధతిలో వీలునామా తయారుచేయాలనుకునే వారు ముందుగా సదరు వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా నిర్దేశిత ఫీజును ఆన్‌లైన్లో కట్టాలి. ఆ తర్వాత యూజర్ కేటగిరీని ఎంచుకోవాలి. ఆపైన కుటుంబసభ్యులు, ఆస్తులు, వాటి పంపకం ఎలా చేయాల నుకుంటున్నారు మొదలైన వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.



ఆ వివరాలను కంపెనీ.. న్యాయ నిపుణులకు పంపుతుంది. వారు ముసాయిదా వీలునామాను సిద్ధం చేస్తారు. దానిలో మార్పులు, చేర్పులు ఏమైనా ఉన్న పక్షంలో తెలియజేస్తే.. ఆ మేరకు సంస్థ సవరణలు చేస్తుంది. తుది వీలునామాను ఈమెయిల్ లేదా హార్డ్ కాపీ కావాలంటే ఆ రూపంలోనూ పంపిస్తుంది. సాధారణంగా సంప్రదాయబద్ధంగా తయారు చేయించుకోవాలంటే లాయర్‌ను బట్టి దాదాపు రూ. 20,000 దాకా అవుతోంది.



అదే ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీలునామా రూ. 4,000లో అందిస్తున్నాయి ఈజీవిల్‌డాట్‌కామ్, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్. ఒకసారి సిద్ధమయ్యాక, అదనపు మార్పులు చేర్పులు మొదలైనవి చేయాలంటే సుమారు రూ.250 ఖర్చవుతుంది. ఇక హార్డ్ కాపీ హోమ్ డెలివరీ కావాలంటే అదనంగా రూ. 500 వసూలు చేస్తున్నాయి కంపెనీలు. అయితే, ప్రస్తుతం బెంగళూరు, ముంబై వంటి నగరాల్లోనే ఈ సర్వీసు ఉంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top