మా నాన్నకు ఆ వ్యాధి ఎందుకు వచ్చింది?


న్యూరో కౌన్సెలింగ్

 


మా నాన్నగారి వయసు 62 ఏళ్లు. ఆయన కాళ్లు, చేతులు వణుకుతుంటే వైద్యులకు చూపించాం. పార్కిన్‌సన్ వ్యాధి ఉన్నట్లు వారు చెప్పారు. దాంతో మా నాన్నగారు ఎక్కువగా కుంగిపోతున్నారు. ఆయన అలా కావడం చూసి, మేమందరమూ ఆందోళన చెందుతున్నాం. అది ఎందుకు వస్తుంది. పార్కిన్‌సన్ వ్యాధి పూర్తిగా నయమవుతుందా? దయచేసి మా నాన్నగారి సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి.

 - ఈశ్వర్, నల్గొండ


 పార్కిన్‌సన్ వ్యాధి ఎక్కువగా వయసు పైబడినవాళ్లలో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి వచ్చినవారిలో అప్రయత్నంగా చేతులు, కాళ్లు వణుకుతుండటంతో పాటు నిద్రలేమి, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జబ్బు ముదిరే కొద్దీ నాలుక, పెదవులు కూడా వణకడం మొదలవుతుంది. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. శరీరం బిగుతుగా మారుతుంది. ఏ పనీ సరిగా చేసుకోలేకపోతారు. ఈ వ్యాధి ఎక్కువగా జన్యుపరమైన కారణాలతో వస్తుంది. మెదడులో డోపమిన్ అనే రసాయనాన్ని తయారు చేసే కణాలు వేగంగా చనిపోవడం వల్ల డోపమిన్ రసాయనం తగ్గుతుంది. దాంతో పార్కిన్‌సన్ వ్యాధి వస్తుంది. డోపమిన్ తగ్గేకొద్దీ పార్కిన్‌సన్ లక్షణాలు పెరుగుతుంటాయి. మీ నాన్నగారికి పార్కిన్‌సన్ వ్యాధి ఉందని ఆందోళన చెందకండి. ప్రస్తుతం ఈ వ్యాధికి అత్యాధునిక చికిత్సావిధానాలు అందుబాటులో ఉన్నాయి. పార్కిన్‌సన్ వ్యాధిగ్రస్తులకు కుటుంబ సభ్యుల ఆదరణ ఎక్కువగా ఉండాలి. వారు మానసికంగా కుంగిపోకుండా చూసుకునే బాధ్యత కుటుంబ సభ్యులదే. వారిని ఒంటరిగా ఉండనీయకుండా నలుగురితో గడిపేలా చూడండి.     మీ బంధువులు, మీ నాన్నగారి స్నేహితులు ఆయనతో ఎక్కువగా కలిసేలా చూడండి. మీ నాన్నగారు మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకుంటూ, సరైన చికిత్స అందేలా జాగ్రత్తలు తీసుకోండి. దాంతో మెరుగైన ఫలితాలను పొందుతారు.

 

 డాక్టర్ కోమల్ కుమార్

 సీనియర్ న్యూరోఫిజీషియన్

 యశోద హాస్పిటల్స్

 సికింద్రాబాద్

 

ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

 

నా వయసు 24 ఏళ్లు. నేను ఎస్‌ఐ జాబ్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఏడాది క్రితం ఒకసారి హైజంప్ చేసే సమయంలో మోకాలిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. డాక్టర్‌ను కలిస్తే ‘పార్షియల్ ఏసీఎల్ టేర్’ జరిగిందని వివరించారు. కొన్ని రోజులు ఫిజియోథెరపీ తీసుకొమ్మనీ, ఆ తర్వాత రన్నింగ్ చేయవచ్చని చెప్పారు. నాకు అప్పుడప్పుడూ ఇంకా నొప్పి ఇస్తూనే ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.

 - వి. మహేశ్, కరీంనగర్


 ఆటలు ఆడే సమయంలో మీరు చెప్పిన యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయపడటం చాలా సాధారణంగా జరిగేదే. పాశ్చాత్యదేశాల వారు స్పోర్ట్స్ సమయంలో దీనికి (ఏసీఎల్)కు లోనవుతుంటారు. కానీ మనదేశంలో సాధారణంగా టూవీలర్ నడిపేవారు యాక్సిడెంట్‌కు గురైనప్పుడు ఈ లిగమెంటు దెబ్బతింటుంది. ఇది మోకాలిలో ఉండే కీలకమైన లిగమెంటు. ఒకసారి ఇది గాయపడితే దీనికి రక్తసరఫరా జరగదు కాబట్టి ఇది ఒక శాశ్వత నష్టం చేకూర్చే ప్రమాదంగా పరిణమిస్తుంది. ఈ లిగమెంట్ దెబ్బతిన్న వారు... అంటే ఏసీఎల్‌కు గాయం అయిన వారు సరిగా నిలబడలేకపోవడం మామూలే. కొన్నేళ్ల తర్వాత అది ఆర్థరైటిస్‌గా మారడం కూడా జరుగుతుంది. సాధారణంగా 50 ఏళ్ల కంటే పెద్ద వయసు ఉన్న వారిలో ఏసీఎల్ గాయపడితే సాధారణ సంప్రదాయ చికిత్స చేస్తూ, మోకాలి కదలికలు తగ్గించుకొమ్మని చెబుతూ, వ్యాయామాలను సూచిస్తుంటాం. కానీ చిన్న వయసు వారిలో అంటే... 40 ఏళ్ల కంటే తక్కువ వారికి మాత్రం శస్త్రచికిత్స సూచిస్తుంటాం. ఇందులో కొత్త లిగమెంటు పునర్నిర్మాణం చేస్తుంటాం. దీనివల్ల వారిలో ఆర్థరైటిస్ రాకుండా నివారించడం సాధ్యమవుతుంది. మీ ఎమ్మారైను బట్టి పార్షియల్ టేర్ అంటున్నారనుకుంటాను. కానీ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే ఆ లిగమెంట్ పూర్తిగా చిరిగిపోయి ఉంటుందని ఊహించవచ్చు. కాబట్టి మీరు ఇప్పట్లో జంపింగ్స్, రన్నింగ్ వంటి వ్యాయామాలు, స్పోర్ట్స్ మొదలుపెట్టకండి. మీ పరిస్థితిని పూర్తిగా సమీక్షించేలా ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ నిపుణుడిని కలిసి, తగిన సలహా తీసుకోండి.

 డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి

 చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్

 ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్

 హైదరాబాద్     

 

డయాబెటిక్ కౌన్సెలింగ్.



 మా నాన్నగారికి ఇటీవల డయాబెటిస్ పరీక్షలు చేయిస్తే, ఆయన రక్తంలో చక్కెరపాళ్లు 290, ట్రైగ్లిసరైడ్స్ కొవ్వులు 611 వచ్చాయి. ఆయన గత ఐదేళ్లుగా చక్కెర నియంత్రణ కోసం మందులు వాడుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఆహార నియమాలు కూడా పాటిస్తుంటారు. కానీ మా నాన్నగారు వృత్తిరీత్యా చాలా ఒత్తిడిలో ఉంటారు. దయచేసి ఆయన ట్రైగ్లిజరైడ్స్ తగ్గడం కోసం తగిన చికిత్స సూచించగలరు.

 - ఎ., హైదరాబాద్


 ఆయన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కేవలం ఈ ఒక్క రిపోర్టు ఆధారంగా వెంటనే ఆయన చక్కెరపాళ్లు అనియంత్రితంగా ఉంటున్నాయని నిర్ధారణ చేయలేం. ఆయనకు మరోసారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌తో పాటు హెచ్‌బీఏ1సీ పరీక్ష చేయించండి. దీని వల్ల గత మూడు నెలల్లో మీ నాన్నగారి షుగర్ పాళ్ల సరాసరి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్షల్లో రిపోర్టులు 126 కంటే ఎక్కువగానూ, హెచ్‌బీఏ1సీ పరీక్షలోని విలువ 7 కంటే ఎక్కువగానూ ఉంటే, అప్పుడు షుగర్ నియంత్రణ కోసం నోటి ద్వారా తీసుకునే మరో మందు వాడవచ్చు. ఇక ట్రైగ్లిసరైడ్స్ మాత్రమే గాక ఆయనలో అన్ని రకాల కొవ్వుల రీడింగ్స్ (లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రిపోర్టులు) అవసరం. అన్ని కొవ్వులు కలుపుకున్న రిపోర్టు 200 కంటే తక్కువగా ఉండాలి. అది సాధించడానికి ఆయన రక్తంలో కొవ్వుల పాళ్లను నియంత్రించేలా మందులు వాడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఆ పరీక్షలు చేయించి, ఆ రిపోర్టులతో ఫిజీషియన్‌ను కలవండి.

 

 నా వయసు 27 ఏళ్లు. నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా హెచ్‌బీఏ1సీ విలువ నార్మల్‌గానే ఉంది. కానీ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ) పరీక్ష రిపోర్టులు మాత్రం అనుకూలంగా రాలేదు. నేను ప్రస్తుతం గ్లైకోమెట్ 500 ఎంజీ మందును రోజుకు రెండుసార్లు వాడుతున్నాను. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి.

 - సుగుణ, కాకినాడ




 మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు రక్తంలో చక్కెరపాళ్లు విలువలు నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. మీరు వాడే మెట్‌ఫార్మిన్ మందును ఆపేసి, ఆహార నియమాలు పాటించడం ద్వారా మీ చక్కెర పాళ్లను నార్మల్‌గా ఉంచుకోవచ్చు. మీరు గర్భం ధరించాక అవసరాన్ని బట్టి మళ్లీ మీ మందుల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. ఒకవేళ మందులతో మీ చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే (మరీ ముఖ్యంగా గత మూడు నెలల విలువలు) అప్పుడు మీకు అవసరాన్ని బట్టి ఇన్సులిన్ వాడాల్సి రావచ్చు.

 

 డాక్టర్ శ్రీనగేశ్

 కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్

 కేర్ హాస్పిటల్స్

 బంజారాహిల్స్

 హైదరాబాద్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top