ఏం చేస్తే తను మారుతుంది?

ఏం చేస్తే తను మారుతుంది?


వేదిక

స్నేహమనేది ఎప్పుడూ నిన్ను ఒక వ్యక్తిగా నిలబెట్టాలి తప్ప, తప్పు దోవలో నడిపించకూడదు. అలా నడిపిస్తే అది నిజమైన స్నేహమే కాదని నా స్థిరమైన అభిప్రాయం. ఆ అభిప్రాయమే నన్ను, రమ్యను దూరం చేసిందనుకుంటా. నేను, రమ్య ఎంత మంచి స్నేహితులమంటే... ఎక్కడికైనా ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. ఒకే స్కూలు, ఒకే ట్యూషను, ఒకే కాలేజీ... మా స్నేహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. కొందరు అసూయ కూడా పడేవారు. అలాంటి మా మధ్య దూరం పెరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు.

 

చదువులు పూర్తయ్యాక ఇద్దరం ఒకేసంస్థలో ఉద్యోగాలు సంపాదించాం. కొన్నాళ్లపాటు బాగానే గడిచింది. కానీ రోజులు గడిచేకొద్దీ రమ్యలో ఏదో మార్పు. తనకి కొత్త ఫ్రెండ్స్ వచ్చారు. దానివల్ల నాకు ఇబ్బంది లేదు. కానీ తన స్నేహాలు సరిగ్గా లేకపోవడమే నన్ను బాధించింది. ఎటువంటి కమిట్‌మెంట్స్, సిన్సియారిటీ లేని మనుషులతో తిరుగుతూ తను కూడా వాళ్లలా తయారవడం మొదలుపెట్టింది రమ్య. అది నాకు నచ్చలేదు. చాలాసార్లు వారించాను. పనిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పాను. కానీ తను వినలేదు. పైగా నా పోరు పడలేక నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది.

 

దీనికితోడు తనను నిస్వార్థంగా, నిష్కల్మషంగా అభిమానించిన నాకు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టింది రమ్య. తనని ఏమీ అనలేకపోయేదాన్ని. అలాగని తనను సపోర్ట్ చేయలేను. ఎందుకంటే, తను వెళ్తోన్న దారి తప్పని నాకు తెలుసు కాబట్టి. తన ప్రవర్తన కారణంగా తను కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు నేను తనని వెనకేసుకుని రాలేకపోయాను. నువ్వలా చేసివుండకపోతే ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదు కదా అన్నాను. ఆ మాటని తను తప్పుగా అర్థం చేసుకుంది. నేను తనని దూరం పెడుతున్నానని అనుకుంది. తనే నాకు దూరంగా వెళ్లిపోయింది. నిజానికి ఆ దూరం తను కోరుకుంది. కానీ అది నన్ను మాత్రం చాలా బాధించింది. ఆ విషయం ఎలా చెబితే రమ్యకి అర్థమవుతుంది! ఏం చేస్తే తను మారుతుంది! కనీసం మీరైనా చెప్పరూ!

 - వందన, రాయచూర్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top