పడి లేచిన కెరటం!

పడి లేచిన కెరటం! - Sakshi


అమితాబ్‌కు పరాజయం కొత్తేమీ కాదు. చాలా పాత చుట్టం. అయితే ఆ చుట్టాన్ని చూసి బెదిరి పోలేదు. చిన్నబుచ్చుకోలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. విజయపతాకాన్ని ఎగరేశారు. అమితాబ్ రాత్రికి రాత్రే సూపర్‌స్టార్ కాలేదు. హీరో కావడానికి సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు-

 ‘‘ఈ గొంతుతో ఎలా హీరో అవుదామనుకున్నావయ్యా!’’ అని ఒకరు.

 ‘‘ఇంత ఎత్తుతో ఎలా హీరో అవుతావు!’’ అని ఒకరు.

 ఒక్కరా ఇద్దరా? అమితాబ్ మనసు విరిగే మాటలెన్నో వినబడేవి. అయితే అవి అతని పట్టుదలను రెట్టింపు చేశాయి తప్ప నిరుత్సాహం నింపలేదు. సూపర్‌స్టార్ అయ్యేవరకు మడమ తిప్పలేదు.

 ‘అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్’ లిమిటెడ్ (ఎ.బి.సి.ఎల్). పేరుతో సొంత కంపెనీ మొదలుపెట్టారు బిగ్‌బి. ఈ కంపెనీ నుంచి విడుదలైన తొలి సినిమా ‘తేరే మేరే సప్నే’ పరాజయం మూటగట్టుకుంది. ‘ఎ.బి.సి.యల్’ భవిష్యత్‌కు ఇదో సూచనలా మిగిలింది. యాక్షన్ హీరోగా మరోసారి పలకరించడానికి

 1997లో ‘మృత్యుదాత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు అమితాబ్. తన సొంత నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా పరాజయం పొందింది. నష్టాలు తెచ్చింది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో నష్టాలు.

 ఒకానొక దశలో కంపెనీ ఊహించని రీతిలో దివాళా తీసింది. ఇండియన్ ఇండస్ట్రీస్ బోర్డ్ ‘ఎ.బి.సి.ఎల్’ను ‘ఫెయిల్డ్ కంపెనీ’గా ప్రకటించింది. నష్టాల నుంచి కోలుకోవడానికి బాంబేలోని బంగ్లాను, రెండు ఫ్లాట్లను అమ్ముకోవాల్సి వచ్చింది.

 ‘‘అమితాబ్ పని అయిపోయింది’’ అనుకున్నవాళ్లు ఉన్నారు.

 ‘‘అంత పెద్ద స్టార్ కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది’’ అని జాలి పడిన వాళ్లు ఉన్నారు.

 అమితాబ్ మాత్రం ఓటమిని చూసి పలకరింపుగా నవ్వారు. ఆ నవ్వులో ‘నేను మళ్లీ గెలుస్తాను’ అనే ఆత్మవిశ్వాసం ఉట్టిపడింది.

 యాభై అయిదు సంవత్సరాల వయసులో మరో విజయం కోసం నడుం బిగించాడు. అప్పుడంటే యవ్వనోత్సాహం ఉంది. సంపూర్ణ ఆరోగ్యం ఉంది. ఒక్కసారి కిందపడినా పదిసార్లు లేచే ఓపిక ఉంది.

 మరి ఇప్పుడు?

 ఉత్సాహం ఉందిగానీ...వయసు తోడుగా లేదు.

 ఆరోగ్యం ఉందిగానీ...సంపూర్ణ ఆరోగ్యం లేదు.

 అప్పటితో పోల్చితే ‘లేదు’లు బోలెడు ఉన్నాయి. అయితే ఆయన దగ్గర ఈ వయసులోనూ ఒకే ఒకటి ఉంది.

 ‘ఒక్కసారి కింద పడినా పదిసార్లు లేచే శక్తి’

 ‘తనలోని శక్తి ఏమిటో కనుగొనేవాడే..నిజమైన శక్తిమంతుడు’ అంటారు.

 మరి తనలోని శక్తి ఏమిటి?

 వ్యాపారం...కాదు.

 రాజకీయాలు...కాదు.

  తన శక్తి ఏమిటో తనకు తెలుసు. అదే ‘నటన’

  ఏ నటనతోనైతే తాను పైగా ఎదిగాడో, అదే నటనతో మళ్లీ తనను తాను నిరూపించుకోవాలనుకున్నాడు.

 ‘బడే మియా చోటే మియా’(1998) సినిమాతో కొద్దిగా పైకి లేచి యశ్‌చోప్రా ‘మహబ్బతే’(2000)తో విజయం అనే క్రీజ్‌లో నిలుదొక్కుగోలిగారు.

 సినిమా నటులు బుల్లితెరపై నటించడాన్ని తక్కువగా చూసే రోజుల్లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో బుల్లితెరకు కొత్త వెలుగు ఇచ్చారు. తన విజయ విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

ఇప్పుడు అమితాబ్ వయసు 71 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ‘ఓటమి’ భూతం కనికరం లేకుండా అతడిని పలకరించినా... మళ్లీ లేచి కాలరు ఎగరేసే సత్తా ఆయనకు పుష్కలంగా ఉంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top