ఉత్కృష్టసోమం–అగ్నిష్టోమం

ఉత్కృష్టసోమం–అగ్నిష్టోమం


సమాజంలో పెచ్చరిల్లుతున్న అశాంతిని, అసంతృప్తిని తొలగించి, లోకకల్యాణం చేకూర్చేందుకు, సనాతన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టేందుకు 23 సోమవారం నుంచి 28 శనివారం వరకు ‘ఉత్కృష్ట సోమయాగం’ జరగనుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలో బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్యసోమయాజులు బ్రహ్మత్వంలో... మాడుగుల భవానీ శశిభూషణ శర్మ దంపతుల యాజమాన్యంలో ఈ బృహద్యజ్ఞం జరుగుతోంది.



కృష్ణానదీ తరంగాలపై వీచే గాలి సోకినా చాలు. పాపాలన్నీ నశించి విష్ణులోకాలను పొందుతారని పురాణాలు పేర్కొన్నాయి. అటువంటి పవిత్ర కృష్ణానదీ తీరాన్ని ఆనుకొని ఉన్న బీచుపల్లి క్షేత్రం ఈ చారిత్రక యాగానికి వేదికవడం ముదావహం. గతంలో ఈ ప్రాంతమంతా విరివిగా శ్రౌతయాగాలు జరిగేవి. ఈ ప్రాంతంలోనిశ్రౌతపండితులు దక్షిణభారతదేశంలో అగ్రగాములుగా ఉండేవారని చరిత్ర. అటువంటి  చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో వందేళ్ల తర్వాత ఈ సోమయాగం...   



శ్రౌతయాగ రక్షణలో ‘శ్రుతి సంవర్ధినీ’

మరుగున పడుతున్న వైదిక సంస్కృతిని పరిరక్షించాలనే లక్ష్యంతో, శ్రౌతధర్మం పట్ల అందరికి అవగాహన కలిగించి శ్రౌతయజ్ఞాలలోని ఆచార, సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే తపనతో మూడేళ్ల క్రితం ఏర్పాటయిన శ్రుతి సంవర్ధినీ సభ ఇప్పుడు ఈ యాగాన్ని నిర్వహిస్తోంది.



మహాతపశ్శాలులైన ద్రష్టలు లోకాతీతదృష్టిని సంపాదించి మానవునికంటే ఉత్తమమైన శక్తులున్నాయని చాటిచెప్పారు. అటువంటి శక్తులు సాకారమైనా, నిరాకారమైనా కావచ్చు. ఈ ప్రపంచంలో నిలబడడంలో వాటి సహకారం ఎంతైనా అవసరం. ఆ శక్తులనే మనం దేవతలని పిలుచుకుంటున్నాం. అటువంటి దేవతలకు కృతజ్ఞతా పూర్వకమైన బుద్ధితో చేసేదే యజ్ఞం.



భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదింటిని కలిపి పంచభూతాలని అంటారు. ప్రకృతికి  ఈ పంచభూతాలే ముఖ్యకారణాలు. అటువంటి పంచభూతాలలో అగ్ని మూడవది. యజ్ఞయాగాది క్రియలలో ముందుగా కావలసింది అగ్నిదేవుడే! ‘అగ్నిముఖావైదేవా’. అన్న వాక్యానుసారం దేవతలకు ఏది సమర్పించాలన్నా దాన్ని అగ్నిముఖంగా ఇవ్వాల్సిందే. అలా ఇచ్చినవాటినే దేవతలు స్వీకరిస్తారు. దీనినే యజ్ఞమని అంటారు. యజ్ఞాలు శ్రౌతయజ్ఞాలని, స్మార్తయజ్ఞాలనీ రెండురకాలు. వీటిలో వేదోక్తమైన శ్రౌతయజ్ఞాలకు విశేష ప్రాధాన్యత ఉంది. వాటిలోనిదే అగ్నిష్టోమం.



సోమయాగం అంటే ఏమిటి?

విశ్వంలో ప్రాణులు బతకడానికి కావలసిన అన్నం, నీరు, గాలి, మొదలైన వాటిని ప్రసాదించే దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా హవిస్సులను సమర్పించి వారిని ఆరాధించాలి. ‘‘దేవేభ్య ఇదం నమమ–నేను సమర్పించిన ఈ హవిస్సు ఆయా దేవతలకు చెందుతుంది. ఇందులో నాది ఏమీలేదు’’ అన్న భావనతో స్వార్థాన్ని విడచి సమస్త పాపాలను తొలగించుకొని చిత్తశుద్ధిని పొందుతాం. ఈ విధంగా సర్వదేవతల స్వరూపుడైన పరమేశ్వరుణ్ని తృప్తిపరచి, తద్వారా దేవ ఋణం నుంచి విముక్తుడవడమే ఈ యాగ ముఖ్య ఉద్దేశ్యం.



అన్ని యాగాలలో సమర్పించే పురోడాశం, నెయ్యి, పాలు, పెరుగు మొదలైన హవిస్సులేగాక, అమృతలత జాతికి చెందిన ‘సోమలత’ అనే ప్రధానమైన హవిస్సును నలుగురు ఋత్విక్కులు మంత్రోక్తంగా దంచి, ముద్దను ఒక బట్టలో పెట్టి దానిని పిండి ఆ రసాన్ని గ్రహ, చమస అనే పేరుతో ఉన్న పాత్రలలోకి తీసుకుంటారు. అనంతరం దీనిని యాగంలో సమర్పిస్తారు. ఈ సోమరసాన్ని అగ్నిలో ఆహుతి ఇచ్చినప్పుడు ఆ యాగ దేవతయిన ఇంద్రుడు తృప్తిచెంది, ప్రజలకు బలాన్ని, కీర్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించి, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఈ యజ్ఞాలూ, యాగాలూ. యజ్ఞయాగాల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి, వర్షాలు కురుస్తాయని, భూగర్భజలాలు పెరిగి, పంటలు బాగా పండుతాయని సైన్సుపరంగా కూడా రుజువైంది.



ఈ అగ్నిష్టోమయాగంలో త్రివృత్, పంచదశ, సప్తదశ, ఏకవిగంశములనే నాలుగు రకాల స్తోత్రాలు, సామగాన రూపకాలైన పన్నెండు స్తోత్రాలు ఉన్నందువల్ల దీనికి జ్యోతిరగ్నిష్టోమం అని పేరు. అగ్నిష్టోమమనే యజ్ఞాయజ్ఞియ స్తోత్రంతో ఈ యాగం పూర్తి అవుతున్నందున దీనికి ‘అగ్నిష్టోమం’ అనే పేరు సార్థకమైంది. అగ్నిష్టోమానంతరం సంతానార్థులకోసం పుత్రకామేష్ఠి యాగం నిర్వహిస్తున్నారు.

– అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని వేదపండితులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top