మీకేం తక్కువ!

మీకేం తక్కువ!


ఇది లేదనీ, అది లేదనీ రోజూ ఏడ్వడమే కదా! అదుంటే బాగుండు.. ఇదుంటే బాగుండు అని రోజూ భంగపడడమే కదా! ఇదుంటే అది చేస్తా.. అదుంటే ఇంకేదో చేస్తా అని రోజూ ఫోజులేగా! అన్నీ ఉన్నా ఏమీ చేయలేని ఎందరికో.. ఏమీ లేకపోయినా అన్నీ చేయగల    ఈ టూ ఫ్రెండ్స్‌... సింప్లీ అదుర్స్‌!! ఒకరికి రెండు కళ్లూ లేవు. మరొకరికి రెండు చేతులూ లేవు. ప్లాట్‌ ఫామ్‌ మీద కూర్చొని బిచ్చమడిగితే చేతి నిండా కాసులే. అయ్యో మమ్మల్ని ఇలా ఎందుకు చేశావు దేవుడా అని ఏడిస్తే.. కడుపు నిండా సానుభూతే.



‘‘ఠట్‌.. మేము అట్లా బతకం. మాకేం అక్కర్లేదు. మేమే పదిమందికి ఇస్తాం. బంజర జీవితం మాది కాదు. మేము అందరి జీవితాలనీ సస్యశ్యామలం చేస్తాం. మాలో ఒకరు పలుగు.. ఇంకొకరు పార. మా గుండెల్లో ఉన్నది పరోపకార ధార. చేతలకు చేతులు అక్కర్లేదని చెబుతాం. ఎదగడానికి దృష్టి అక్కర్లేదని చెబుతాం. పరోపకారం.. నాటితే చాలు అని చెబుతాం. వనమంత మంచి చేయడానికి చెట్టంత గుండె ఉంటే చాలు. మాకేం తక్కువ?! నిజానికి మీకేం తక్కువ? మేమున్నాంగా!’’



రెండు చెమట చుక్కల్ని రాల్చితే చిన్న మొక్కని నాటగలం. అదే మొక్కని నాటడానికి ఈ ఇద్దరు స్నేహితులు మాత్రం చెమటతో పాటు రక్తాన్ని, కన్నీళ్లను కూడా చిందించాలి. చిందించారు కూడా! ఫలితమే.. పచ్చటి చిట్టడవి. అయితే వీళ్లు ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకో అడవిని సృష్టించే వరకు పలుగు, పార దించేది లేదని అంటున్నారు!



చైనా రాజధాని బీజింగ్‌కి సమీపంలో హెబెయ్‌ ప్రావిన్స్‌ ఉంది. అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఏదో ఒక పేరు ఉండే ఉంటుంది కానీ, అక్కడ ఉంటున్న ఇద్దరు స్నేహితులు మాత్రమే ఇప్పుడు ఆ గ్రామానికి పేరు, ప్రతిష్ట. ఆ ఇద్దరు స్నేహితులలో ఒకతని పేరు జియా వెంకీ (54). ఇంకో అతని పేరు హైగ్జియా (55). వెంకీకి చేతుల్లేవు. హైగ్జియాకు కళ్లు లేవు. మొక్కల్ని నాటి, అడవిని పెంచడం కోసం వెంకీ తన కళ్లను హైగ్జియాకు, హైగ్జియా తన చేతుల్ని వెంకీకి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఇద్దరూ బాల్య స్నేహితులు. మూడేళ్ల వయసులో వెంకీకి కరెంట్‌ షాక్‌ కొట్టి రెండు చేతులూ పోయాయి. హైగ్జియాకు పదిహేడేళ్ల క్రితం క్వారీలో పనిచేస్తుండగా ప్రమాదం జరిగి కళ్లు పోయాయి.



పాదులు తవ్వడం, వాటికి నీళ్లు పారేలా చెయ్యడం, చెట్ల నుంచి మండల్ని కోసుకొచ్చి ఆ పాదుల్లో అంటు కట్టడం... ఇదంతా పెద్దపని. ఈ పెద్ద పనిని ఇద్దరూ చేస్తారు. అయితే అంటు మండల్ని తెంపుకొచ్చే పని మాత్రం హైగ్జియాదే. అతడికి చేతులున్నాయి కాబట్టి ఆ పని తేలిక. చెట్ల మొదలులో వెంకీ వంగి కూర్చుంటే, అతడి భుజంపైకి ఎక్కి హైగ్జియా చేతులు తడుముకుంటూ మండల్ని తెంపుకుంటాడు. ఏ చెట్టు మండల్ని తెంపాలన్న డైరెక్షన్‌ మళ్లీ వెంకీదే. వీళ్లు నడిచే దారిలో వాగులాంటివి వచ్చినప్పుడు చేతుల్లేని వెంకీ భుజం మీద జింక పిల్లలా కళ్లు లేని హైగ్జియా ఎక్కేస్తాడు. ఉదయాన్నే చద్ది కట్టుకుని వెళ్లడం, మొక్కల్ని నాటడం, నాటిన మొక్కల్ని చూసుకోవడం, సాయంత్రానికి ఇల్లు చేరడం.. 2002 నుంచీ ఇదే వాళ్ల దైనందిన క్రమం.


‘మనం నాటిన మొక్కలు ఎలా ఎదుగుతున్నాయ్‌ వెంకీ’ అని హైగ్జియా అడుగుతున్నప్పుడు చూడాలి వెంకీ కళ్లలో ఆనందం. మిత్రుడికి అర్థమయ్యేలా చెప్పడానికి అతడు పడే తపనలో పచ్చటి కవిత్వం చల్లటి గాలిలా వీస్తుంది. హైగ్జియా వెంటనే ఆ మొక్కల్ని తన చేతులతో తడిమి చూస్తాడు. వెంకీ ఎలాగూ మొక్కల్ని కళ్లారా చూసే కదా కవిత్వం చెబుతాడు.. కానీ చేతులతో మొక్కని తడిమే భాగ్యం అతడికి లేదు. అప్పుడు కళ్లతోనే స్పృశిస్తాడు.



బతికింది రెండే మొక్కలు

తొలి ఏడాది ఈ ఇద్దరు మిత్రులు 800 మొక్కలు నాటితే వాటిల్లో రెండు మాత్రమే బతికాయి! కూర్చొని ఆలోచించారు. వాగుల నుంచి చిన్న చిన్న నీళ్ల పాయలను తీసి ఆ వరుసలో మొక్కల్ని నాటడం మొదలు పెట్టాడు. ప్లాన్‌ సక్సెస్‌ అయింది.  ‘‘క్వారీలొస్తున్నాయి. కాల్వలు అడుగంటుతున్నాయి. చేపలు, రొయ్యలు చచ్చిపోతున్నాయి. నేల మండిపోతోంది. ఇన్ని నీళ్లు పోసి, ఇంత మొక్కని నాటితే తప్ప మనకు బతుకు లేదు’’ అని వెంకీ, హైగ్జియా.. ఈ మధ్య ఒక షార్ట్‌ఫిల్మ్‌ ఇంటర్వూ్యలో చెప్పారు. ఆ షార్ట్‌ఫిల్మ్‌ పేరు ‘యూ విల్‌ బి మై ఆర్మ్స్‌.. ఐ విల్‌ బి యువర్‌ ఐస్‌’.  



ఊరికి సమీపంలో ఈ అన్నదమ్ములు టార్గెట్‌గా పెట్టుకున్న అడవి ఆల్రెడీ పూర్తయిపోయింది. గత ఏడాది రెండో టార్గెట్‌ కూడా మొదలైంది. వంద ఎకరాల్లో చెట్లను నాటే పథకం అది. అయితే వాళ్లు దానిని పథకం అనడం లేదు. ప్రయత్నం అంటున్నారు. ప్రయత్నం ప్రారంభం అయింది కాబట్టి అది పథకమే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top