ఆదివాసీలే అందరికన్నా నాగరికులు

ఆదివాసీలే అందరికన్నా నాగరికులు


సరస్వతి రమ

 

తెల్లగా.. పొడుగ్గా.. ‘బీర్  బిర్సా ముండా’ అన్న అక్షరాలున్న టీషర్ట్ ధరించిన ఈ వ్యక్తి బ్రిటిషర్, అంతకన్నా కూడా డార్విన్ ముని మనవడు! పేరు.. ఫెలిక్స్ పెడెల్. ఒరియా గిరిజన వీరుడైన బిర్సా ముండా పేరును టీషర్ట్‌మీద ఎందుకు ముద్రించుకున్నారు అని ఆయన్ని అడిగితే.. ‘‘మా బ్రిటిషర్స్ చేసిన పాపాల్లో బిర్సా ముండాను చంపడం ఒకటి. ప్రాయశ్చిత్తంగా, ఆ వీరుడి గుర్తుగా ఈ టీ షర్ట్’’ అని సమాధానమిస్తాడు. అయితే అది కేవలం ఆయన వేషధారణకే పరిమితం కాలేదు. ముప్పై ఏళ్లుగా ఒరిస్సాలోని ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతూ ఆచరణలోనూ చూపిస్తున్నాడు. ప్రొఫెసర్ ఫెలిక్స్ ఉద్యమకారుడు. సొంత దేశాన్ని వదిలి ఇక్కడే స్థిరపడ్డాడు. ఇక్కడి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పలుప్రాంతాలు తిరుగుతాడు. అలా తిరుగుతూ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఫెలిక్స్‌తో జరిపిన సంభాషణలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.



 ఇక్కడి పారిశ్రామికవేత్తలకు డబ్బు తప్ప ఏమీ తెలియదు. ఈ దేశంలో దొరికే ఉక్కు, అల్యూమినియం, బాక్సైట్, బొగ్గులాంటి ఖనిజాల కోసం ఆదివాసీల ఆవాసాలను పెకిలిస్తున్న ఈ కంపెనీలకు ఇంకో విషయం కూడా తెలియదు... ప్రకృతి సంపదను రానున్న తరాలకు అందించడానికి ఆదివాసీలు ఎంతగా శ్రమపడుతున్నారో! ఆ మాటకొస్తే అసలు ఆదివాసీల పట్లే ఆ కంపెనీలకు అవగాహనలేదు. ఆదివాసీలు ప్రకృతిని దైవంగా పూజిస్తారు. సహజవనరులను పరిరక్షించడం తమ సంస్కృతిగా భావిస్తారు. ప్రకృతిధర్మం గురించి తెలిసిన ఆదీవాసీలనేమో అనాగరికులు అంటున్నాం.. తెలియనివాళ్లను మేధావులుగా, విద్యావేత్తలుగా, నాగరికులుగా కీర్తిస్తున్నాం. ఎంత దురదృష్టం! దీనికి కారణం  మన దగ్గరున్న విద్యావిధానం;  ఇంజనీ రింగ్, మెడిసిన్ తప్ప దేనికీ ప్రాధాన్యమివ్వక పోవడం. అసలు మన జీవనవిధానమే ఎకోఫ్రెండ్లీ సిస్టమ్‌గా లేకపోవడం!  



అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు...



అసలు ఈ భావననే నేనొప్పుకోను. ఈ దేశం ఎందులో ఐరోపా కన్నా తీసిపోయింది? అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు అనే భావనంతా అగ్రదేశాలది. అమెరికాను ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీ అంటున్నాం. అది తన దేశంలో మైనింగ్ నిలిపేసింది. ఎందుకూ... అభివృద్ధి చెందుతున్న (అమెరికా అంటున్నదాని ప్రకారం) దేశాలైన ఇండియా, బ్రెజిల్‌లో పుష్కలమైన ఖనిజాలున్నాయి. అవి మనకోసం స్టీల్ వంటి వాటిని ఉత్పత్తిచేసేలా చేద్దాం.. దీనివల్ల మన పర్యావరణానికి హాని ఉండదు అని ఓ పాలసీని తయారు చేసుకుంది.  ఇలాంటి ఒప్పందాలన్నిటికీ వేదిక నా సొంతూరైన లండన్. ఈ విషయాలన్నిటినీ ప్రస్తుతం నేను రాస్తున్న ‘వార్ అండ్ టై’ అనే పుస్తకంలో చర్చిస్తున్నాను.  



పొంతన లేదు!



ప్రపంచానికి అద్భుతమైన జీవనవిధానాన్ని, గొప్ప విలువలను అందించిన దేశం ఇది. యోగా, ధ్యానంలాంటి వాటితో పొందే మానసిక వికాసం, తద్వారా జరిగే ప్రగతిని మించిన అభివృద్ధి ఉంటుందా? ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే.. స్త్రీల పట్ల గౌరవంగా ఉండడం. ఏ సమాజంలో స్త్రీని అర్థంచేసుకుంటారో.. ఏ సమాజమైతే స్త్రీకి సముచితస్థానం ఇస్తుందో ఆ సమాజం ప్రగతిపథంలో పయనిస్తున్నట్టు లెక్క.. అయితే  ఈ దేశంలో మహిళలకు సంబంధించి చెప్తున్న సూక్తులకు, వాళ్లకు జరుగుతున్న అవమానాలకు పొంతనే లేదు. ఈ పరిణామం శోచనీయం. మతమనేది కూడా ఓ ప్రధాన అంశంగా మారడం కూడా విచారకరం. నిజానికి ప్రకృతి ధర్మాన్ని పాటించడాన్ని మించిన మతం లేదు. 1940ల్లోని ఒరియాకు చెందిన గొప్ప రైటర్ గోపీనాథ్ మహంతి ఒకసారి ఓ ఆదివాసీ నాయకుడిని అడిగాడట.. మీరు కొలిచే దైవం ఏంటి అని. దానికి ఆ నేత ‘పర్వతం’ అని జవాబు చెప్పాడట. మనిషి జీవనానికి కావల్సిన అన్ని మినరల్స్ పర్వతం ఇస్తుందని వివరించాడట ఆ నేత.



మంచి మార్పుకోసం..



నేడు సామాజిక ఉద్యమాల అవసరం ఎంతో ఉంది. నాకు తెలిసి ఇలాంటి ఉద్యమాలు ఇంకా కొనసాగుతున్న దేశం ఇండియానే. అయినా ఆదివాసీ హక్కులకు సంబంధించి ఇంకా చైతన్యం రావాలి. నిజమైన అభివృద్ధి... ఆకాశహర్మ్యాలు నిర్మించడంలో లేదు. ఆదివాసీల హక్కులను కాపాడడంలో ఉంది. వాళ్ల ఉపాధి వాళ్లకు మిగల్చడంలో ఉంది. దేశ ఉత్పత్తిలో వాళ్లకు భాగస్వామ్యాన్ని కల్పించడంలో ఉంది.  ఆదివాసీల గురించి ఆలోచించడమంటే ప్రకృతిని పరిరక్షించుకోవడమే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top