మా ఊరి దేవుడు

మా ఊరి  దేవుడు - Sakshi


నేడు మహానేత  6వ వర్ధంతి

 

వెలుతురు ఎంతకూ రాదేం! మనకేం తెలుసు? ఎదురు చూస్తుంటాం. వేకువ ఎప్పుడూ ఇంత ఆలస్యం కాలేదేం! మనకేం తెలుసు? మేఘం భూతమై ఆయన్ని అడ్డగిస్తోందని. చంటిగాడు కూడా తెలియకే సూర్యోదయం కోసం చూస్తూ ఉన్నాడు.  చంటిగాడు చాలాసేపటిగా మేల్కొనే ఉన్నాడు. ఆ వేళ వాడికి త్వరగా మెలకువ వచ్చింది. అది త్వరగా వచ్చిన మెలకువ కాదు. త్వరపడి తెచ్చుకున్న మెలకువ. జాము జాముకూ కోడి కూతను వింటున్నాడు. తెల్లారితే వాడు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. అదేమిటో వాడొక్కడికే తెలుసు. చంటిగాడికి పదేళ్లు. వాడి చెల్లెలు చంటిది... దానికి ఆరేళ్లు. అదింకా లేవలేదు. లేచాక తనకూ ఆ రహస్యం చెబుతాడు. దేవుడి గురించి చెల్లి వాడిని చాలాసార్లు అడిగింది. దేవుడు ఎలా ఉంటాడని, ఎక్కడుంటాడని, ఏం చేస్తుంటాడని, ఎందుకు అందరూ దేవుడిని తలుచుకుంటారని అడిగింది. వాటన్నిటికీ కలిపి ఒకే సమాధానాన్ని వాడొక గుడ్డ సంచీలో దాచి ఉంచాడు. చంటిగాడికి ఏవో గంటలు వినిపించాయి. గుడి గంటలు కావు. బడి గంటలు కావు. ఆవుదూడల మెడ  గంటలూ కావు. వాడి మనసులోని గంటలు.



 తాతయ్య చెప్పేవాడు.

 ఆదివారం సూర్యుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి; సోమవారం శివుడు; మంగళవారం ఆంజనేయుడు, అమ్మవారు; బుధవారం వినాయకుడు, సరస్వతి, సీతారాములు;  గురువారం సాయిబాబా, దత్తాత్రేయుడు; శుక్రవారం లక్ష్మీదేవి; శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకుంటారని.



చంటిగాడి ఫ్రెండ్ రహీమ్. వాడైతే వాళ్ల నాన్నతో కలిసి శుక్రవారం, శుక్రవారం మసీదుకు వెళతాడు.ఇంకో ఫ్రెండ్ పీటర్. ప్రతి ఆదివారం చర్చికి వెళతాడు.త్వరగా తెల్లారితే బాగుండు, గుడికెళ్లాలి అనుకున్నాడు చంటిగాడు.

   

చంటిగాడికి చీకటంటే భయం లేదు. కానీ మేఘాలంటే భయం. ఆకాశం ఉరిమి చూసినా వాడు భయపడడు. ఆకాశాన్ని మెరుపు నిలువునా చీల్చినా వాడికి భయమేయదు. కానీ మేఘానికే వాడు భయపడతాడు. వర్షం ముంచేస్తుందనీ కాదు. ఏదో కబురును అది మోసుకొస్తుందని! ఆ కబురు అమ్మమ్మని, తాతయ్యని, అమ్మానాన్నల్నీ, ఊళ్లో వాళ్లని కలవర పెడుతుందని. ఆరేళ్ల క్రితం చంటిగాడు ఇలాంటి కబురే విన్నాడు. భూమీ ఆకాశం కన్నీరవడం చూశాడు. అప్పుడు వాడికి నాలుగేళ్లు. వాడికేం అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం తెలుస్తోంది. ఎవరో ఒక మనిషి కోసం వీళ్లంతా ఏడుస్తున్నారు. ఎవరో ఒక మనిషి కోసం గుండెలు బాదుకుంటున్నారు. ఎవరో ఒక మనిషి కోసం దేవుణ్ణి పట్టుకుని ‘ఇది న్యాయమేనా?’ అని అడుగుతున్నారు. ‘నీ రూపానికి ప్రతిరూపం అనుకున్నామే... ’ అని దేవుడితో తగువులాడుతున్నారు. ఆ మనిషెవరో పెద్దయ్యే కొద్దీ చంటిగాడికి తెలిసింది. చెల్లితో చెప్పేవాడు. ‘ఎవరన్నయ్యా...’అంటే... ‘దేవుడులాంటి మనిషి’ అని.

   

అమ్మ వాకిట్లో కల్లాపి చల్లుతున్న చప్పుడు వినిపిస్తోంది. చంటిగాడు లేచి కూర్చున్నాడు. చకచకా స్నానం చేశాడు. చంటిదాన్నీ లేపాడు. స్నానం చేయించాడు. చన్నీళ్లు ఒణికించాయి. ‘అయ్యప్ప స్వాముల కన్నానా’ అనుకున్నారు అన్నా చెల్లీ.   ‘ఏం చేస్తున్నార్రా’ అని అమ్మ అడిగింది ఇంట్లోకి వస్తూ. ‘ష్..’ అని ఒకళ్ల వైపు ఒకళ్లు చూసుకుంటూ... ‘ఏం లేదమ్మా’ అన్నారు అన్నా చెల్లెళ్లు. స్కూలు బ్యాగులో దాచి ఉంచిన గుడ్డ సంచిని చెల్లికి చూపించాడు. ‘ఏంటన్నయ్యా’ అని అడిగింది. చెవిలో గుసగుసగా చెప్పాడు. ‘దేవుడికా?’ అని చంటిది మెల్లగా అడిగింది. ‘అవును’ ‘ఏ గుడి?’ ‘చెప్తా పద’ అన్నాడు చంటిగాడు చెల్లి చెయ్యి పట్టుకుని బయటికి నడుస్తూ. కొద్దికొద్దిగా తెల్లారుతోంది.

 అన్నాచెల్లి వీధిలోకి వచ్చారు. కాళ్లకు చెప్పుల్లేవు. కావాలనే వేసుకోలేదు. చెల్లినీ వేసుకోవద్దన్నాడు. ఎందుకన్నయ్యా అని అడిగితే, దేవుడి దగ్గరికి చెప్పులతో వెళ్ల కూడదు అన్నాడు. అక్కడినుంచి రాములవారి వీధిలోకి నడిచారు. అక్కడి నుంచి ఇంకో వీధిలోకి మలుపు తీసుకున్నారు. ఊళ్లో అన్నీ చంటిగాడికి తెలిసిన వీధులే. ఊళ్లో అందరూ చంటిగాడికి తెలిసిన మనుషులే.



 ‘ఏం బాబూ... పొద్దున్నే ఎక్కడికి బయల్దేరారు’ అడిగాడు రంగయ్య తాత. ఆ తాతంటే చంటిగాడికి ఇష్టం. ఎప్పుడు కనిపించినా ప్రేమగా చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చేవాడు. ‘ఎందుకు తాతయ్యా... ఖర్చు’ అనేవాడు చంటిగాడు. వాడికి తెలుసు తాతయ్యకు ఎవరూ లేరని. ‘నాకేం రా... ఇంకా ఏం కావాలో చెప్పు కొనిస్తా... మహరాజులా పింఛన్ తీసుకుంటున్నా’ అని నవ్వేవాడు. తాతయ్యలో ఇప్పుడా నవ్వు లేదు. అమ్మ చెప్పింది, పింఛను రావట్లేదని! అందుకేనేమో అలా ఉంటున్నాడు. తాతకిప్పుడు నవ్వు లేదు. నా అనేవారు లేరు. పింఛనూ లేదు. గుడి నుంచి వచ్చేటప్పుడు తాతయ్యకు ప్రసాదం తేవాలి అనుకున్నాడు చంటిగాడు.

   

వీధిలో ఆడవాళ్లు ముగ్గులేస్తున్నారు. వాళ్లను దాటుకుంటూ ముందుకు వెళుతున్నారు అన్నా, చెల్లి. ‘అన్నయ్యకి ఎలా ఉంది వదినా’

 ‘కష్టమంటున్నారు వదినా... ఆపరేషన్ చెయ్యాలంట... రెండు లక్షలైనా లేందే ప్రాణం నిలబడేలా లేదు’ ‘ఆరోగ్యశ్రీ కార్డు ఉందిగా’.

 ‘కార్డుంది కానీ... కనికరమే లేదు. మేం చెయ్యం అంటున్నారు పట్నం ఆసుపత్రోళ్లు. గవర్నమెంట్ వాళ్లకి డబ్బులివ్వడం లేదంట.’

 ‘అవునవును. మొన్న సుజాత భర్తకీ ఇలాగే అయింది. ఆరోగ్యశ్రీ ఉన్నా, ఆపరేషన్ చెయ్యలేదట. చనిపోయాడు. పాపం సుజాత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. ‘నాకూ భయంగా ఉంది వదినా. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని. మునుపైతే పిలవగానే ‘కుయ్ కుయ్’ మంటూ 108 వస్తుందనే నమ్మకం ఉండేది. ఇప్పుడు అదీ లేదు. 104 అయితే ఊళ్లోకి వచ్చి వైద్యం చేసిందే లేదు’. ‘అవునక్కా... చేతికందొచ్చిన మల్లమ్మ కొడుక్కి యాక్సిడెంట్ అయితే 108కి దిక్కే లేకుండా పోయింది. బిడ్డ పోయాడు. ప్చ్... వాడి మీదే ఆశలు పెట్టుకుంది... ఎలా బతుకుతుందో పాపం...’ చంటిగాడు నడుస్తున్నాడే గానీ, ఈ మాటలన్నీ వింటున్నాడు. చేతి సంచీని భక్తిగా తడుముకుంటున్నాడు.

   

 అన్నాచెల్లి ఇంకో మలుపు తిరిగారు.


 ముసలి రైతు ఎదురయ్యాడు. బక్కచిక్కిన ఎడ్లను అదిలించుకుంటూ పట్నం వైపు తోలుకెళుతున్నాడు. ఇలా చాలామంది రైతులు ఎడ్లను తీసుకెళ్లడం చంటిగాడు చాలాసార్లు చూశాడు. అదేంటో అవేవీ మళ్లీ వెనక్కి రావు. పంపులు పని చెయ్యక, కాలవ పనులు ఆగిపోయి, పొలాలన్నీ బీడువారి, వ్యవసాయానికి గడ్డు రోజులు రావడంతో ఇలాంటి రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీచరుసార్ చెబుతూ ఉంటారు. తమను దాటుకుని వెళ్లిన రైతును జాలిగా వెనక్కి తిరిగి చూశాడు చంటి. ‘నడువన్నా, పోదాం’ అని చెల్లి చెయ్యి లాగితే ఈ లోకంలోకి వచ్చాడు. మెల్లిగా నడుస్తున్నారు. చేతి సంచిని చెయ్యి మార్చుకున్నాడు చంటి. ‘నేను పట్టుకునేదా అన్నయ్యా’ అంది చంటిది. ‘వద్దులే బరువేం లేదు’ అన్నాడు చంటిగాడు.

 

అంతలో...


‘జీవితం బరువై పోయిందక్కా...’ అనే మాట వినిపించింది. వీధి అరుగు దగ్గర నలుగురైదుగురు ఆడవాళ్లు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. ‘పావలా వడ్డీ ఎందుకూ... వడ్డీ లేకుండానే డ్వాక్రా అప్పులు ఇస్తాం’ అన్నారు. ఎవరికి ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో అర్థంకావడంలేదు. ఎప్పుడడిగినా, ఇప్పుడు లేదనడమే. పాడి గేదెను కొనడానికి అప్పుకోసం కాళ్లరిగేలా తిరిగాను. అప్పు దొరకలేదు. బతకడం కష్టమైంది. అప్పట్లో పావలా వడ్డీ ఉన్నప్పుడే బాగుండింది’ అంటోంది... బక్కగా, చంటిగాడి పిన్ని పోలికలున్నావిడ. ‘అప్పట్లో’ అని ఆమె ఎందుకు అనిందో చంటిగాడికి అర్థమయింది. ‘ఎప్పటికో మళ్లీ సేద్యం చేసుకునేది. భూములు ఎండిపోతున్నాయ్. పొలాలకు నీళ్లు లేవు. ఊళ్లో పనుల్లేవు. కొంగలతో పాటు, మగాళ్లూ వలసబోతున్నారు. నీళ్ల ప్రాజెక్టులు లేవు. ఇళ్లు లేవు. పూరి గుడిసెల బతుకు ఇంకెన్నాళ్లో?’ గొణుక్కుంటూ ఎదురొస్తున్నాడు పెట్టేబేడా సర్దుకున్న వెంకటన్న. ఇంత పొద్దప్పుడు ఏ ఊరు వలసవెళుతున్నాడో అనుకున్నాడు చంటిగాడు.  

   

దారి మధ్యలో కమలమ్మ ఎదురైంది. అమె పక్కనే, ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే వాళ్లబ్బాయి ఉన్నాడు.  ‘ఏంటి బాబూ... ఉదయాన్నే ఎక్కడికెళుతున్నారు?’ అని అడిగింది. ‘గుడికి కమలమ్మా’ అని అన్న కన్నా ముందే ఉత్సాహంగా చెప్పింది చంటిది.

 కమలమ్మ చంటివాళ్ల ఇంట్లో పనికి వస్తుండేది. అమ్మ చెప్పేది... మరో నాలుగిళ్లలో చేస్తూ ఇల్లు నడిపేదని. ‘ఇక చాలమ్మా పని మానెయ్’ అని కూతురు బలవంతపెట్టాక పనికి వెళ్లడం మానేసింది. కలిమి లేదన్న మాటే గానీ పిల్లలిద్దరికీ చదువులున్నాయి. అమ్మాయి పట్నంలో పనిచేస్తోంది. ఆరేళ్ల క్రితం ఆ అమ్మాయి బి.టెక్ చదివింది. నయాపైసా ఖర్చు లేకుండా మొత్తం రీ ఇంబర్‌మెంట్‌తోనే! కాలేజీ ఫీజుకు పోను మెస్ చార్జీలు, బస్ చార్జీలు, పరీక్ష ఫీజులు అన్నీ ప్రభుత్వమే ఇచ్చింది. కానీ అ ఆమ్మాయి తమ్ముడికే ఆ భాగ్యం కలగలేదు. వాడి ఇంజినీరింగ్‌కి ఇప్పుడు ఫీజు రీఇంబర్స్‌మెంట్స్ దొరకలేదు. అప్పటి భాగ్యం ఇప్పుడెందుకు లేదో చంటిగాడికి తెలుసు.

 పూజారిగారు ఎప్పుడూ అంటుంటారు... ‘ఆరేళ్ల క్రితం వేరు, ఇప్పుడు వేరు’ అని. ఆ మాటలకూ వాడికి అర్థం తెలుస్తోంది.ఆలోచిస్తూ నడుస్తున్నాడు.



 పింఛను రాక విలవిల్లాడుతున్న వికలాంగుల్ని, ఆడపిల్లలకు రక్షణ లేక బెంబేలు పడుతున్న తల్లిదండ్రుల్నీ , చాలీచాలని ఆదాయంతో బతుకు ఈడుస్తున్న పూజారిగారిని, ఎగుదూ బొదుగు లేని పేద ముస్లిం కుటుంబాలను నాన్న మాటల్లో ఊహించుకుంటూ నడుస్తున్నాడు.

 ఆ చిన్న మనసు ఆవేశానికి లోనవుతోంది. ఎందుకిలా చేశావ్ అని దేవుణ్ని అడగాలని త్వరపడుతోంది.

   

‘రాములవారి గుడి, అమ్మవారి గుడి, సాయిబాబా గుడి, శివుడి గుడి, ఆంజనేయస్వామి గుడి, ఏడుకొండలవాడి గుడి, కనకదుర్గమ్మ గుడి... మసీదూ, చర్చి కూడా దాటుకుని వచ్చేశాం. ఇంకా ఎక్కడన్నయ్యా మనం వెళ్లాల్సిన గుడి? ఏడి అన్నయ్యా మనం మొక్కాల్సిన దేవుడు? కాళ్లు నొప్పెడుతున్నాయి అన్నయ్యా’ అంది చంటిది. ‘తప్పు. దేవుడి దర్శనానికి వెళ్లేటప్పుడు అలా అనుకోకూడదు. చెంపలేసుకో. ఊ.. అడుగో దేవుడు. ఇదే గుడి’ అన్నాడు చంటిగాడు చెయ్యి చూపిస్తూ. ‘అది వై.ఎస్.తాత విగ్రహం కదా...’ అంది చంటిది అర్థం కానట్లు.

 చంటిగాడు ఏమీ మాట్లాడలేదు. సంచీ తీశాడు.



అందులోంచి జాగ్రత్తగా టెంకాయ తీశాడు. వై.ఎస్.తాత విగ్రహం ఎదురుగా నిలబడ్డాడు. చెల్లినీ వచ్చి తన పక్కన నిలుచోమన్నాడు. కళ్లు మూసుకుని  దండం పెట్టుకోమన్నాడు. చంటిది అన్న చెప్పినట్టే చేసింది. తర్వాత కళ్లు తెరిచింది. అన్నాచెల్లెలు ఇద్దరూ కలిసి వై.ఎస్. తాత విగ్రహానికి టెంకాయ కొట్టారు. ‘ఎందుకన్నయ్యా... వై.ఎస్. తాతకు టెంకాయ కొట్టాం? ఆయనేమైనా దేవుడా’ అని అడిగింది చంటిది.‘అవున్రా... దేవుడే’ అని వెనకనుంచి ఎవరివో మాటలు వినిపించాయి.వెనక్కి తిరిగి చూస్తే అమ్మా, నాన్న! ఇంకా రంగయ్య తాత,రామాలయం పూజారీ, ఊరి ఆడవాళ్లు... అంతా ఉన్నారు! పూజారి అంటున్నాడు.



 ‘వై.ఎస్.తాత దేవుడైతే... ఊరు ఆయన గుడి. ఆయన బతికున్నప్పుడు ఊళ్లన్నీ చల్లగా ఉండేవి. ఊళ్లో నీళ్లుండేవి. పొలాలు పచ్చగా ఉండేవి. నిరుపేదలకూ పెద్దపెద్ద చదువులు అందేవి. పెద్ద పెద్ద రోగాలకూ ఖర్చులేని చికిత్సలు ఉండేవి. పావలా కాసంత బొట్టుతో ఆడపడుచుల ముఖాలు కళకళలాడేవి. ఆడపిల్లలకు అండ, దండ ఉండేది. వికలాంగులకు ఊతం ఉండేది. ముసలివాళ్లకు ఆసరా ఉండేది. కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ భరోసా ఉండేది. అందరికీ పక్కా ఇళ్ల అవకాశం ఉండేది. అందుకే వై.ఎస్. దేవుడు’.

 ‘అందుకే నాన్నా... నేనూ, చెల్లి వై.ఎస్.తాతకు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం’ అన్నాడు చంటి. ఈ పిల్లలు ఇంత ఉదయాన్నే ఏం చేయబోతున్నారా అని వాళ్లకు తెలియకుండా అనుసరించినవాళ్లు ఒక్కొక్కరూ దగ్గరికొచ్చి మురిపెంగా వాళ్ల బుగ్గలు పుణికారు. మహానేత వై.ఎస్. విగ్రహానికి చేతులు జోడించి నమస్కరించారు.

 - సాక్షి ఫ్యామిలీ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top