మంకీ బాత్

మంకీ బాత్ - Sakshi


నేడు చైనీస్  న్యూ ఇయర్

హ్యూమర్ ప్లస్




కోతి చేష్టలూ... కోతి వేషాలూ అని అందరూ మమ్మల్ని ఆక్షేపిస్తుంటారు గానీ... నిజానికి కోతులమైన మేం చాలా మంచివాళ్లం.

 గాంధీగారు ఎప్పుడు ఆదర్శాలు బోధించినా కోతులను దృష్టిలోపెట్టుకునే చేశారు. ఈ లోకానికి ‘చెడు వినకు, అనకు, చూడకు’అంటూ అద్భుతమైన సందేశం ఇచ్చారు. కానీ అది లోకంలోకి బలంగా వెళ్లాలంటే మా బొమ్మల మీదే ఆధారపడ్డారు. ఆయన లాగే మన దేశ ప్రధానీ అభిప్రాయపడ్డారు. అందుకే తన మనసులోని మాటను హిందీలో ‘మన్’ కీ బాత్ అంటూ ప్రవచిస్తుంటారు. కానీ మన దక్షిణాది రాష్ట్రాలకు హిందీ పెద్ద పరిచయం లేదు కదా. హిందీ కంటే ఇంగ్లిష్ ఎక్కువ అర్థం అవుతుంది కదా. అందుకే దాన్ని కోతివాక్కు అనగా ‘మంకీ’ తాలూకు మాటగా అపార్థం చేసుకుంటారు.  హిందీ తెలియనందున ఇదే అపోహ బందరు మహా పట్టణం విషయంలోనూ తెలుగువారికి కలుగుతుంది. ఒకసారి బందర్‌గాహ్ అంటే నౌకాశ్రయమనీ, అప్పట్లో నవాబులకూ ఈ పట్టణమే రేవుపట్టణమనీ తెలిశాక... దానిపై గౌరవం కలుగుతుంది. ఇదీ మంచిదే. ఎందుకంటే ఒకసారి దురర్థం వచ్చేలా అపార్థం చేసుకున్నాక మనసులో నాటుకునే మాట బలంగా ఉంటుంది. పైగా ఈ అపార్థం కూడా ప్రతిసారీ అర్థం చేసుకునేందుకు ‘మన్’... అనగా మనసుకు ఇచ్చే ‘కీ’ లా ఉపయోగపడుతుంది.



మనిషి కోతులను అపార్థం చేసుకున్నంతగా మరే జంతువునూ చేసుకోలేదు. అందుకే తన మనసు చేసే కొన్ని వాస్తవమైన చేష్టలను నాకు ఆపాదించారు. మనసులాగే దానికీ  స్థిరత్వం ఉండదని తేల్చి చెప్పారు. కోతి చెట్ల కొమ్మలను బలంగా ఊపుతుంటుందనీ, ఆ కొమ్మ మీది నుంచి ఈ కొమ్మమీదికి పాకుతూ, దూకుతూ ఉంటుందని దాన్ని తత్వాన్ని ఆక్షేపిస్తూ ఉంటారు. ‘తా జెడ్డకోతి వనమెల్లా చెరిచిందం’టూ కోప్పడుతుంటారు.  కానీ కొమ్మలను అలా బలంగా ఊపబట్టే వాటి గింజలు రాలి నేల మీద పడుతుంటాయి. ఆ తర్వాత కొత్తచిగుళ్లు వేసి కొత్త మొక్కలు మొలుస్తుంటాయి. అంటే ఇది వనమెల్లా చెరిచే డీఫారెస్టేషన్ ప్రక్రియ కాదు. మానవులు మంచి చేయాలనుకొనీ చేయలేనిది... మేం చెడుపు చేస్తున్నామన్న భావన కలిగిస్తూ చేస్తాం. అనగా ఇది కొండ అంచులపై అడవులను పెంచే ‘ఎఫారెస్టేషన్’ ప్రక్రియ అని తప్ప మరోటి కాదని చెబుతున్నాను. అలాగే నేను చాలా పండ్లను కొద్దిగా కోరికి చాలా వృథాగా కిందికి వదిలేస్తుంటానని చాలామంది అపార్థం చేసుకుంటారు. అది వాస్తవం కాదు. పాపం... ఎన్నో జీవులు నా అంత చిటారు కొమ్మలకు చేరలేరు. ఆ పండ్లను తెంపుకోలేరూ... మన కడుపు నింపుకోలేరు. నేను బాగున్నాయా లేదా అని శబరిలాగే శాంపిల్ చూసి, వదిలేసిన ఆ పండ్లను కొమ్మచివరి వరకూ చేరలేని ఎన్నో జీవులు తింటుంటాయి. ఆకలి తీర్చుకుంటుంటాయి. మేము కొమ్మ చివర అందని ద్రాక్షల్లా ఉండే పండ్లను నేను అనేక జీవులకు అందించినట్లే...  చైనావాళ్లూ అతి ఎక్స్‌పెన్సివ్ వస్తువులను అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా చేయగలిగినవాళ్లూ, నా చేష్టలను అనుసరించే వారు కాబట్టే చైనీయులు సైతం నేటి నుంచి మొదలు కాబోయే వాళ్ల కొత్త ఏడాదికి నా పేరు పెట్టుకున్నారు.



చివరగా మళ్లీ మనసుకూ, మర్కటానికీ ఉన్న బంధం విషయానికి వద్దాం. నేను టకటకా కొమ్మలు మారే పని చేస్తుండటంతో కోతినీ, మనస్సునూ ఏకకాలంలోనే  తిడుతుంటారు. నిలకడ లేనిదంటూ నిందిస్తుంటారు.  ముందే మనవి చేశాను కదా... మనకూ, మీ మనసుకూ పోలిక ఉందని. ఇది పూర్తిగా దుష్ర్పచారం. నేను రకరకాలుగా ఆలోచించబట్టే కదా... కొత్త కొత్త ఆలోచనలు వచ్చేదీ... నా ధోరణి లాంటి ఐడియాల వల్లనే కదా మీ జీవితాలే మారేది!

 - యాసీన్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top