త్రీ మంకీస్ - 6

త్రీ మంకీస్ - 6


డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 6

 

 - మల్లాది వెంకటకృష్ణమూర్తి

 

 ‘‘ఓ కూతురు ఉంది సార్.’’

 ‘‘సరే కేసు గురించి మీరు చెప్పండి.’’ యమధర్మరాజు భర్త వైపు లాయర్ని అడిగాడు.

 ‘‘నా క్లైంట్ భార్య అతని మీద గృహ హింస చట్టం 498ఏ కింద కేసు పెట్టింది. నిజానికి నా క్లైంట్‌కి హింస పడదు. గాంధీ గారి ఫాన్. సరిహద్దు గాంధీ గారి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు కూడా. అందువల్ల ఆయన మనసు బాధ పడింది. అహం దెబ్బ తింది. తన భార్యంటే అసహ్యం వేసింది. దాంతో విడాకులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నాడు. యువర్ ఆనర్. ఆ కారణంగా ఆయనకి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను’’ లాయర్ కోరాడు.

 ‘‘మై లెరెన్డ్ కౌన్సెల్. ఆ సెక్షన్ కింద బెయిల్ ఇవ్వకూడదని తెలీదా?’’ యమధర్మరాజు ఓపికగా చెప్పాడు.

 ‘‘విడాకులు అతని హక్కు యువర్ ఆనర్. అవి తీసుకోడానికి నా క్లైంట్ బయటకి రావాల్సి ఉంది యువర్ ఆనర్’’ లాయర్ చెప్పాడు.

 ‘‘దేనికి విడాకులు?’’

 ‘‘మనసు బాధపడటంతో, అహం దెబ్బ తినడంతో, తన భార్య మీద అసహ్యం వేసి నిజానికి ఈ కేసులో ఇంకో ఇష్యూ కూడా ఉంది యువర్ ఆనర్.’’

 ‘‘ఏమిటది?’’

 ‘‘నా క్లైంట్ తన కిడ్నీని వెనక్కి కోరుతున్నాడు.’’

 ‘‘సరిగ్గా విన్నానా? ఇడ్లీని వెనక్కి కోరడమేమిటి?’’

 ‘‘వినలేదు యువర్ ఆనర్. కిడ్నీ అన్నాను.’’

 ‘‘సిడ్నీ అన్నారా?’’

 ‘‘కిడ్నీ అన్నాను యువర్ ఆనర్. రెండేళ్ళ క్రితం నా క్లైంట్ భార్య రెండు కిడ్నీలు పని చేయడం ఆగిపోయింది. ఆవిడ బిపి పేషెంట్. అందువల్ల కిడ్నీలు దెబ్బ తిన్నాయి. నా క్లైంట్‌కి తన భార్య మీద అప్పట్లో గల ప్రేమాభిమానాలతో తన రెండు కిడ్నీలలో ఒక దాన్ని ఆమెకి ఉచితంగా దానం చేశాడు.’’

 ‘‘అబ్జెక్షన్ యువర్ ఆనర్. దానం అంటేనే ఉచితం అని. ఉచితంగా దానం ఏమిటి నా బొంద?’’ భార్య తరఫు లాయర్ అభ్యంతరం చెప్పాడు.

 ‘‘ఇదిగో నాయుడు. టెక్నికల్ పాయింట్ల మీద తప్ప ఇలాంటి వాటి మీద అభ్యంతరాలు ఒద్దని ఎన్నిసార్లు చెప్పాలి?’’

 ‘‘ఆయన కథలు రాయడం వల్ల మనకీ పీడ యువర్ ఆనర్. సరే. నా క్లైంట్ కిడ్నీని డాక్టర్‌లు శస్త్రచికిత్స చేసి ఆమెకి అమర్చారు. ఆమె తన మీద గృహహింస కేసు పెట్టిన కారణంగా ఆమె నించి విడాకులు తీసుకోబోతున్నాడు కాబట్టి తన వస్తువు తన భార్య దగ్గర ఉండటం ఇష్టం లేదు. కాబట్టి దాన్ని తిరిగి వెనక్కి ఇప్పించాల్సిందిగా నా క్లైంట్ కోర్టుని కోరుతున్నాడు.’’

 ‘‘ఇది నిజమేనా? కిడ్నీ ప్రస్తుతం మీ క్లైంట్ దగ్గర ఉందా?’’ యమధర్మరాజు భార్య వైపు లాయర్ని అడిగాడు.

 ‘‘నిజమే సార్. ఉంది.’’

 ‘‘అది తిరిగి ఇవ్వడానికి ఆమెకి అభ్యంతరం ఉందా?’’

 ‘‘ఉంది యువర్ ఆనర్.’’

 ‘‘ఏమిటా అభ్యంతరం?’’ భర్త తరఫు లాయర్ భార్య వైపు లాయర్ని ప్రశ్నించాడు.

 ‘‘నేను ఇక్కడే ఉన్నాను. అది నేను అడగాల్సిన ప్రశ్న. ఏమిటా అభ్యంతరం?’’ యమధర్మరాజు చిరాగ్గా చెప్పాడు.

 ‘‘ఆమె డయాలసిస్‌లో ఉండగా ఆమె భర్త ఆమెకి కిడ్నీని డొనేట్ చేశాడు. ఇప్పుడు ఆమె శరీరం నించి దాన్ని వేరు చేస్తే ఆమెకి మరణం తప్పదు. కాబట్టి అది హత్యాప్రయత్నం కిందకి వస్తుంది యువర్ ఆనర్’’ భార్య తరఫు లాయర్ చెప్పాడు.

 ‘‘దీనికి మీరేమంటారు?’’ యమధర్మరాజు భర్త తరఫు లాయర్‌ని అడిగాడు.

 ‘‘కాని అతని క్లైంట్ ప్రాణాలు యమధర్మరాజు చేతిలో తప్ప నా క్లైంట్ చేతుల్లో లేవు యువర్ ఆనర్’’ భర్త వైపు లాయర్ చెప్పాడు.

 ‘‘నా చేతుల్లోనా?’’ యమధర్మరాజు ఉలిక్కిపడి అడిగాడు.

 ‘‘అంటే ఆయన చేతుల్లో’’ చేతిని పైకి చూపిస్తూ భర్త తరఫు లాయర్ చెప్పాడు.

 ‘‘ఐసీ’’ యమధర్మరాజు పైకి చూసి ఆ కేసు ఫైల్లో ఏదో రాసుకున్నాడు.

 ‘‘అంతే కాక నా క్లైంట్ ఆమెకి కిడ్నీ దానం చేశాడు కాని ప్రాణదానం చేయలేదు. తను దేంతో పుట్టాడో దాన్నే, కేవలం తనకి చెందినదాన్ని, అదీ గతంలో ఉచితంగా ఇచ్చిన దాన్నే నా క్లైంట్ కోరుతున్నాడు. అది సబబు. అది న్యాయం.’’ లాయర్ చెప్పాడు.

 ‘‘అది సబబు కాదు. అది అన్యాయం’’ రెండో లాయర్ చెప్పాడు.

 ‘‘యువర్ ఆనర్. ఆమె అది తనదే అన్నట్లుగా ఇవ్వననడం న్యాయం కాదు. కొన్నది ఏదైనా తనది అవుతుంది. కిడ్నీని తను కొన్నదా? బిల్ లేదా ఇన్‌వాయిస్‌ని చూపించమనండి. కొనలేదు. కాబట్టి వాటిని చూపించలేదు. పోనీ బహుమతిగా పొందిందా? గిఫ్ట్ డీడ్‌ని చూపించమనండి. లేదు. పోనీ కేవలం అప్పుగా తీసుకుంది అనుకుందాం. నిజానికి ఆ కిడ్నీకి ఆమె వడ్డీగా ఇంకో చిన్న కిడ్నీని కూడా కలిపి ఇవ్వాలి. కాని నా క్లైంట్ దయగల వాడు కాబట్టి వడ్డీని మాఫీ చేసి కేవలం తను అప్పుగా ఇచ్చిన తన కిడ్నీనే వెనక్కి ఇవ్వమని కోరుతున్నాడు’’ లాయర్ చెప్పాడు.

 ‘‘ఇదన్యాయం. అక్రమం.’’

 ‘‘పోస్టాఫీస్‌లో మనిఆర్డర్ ఫారం రాయడానికి ఇచ్చిన రెండు రూపాయల పెన్నునే తిరిగి అడుగుతాం. అలాంటిది పది లక్షల ఖరీదు చేేన  కిడ్నీని ఉచితంగా ఏ తలకి మాసినవాడూ ఇవ్వడు.’’

 ‘‘దాని ధర పది లక్షలా? పది లక్షలు ఇస్తుందేమో నా క్లైంట్‌ని అడుగుతాను. వాయిదా కోరుతున్నాను’’ భార్య వైపు లాయర్ చెప్పాడు.

 ‘‘ఊహూ. నా క్లైంట్ దాన్ని అమ్మనని చెప్పాడు. అమ్మినా తన భార్యకి అసలు అమ్మనని చెప్పాడు. రైట్స్ ఆఫ్ ఎడ్మిషన్ రిజర్వ్‌డ్. మై క్లైంట్ డిమాండ్స్ హిజ్ కిడ్నీ బేక్’’ ఆఖరిలో ప్రతీ ఇంగ్లీష్ పదం బల్ల గుద్దుతూ చెప్పి లాయర్ తన ఆర్గ్యుమెంట్‌ని ముగించాడు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top