ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి!

ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి!


శతాధిక వృద్ధురాలు మల్లికాంబను పలకరించడం అంటే...స్వాతంత్య్రపోరాట జ్ఞాపకాలను పలకరించడం. ఆనాటి పోరాటస్ఫూర్తిని మళ్లీ స్ఫురణకు తెచ్చుకోవడం...



బీపీ.. షుగర్లు లేవు..

వందేళ్లు దాటినా మల్లికాంబకు బీపీ,షుగర్ వంటివి ఏమీలేవు. అందరిలాగానే స్వీట్లు,  హాట్లు తింటారు.  ఒంటరిగా కాదు.. తోటి కుటుంబ సభ్యులందరితోనూ కలిసి తింటారు. 105 ఏళ్ల వయసులోనూ కళ్లు కనిపిస్తున్నాయి. చెవులు వినిపిస్తున్నాయి. జ్ఞాపకాలు అలానే ఉన్నాయి.



గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం లక్ష్మీపురానికి చెందిన ఘంటా రాఘవయ్య, మల్లికాంబలది వ్యవసాయ కుటుంబం. రాఘవయ్య తండ్రి గాంధేయవాది. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. భర్త ఆదేశంతో మల్లికాంబ కూడా ఉద్యమంలో నడిచారు. విదేశీ వస్త్ర బహిష్కరణ తదితర ఆందోళనల్లో ఆమె పాలుపంచుకున్నారు.



దీంతో బ్రిటిష్ పాలకులు ఆమెతో పాటు ఆర్నెల్ల కొడుకు రామ్మోహనరావునూ జైలులో పెట్టారు.  మల్లికాంబను కన్ననూర్, వెల్లూరు (తమిళనాడు) జైళ్లలో ఏడాదికి పైగా ఉంచగా, భర్త రాఘవయ్యను రాజమండ్రి సెంట్రల్ జైలులో వేశారు. కుమారుడు రామ్మోహన్‌రావు జైలులోనే నడక నేర్చుకున్నాడు.



జైలులో చిన్న పిల్లాడున్నాడని జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ‘‘నేను జైల్లో ఉన్నప్పుడు నా కొడుకు రామ్మోహనరావు వయసు ఆరు నెలలు. సూపర్నెంటు దుర్గారావు ఆవుపాలు, రొట్టే ఇచ్చేటోడు. జైల్లో మగాళ్లకే గాని ఆడోళ్లకు పని సెప్పోటోళ్లు కాదు. అన్నం పెట్టేటోళ్లు గాదు. స్వతంత్య్ర ఉద్యమంలో బ్రిటిషోళ్లను ఇబ్బంది పెట్టడానికి  రామ్మోహనరావు పేరిట జెండాలు రాసేరు.



చిన్నపిల్లోడని తెలియక అదెవరో పెద్దోడని సేన్నాళ్లు గాలించేరు. చివరికి దొరక్క వదిలేశారు..’’ అంటూ నాటి జ్ఞాపకాలను నవ్వుకుంటూ నెమరు వేసుకున్నారు మల్లికాంబ. తన కుమారుడు, కోడలితో కలిసి ఆమె విశాఖపట్నం శివారు పరదేశిపాలెం దగ్గర నివసిస్తున్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న రాఘవయ్య, మల్లికాంబల సేవలను గుర్తించి 1972 ఆగస్టు 15న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీరికి ప్రతిష్టాత్మక తామ్రపత్రాలను ప్రదానం చేశారు.

- బొల్లం కోటేశ్వరరావు, సాక్షి విశాఖపట్నం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top