ప్రపంచం మన వైపు చూస్తోంది

ప్రపంచం మన వైపు చూస్తోంది - Sakshi


ఇతర దేశాల్లో మన వాళ్ల పనితీరు అద్భుతంగా ఉంటోంది. మన దేశంలో ఆ స్థాయిలో ఉండడంలేదు. విజ్ఞానం లక్ష్యంగా చదువులు ఉండాలి. అప్పుడు ఉద్యోగం చిన్న అంశమే అవుతుంది. చదువుతోపాటు ఆ స్థాయిలో స్కిల్స్ పెంపొందించుకోవాలి. గూగుల్, వాట్సాప్... ఇవన్నీ యువకులే రూపొందించారు. ఇలాంటి వాటికి ఇప్పుడు ఇంకా ఎంతో స్కోప్ ఉంది.

 

ఎనగందుల వరదారెడ్డి... చదువనేది ఉద్యోగమే లక్ష్యంగా ఉండకూడదని, విజ్ఞానం సంపాదించడానికే అని నమ్మారు. జీవితంలో ఆచరించారు. హాయిగా సాగేపోయే ప్రభుత్వ ఉద్యోగాలను వదలివేశారు. సాధించాలనే తపనతో అడుగు వేశారు. అలుపెరుగని బోధనతో ముందుకు కదిలారు. 40 ఏళ్ల క్రితం ఎస్‌ఆర్ ట్యుటోరియల్స్ స్థాపించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగంలో ఓ బ్రాండ్‌గా నిలిచారు. 6 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వరదారెడ్డి జీవిత విశేషాలు ఆయన మాటల్లోనే...

 

ఒక్క నాగలి వ్యవసాయం

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట మా ఊరు. ఆర్థికంగా పేద కుటుంబం. ఒక్క నాగలి వ్యవసాయమే. 1947 మార్చి 12 నా పుట్టిన రోజు. అమ్మ కాంతమ్మ, నాన్న నర్సింహారెడ్డి, నాన్నకు చదువు రాదు. సంతకం మాత్రం చేసేవారు. నేను బాగా చదువుతాననే నమ్మకం నాన్నకు మొదటి నుంచి ఉండేది. అందుకే ఎప్పడూ నా చదువుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఉద్యోగం వదిలి చదవుకోవాలనుకున్నప్పుడు బంధువులు, దగ్గరి వారు వ్యతిరేకంగా చెప్పారు. నాన్న మాత్రం నా అభిప్రాయం ప్రకారం చదువుకోవాలనే చెప్పాడు. నాలుగో తరగతి వరకు మా ఊరిలోనే చదువుకున్నా. తర్వాత ఎనిమిదో తరగతి వరకు వర్ధన్నపేటకు వెళ్లా. వర్ధన్నపేటలో అన్ని తరగతులకు మాదే ఫస్ట్ బ్యాచ్ ఉండేది. తొమ్మిదో తరగతి ప్రారంభమం కావడం ఆలస్యమైంది. దీంతో జఫర్‌గఢ్‌కు వెళ్లా. 11వ తరగతి వరకు అక్కడే. ఆ తర్వాత హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పీయూసీ, డిగ్రీ, ఎమ్మెస్సీ(ఫిజిక్స్) పూర్తి చేశా. అప్పుడు ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది.

 

ఆవును అమ్మి ఫీజు

చదువుపై చాలా ఇష్టం ఉండేది. అప్పుడున్న పరిస్థితుల్లో ఫీజుల కట్టేందుకు డబ్బులు ఉండేవి కావు. హెచ్‌ఎస్‌సీలో ఉన్నప్పుడు పరీక్ష ఫీజుకు (రూ.12) డబ్బులు లేవు. దీంతో బడికి పోవడం మానేశా. మూడు రోజులు వెళ్లలేదు. అప్పుడు మా సార్లు ఇంటికి వచ్చి మా నాన్నకు నచ్చజెప్పారు. డబ్బులు లేని విషయం చెప్పాం. అప్పుడు 10 మంది సార్లు చెరో రూపాయి, హెడ్ మాస్టర్ రెండు రూపాయలు ఇచ్చారు. అక్కడ చదువు జీవితం మలుపు తిరిగింది. తర్వాత పీయూసీలో చేరేటప్పుడు ఇదే పరిస్థితి. కాట్రపల్లి లక్ష్మీనర్సింహారెడ్డి(కేఎల్‌ఎన్‌రెడ్డి) పీయూసీ అడ్మిషన్ ఫీజు రూ.125 చెల్లించారు. ‘నువ్వు మంచి ప్రతిభావంతుడిలా ఉన్నావు. బాగా చదువుకోవాలి రా. ఏ అసవరం ఉన్నా నా దగ్గరకి రా’ అని చెప్పారు. ఆ తర్వాత పీయూసీ పరీక్ష ఫీజు రూ.18కి ఇబ్బందులు. ఇంటికి వెళ్లి నాన్నకు విషయం చెప్పా. ఆవును అమ్ముదామని నాన్న అన్నాడు. పాలేరుకు కూడా తెలియకూడదని కాట్రపల్లి అంగడికి ఆవును తీసుకెళ్లాం. రూ.20 రూపాయలు కచ్చితంగా వస్తాయని నాన్న అన్నాడు. మూడు గంటలు వేచి చూసినా ఆవు దగ్గరికి ఎవరూ రాలేదు. అప్పుడు నాన్న, నేను దిగాలు పడ్డాము. చివరికి రూ.28కి ఆవు అమ్ముడుపోయింది. నాన్న ఎంతో సంతోషంతో... ‘దీనికి ఇంత వస్తాయని అనుకోలేదురా. మొత్తం రూ.28 నువ్వే తీసుకో. బాగా చదవుకోవాలి’ అన్నారు. అప్పుడు హన్మకొండ నుంచి దమ్మన్నపేటకు వెళ్లాంటే 90 పైసలు బస్సు కిరాయి. నేను అడ్దదారుల్లో నడిచే ఇంటికి వెళ్లే వాడిని. ఊరి మొదట్లో దళితవాడ ఉండేది. నడిచి వస్తున్న నన్ను చూసి వారు ప్రేమతో... అయ్యో పాపం అనేవారు.



గురువులే మార్గదర్శకులు

మా చిన్నతనంలో గురువులు గొప్ప మార్గదర్శకులుగా ఉండేవారు. అప్పటి విద్యా విధానం ప్రకారం ఎనిమిదో తరగతిలో ఆప్షనల్ తీసుకోవాల్సి ఉండేది. సైన్స్, ఆర్ట్స్‌లో ఏది ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకోవాలి. విద్యార్థులకు ఆ స్థాయిలో అంతగా అవగాహన ఉండదు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులే ఆప్షనల్ నమోదు చేసేవారు. అప్పుడు ఎక్కువగా ఆర్ట్స్ సబ్జెక్టునే ఎంపిక చేసుకునేవారు. మొదట నేను ఆర్ట్స్ అని చెప్పాను. నువ్వు లెక్కలు బాగా చేస్తావు అని మా సార్ తర్వాత నా ఆప్షనల్ మార్చారు. అది నా జీవితంలో మంచి మలుపు. నాకు మొదటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం. దాంట్లోనే నైపుణ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.

 

ఉద్యోగాలు వదిలాను

అప్పుడు పరీక్షలు అయిపోతుండగానే ఉద్యోగాలు వచ్చేవి. అలా పీయూసీ పూర్తికాగానే 1964లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో సర్వే సూపర్‌వైజర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పుడే గవర్నమెంట్ రక్షిత కౌలుదారు చట్టం తెచ్చింది. భూస్వాముల భూములను దున్నుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని ఆ చట్టం ఉద్దేశం. ప్రభుత్వం మంచి ఆలోచనతో చేసిన ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత మాది. అప్పుడు నాకు 18 ఏళ్లు. చిన్నతనంలోనే మంచి ఉద్యోగం. మరిపెడ మండలం గిరిపురంలో నాకు డ్యూటీ. అక్కడ భూస్వామి భూములను సర్వే చేసి ఆ ఊరి వారికి పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ నిర్ణయమే అయినా అక్కడి వారు ఆ భూస్వామి ఏదో దానం చేస్తున్నట్లుగా భావించి మసలుకునేవారు. ఒక రోజు ఓ గిరిజనుడు వచ్చి చిన్న పిల్లాడిని భూస్వామి కాళ్లపైన పెట్టి తనకు భూమి ఇవ్వాలని కోరాడు. ఆ భూస్వామి చిన్న పిల్లాడిని తన్నినంత పని చేశాడు. అది నన్ను కలిచి వేసింది. ప్రభుత్వం చేసిన చట్టం గొప్పది. అమలు విషయంలో క్షేత్ర స్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. భూస్వామి చెప్పినట్లుగా కాకుండా నేను నిబంధనల ప్రకారం చేశాను. అయినా చట్టం స్ఫూర్తి నెరవేరే పరిస్థితి వంద శాతం కనిపించలేదు. ఆ వ్యవస్థలో ఇమడలేకపోయాను. ‘అందరూ నౌకరి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే నువ్వెందుకు రాజీనామా చేసున్నావు, ఆలోచించుకో’ అని అందరు చెప్పారు. అవినీతిలో భాగస్వామిని కాలేక రెండేళ్లకే రాజీనామా చేశాను. కష్టపడి పనిచేయాలని భావించాను. అందుకు చదువు ఒక్కటే మార్గమని డిగ్రీ, పీజీ పూర్తి చేశా. మహబూబియా పంజతన్(ఎయిడెడ్) జూనియర్ కాలేజిలో ఫిజిక్స్ లెక్షరర్‌గా 1974లో ఉద్యోగం వచ్చింది. మూడున్నర ఏళ్లు పని చేసి వాలంటరీ రిటైర్మ్‌ంట్ తీసుకున్నా. ఈ నిర్ణయంపై అప్పుడు మా ప్రొఫెసర్స్ సహా అందరు నన్ను కోప్పడ్డారు. నేను మాత్రం ధైర్యంగా అడుగు వేశా.



కోచింగ్ నుంచి మొదలై..

నాకు తెలిసింది ఒక్కటే.. బోధన. ఆ రంగంలోనే నా సామర్థ్యం కొద్ద్దీ పని చేసుకుంటూ వెళ్లా. ఎమ్మెస్సీ పూర్తయ్యాక 1976లో ఎస్‌ఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభించా. ఉదయం, సాయంత్రం ట్యుటోరియల్... మధ్యాహ్నం కాలేజీ ఇలా ప్రతి రోజు 18 క్లాసుల వరకు చెప్పే వాడిని. ఎస్సెస్సీ, ఇంటర్, పాలిటెక్నిక్... ఇలా అన్ని తరగతులకు కోచింగ్ ఇచ్చేవాడిని. 1978లో హన్మకొండలో ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీని స్థాపించాను. 1980లో ఎస్‌ఆర్ హైస్కూల్, 1994లో ప్రభుత్వ ఆమోదిత జూనియర్ కాలేజిని, 2002లో ఇంజనీరింగ్ కాలేజీలు, 2003లో డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు నెలకొల్పాను. తెలంగాణలో మహబూబ్‌నగర్ తప్ప అన్ని జిల్లాలో మా ఎస్‌ఆర్ విద్యాసంస్థలు ఉన్నాయి.  విశాఖపట్టణంలో నెలకొల్పిన విద్యాసంస్థలు అక్కడి ప్రజల సహకారంతో  సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. అక్కడ ప్రజలకు ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్ లేదు. ఎవరైనా ఒక్కటే అనుకుంటారు. అది నా అనుభవపూర్వకంగా రుజువైంది. అందరి సహకారంతో అక్కడా బాగా చదువు చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు మొత్తం 93 విద్యా సంస్థలు ఉన్నాయి. 6170 మంది ఉపాధి పొందుతున్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అఫిలియేటెడ్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ స్థాపించాం. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించా. తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(టీపీజేఎంఏ) అధ్యక్షుడిగా ఉన్నా.



శ్రీమతి సహకారం

ట్యుటోరియల్, కాలేజీలతో ఇలా దశాబ్దాలపాటు నిత్యం బిజీ. పిల్లల చదువులు, ఇంటి విషయాలు అన్ని నా భార్య సుమతీదేవి చూసుకునేవారు. మా కాలేజీలో హాస్టల్స్ నిర్వహణ ఆమే చూసుకునేది. నేను ప్రభుత్యోద్యోగం చేయాలని ఆమె మొదట కోరుకునేది. ప్రభుత్వోద్యోగం చేస్తే  ఇప్పుడు ఇలా వేల మందికి ఉపాధి కల్పించేవాడిని కాదు కదా. అందుకే ఇప్పుడామె సంతోషంగా ఉంది. సుమతి వాళ్లది పెద్ద కుటుంబం. కరీంనగర్ జిల్లా మంథని. వీళ్ల అన్నయ్య చందుపట్ల రాంరెడ్డి మాజీ ఎమ్మెల్యే. గవర్నమెంట్ ఉద్యోగాలు వదులుకున్న సమయంలో నాపై ఒత్తిడి వచ్చింది. చదువుకునే రోజుల్లోనే అందరికి విద్య అందుబాటులో ఉండేలా ఏదన్నా స్కూల్ పెట్టాలని అనుకునేవాడిని. అందరూ దాన్ని అర్థం చేసుకోలేదు. తలా ఓ మాట అంటుంటే నాకు బాధనిపించేది. ఇదివరకే రెవెన్యూ ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఇప్పడు లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేశాను. నేనేమైనా తప్పు చేశానా? అని మథనపడ్డాను. తర్వాత ఏదైతే అదైందని ధైర్యం చేశాను. నాకు ఇద్దరు పిల్లలు. మధుసూదన్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి. చదువు పూర్తయ్యాక అమెరికా వెళ్దామనుకున్నారు. నేనే వద్దని చెప్పా. 1998 నుంచి విద్యా సంస్థల పర్యవేక్షణ భాగస్వాములయ్యారు. 2008 నుంచి వాళ్లే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు.

 

విద్యా వ్యవస్థ

ఏ దేశమైనా విద్యతోనే ప్రగతి సాధిస్తుంది.  మెరుగైన బోధన మంచి సమాజాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు విద్యార్థులు ఉద్యోగం లక్ష్యంగా చదువులు సాగిస్తున్నారు. తల్లిదండ్రుల ఆలోచన తీరు ఇలాగే ఉంటోంది. ఇది మారాలి. అమెరికాలో కూడా ఎస్‌ఆర్  అసోసియేషన్ ఉంది. నా పూర్వ విద్యార్థులు ఎంతోమంది విదేశాల్లో స్థిరపడిపోయారు. వారి ఆహ్వానం మేరకు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటా. ఎక్కువ యువత ఉన్న దేశం మనదే కావడంతో మిగిలిన దేశాలు మనవైపు చూస్తున్నాయి. గూగుల్, వాట్సాప్... ఇవన్నీ యువకులే రూపొందించారు. ఇలాంటి వాటికి ఇప్పుడు ఇంకా ఎంతో స్కోప్ ఉంది. మనకు ఉద్యోగం అని కాకుండా మనం కొందరికి ఉద్యోగం కల్పిస్తామనే ఉద్దేశంతో చదువు సాగాలి. ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కష్టంలోనే సుఖముంటుంది. పేరు, ప్రతిష్ట అన్నీ వస్తాయి.

 

 - పిన్నింటి గోపాల్, (సాక్షి ప్రతినిధి, వరంగల్)

ఫొటోలు : సంపెట వెంకటేశ్వర్లు

 

‘శ్రీమంతుడే..!’

నా సొంతూరు దమ్మన్నపేట అంటే ఎంతో ఇష్టం. నేను పుట్టిన ఊరు, ఈ పేరు రావడానికి కారణమైన ఊరు. ఆ ఊరితో నా బంధం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికీ అక్కడ వ్యవసాయం చేస్తున్నాం. మా పొలంలో పని చేసే వారికి ఏ పని చేయాలనేది ఎప్పుడూ చెప్పను. మీరు ఏ పని చేస్తారో చేయండి. ముందుగా మీరు తీసుకుని నాకు ఇవ్వండి అని చెప్పాను. వాళ్లు తృప్తిగా పని చేస్తున్నారు. రెండు రోజులకోసారి 15 క్వింటాళ్ల కూరగాయలు వస్తున్నాయి. మా ఊళ్లో బడిని పునర్‌నిర్మించే పని చేపట్టాను. రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మా ఊరి వాళ్లు ఎవరైనా పని మీద వరంగల్ నగరానికి వస్తే భోజనం చేసి వెళ్లమని చెబుతుంటాం. మా విద్యా సంస్థల్లో మా ఊరి వాళ్లకు సగమే ఫీజు ఉంటుంది. ఇవన్నీ నాకు తృప్తి నిస్తున్నాయి. నా ఇనిస్టిట్యూషన్స్‌లో చదివే ఎంతోమంది పేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీ ఇస్తున్నాను. ఇంకా చాలామందికి ఉచితంగా విద్యాదానం చేస్తున్నాను. జీవితం ఇప్పుడు హాయిగా సాగుతోంది. ఖాళీగా ఉంటే మనసుకు ఏది  తోచదు.

 

కేసీఆర్ అభినందన

తెలంగాణ ఉద్యమం జరగడానికి దారి తీసిన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమం జరుగుతున్న తరుణంలోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలంగాణలో వందల కాలేజీలను ప్రారంభించారు. వాళ్లు ఇక్కడ కాలేజీలు పెట్టినప్పుడు మనం అక్కడ కాలేజీ పెట్టవచ్చు కదా అనే ఆలోచనతో నేను విశాఖపట్నంలో కాలేజీ ప్రారంభించా. ఈ విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నన్ను అభినందించారు. ‘మన వాళ్లు బయటికి వెళ్లరనే అభిప్రాయం ఉంది. వరదారెడ్డి అక్కడ స్కూళ్లు పెట్టి, ఆ అభిప్రాయం మార్చిండు. ఇలా ఎక్కువ మంది ఆలోచించాలి’ అని మీటింగ్‌లోనే అన్నారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top