ఇద్దరు దేవుళ్లు!

ఇద్దరు దేవుళ్లు!


దైవికం

 

కష్టాల్లో దేవుడు గుర్తొస్తాడు. లేదంటే, దేవుడిలాంటి మనిషైనా గుర్తొస్తారు. అయితే దేవుడి లాంటి మనిషికన్నా కూడా, దేవుడే ఎక్కువగా మనిషికి అందుబాటులో ఉంటాడు! దేవుడు.. గుడిలో ఉంటాడని మనకు నమ్మకంగా తెలుసు. పరుగున వెళ్లి ‘దేవుడా నువ్వే దిక్కు’ అని వేడుకోవచ్చు. బైబిల్‌లో, భగవద్గీతలో, ఖురాన్‌లో, తక్కిన పవిత్ర గ్రంథాలలో అక్షరాల రూపంలో దేవుడి స్వరూపం సాక్షాత్కరిస్తుంది కనుక దైవవాక్యాలను గుండెకు హత్తుకుని మనసుకు మరమ్మతులు చేసుకోవచ్చు. ఆకాశం దేవుడి నివాసం అని కూడా మనకో నమ్మకం కనుక కన్నీళ్లతోనో, నీళ్లింకిన కళ్లతోనో నింగి వంక చూస్తూ దేవుడిని ప్రార్థించవచ్చు.

 

అయితే దేవుళ్లా వచ్చి గట్టెక్కించే వరకు దేవుడిలాంటి మనిషి ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడుంటారో తెలీదు. ఏ రూపంలో వస్తారో తెలీదు. అమ్మ, నాన్న, తోబుట్టువు, స్నేహితుడు, బంధువు... ఎవరైనా కావచ్చు. ఆఖరికి శత్రువు కూడా దేవుడు పంపిస్తే వచ్చినట్లు రావచ్చు. ఒకటే తేడా. దేవుడిని మనం వెతుక్కుంటూ పోతాం. దేవుడి లాంటి మనిషి మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. దేవుడు ఎంతో కరుణిస్తే తప్ప దేవుడి లాంటి మనిషి దొరకరు.

 

సాధారణంగా కష్టాలు, కన్నీళ్లు మామూలు వ్యక్తులకే వస్తాయని, వాళ్లకే తరచు దేవుడి అవసరం కలుగుతుంటుందని అనుకుంటాం. అయితే దేశంలోనే అత్యున్నత హోదాలలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఈ మధ్య దేవుడు గుర్తొచ్చాడు. వాళ్లలో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోథా! ఇంకొకరు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ! ‘‘ఫర్ గాడ్స్ సేక్, న్యాయవ్యవస్థ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని చెక్కు చెదరనియ్యకండి. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తూ పోతుంటే జాతికి తీరని హాని జరుగుతుంది’’ అని లోథా ఆగ్రహంతో అభ్యర్థించారు. ‘న్యాయమూర్తుల నియామకాల్లోని గుట్టుమట్లను బహిర్గత పరచి, ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పెట్టండి’ అని ఒక పౌరుడు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంలో లోథా పై విధంగా స్పందించారు. ‘ఫర్ గాడ్స్ సేక్’ అని ఆయన అనడంలో ‘భగవంతుడా ఏమిటీ విపరీతం’ అన్న నిస్పృహ ఉంది.

 

ఇలాంటి నిస్పృహకే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా లోనయ్యారు. ఇటీవల ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు ప్రదానం చేస్తున్న ఉమ్మడి సభలో తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు ‘చోటు’ కోసం గొడవ పడడం చూసి ఆయన ఎంతో ఆవేదన చెందారు. ప్రజాస్వామ్యానికి ఆలయం లాంటి పార్లమెంటు భవనంలో సభ్యులు కనీస గౌరవ మర్యాదలు కూడా విస్మరించి సభ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించడం ఆయనను బాధించింది. ‘‘ప్లీజ్.. ఫర్ గాడ్స్ సేక్, హుందాగా వ్యవహరించండి. మీరంతా ప్రజాప్రతినిధులన్న సంగతి మర్చిపోయి, సభలో గందరగోళం సృష్టిస్తే పవిత్రమైన పార్లమెంటు అపహాస్యం పాలవుతుంది’’ అని ఆక్రోశించారు. ఆ ఆక్రోశంలో ‘దేవుడా, వీళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు’ అన్న వేడుకోలు ఉంది. అదే సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ.. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టేముందు, అక్కడి మెట్లకు శిరస్సుతో నమస్కరించడాన్ని గుర్తు చేస్తూ.. మోడీని కొనియాడారు కూడా.

 

లోథాకు, ప్రణబ్‌కి వచ్చిన కష్టం.. పెద్ద కష్టంగా మనకు అనిపించకపోవచ్చు. అసలవి కష్టాలే కాదని కూడా అనిపించవచ్చు. అయితే ఏ మనిషి కష్టాన్నయినా మనం అనుకునే హెచ్చుతగ్గులను బట్టి అంచనా వెయ్యకూడదు. కష్టం తీవ్రత దేవుడిని తలచుకోవడంలో ఉంటుంది. ఎవరైనా బాధగా ‘దేవుడా’ అనుకున్నారంటే అది కష్టం అవుతుంది తప్ప, చిన్నకష్టమో, పెద్ద కష్టమో కాదు.

 

కష్టాల్లో.. దేవుడు గానీ, దేవుడి లాంటి మనిషిగానీ గుర్తొస్తారని కదా అనుకున్నాం. అంటే ప్రతి మనిషికి ఇద్దరు దేవుళ్లు. ఒకరు దేవుళ్లలో దేవుడు. ఇంకొకరు మనుషుల్లో దేవుడు. మనకిక భయం ఏమిటి? దేవుడు తప్పక మన కష్టం తీరుస్తాడు. లేదా కష్టం తీర్చి రమ్మని తన తరఫున మనిషినైనా పంపిస్తాడు. అలా కూడా జరగలేదంటే.. ఎవరి వల్ల కష్టం వచ్చిపడిందో వారిలో పరివర్తన తెచ్చి, వారినే కష్టం తీర్చే మనిషిగా మన ముందుకు పంపే ఆలోచనలో ఆయన ఉన్నాడని. అప్పటి వరకు కష్టాన్ని ఓర్చుకోవడమే దేవుడికి మనం చెల్లించగల స్తుతి.  

 

- మాధవ్ శింగరాజు

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top