దివ్యమైన ప్రతిభ

దివ్యమైన ప్రతిభ - Sakshi


స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుంచి కోర్సు మధ్యలో వదిలేసి అర్ధంతరంగా బయటకు వచ్చేటప్పుడు భవిష్యత్తు గురించి భయం వేయలేదా? అని అడిగితే, భయం తలుపులు తడుతుండగానే, ఆత్మవిశ్వాసపు తలుపులు తెరిచాను.. అని అంటుంది దివ్యానాగ్. ప్రస్తుతం మూలకణ (స్టెమ్‌సెల్స్) చికిత్సా విధానాల గురించి పరిశోధన కొనసాగిస్తూ, భవిష్యత్తులో వైద్యరంగానికి ఆశాకిరణంగా మారుతుందన్న అంచనాలున్న యువతి. 20 ఏళ్ల వయసులోనే ప్రత్యేకమైన యువతిగా ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ జాబితాలో నిలిచింది. పాప్ తరంగం జస్టిన్ బీబర్, ‘టంబ్లర్’ వ్యవస్థాపకుడు డేవిడ్ కార్ప్, టెన్నిస్ తార షరపోవా వంటి వారితో పాటు ‘ఫోర్బ్స్’ ఎంపిక చేసిన ‘30 అండర్ 30’లో నిలిచిన భారతీయ మూలాలున్న అమెరికన్ యువతి దివ్యానాగ్.

 

దివ్య తల్లిదండ్రులు భారతీయులే. జైపూర్ వాళ్లు. అమెరికాలో స్థిరపడ్డ వాళ్లు. చిన్నప్పటి నుంచే సైన్స్‌పై ఎంతో మమకారంతో చదివిన దివ్యకు ఒక దశకు వచ్చాక అంతర్గతంగా వైద్యం విషయంలో ఆలోచన మొదలైంది. జ్ఞానం పెరిగే కొద్దీ... ‘ఏదో పట్టాలు పుచ్చుకొని డబ్బు సంపాదించడం కాదు, పరిశోధన రంగంలోకి వెళ్లాలి. వైద్యశాస్త్రంలో సరికొత్త పద్ధతులను ఆవిష్కరించాలి..’ అనేది ఆమె అభిలాషగా మారింది. ఇదే సమయంలో పరిశోధన విభాగంలో స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో సీటు వచ్చింది.

 

స్టాన్‌ఫోర్డ్‌లోకి ప్రవేశించగానే ఆమెను అద్వితీయమైన వాతావరణం పలకరించింది. ఒక విద్యార్థిగా విజ్ఞానాన్ని అందుకోవడానికి ఎలాంటి వాతావరణం కావాలో దాన్ని అందించిందిట స్టాన్‌ఫోర్డ్. అయితే అది స్టాన్‌ఫోర్డ్ అయినా ఆక్స్‌ఫర్డ్ అయినా ఏదో మొక్కుబడి చదువులు చదవడం కాదు, తన ఆలోచనలు వేరు, లక్ష్యాలు వేరు. అందుకే విద్యాసంవత్సరం మొదలైన కొంతకాలానికి ఆమె వర్సిటీ నుంచి బయటకు వచ్చింది. డ్రాపౌట్ అనే ముద్రపడుతుందని తెలిసినా ధైర్యంగా నిర్ణయం తీసుకొంది.

 

స్టాన్‌ఫోర్డ్‌నుంచి బయటకు వచ్చిన తర్వాత దివ్య సొంతంగా ‘స్టెమ్‌సెల్‌థెరనోస్టిక్స్’ అనే సంస్థ ను స్థాపించింది. హృదయ, కాలేయ సంబంధ జబ్బుల చికిత్సపై అధ్యయనాన్ని ప్రారంభించింది. సాధారణంగా హృదయం, కాలేయాలకు జబ్బులు వచ్చాయంటే మరణం ముంగిట నిలబడినట్టే. చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రపంచంలో అనునిత్యం హార్ట్‌ఎటాక్‌లతోనో, కాలేయ సంబంధ జబ్బులతోనో అనేక మంది మరణిస్తూనే ఉన్నారు. ఇలాంటి జబ్బుల నివారణకు మూలకణ చికిత్స పద్ధతిలోనే ఒక నూతన విధానాన్ని ఆవిష్కరించడాన్ని దివ్య లక్ష్యంగా ఎంచుకొంది.

 

‘మూలకణ చికిత్సలో కూడా మార్పు తీసుకురావాలనేది నా లక్ష్యం. చర్మకణాలనే మూల కణాలుగా మార్చి చికిత్స చేసే విధానాన్ని అభివృద్ధి పరుస్తున్నాం...ఇది భవిష్యత్తులో మూలకణ చికిత్స విధానాన్నే మార్చేస్తుంది..’అని దివ్య ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.

 

ఇదే సమయంలో దివ్య సొంతంగా ‘స్టార్ట్‌ఎక్స్ మెడ్’ అనే సంస్థను కూడా ప్రారంభించింది. ప్రపంచంలోని ప్రముఖమైన 30 వైద్య, వైద్యపరిశోధక సంస్థలు ఈమెతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. స్టాన్‌ఫోర్డ్ హాస్పిటల్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి ప్రముఖసంస్థలు కూడా దివ్య స్థాపించిన పరిశోధన సంస్థతో కలిసి పనిచేస్తున్నాయి. దీన్ని తన ఆదాయ, వ్యాపార మార్గంగా మార్చుకొందామె.

 

ఈ విధంగా స్టెమ్‌సెల్ థెరనోటిస్టిక్స్, స్టార్ట్ ఎక్స్ మెడ్‌లకు రథసారధిగా, వైద్యరంగంలో భవిష్యత్తు తారలా అగుపిస్తున్న దివ్యను ఫోర్బ్స్ వాళ్లు గుర్తించారు. ఆమెను ‘30 అండర్ 30’ జాబితాలోకి ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన 30 మంది యువతలో ఒకరిగా గుర్తింపునిచ్చారు. దీంతో మంచి గుర్తింపే వచ్చినప్పటికీ ఇంతకు ముందే దివ్య స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ థాట్ లీడర్ (2102), గ్లోబల్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌లను అందుకొంది. ‘వైర్డ్’ పత్రిక వాళ్లు నిర్వహించిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి చర్చించింది. వాణి జ్య రంగంలో మహిళా శక్తి పాత్ర, వైద్య రంగ సంబంధిత అంశాల గురించి తన ఆలోచనలను ఒబామాతో కలిసి పంచుకొంది.

 

భవిష్యత్తులో సంచలనమే..

 

పరిణతి చెందిన కణాలను మూలకణాలుగా మార్చి చికిత్స కోసం ఉపయోగించడం అనే అంశంపై పరిశోధన  చేసిన పరిశోధకులకు వైద్యరంగంలో నోబెల్ బహుమతి లభించింది.  దాదాపు ఇలాంటి అంశం మీదే పనిచేస్తూ హృదయం, కాలేయ జబ్బుల నివారణ కోసం పనిచేస్తోంది దివ్య. మరి ఆమె ప్రయత్నాలు విజయవంతం అయితే... ఈ ప్రవాస భారతీయురాలు ఏ నోబెల్ స్థాయికో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

భారత్‌తోనూ అనుబంధం...



దివ్య తండ్రి ఇంటెల్‌లో ఇంజనీర్, తల్లి బయోకెమిస్ట్రీ రంగంలో పనిచేస్తున్నారు. దివ్య అమెరికాలోనే పుట్టింది. అయితే వారసత్వ మూలాలను మాత్రం మరవలేదు. ఇప్పటికీ ప్రతి రెండేళ్లకు ఒకసారి కచ్చితంగా ఇండియాకు వస్తూ ఉంటానని, ఇక్కడ తనకు అనేక మంది స్నేహితులున్నారనీ వాళ్లతో కలిసి ఇండియా మొత్తం తిరుగుతుంటాననీ దివ్య చెబుతోంది. ఇండియా తన దృష్టిలో ఒక అద్భుతమైన దేశమంటూ భారతీయతను చాటుకొంటున్న ఈ యువతేజానికి జేజేలు!

 

 స్టెమ్‌సెల్ థెరనోటిస్టిక్స్, స్టార్ట్ ఎక్స్ మెడ్‌లకు రథసారధిగా, వైద్యరంగంలో భవిష్యత్తు తారలా అగుపిస్తున్న దివ్యను ఫోర్బ్స్ వాళ్లు గుర్తించారు. ఆమెను ‘30 అండర్ 30’ జాబితాలోకి ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన 30 మంది యువతలో ఒకరిగా గుర్తింపునిచ్చారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top