స్త్రీలకు ఆ బేబీ పౌడర్‌ ప్రమాదకరమా?

స్త్రీలకు ఆ బేబీ పౌడర్‌ ప్రమాదకరమా?


హెచ్చరిక



అవుననే అంగీకరించి తీర్పు ఇచ్చింది అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ కోర్టు. ప్రపంచమంతటా విరివిగా దొరికే ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ బేబీ పౌడరును స్త్రీలు తమ జననాంగాల శుభ్రత కోసం వాడటం వల్ల వారికి ‘ఒవేరియన్‌ కేన్సర్‌’ (అండాశయ కేన్సర్‌) వచ్చే ప్రమాదం ఉందని ఆ కోర్టు నమ్మడం వల్ల కాలిఫోర్నియాకు చెందిన ‘ఈవా ఎచివెరియా’ అనే మహిళకు దాదాపు 2700 కోట్ల రూపాయలు (417 మిలియన్‌ డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించమని తీర్పు చెప్పింది. ఫేస్‌ పౌడర్ల వల్ల తమ ఆరోగ్యాలు పాడయ్యాయని అమెరికాలో దాఖలైన కేసులలో అత్యధిక జరిమానా విధించిన కేసుగా దీనిని చెప్పుకోవచ్చు.

 

ఈవా ఎచివెరియా అభియోగం ఏమిటి?


కాలిఫోర్నియాకు చెందిన 63 సంవత్సరాల ఈవా ఎచివెరియా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ పౌడర్‌ను జననాంగ శుభ్రత కోసం 1950 నుంచి 2016 వరకు ఉపయోగించింది. అయితే 2016లో ఆమె  అండాశయ క్యాన్సర్‌ బారిన పడింది. దీనికి కారణం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పౌడరే అని భావించిన ఈవా వెంటనే లాస్‌ ఏంజిల్స్‌ కోర్టులో నష్టపరిహారానికి దావా వేసింది.



‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ తన టాల్కమ్‌ పౌడర్‌ బాటిల్‌ మీద తగిన  జాగ్రత్తలు ఇవ్వలేదు, కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించలేదు, అందువల్లనే నేను కేన్సర్‌ బారిన పడ్డానని’ ఈవా అభియోగం చేసింది.  ‘నా లాగా మరొకరికి నష్టం జరగకూడదు. మహిళలకు నా పరిస్థితి గురించి చెప్పి, వారిని హెచ్చరించాలన్న ఉద్దేశంతో కేసు ఫైల్‌ చేశాను’ అని ఆమె చెప్పింది. ఆమె వాదనతో అంగీకారం తెలిపిన కోర్టు జాన్సన్‌ సంస్థకు భారీ జరిమానా విధించింది. ‘ఈ తీర్పుతో నా క్లయింట్‌ ఊరడిల్లే అవకాశం ఉంది. చావుతో పోరాడుతున్న నా క్లయింట్‌ ఈ వచ్చిన జరిమానా సొమ్ముతో తనలా ఒవేరియన్‌ కేన్సర్‌తో బాధ పడుతున్నవారికి సహాయం చేయదలిచారు’ అని ఈవా లాయర్‌ మార్క్‌ రాబిన్‌సన్‌  చెప్పారు.మరోవైపు ఈ తీర్పుపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ స్పందించింది. ‘మాకు కేన్సర్‌ బారిన పడ్డ ఈవా పట్ల సానుభూతి ఉంది. అయితే అంత మాత్రాన మా పౌడర్‌ వల్ల ఆమెకు కేన్సర్‌ వచ్చిందనడంతో ఏకీభవించలేం. దీనికి శాస్త్రీయ నిరూపణలు లేవు. మేము ఈ తీర్పును సవాలు చేస్తాం’ అని సంస్థ బాధ్యులు ప్రకటన చేశారు.



దాదాపు 4000 కేసులు

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ మీద అమెరికాలో ప్రస్తుతం సుమారు నాలుగు వేల కేసులు విచారణలో మూలుగుతున్నాయి. ఇవన్నీ తీర్పు పెండింగ్‌లో ఉన్న కేసులే. జాన్సన్‌ ఉత్పత్పుల వాడకం వల్ల తమ ఆరోగ్యం పాడైందని దాఖలైన కేసులను కొన్ని రాష్ట్రాల్లోని కోర్టులు కొట్టేస్తుండగా మరికొన్ని రాష్ట్రాల కోర్టులు జరిమానాలు విధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో మిస్సౌరీ కోర్టు నాలుగైదు కేసులలో 300 మిలియన్‌ డాలర్ల జరిమానాను విధించింది. ఇప్పుడు తాజాగా లాస్‌ ఏంజిల్స్‌ తీర్పుతో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ప్రాణం పోసుకున్నట్టయ్యాయి. వీటన్నింటి నుంచి జాన్సన్‌ సంస్థ ఎలా బయటపడుతుందో చూడాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top