తెలుగు కథకు తానా బహుమతి

తెలుగు కథకు తానా బహుమతి


తెలుగు కథకు తానా అందిస్తున్న అండదండలు విస్మరణీయం కాదు. ముఖ్యంగా గత పది, పదిహేను సంవత్సరాలుగా తెలుగు కథ వికాసంలో తానా ప్రత్యక్షంగా పరోక్షంగా పాలుపంచుకుంటున్నది. ఇందుకు ‘కథా సిరీస్’ ఒక ప్రబల ఉదాహరణ.

 

వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ ప్రతి ఏటా వెలువరిస్తున్న ‘కథ’ వార్షిక సంకలనాలు సాంకేతికంగా ‘కథాసాహితి’ ప్రచురణలే అయినా మానసికంగా తానా ప్రచురణలు. వీటి కోసం తానా స్వయంగా శాశ్వత ప్రాతిపదికన ఆర్థిక పరిపుష్టి అందించడమేగాక, ఈ మంచి పని కోసం అమెరికాలో విరాళాలు ఆకాంక్షించడం, నలుమూలల ఉన్న అమెరికా పాఠకులకు చేర్చేందుకు ప్రతులను విక్రయించడం, ప్రచారం చేయడం... తన పనులుగా భావించి చేస్తున్నది. ఇది తక్కువ సేవ కాదు. ఆ విధంగా ‘కథ’లో ప్రకటితమైన కథకులెందరో  తానాకు, అమెరికాకు రుణపడి ఉన్నారు.



 అలాగే తెలుగు కథను ఉత్సాహపరచడానికి  తానా నిర్వహించిన పోటీలు గుర్తు చేసుకోవాలి. రూ.మూడు వేలు, రూ.ఐదు వేలు పెద్ద మొత్తాలుగా ఉన్న 2001-05 సం.ల కాలంలో తెలుగు కథకు బహుమతిని ఏకంగా రూ.25,000గా ప్రకటించి  కుతూహలం రేపింది తానా. అయితే కథల నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని నిరాశ పడి  బహుమతి మొత్తాన్ని పలువురికి విభజించి పంచడం మినహా ‘టైటానిక్’ (సురేష్), ‘అస్తిత్వానికి అటూ ఇటూ’ (మధురాంతకం నరేంద్ర), ‘మిత్తవ’ (మంచికంటి) వంటి మంచి కథలు ఆ పోటీల వల్లే తెలుగు కథకు జతపడ్డాయి. తెలుగు కథలోనూ, రచనలోనూ  నిమగ్నమైన కాట్రగడ్డ దయానంద్, ఓల్గా, పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, శ్రీరమణ తదితరులను ఆమెరికా ఆహ్వానించి వారిని తన వంతుగా గౌరవించు కోవడం తానా చేసిన మరో మంచి పని. ఆ పరంపరలో భాగంగా తానా ఇటీవలే ‘తెలుగు కథ- నేపథ్యాలు’ పేరుతో రెండు విలువైన సంకలనాలు వెలువరించింది. ఇప్పుడు మరో బహుమతిగా ఈ పుస్తకం. గురజాడ ‘దిద్దుబాటు’ కంటే ముందు తెలుగులో వెలువడిన  92 కథల సంకలనమే ‘దిద్దుబాటలు’.



తెలుగులో మొదటి కథ ‘తేదీ ప్రకారం ఏది?’ అని కాకుండా ‘పరిణతి ప్రకారం ఏది?’ అనే విషయంలో పండితులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. 1910లో గురజాడ ‘దిద్దుబాటు’, ‘మీ పేరేమిటి?’ కథలు రాశారు. వస్తువు రీత్యా, శిల్పం రీత్యా, భాష రీత్యా, స్థానికత రీత్యా ఇవి ప్రపంచస్థాయి కథలు. ఆ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నించిన అంతకుముందరి కథలు ఎన్ని ఉన్నా వీటి ముద్ర చెరిగిపోదు. రాయసం వెంకట శివుడు, భండారు అచ్చమాంబ, ఆచంట సాంఖ్యాయన శర్మ, విన్నకోట లక్ష్మీ జోగమ్మ వంటి తొలి కథకుల కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. కొన్ని గ్రాంథికం, కొన్ని వ్యావహారికం, కొన్ని మిశ్రమంగా, కొన్ని సంభాషణ రూపంలో, కొన్ని ప్రాథమిక శైలిలో.... పలుకు నేర్చుకుంటున్న పాపాయి అందం వీటి నిండా ఉంది.  వీటిని చూస్తే ఇంత కృషి జరిగిందా అనే ఆశ్చర్యం కలుగుతుంది. గర్వం కూడా. 20వ శతాబ్దపు తొలి రోజుల వచనం, వస్తువు, సామాజిక జీవనం తెలియాలంటే ఇంతకు మించిన విలువైన సాధనం మరొకటి ఉంటుందా?  



ఈ కథలను సేకరించడం, ఆనాటి భాషను తప్పుల్లేకుండా కంపోజ్ చేయడం, ప్రూఫ్ చూడటం, అందంగా పుస్తక రూపం ఇవ్వడం... ఈ పనుల కన్నా వీపున వంద మూటలు మోయడం సులువు. కాని సంపాదకులు వివినమూర్తి, మిత్రులు వాసిరెడ్డి నవీన్, ఎ.వి.రమణమూర్తి, చంద్ర, అక్షర సీత ఈ పని సమర్థంగా చేయగలిగారు.  తెలంగాణ తొలితరం కథలను తెలంగాణవారు ప్రచురించుకున్నట్టు ఈ విలువైన సంపదను ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రచురించుకుని ఉంటే బాగుండేది కానీ మాతృభూమి రుణం కొంతైనా తీర్చుకోవడానికి తపన పడే తానాకు అవకాశం దక్కడం సంతోషించదగ్గ అంశం. దీని వల్ల తానా తెలుగు కథకు విలువైన చేర్పును సమకూర్చడమే గాక తన వదాన్యతతో పూర్వ కథకులందరినీ రుణగ్రస్తులను చేసుకోగలిగింది.



 కాళీపట్నం రామారావు 90వ జన్మదినం సందర్భంగా వెలువడిన ఈ సంకలనం ఆయనకు ఒక అనిర్వచ నీయమైన అమెరికా కానుక.

 ఇలాంటి పనులు  ఎన్ని జరిగితే అంత మేలు.

 - నెటిజన్ కిశోర్

 దిద్దుబాటలు (దిద్దుబాటుకు ముందు కథలు 92)

 తానా ప్రచురణ; సంపాదకులు- వివినమూర్తి, వెల: రూ.300; అమెరికాలో: 25 డాలర్లు, ప్రతులకు:  అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు లేదా 040 - 23244088



తానా 2015 ఉత్సవాల్లో కథావేడుక....



 ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తానా ఉత్సవాల్లో భాగంగా 2015 జూలై 2-4 తేదీల్లో అమెరికా డెట్రాయిట్‌లో జరగనున్న వేడుకలలో తెలుగు కథకు పెద్ద గౌరవం దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఆహ్వానం అందుకున్న వారిలో సుప్రసిద్ధ కథకులు పి.సత్యవతి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, డా.వి.చంద్రశేఖరరావు, స.వెం.రమేశ్, వాసిరెడ్డి నవీన్ ఉన్నట్టు తానా తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఇంతమంది కథకులు తానాకు హాజరు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. ఫలితంగా అక్కడ విస్తృతంగా జరిగే కథాసదస్సులలో తెలుగు కథ రెపరెపలాడనుంది. ఇది కథాభిమానులను ఆనందపరిచే సంగతి. పి.సత్యవతి (మంత్రనగరి), నామిని (మూలింటామె), డా.వి.చంద్రశేఖరరావు (లెనిన్ ప్లేస్), స.వెం.రమేశ్ (ప్రళయకావేరి కతలు) రచనలు పాఠకులకు పరిచితాలు. వాసిరెడ్డి నవీన్ ‘కథ’ సంకలనాలు బహుళ గుర్తింపును పొందాయి. కాగా తెలంగాణ రాష్ట్రం నుంచి కవి దర్భశయనం శ్రీనివాసాచార్య (వేళ్లు మాట్లాడేవేళ) వేడుకలలో పాల్గొననున్నారు.





 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top