పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్

పర్ఫెక్ట్  ఫ్యామిలీ మ్యాన్


సినిమా కష్టాలు లేనిదే సూర్య హీరో కాలేదు. ఇంట్లో సంతోషాలు పంచనిదే శరవణన్ ఫ్యామిలీ మ్యాన్ కాలేదు. నాన్న రికమండేషన్ లేకుండా తాను ముళ్లబాటలో నడిచాడు. తమ్ముడికి పూలబాట వేశాడు. జ్యోతికను అమితంగా గౌరవిస్తాడు. పిల్లల్ని గొప్పగా ప్రేమిస్తాడు.  ద పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్!


ముందు మీరు తెలుగుకి వచ్చి మార్కెట్ పెంచుకున్నారు.. ఆ తర్వాత మీ దారిలో మీ తమ్ముడు వచ్చారు. ఇప్పుడు మీ మార్కెట్ ‘ఊపిరి’లోకి మీ తమ్ముడు చొరబడ్డాడనుకుంటున్నారా?

(నవ్వుతూ). మీకో గమ్మత్తై విషయం చెప్పాలి. విషయం గమ్మత్తుగా ఉన్నా చాలా ఇన్‌సైట్‌ఫుల్ విషయం. నా చిన్నప్పుడు ఒక గొప్ప జ్యోతిషుడు జాతకం చెప్పారు. మా నాన్నగారితో ‘ఉంగ పయ్యన్ హీరో ఆవ్వాన్’ (మీఅబ్బాయి హీరో అవుతాడు) అని అన్నారాయన. నాన్నగారు వెంటనే, ‘యారు.. కార్తీయా..’ (ఎవరు కార్తీయా) అని చాలా ఎగ్జైటెడ్‌గా అడిగారు. ఆ అస్ట్రాలజర్ ‘ఇల్లే...సూర్య’ (కాదు... సూర్య) అన్నారు. మా నాన్నగారు అపనమ్మకంగా ‘ఎన్నా పేసరే సూర్యావా..’ (ఏం మాట్లాడుతున్నావ్.. సూర్యానా) అని ఆయన మీద చిరాకుపడ్డారు. నేనంత చురుకుగా ఉండేవాణ్ణి కాదు కదా. అందుకే నా మీద నమ్మకం ఉండేది కాదు. చివరికి అస్ట్రాలజర్ చెప్పింది నిజమైంది. ముందు నేను హీరో అయ్యాను. ఆ తర్వాత కార్తీ. ‘ఊపిరి’ చాలా మంచి సినిమా. కంటెంట్ బాగుంటుంది. కార్తీ తన స్టైల్ మార్చుకుని ఈ సినిమా చేశాడు. ఈ సినిమాతో తన మార్కెట్ ఇంకా పెరిగిందంటే వినడానికి హాయిగా ఉంది. అన్నయ్యని కదా.. గర్వంగా కూడా ఉంది.


మీ ఇద్దరిలో ఎవరు చురుకు..?

ఇంకెవరూ.. నా తమ్ముడే. చిన్నప్పుడు నేనెక్కువ మాట్లాడేవాణ్ణి కాదు. మొహమాటం, బిడియం ఎక్కువ. చదువులోనూ అంతంత మాత్రమే. నా తమ్ముడు కార్తీ ఫాస్ట్. చదువులో ఫస్ట్. నేను ఇంట్లో సెలైంట్.. బయట అంతకన్నా సెలైంట్. ఇద్దరం ఐస్‌క్రీమ్ పార్లర్‌కి వెళితే నాకెలా ఆర్డర్ ఇవ్వాలో తెలిసేది కాదు. తననే ఆర్డర్ ఇవ్వమని చెప్పేవాణ్ణి. చిన్నప్పుడు నేను, కార్తీ మాట్లాడుకున్నది తక్కువ. పోట్లాడుకున్నదే ఎక్కువ. చదువుకోవడానికి కార్తీ యూఎస్ వెళ్లినప్పుడు బాగా మిస్సయ్యాను. అక్కణ్ణుంచి తను తిరిగొచ్చాక మా మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఏర్పడింది.


మీ నాన్నగారు (ప్రముఖ తమిళ నటుడు శివకుమార్) మిమ్మల్ని రికమండ్ చేయకుండా కార్తీ కోసం వెయిట్ చేశారేమో?

అసలు నాన్నగారిది రికమండేషన్లు చేసే మనస్తత్వం కాదు. ఎవరి కష్టంతో వాళ్లు పైకి రావాలనుకుంటారు. నేను ఓ బట్టల కంపెనీలో ఉద్యోగం చేసేవాణ్ణి. ఆరు నెలలు చేశాను. దర్శకుడు వసంత్‌గారు నన్ను చూసి, సినిమాల్లోకి తీసుకువెళ్లారు. ఆ సినిమాలో అజిత్ నటించాల్సింది. ఆయన తప్పుకోవడంతో నాకు అవకాశం ఇచ్చారు. వసంత్‌గారు చాన్స్ ఇచ్చిన విషయం నా ఫ్రెండ్స్‌తో చెబితే వాళ్లందరూ ‘నువ్వా’ అని ఒక్కసారిగా నవ్వేశారు. దాంతో నాకు ఉక్రోషం వచ్చేసింది. ‘మనం ఎందుకు కాకూడదు’ అని సవాల్‌గా తీసుకున్నాను. మొదట్లో కొంత నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దాంతో పట్టుదల పెరిగింది. సినిమాలంటే కొంత ఇష్టం ఉండేది.. ఆ తర్వాత విపరీతంగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఇదిగో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.




త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుంది. రెండు, మూడు కథలు కూడా అనుకున్నాం. ఏ కథతో సినిమా చేస్తాం అనేది మరోసారి చెబుతాను.  ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది? అనేది కూడా ఇప్పటికిప్పుడు  చెప్పలేను. 
- సూర్య


 కష్టపడి పైకొచ్చారు.. హాయిగా కమర్షియల్ సినిమాలు చేసుకోకుండా ‘పసంగ-2’ (తెలుగులో ‘మేము’) లాంటి ఆర్ట్ టైప్ మూవీ చేసి, రిస్క్ ఎందుకు తీసుకున్నారు?

అది ప్రాపర్ ఆర్ట్ మూవీ కాకపోయినా.. దాదాపు ఆర్ట్ మూవీయే. తల్లిదండ్రులకు, పిల్లలకు కావాల్సిన సినిమా. అందుకే ‘పసంగ -2’లో నటించడంతో పాటు నేనే నిర్మించాను. నేనిప్పటివరకూ చేసిన సినిమాలన్నింటికన్నా డిఫరెంట్ మూవీ అది. ‘నాన్-కమర్షియల్’ మూవీయే అయినా అలా అనిపించదు. ఒక నాన్-కమర్షియల్ మూవీ కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వాలంటే కంటెంట్ ముఖ్యం. అలాంటి కథలు కుదిరితే రెగ్యులర్ డ్యాన్సులు, ఫైట్లు లేకుండా సినిమా చేయడానికి నేను రెడీ. ఎందుకంటే, ఇలాంటి సినిమాలు పది కాలాల పాటు నిలిచిపోతాయ్. 5 కోట్లతో తీసిన ‘పసంగ-2’ 50 కోట్ల వరకూ వసూలు చేసింది.


ప్యూర్ ఆర్ట్ మూవీ చేయడానికి మీరు రెడీయా?

ఆర్ట్ మూవీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. బలమైన కథ ఉంటే చేయడానికి రెడీ. కానీ, నాతో ‘ఆర్ట్’ సినిమా అంటే నిర్మాతలు ముందుకు రాకపోవచ్చేమో. సో... నేను నటించడం మాత్రమే కాదు.. నిర్మాతగా మారాలి. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా మారిపోవాలి. ఆ సినిమాని సేల్ చేసుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేయాలి. అన్నింటికీ మించి ఆ సినిమా మీదే పూర్తిగా దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా డేట్స్ సర్దుబాటు చేసుకోవాలి. అలాగే పారితోషికం కూడా తీసుకోకూడదు. కొన్ని త్యాగాలు చేస్తే మీరన్నట్లు ఆర్ట్ ఫిలిం చేసేయొచ్చు.


ప్రయోగాలు ఇష్టపడతారనిపిస్తోంది..

అవును. అందుకే ‘గజిని’, ‘మాట్రాన్’ (తెలుగులో ‘బ్రదర్స్’) వంటి సినిమాలు చేశాను. అప్పట్లో ‘ఆదిత్య 369’ ఓ ప్రయోగమే కదా. అలాగే, ‘మిస్టర్ ఇండియా’, ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటాం. అప్పట్లో భయపడి ఆ చిత్రాలు తీసి ఉండకపోతే సిల్వర్ స్క్రీన్ మంచి సినిమాలను మిస్ అయ్యుండేది. ఇప్పుడు చెప్పుకోవడానికి అలాంటి సినిమాలు ఉండేవి కావు. ‘24’ అలాంటి సినిమాయే అవుతుంది.



పాత్రలు ఎంత కష్టపెట్టినా ఇష్టంగా చేస్తారేమో..?

(నవ్వుతూ)... అవునండి. కమల్‌హాసన్‌గారిని తీసుకుందాం. యాభైఏళ్ల వయసులో ఆయన ‘దశావతారం’లో పది పాత్రలు చేశారు. మరి.. ఇప్పుడు ఈ వయసులో నేనెంత కష్టపడాలి?


మీ గురించి ఇప్పటివరకూ ఎలాంటి కాంట్రవర్శీ రాలేదు.. ఎలా మ్యానేజ్ చేస్తున్నారు?

జీవితం సుఖంగా సాగిపోతోంది. ఇలాంటి సమయంలో నేను వివాదంలో ఇరుక్కోవాలని కోరుకుంటున్నారా? వద్దండి. ‘ఐయామ్ బ్లెస్డ్’. అటు తమిళంలోనే కాదు.. ఇటు తెలుగులో కూడా అందరి అభిమానాన్ని పొందగలిగాను.


‘అగరమ్ ఫౌండేషన్’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ ఎన్నో ప్రాడెక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. రీసెంట్‌గా ఓ బ్రాండ్ వల్ల అమితాబ్ బచ్చన్‌కి కూడా కష్టాలు తప్పలేదు..

నేను ఏ బ్రాండ్‌కి అయితే చేస్తున్నానో దాని గురించి తెలుసుకుంటాను. నా పరిధి మేరకు ఎంతవరకూ తెలుసుకోవాలో అంతా తెలుసుకుంటా. నేను ప్రమోట్ చేసే బ్రాండ్‌ని నేను వాడతాను. నేను ప్రమోట్ చేసే ఫుడ్ ఐటమ్స్‌ని నేను కూడా తింటాను. ఆ మధ్య కొన్ని ఫుడ్ ప్రాడెక్ట్స్‌ని ప్రమోట్ చేయమంటే చేశాను. అది చూసి పిల్లలు వాటిని తినడం, తాగడం మొదలుపెట్టారు. అవి మంచిది కావని ఎవరో చెప్పారు. అంతే.. వాటిని ప్రమోట్ చేయడం మానేశాను.


మీ బెస్ట్ హాఫ్ జ్యోతిక గురించి?

జ్యోతిక నాకు మంచి ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్. మంచి తల్లి, మంచి వదిన, మంచి కోడలు. మంచి నటి కూడా. నాకొచ్చే సందేహాలను తీర్చుకోవడం కోసం జ్యోతిక అనే బుక్‌ని అప్రోచ్ అయితే చాలు.. సమాధానం దొరికేస్తుంది. మాది జాయింట్ ఫ్యామిలీ. మా అమ్మా, నాన్న, నా ఫ్యామిలీ, కార్తీ ఫ్యామిలీ కలిసే ఉంటాం. అందర్నీ ప్రాపర్‌గా చూసుకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఇంకా అనుబంధం పెరగడానికి జ్యోతిక కారణమైంది. జ్యోతిక నన్ను మాత్రమే కాదు.. షీ మ్యారీడ్ మై హోల్ ఫ్యామిలీ ఆల్సో (నవ్వుతూ).


 పిల్లలు దియా, దేవ్ ముచ్చట్లు...

దియా ఫిఫ్త్ స్టాండర్డ్‌కి వెళుతోంది. దేవ్ సెకండ్ స్టాండర్డ్. ఏడెనిమిదేళ్ల వయసులో నేనెలా ఉండేవాణ్ణో నా పిల్లలు అలా లేరు. నాకన్నా చాలా తెలివిగా, చురుకుగా ఉన్నారు. ఓ ఫాదర్‌గా అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఎట్ ది సేమ్ టైమ్ పిల్లలను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. అందుకే, ఎంత బిజీగా ఉన్నా వాళ్ల కోసం టైమ్ స్పెండ్ చేస్తుంటాను.


 ఫైనల్లీ... ఒకవైపు వరుసగా సినిమాలు మరోవైపు సేవా కార్యక్రమాలు.. దాంతో పాటు ఫ్యామిలీ... ఎలా డీల్ చేస్తున్నారు?

సింపుల్.. ఇంట్లో ఉన్నప్పుడు సూర్యని మర్చిపోతా. షూటింగ్ లొకేషన్‌లో ఉన్నప్పుడు శరవణన్‌ని (సూర్య అసలు పేరు శరవణన్. సూర్య హీరోగా ఎంటరైనప్పుడు అప్పటికే శరవణన్ పేరుతో పాపులర్ ఆర్టిస్ట్ ఉండటంవల్ల సూర్యతో మొదటి సినిమా నిర్మించిన దర్శకుడు మణిరత్నం ఈ పేరు పెట్టారు) మర్చిపోతా. - డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top