ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ హక్కు..

ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ హక్కు.. - Sakshi


ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో... అది భారతదేశం అవుతుంది.

అమ్మను, చెల్లిని, బిడ్డను... ‘తల్లీ’ అని పిలుచుకోవడం మన ఆచారం.

జన్మనిచ్చిన తల్లి అని కాదు... ముక్కోటి దేవతల ప్రతీక అని.

దేవుడి కోసం మనం గుడి కడితే...

దేవుడు తన కోసం కట్టుకున్న గుడి... స్త్రీ అని నమ్ముతాం.

‘ఈ గుడి పవిత్రతను కాపాడడంలో రాజీ ఉండదు, ఉండకూడదు’

అని ఉపదేశించిన మరో మహోన్నత దేవాలయమే...

సమాజం కట్టిన సుప్రీం దేవాలయం.

స్త్రీని పూజించే కంటే ముందు... స్త్రీని రక్షించే ఈ దేవాలయానికి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ వందనాలు.


 

2004.. జనవరి.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని ఓ గ్రామం.

స్నేహితురాలు వనజ ఇంటి నుంచి బయలుదేరింది పద్మ (పేరు మార్చాం). ఆ అమ్మాయి పదవ తరగతి చదువుతోంది. వనజ వాళ్లన్నయ్య దగ్గర లెక్కలు చెప్పించుకోవడానికి స్కూల్ అవగానే వనజతో కలిసి వాళ్లింటికి వెళ్తుంటుంది. ఆ రోజు ట్యూషన్ అయిపోయాక సాయంత్రం ఆరున్నరకు ఇంటికి బయలుదేరింది. వనజ వాళ్లింటికి పద్మ వాళ్లింటికి అట్టే దూరం లేకపోయినా మధ్యలో పొదలు ఉంటాయి. చుట్టుపక్కల ఇళ్లేవీ ఉండవు. పద్మ సరిగ్గా ఆ పొదల దగ్గరకు రాగానే సంతోష్ (పేరు మార్చాం) ఆమె దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. సంతోష్ ఆ ఊరి మోతుబరి కొడుకు. ఆకతాయి. సంతోష్ గురించి తెలిసిన పద్మ తలవంచుకొని తానే పక్కనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. వెళ్లనివ్వలేదు సంతోష్. పైగా తాగి ఉన్నాడు. పద్మ వెన్నులో సన్నని వణుకు. అరవబోయింది. చేత్తో నోటిని మూసి పద్మను పొదల్లోకి ఎత్తుకెళ్లాడు. గంట తర్వాత పద్మ ఇంటికి చేరింది.. సంతోష్ పారిపోయాడు. రాత్రి తొమ్మిదింటికి ఊళ్లో పంచాయితీ. ‘పోలీస్ స్టేషన్‌కి వెళ్లకుండా పంచాయితీలోనే రెండు కుటుంబాల వాళ్లు కాంప్రమైజ్ అయిపోండి’ అని పంచాయితీ పెద్దలు చెప్పారు. పద్మ వాళ్లన్నయ్య ‘అట్లెట్టా ఊరుకుంటాం.. వాడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సిందే’ అని పట్టుబట్టాడు. ఆ రాత్రికి రాత్రే చెల్లెలిని, తండ్రిని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు పద్మవాళ్లన్నయ్య. కంప్లయింట్ ఇచ్చారు. పద్మను మెడికల్ టెస్ట్‌కు పంపారు.

 

మరుసటి రోజు...

 మెడికల్ రిపోర్ట్ వచ్చింది పద్మ రేప్‌కి గురైనట్టు. పారిపోయిన సంతోష్‌ను పట్టుకొచ్చారు పోలీసులు. గ్రామ పెద్దతో పాటు రెండు కుటుంబాల వాళ్లూ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. కేసులు పెట్టుకొని ఎంత దూరం పోతరు? ఆడపిల్ల.. ఆలోచించుండ్రి’ అన్నడు గ్రామపెద్ద. ‘మావాడు చేసింది తప్పే.. మా తాహతుకు తగకపోయిన వాడు చేసిన తప్పుకి శిక్షగా మీ పిల్లను మా ఇంటి కోడల్ని చేసుకుంటం.. దీన్ని ఇక్కడితోనే ఇడిచిపెట్టుండ్రి’ అన్నాడు సంతోష్ మేనమామ. పద్మ మేనమామా ఆ పరిష్కారానికి అంగీకరించాడు. పద్మతల్లిదండ్రులనూ ఒప్పించాడు. ఒప్పందం కుదిరింది. రెండు కాళ్లమధ్య తలపెట్టుకొని వెక్కివెక్కి ఏడుస్తున్న పద్మకు సంబంధం లేకుండానే ఒప్పందం కుదిరింది. సంతోష్‌ని చూస్తే వణికిపోతున్న పద్మ అంగీకారం లేకుండానే అతనితో ఆమె పెళ్లి నిశ్చయమైంది. టెన్త్‌లో స్కూల్ ఫస్ట్ రావాలనే లక్ష్యం తప్ప ఇంకే ఆలోచనా లేని ఆమె ఈసారి పెళ్లి అనే బలవంతానికి గురైంది!

 ఇది పదకొండేళ్ల నాటి మాట.. ఊరి పెద్దలు, పోలీసులు, తల్లిదండ్రులు కలిసి చేసిన మధ్యవర్తిత్వానికి ఓ అమాయకురాలు బలైంది. పైకి పొక్కింది ఇదొక్క సంఘటనే. పొక్కనివి, బాధితురాలి నోరు నొక్కి పెళ్లి చేసినవీ ఎన్నో!

         

2015.. జూలై.. ఇక నుంచి ఇలాంటి మధ్యవర్తిత్వాలు చెల్లవు. రేప్ చేసిన వాడు శిక్షను అనుభవించాల్సిందే! ‘స్త్రీ దేహం.. ఆమెకు దేవాలయం! ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణహక్కు. స్త్రీ ఆత్మగౌరవాన్ని కించపరిచే నిర్ణయాలతో, ఒప్పందాలతో ఆమె సమాధానపడవల్సిన అవసరం లేదు. రేప్‌కి గురైన స్త్రీ తల్లిదండ్రులతో నేరస్థుడు ఎలాంటి మధ్యవర్తిత్వం నెరపడానికీ వీల్లేదు. పెళ్లి చేసుకుంటానని, నష్టపరిహారమిస్తాననే ప్రలోభాలతో కేస్‌ను విత్‌డ్రా చేయించే ప్రసక్తే లేదు. నేరస్థుడు శిక్ష అనుభవించాల్సిందే ’ అంటూ మూడ్రోజుల క్రితమే  జూలై ఒకటో తారీఖున సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

 

ఈ తీర్పుకి కారణమైన కేసు ఇదే

 2008లో మధ్యప్రదేశ్‌లో ఏడేళ్ల పాప రేప్‌కి గురైంది. నేరస్థుడికి సెషన్స్‌కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. పాప తల్లిదండ్రులకు నష్టపరిహారం పేరుతో కొంత డబ్బిచ్చి రాజీ కుదుర్చుకున్న నేరస్థుడు శిక్ష రద్దు చేయించుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని 2009లో హైకోర్టు నేరస్థుడి శిక్షను తగ్గించి యేడాదికి కుదించింది. ఈ తీర్పు వెలువడే సరికి యేడాది కాలం పట్టింది కాబట్టి ఆ యేడాదీ శిక్షా పూర్తయిందని కేస్ కొట్టేసింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పు మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీకోర్టుకు అప్పీలు చేసింది. అదే సమయంలో తమిళనాడులో ఓ రేప్ కేసు నమోదై మద్రాస్ హైకోర్టుకు వచ్చింది. అందులో కూడా అత్యాచార బాధితురాలు మైనర్ బాలికే (15). రేప్‌వల్ల గర్భవతి అయింది. మద్రాస్ హైకోర్టు జడ్జి ఆ అమ్మాయితో... ‘నీకు పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోసం అతడిని (రేపిస్టుని) పెళ్లిచేసుకో’ అంటూ రాజీకుదిర్చాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు  కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు ఆ తీర్పుతోపాటు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునూ తూర్పార బడుతూ స్త్రీ ఆత్మగౌరవాన్ని భంగపరిచే రాజీలు కుదరవు. నేరస్థుడు శిక్ష అనుభవించాల్సిందే అంటూ తన తీర్పును స్పష్టం చేసింది.

 - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

మధ్యవర్తిత్వం అంటే ఏంటి?

 అఈఖ.. ఆల్టర్‌నేటివ్ డిస్‌ప్యూట్స్ రిజల్యూషన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) 89 సెక్షన్ కింద 2002 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం సులభంగా పరిష్కారం అయ్యే కేసులను కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు ఈ మీడియేషన్ సెంటర్‌కి జడ్జి రిఫర్ చేస్తారు. సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులనే ఈ మీడియేషన్ సెంటర్‌కి రిఫర్ చేస్తారు. లైంగికదాడులు, యాసిడ్‌దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, డౌరీ డెత్‌కేసులు, డెకాయిటీ కేసులను మీడియేషన్ సెంటర్‌కి రిఫర్‌చేయరు. చేయకూడదు కూడా!

 - ఇ. పార్వతి, హైకోర్టు అడ్వొకేట్

 

 సమర్థించే అంశాలు కావు     

 ఆడపిల్లలపై లైంగిక దాడి కేసుల్లో మధ్యవర్తిత్వం, రాజీ కుదుర్చు కోవడం లాంటివి సమర్థించే అంశాలు కావు. రాజీకి రావడానికి సమాజం కూడా ఓ కారణం. కాబట్టి మార్పనేది సమాజం నుంచే రావాలి. ప్రతి ఒక్క పౌరుడు దేశంలో జరుగుతున్న  హింసను అరికట్టడంలో తమ వంతు బాధ్యతను నిర్వహించాలి.

 - డాక్టర్ లక్ష్మీదేవి,  కేశవ్‌మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్   

 

 ఈ తీర్పు మీద ఏమంటున్నారంటే..

 

 ఏ ఆడపిల్లా కోరుకోదు


 రేప్ చేసిన మృగాన్ని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్లా కోరుకోదు. ఇలాంటి వ్యక్తులకు  పడే శిక్షలు వెలుగు చూస్తే  ఇలాంటివి రిపీట్ కావు.

 - మౌనిక, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

 

 ఏ రకంగానూ భర్తీ చేయలేం

 రాజీ కుదుర్చుకోవడం కరెక్ట్ కాదు. ఆడపిల్లకు ఇలాంటి సంఘటనల కారణంగా కలిగే నష్టాన్ని ఏ రకంగానూ భర్తీ చేయలేం. ముందు అతనికి శిక్ష పడాలి. అలాగే  ప్రభుత్వం బాధితురాలి  కెరీర్‌కు ఆసరానివ్వాలి

 - సరోజినీ వల్లారపు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

 

 మనకన్నా న్యాయంగా...

 మన కన్నబిడ్డ మనసు గురించి మనకన్నా సుప్రీంకోర్టే న్యాయంగా ఆలోచిస్తుందని తల్లిదండ్రులు ఇప్పటికైనా గ్రహించాలి. రేప్‌కు గురైన అమ్మాయిని సమాజం ఆమెను చూసే విధానంలో మార్పు రావాలి.

      -మాధవీలత, సామాజిక పరిణామాల విశ్లేషకురాలు

 

 ప్రక్షాళన కావాలి

 తీర్పు సరే.. అసలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, సభ్యసమాజం పూర్తిగా ప్రక్షాళన కావాలి.

 - శిలాలోలిత, లెక్చరర్, రచయిత్రి    

 

 పెళ్లేమిటి!?


 సుప్రీం తీర్పు ఆహ్వానించదగ్గదే. రేప్ చేసిన వాడితో పెళ్లేమిటి? వాడిని కఠినంగా శిక్షించకుండా!

 -సతీష్, కాప్రికాన్ సిస్టమ్స్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top