సోల్‌మేట్‌ సునీత

సోల్‌మేట్‌ సునీత


సునీతా కేజ్రీవాల్, ఐ.ఆర్‌.ఎస్‌. మాజీ అధికారి

జన్మస్థలం : ఢిల్లీ;

భర్త : అరవింద్‌ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి;

వివాహం : 1994;

పిల్లలు : హర్షిత (1996), పులకిత్‌ (2001);

చదువు : ఎమ్మెస్సీ జువాలజీ

ఉద్యోగం : ఇన్‌కం టాక్స్‌ కమిషనర్‌ (1995)

సర్వీసు : 20 ఏళ్లు;

విరమణ : 2016



ప్రకృతి ఎప్పుడూ తన ధర్మాన్ని విస్మరించదు. నమ్మకద్రోహం, అసత్య ఆరోపణలు అనే విత్తనాలను నాటితే తిరిగి అవే మొలకెత్తుతాయి. ఇది అనివార్యం. – సునీతా కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య (కపిల్‌ మిశ్రాను ఉద్దేశించి)



కపిల్‌ నువ్వు నన్ను దీదీ (అక్క) అని పిలుస్తావు. మా ఇంటికి వస్తూపోతూ ఉంటావు. అప్పుడైనా చెప్పాల్సింది కదా... ఆ రెండు కోట్ల రూపాయల సంగతి. ఒకే. మే 5న అంటున్నావు కదా నువ్వు మా ఇంటికి వచ్చింది. ఆ రోజు కూడా ఎప్పటిలా నిన్ను అడిగేవుంటాను.. ‘టీ తాగుతావా?’ అని. అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు రెండు కోట్ల రూపాయల సంగతి? – సునీతా కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య (కపిల్‌ మిశ్రాను ఉద్దేశించి)



సునీతా కేజ్రీవాల్‌ అంకితభావం గల సహధర్మచారిణి. తన ఇంట్లో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో అమె గ్రహించలేరు. నిజం ఏమిటో ఆమెకు తెలీదు. భర్త పతనావస్థ అమెను కలవరపెడుతోంది. ఆమె నన్ను ఎన్ని మాటలు అనినా సరే, నేను ఆమెను ఒక్క మాటా అనను. – కపిల్‌ మిశ్రా, మంత్రివర్గం నుంచి సస్పెండ్‌ అయిన ‘ఆప్‌’ ఎమ్మెల్యే



గత సోమవారం సునీతకు, కపిల్‌కు మధ్య నడిచిన ట్వీట్‌లు ఇవి. సునీత మితభాషి. కపిల్‌ అన్నట్లు.. ఆమె తన ఇంటిని తప్ప తక్కిన విషయాలేమీ పట్టించుకోరు. అయితే తన భర్త అవినీతిపరుడు అన్న ఆరోపణలపై ఆమె మితభాషిగా మిగిలిపోదలచుకోలేదు. మే 5న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌... కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లి మరీ రెండు కోట్ల రూపాయల నగదును ఇచ్చివచ్చారని కపిల్‌ ఆరోపించడంపై సునీత ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.


అయితే ఇది తన భర్తను వెనకేసుకు రావడం కాదు. ‘నా భర్త గురించి నాకు తెలుసు’ అని గట్టిగా చెప్పడం. నిజానికి తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కేజ్రీవాల్‌ తీసుకున్నంత తేలికగా ఆయన భార్య సునీత తీసుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఆమె ఒక స్త్రీ, ఒక భార్య, ఒక గృహిణి కావడం ఒక్కటి మాత్రమే కాదు! నిజాయితీపరురాలైన ఇండియన్‌ రెవిన్యూ ఆఫీసర్‌ అయి ఉండడం కూడా.



ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 20 ఏళ్లకు పైగా సేవలు అందించిన ఇండియన్‌ రెవిన్యూ సర్వీస్‌ అధికారి సునీతా కేజ్రీవాల్‌ గత ఏడాదే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి బయటికి వచ్చారు. నిత్యం రాజకీయ ఒత్తిడులలో ఉంటున్న తన భర్తకు నిరంతరం తోడుగా ఉండడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. భర్త కోసం ఉద్యోగం మానేసిన సునీత.. భర్త కోసమే ఉద్యోగం చేసిన రోజులు కూడా ఉన్నాయి. 2014కు ముందు అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని తన ఉద్యోగాన్ని మానేసినప్పుడు.. సునీత తన ఉద్యోగాన్ని కొనసాగించి కుటుంబాన్ని అర్థికంగా నెట్టుకొచ్చారు.



అయితే సునీత కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి మాత్రమే తన ఉద్యోగాన్ని త్యాగం చేశారని ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ అంటున్నారు. బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లవలసినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి బిహార్‌ ముఖ్యమంత్రి అయిన విధంగానే, త్వరలో సునీతా కేజ్రీవాల్‌ కూడా ఢిల్లీకి ముఖ్యమంత్రి అవుతారని మనోజ్‌ తివారీ అంచనా. వాస్తవానికి ఇది అంచనా కన్నా కూడా ప్రత్యర్థి పార్టీపై ఆయన సంధించిన విసురుగానే భావించాలి.  



అయితే సునీతా కేజ్రీవాల్‌ ఈ అంచనాలను, భావనలను పట్టించుకునేంత తీరికను ఏమీ అనుభవించడం లేదు. ‘భర్త పక్కన ఉండడం’ అనే ప్రత్యేక హోదా.. ఆమె భర్త ప్రస్తుతం నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి బాధ్యత కన్నా కూడా ఎంతో కీలకమైనది. అనుక్షణం ప్రజాక్షేత్రంలో ఉండే భర్తకు సహాయకారిగా ఉండడం ప్రజాసేవల కిందికి వస్తుంది తప్ప రాజకీయాల్లోకి వచ్చినట్లు అనుకోడానికి లేదు. ఎన్నికల ప్రచారాలలో కూడా ఇంతవరకు అరవింద్‌ పక్కన సునీత కనిపించడం ఆయనకు వ్యక్తిగత సంరక్షురాలిగా మాత్రమే.


2014 ఎన్నికల్లో వారణాసి పార్లమెంటు సీటుకు నరేంద్ర మోదీపై అరవింద్‌ పోటీ చేసినప్పుడు కూడా ప్రచారంలో భర్త వెంట ఉన్న భార్యగా మాత్రమే సునీత తన పాత్రను పరిమితం చేసుకున్నారు. ఆమె మొదటì సారిగా భర్త పక్కన కనిపించింది 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లు గెలిచి, కేజ్రీవాల్‌ ఘన విజయం సాధించినప్పుడే. అప్పుడు కూడా భర్త ప్రోద్బలంతో మాత్రమే ఆమె ఆ కొద్దిసేపు భర్త పక్కన కనిపించారు.



రాజకీయాలలో సునీత మొదటి నుంచీ ఒక నీడలా మాత్రమే కేజ్రీవాల్‌ వెంట ఉంటున్నారు. అయితే అది రాజకీయ నీడ కాదు. రాజకీయాలనుంచి భర్తను సేదతీర్చే నీడ. ఇరవై రెండేళ్ల క్రితం అరవింద్‌ని వివాహం చేసుకున్నప్పుడు ఒక సాధారణ యువతిలా అమె ఎలాగైతే ఉన్నారో... ఇప్పటికీ అలాగే ఉన్నారు. అలా ఉండడం గొప్ప అని కాదు.


ఐ.ఆర్‌.ఎస్‌. అధికారులుగా ఇద్దరూ వృత్తిపరమైన ఒత్తిళ్లు అనుభవించినప్పుడు, అరవింద్‌ స్థిరమైన ఉద్యోగం మాని అస్థిరమైన రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన భర్త తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా.. ఇంటిపై, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా, భర్తపై ఈగ వాలకుండా.. ఒక శక్తి స్వరూపిణి అయిన గృహిణిలా సునీత ఓర్పుగా, నేర్పుగా నెగ్గుకొస్తున్నారు. ‘థ్యాంక్యూ సునీతా...’ అంటూ అరవింద్‌ భార్యను ప్రశంసిం చడం... మెజారిటీ సీట్లు సాధించిన ఆనందంలో అన్నమాట కాదు. తన జీవితంలో మేజర్‌ పార్ట్‌ అంతా నువ్వేనని కృతజ్ఞతలు చెప్పడం. ఇంతకన్నా చెప్పడానికి ఏముంటుంది సోల్‌మేట్‌కు?



లవ్‌ స్టోరీ: సునీత ఢిల్లీ అమ్మాయి. అరవింద్‌ హర్యానా అబ్బాయి. సునీత ఎమ్మెస్సీ జువాలజీ. అరవింద్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌. ఇద్దరూ సివిల్స్‌ రాశారు. ఇద్దరూ ఐ.ఆర్‌.ఎస్‌.కు సెలక్ట్‌ అయ్యారు. ఇద్దరికీ ఒకేచోట.. నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ముస్సోరీ)లో... ట్రైనింగ్‌. ఆ ట్రైనింగ్‌లోనే అరవింద్‌ సునీతను చూశాడు.


సునీత అరవింద్‌ను చూసిందో లేదో అరవింద్‌కి తెలీదు. మనసులో ఏం ఉంటే అది మాట్లాడే క్యారెక్టర్‌ అరవింద్‌ది. సణుగుడు ఉండదు. నీళ్లు నమలడం ఉండదు. ‘ఏమండీ.. మిమ్మల్ని ప్రేమిస్తున్నా’ అని చెప్పదలచుకున్నాడు, వెళ్లి చెప్పేశాడు. సునీత కళ్లింత అయ్యాయి! అతడి ధైర్యం ఆమెకు నచ్చింది. అతడు కొద్దిగా సిగ్గుపడడం కూడా ఆమెకు నచ్చింది. అసలు.. ధైర్యం, సిగ్గు కాదు... అతడి కళ్లలోని నిజాయితీ ఆమెకు బాగా నచ్చింది.



లక్కీ ఏంటంటే... పెళ్లికి వాళ్లు పెద్దగా కష్టపడలేదు. తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనుకున్నారు. ఒప్పుకున్నారు. కులాలు ఒకటో కాదో అంటారేమో అనుకున్నారు. ఒకటే కాకపోయినా, ఒప్పుకునేవారేమో... కానీ, ఒకటే అయ్యాయి. ఇక చదువు, సంస్కారం, ఉద్యోగం... అన్నీ ఈక్వల్‌. 1994 ఆగస్టులో ఎంగేజ్‌మెంట్, నవంబర్‌లో పెళ్లి. ఈ గ్యాప్‌లో సినిమాలు, షికార్లు, కానుకలు ఎలాగూ ఉండేవే, ఉన్నాయి కూడా. ట్రైనింగ్‌ పూర్తయ్యాక ఇద్దరికీ ఢిల్లీలో ఉద్యోగాలు వచ్చేశాయి. పిల్లలూ లైఫ్‌లోకి వచ్చేశారు. ఇరవై ఏళ్ల తర్వాత అరవింద్‌ రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఇప్పుడిక తెలిసిందే.. సునీత ఢిల్లీ సియెం గారి భార్య.



లవ్‌లీ స్టోరీ: ఫిబ్రవరి 2015. ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. సిటీ అంతా మఫ్లర్‌లే.. కేజ్రీవాల్‌కి ఇమిటేషన్‌. కౌంటింగ్‌ రోజు.. ‘ఫైవ్‌సాల్‌.. కేజ్రీవాల్‌’ అని ఇంటర్నెట్‌లో స్క్రోల్స్‌. అంతా టీవీల ముందు కూర్చున్నారు. ఫలితాలు వెల్లడయ్యాయి. కేజ్రీవాల్‌ భారీ  మెజారిటీతో గెలిచారు. ఆ వార్త రాగానే కేజ్రీవాల్‌... పక్కనే ఉన్న భార్యను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులెవరో ఫొటో తీశారు. ఆ ఫొటోని కేజ్రీవాల్‌ స్వయంగా తనే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి... ‘థ్యాంక్యూ సునీతా ఫర్‌ ఆల్వేజ్‌ బీయింగ్‌ దేర్‌’ అని ట్వీట్‌ చేశారు. ఒక భారతీయ రాజకీయ నాయకుడు... గృహిణి అయిన తన భార్యకు బహిరంగంగా ధన్యవాదాలు తెలిపిన సందర్భం బహుశా అదే మొదటిది కావచ్చు.


ఆ తర్వాత ఇంటి బాల్కనీలోంచి భర్త పక్కనే నిలుచుని సునీత కూడా ప్రసంగించారు. ప్రసంగం అంటే పెద్దగా ఏం కాదు. ‘ఇతడు మన నాయకుడు. మన కోసం పని చేసే నాయకుడు’ అని మాట్లాడ్డం. వెంటనే అరవింద్‌ మైక్‌ అందుకున్నాడు. ‘మీ నాయకుడి వెనుక ఉన్నది ఈ నాయకురాలే’ అన్నాడు. హోరుగా చప్పట్లు. సునీతపై పూలజల్లు కురుస్తుంటే అరవింద్‌ పులకించిపోయాడు. భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి.. ‘‘ఈమె నా భార్య. నేనివాళ బలవంతంగా తనని ముందుకు తెచ్చాను. నేను ఆమెకు చెప్పాను... ‘ప్రభుత్వం నిన్ను ఏమీ చేయదు. నా పక్కన వచ్చి నిలుచో’ అని చెప్పాను. తను నా పక్కన లేకపోతే నేను ఏదీ సాధించగలిగి ఉండేవాడిని కాదు. ఒక్కణ్ణీ నేను ఏమీ చేయలేను. నేను చిన్న మనిషిని’’ అని ఉద్వేగంగా అన్నాడు.



సునీత ఆ రోజు అరవింద్‌ పక్కనైతే ఉన్నారు కానీ, రాజకీయాల్లో లేరు. ఐ.ఆర్‌.ఎస్‌. సీనియర్‌ ఉద్యోగి ఆమె. అందుకే అరవింద్‌ అన్నాడు... ‘ప్రభుత్వం నీపై చర్యేమీ తీసుకోదులే.. నా పక్కన ఉండు’ అని.నిజానికి సునీతకు అలాంటి భయాలేమీ లేవు. భర్త ఉద్యోగం మానేసి వచ్చిన రోజు కూడా ఆమె ఎప్పటిలానే డైనింగ్‌ టేబుల్‌పై భోజనం వడ్డించి ఆయన్ని పిలిచారు. ‘పిల్లలూ.. మీరూ వచ్చేయండి’ అని కూతుర్ని, కొడుకును పిలిచారు. ఉద్యోగాల కన్నా, రాజకీయాల కన్నా.. భర్త, కుటుంబం ముఖ్యం అన్న ట్లు ఉంటారు సునీత. ప్రతి అడుగులో, ఆలోచనలో ఆ కమిట్‌మెంట్‌ కనిపిస్తుంది ఆమెలో. అన్నట్లు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగిందో గుర్తుందా? ఫిబ్రవరి 14న. వాలెంటైన్స్‌డే రోజు. అరవింద్, సునీతల ప్రేమకు సరిగ్గా సరిపోయే సందర్భం అది!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top