రూట్‌ జ్యూస్‌లు

రూట్‌ జ్యూస్‌లు


సమ్మర్‌... కుమ్మేస్తోంది!! నిన్నామొన్నైతే... వడగాలులు సుడిగాలుల్లా పైకి లేచాయి. ఓరి దేవుడో! వేడి దేవుడో! దిక్కేది? దాక్కునే దారేది? దిక్కూ వద్దు, దారీ వద్దు. ఉన్నచోటే... ‘రూట్స్‌’లోకి వెళ్లిపోండి. రూట్స్‌ని పిండి జ్యూస్‌ని తియ్యండి. రూట్‌ జ్యూస్‌ ఒక్క గ్లాసు పడిందా... వేసవి మీకు దాసోహమే!



షడంగ పానీయం

కావల్సినవి: వట్టివేళ్లు, తుంగముస్తలు, చందనం, శొంఠి, కురువేరు (సుగంధిపాల), పర్పాటకము. ఈ మూలికలను సమభాగాలుగా తీసుకొని, ఎండబెట్టి, పొడి చేయాలి

పొడి చేసే విధానం: బాగా దంచి, ఆ పొడిని పలచని కాటన్‌ క్లాత్‌మీద వేసి జల్లించాలి ∙దీనిని చూర్ణం అంటారు.

తయారీ: ఒక భాగం చూర్ణానికి 4 భాగాలు మంచి నీళ్లు పోయాలి. వీటిని రెండు గంటలపాటు అలాగే ఉంచాలి. తర్వాత పొయ్యి మీద పెట్టి, సన్నని మంట మీద సగం భాగం అయ్యేంతవరకు మరిగించాలి. చల్లారిన తర్వాత రోజుకు 3 సార్లు చొప్పున కప్పు లేదా రెండు కప్పుల పానీయం చొప్పున భోజనానికి ముందుగానీ, తర్వాత గానీ సేవించవచ్చు ∙దీని వల్ల జ్వరం తగ్గుతుంది. అతిదాహం నివారణ అవుతుంది. జ్వరంగా ఉన్నప్పుడు దాహంగా అనిపించినప్పుడల్లా మంచినీళ్లకు బదులుగా ఈ పానీయాన్ని కొద్ది కొద్దిగా సేవించవచ్చు.



వట్టివేళ్ల పానీయం

కావల్సినవి: వట్టివేళ్లు – 50 గ్రాములు,నీళ్లు – 2 లీటర్లు

తయారీ: రాత్రిపూట కుండలో నీళ్లు పోసి, వట్టి వేళ్లు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఈ నీళ్లను వడకట్టుకొని సేవించాలి.



క్యారెట్‌ జ్యూస్‌

కావల్సినవి :   క్యారెట్లు – 6 పంచదార లేదా బెల్లం – 3 టేబుల్‌ స్పూన్లు చల్లటి నీళ్లు – 2 గ్లాసులు నిమ్మరసం – టేబుల్‌ స్పూన్‌



తయారీ : పీలర్‌తో క్యారెట్ల పై తొక్క తీసి, సన్నని ముక్కలుగా తరగాలి. మిక్సర్‌జార్‌లో వేసి బ్లెండ్‌ చేయాలి. దీంట్లో పంచదార, చల్లటినీళ్లు పోసి మళ్లీ మెత్తగా అయ్యేంతవరకు బ్లెండ్‌ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పిప్పి ఎక్కువ లేకుండా వడకట్టాలి. ఈ జ్యూస్‌ను గ్లాసులలో పోసి నిమ్మరసం కలపాలి. నిమ్మరసంకు బదులుగా ఆరెంజ్‌ జ్యూస్‌ కలుపుకోవచ్చు.



బీట్‌రూట్‌ జ్యూస్‌

కావల్సినవి : బీట్‌రూట్‌ – 1 అల్లం – చిన్న ముక్క పంచదార/ బెల్లం తరుగు – 2 టీ స్పూన్లు నీళ్లు – 2 కప్పులు నిమ్మరసం – 2 టీ స్పూన్లు పుదీనా ఆకులు – 4 (అలంకరణకు)



తయారీ: బీట్‌రూట్‌ పై తొక్క తీసి, ముక్కలుగా కట్‌ చేసి మిక్సర్‌జార్‌లో వేయాలి. దీంతో పాటు అల్లం ముక్కను తరిగి వేసి బ్లెండ్‌ చేయాలి. మిశ్రమం మెత్తగా అయ్యేంతవరకు రుబ్బి, పంచదార లేదా బెల్లం, నీళ్లు కలపాలి. గ్లాసులో పోసి పుదీనా ఆకులు అలంకరించి సర్వ్‌ చేయాలి. చల్లగా ఉండాలంటే ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవాలి.



అల్లం జ్యూస్‌

కావల్సినవి:  అల్లం రసం – చిన్న ముక్క నిమ్మకాయలు – 4 పంచదార  – 2 కప్పులు నీళ్లు – కప్పు

తయారీ: అల్లం పై తొక్క తీసి, మెత్తగా రుబ్బి, నీళ్లు కలపాలి. ఈ నీటిని వడకట్టాలి. నిమ్మకాయలను కట్‌ చేసి, గింజలు తీసేసి, రసం పిండాలి. పెద్ద గిన్నెలో పంచదార, అల్లం రసం కలిపి మరిగించాలి. మిశ్రమం బాగా చిక్కబడేంత వరకు ఉంచి మంట తీసేయాలి. దీంట్లో నిమ్మరసం కలిపి చల్లారనివ్వాలి. ఈ జ్యూస్‌ని శుభ్రపరిచిన బాటిల్‌లో పోసి ఉంచాలి. కావల్సినప్పుడు పావు గ్లాసు అల్లం జ్యూస్, మిగతా ముప్పావు గ్లాసు నీళ్లు కలిపి, ఐస్‌ క్యూబ్స్‌ వేసి అందించాలి.



సుగంధిపాల పానీయం

కావల్సినవి: సుగంధిపాల (వేరు ముక్కలు) – 250 గ్రాములు, నీళ్లు – 2 లీటర్లు, పంచదార లేదా బెల్లం – కేజీ, నిమ్ము ఉప్పు – చిటికెడు, నిమ్మరసం – తగినంత, ఐస్‌ క్యూబ్స్‌ – తగినన్ని

తయారీ: ∙సుగంధిపాల వేర్లను శుభ్రపరచాలి. వేరు మధ్యలో ఉండే తెల్లటి భాగాన్ని తీసేయాలి. ముదురు రంగులో ఉన్నటువంటి వేళ్లను మంచి ఎండలో ఆరబెట్టాలి. ఈ వేళ్లను 2 లీటర్ల నీళ్లలో వేసి రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు చూస్తే వేళ్ల రంగు నీళ్లకు వచ్చేస్తుంది. ఈ వేళ్లను నానబెట్టిన నీళ్లను పొయ్యి మీద పెట్టి సగం అయ్యేదాకా మరిగించాలి. అంటే రెండు లీటర్ల నీళ్లు లీటర్‌ అవుతాయి.



ఈ నీళ్లను రెండు సార్లు వడకట్టాలి. దీంట్లో కేజీ పంచదార లేదా బెల్లం తరుగు వేసి వేడి చేయాలి. మిశ్రమం కొద్దిగా చిక్కబడేంతవరకు అంటే కనీసం 15 నిమిషాలసేపు సన్నటి మంట మీద ఉంచాలి. అతిగా మరిగించకూడదు. తర్వాత మంట తీసేసి లిక్విడ్‌ మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వాలి. శుభ్రమైన బాటిల్‌లో పోసి చిటికెడు నిమ్మ ఉప్పు కలిపి మూత పెట్టాలి ∙ కావలసినప్పుడు పొడవాటి గ్లాస్‌లో 3 టేబుల్‌స్పూన్‌ల సుగంధిపాల సిరప్‌ వేసి, ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, చల్లటి నీళ్లు పోసి కలపాలి. దీంట్లో ఐస్‌క్యూబ్స్‌ వేసి సర్వ్‌ చేయాలి.

 

నోట్‌:
గ్లాసు పానీయంలో టీ స్పూన్‌ నానబెట్టిన సబ్జాగింజలు, పుదీనా ఆకు వేసి కూడా సేవించవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top