స్థితప్రజ్ఞానందం!

స్థితప్రజ్ఞానందం!


కథానీతి



ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకరైన శారదానందస్వామి, కోల్‌కతా నివాసి అయిన డాక్టర్‌ కంజిలాల్‌తో కలసి పడవలో మఠానికి వెళ్తున్నారు. గంగానది మధ్యలో ఉండగా పెనుతుఫాన్‌ గాలులు వీచి, పడవ తీవ్రంగా అటూ ఇటూ ఊగసాగింది. దాంతో డాక్టర్‌ కంజిలాల్‌ విపరీతంగా భయభ్రాంతుడయ్యాడు. అటువంటి క్లిష్టపరిస్థితులలో కూడా ప్రశాంతంగా హుక్కా తాగుతున్న శారదానందస్వామిపై ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంతో స్వామి తాగుతున్న హుక్కాను లాక్కున్నాడు. చటుక్కున దాన్ని నదిలోకి విసిరేసి, ‘‘అరె, మీరెంతటి వింతమనిషి! పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటే, మీరేమో ఆనందంగా పొగ తాగుతున్నారా?’’ అన్నాడు తీక్షణంగా.



అతడి మాటలకు చిన్నగా నవ్వుతూ, ‘‘పడవ మునిగిపోయే ముందరే నీటిలోకి దూకడం తెలివైన పనేనంటావా డాక్టర్‌?’’ అన్నారు శారదానంద స్వామి. ప్రాణభయంతో తల్లడిల్లుతున్న కంజిలాల్‌ మాట్లాడలేదు. గంగానదిలో తనకు మృత్యువు రాసిపెట్టి ఉందనుకున్నాడు. అతడికి దుఃఖం ముంచుకు రాసాగింది. ఇంతలో వారు ఊహించని విధంగా స్వల్పసమయంలోనే తుఫాను గాలుల వేగం తగ్గిపోయింది. పడవ క్షేమంగా బేలూరు పట్టణానికి చేరింది.



డాక్టర్‌ కంజిలాల్‌ పడవ దిగుతూనే, ‘‘స్వామీ! దుఃఖములందు కలతనొందని మనస్సు గలవాడు, సుఖములందు ఆసక్తిలేనివాడు, అనురాగం, భయం, క్రోధం తొలగినవాడు ‘స్థితప్రజ్ఞుడు’ అని పేరొందుతాడని కృష్ణపరమాత్మ ఎందుకు చెప్పాడో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. స్థితప్రజ్ఞులైన మీకు నా జోహార్లు!’’ అంటూ శారదానందస్వామికి శిరస్సు వంచి నమస్కరించాడు.

– చోడిశెట్టి శ్రీనివాసరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top