జజ్జనకరి జనారే...
బిల్లీ హాలిడే స్వరంతో ‘స్ట్రేంజ్ ఫ్రూట్’ పాట ఈరోజు రికార్డ్ అయింది. అది పాట కాదు...పెను తుఫాను! అమెరికన్ జాత్యాంహంకారంపై నిరసనగా ఎగిసిన నల్లటి జెండా!!ఎబెల్ మీరో పాల్ అనే టీచర్ రాసిన ‘స్ట్రేంజ్ ఫ్రూట్’ కవితను పాటగా మార్చి జనం పాట చేసింది బిల్లీ హాలిడే.
థామస్ షిప్ప్, అబ్రహం స్మీత్ అనే ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ల ఉరితీతకు సంబంధించిన ఫోటోను చూసి పాల్ చలించిపోయాడు. ‘‘ఆ ఫోటో నన్ను కొన్ని రోజుల పాటు వెంటాడింది. ఆ బాధలో నుంచే ఈ కవిత రాశాను’’ అని చెప్పాడు పాల్. థామస్ షిప్స్, అబ్రహంలను ఒక హత్యకేసులో అనుమానితులుగా అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఒక గుంపు ఈ ఇద్దరి మీద దాడి చేసి చెట్టుకు ఉరి వేసి చంపింది. కవిత నుంచి పుట్టిన ఈ పాట ఎన్నో కవితలు, నవలలు, సృజనాత్మక రచనల పుట్టుకకు కారణమైంది. ‘సాంగ్ ఆఫ్ ది సెంచరి’ జాబితాలో అగ్రభాగాన నిలిచింది.