కడుపులో మడుగు!

కడుపులో మడుగు!


మధ్యాహ్న సమయం. అప్పుడే భోజనం పూర్తయింది. భుక్తాయాసంతో వరండాలోని వాలుకుర్చీలో చారబడ్డాడు ఆ పెద్దాయన. తాపీగా తాంబూలాన్ని ఆస్వాదిస్తున్నాడు. మాగన్నుగా నిద్ర ముంచుకొస్తోంది. వాలుకుర్చీలోనే కాసేపు కునుకు తీసేవాడేమో! ఉన్నట్లుండి కడుపులో ఏదో భారంగా అనిపించసాగింది. భోజనం ఏమైనా ఎక్కువైందా అనే ఆలోచనలో పడ్డాడు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ కడుపులో భారం నెమ్మదిగా పెరగసాగింది. కడుపులో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. చెప్పలేని అలజడి. మరికాసేపటికి కడుపులో ఏదో నిండిపోతున్నట్లు ఇబ్బంది. కడుపులో మడుగు కదులుతున్న అనుభూతి.

 

ఇదేదో మామూలుగా తీసిపారేయాల్సిన సంగతి కాదని అర్థమైంది ఆయనకు. భోజనం ఎక్కువ కావడం వల్ల తలెత్తిన సమస్య కాదని మనసుకు తెలుస్తోంది. మరేమై ఉంటుంది..? ఆలోచించసాగాడు ఆయన.. ఆలోచనలను కట్టిపెట్టి నెమ్మదిగా ధ్యానంలోకి జారుకున్నాడు. ధ్యానావస్థలో ఆయనకు అసలు సంగతి అర్థమైంది. తనపై ఏదో ప్రయోగం జరిగింది. ఎవరో తన కడుపును నీటితో నింపేస్తున్నారు. తన కడుపులో భారం పెరుగుతున్న కొద్దీ ఎక్కడో ఉన్న మడుగులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ధ్యానావస్థలో ఆయనకు దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కూడా ఆషామాషీ మనిషి కాదు. నిష్టాగరిష్ఠుడైన శ్రీవైష్ణవుడు.

 

తనపై జరుగుతున్న ప్రయోగానికి తక్షణమే విరుగుడు కనిపెట్టాలి. లేకుంటే, ప్రాణానికే ముప్పు. ఇది కచ్చితంగా మారణ ప్రయోగమే! అర్థమైపోయింది ఆయనకు. అప్పటికే వాలుకుర్చీ నుంచి ఏమాత్రం కదలలేని స్థితికి చేరుకున్నాడు. మెల్లగా మంత్రజపం ప్రారంభించాడు. విరుగుడు ప్రక్రియ మొదలైంది. కొద్దిసేపటికి నెమ్మదిగా బలం కూడదీసుకుని ఇంట్లో ఉన్న పాలేరును కేకేశాడు. పెరట్లోని పశువులశాల పైకప్పులో ఉన్న వెదురుబొంగుల్లో ‘మధ్యనున్న బొంగును చీల్చేయ్’ అని చెప్పాడు. పశువులశాల అంతా బాగానే ఉంది కదా.. ఈయనేంటి బొంగును నరికేయమంటాడనుకొని బిత్తరపోయి చూశాడు పాలేరు.. ‘వెంటనే నరికేయ్‌రా..’ ఈసారి కాస్త గొంతుపెంచి గద్దించాడు ఆయన. బెదిరిపోయిన పాలేరు పరుగున పెరట్లోకి వెళ్లాడు. చేతికందిన గొడ్డలి పుచ్చుకుని పశువుల శాలలోకి దూసుకుపోయాడు. పైకప్పు మధ్యగా ఉన్న బొంగును ఒకే ఒక్క వేటుతో నరికి పారేశాడు.

 

అంతే! ఒక్కసారిగా మొదలైంది ప్రవాహం. నరికేసిన బొంగులోంచి ఉధృతమైన నీటి ధార. పెరట్లోంచి ఆ ధార వెనుకనే ఉన్న పొలంలోకి ప్రవహించింది. చూస్తుండగానే పొలంలో చిన్నసైజు మడుగు కట్టింది. వాలుకుర్చీలోని పెద్దాయన కడుపు తేలిక పడింది. ప్రాణం తెరిపిన పడింది.

 

మర్నాటి మధ్యాహ్నం కూడా ఆ పెద్దాయన యథాప్రకారం భోజనానంతరం తాంబూలం సేవిస్తూ వాలుకుర్చీలో మేనువాల్చాడు. ఒక ఆగంతకుడు పరుగు పరుగున వచ్చి ‘అయ్యా..! తప్పయిపోయింది నన్ను క్షమించండి’ అంటూ ఆయన కాళ్లు చుట్టేసుకున్నాడు. నెమ్మదిగా లేవదీశాడాయన. వచ్చిన ఆగంతకుడే పెద్దాయనపై ప్రయోగం చేసిన తాంత్రికుడు. ‘ఇంకెవరిపైనా ఇలాంటి అఘాయిత్యాలు తలపెట్టకు’ అని హెచ్చరించాడు పెద్దాయన. ‘సరే’నంటూ భయభక్తులతో తలపంకించాడతను. నెమ్మదిగా అక్కడి నుంచి నిష్ర్కమించాడు.

దాదాపు ఎనభయ్యేళ్ల కిందటి సంఘటన ఇది. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఒక పట్టణంలో జరిగింది. ఇప్పుడా ప్రాంతం ఒడిశాలో ఉంది.

- పన్యాల జగన్నాథ దాసు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top