వేగం, తేజం కొప్పరపు కవుల సొంతం

వేగం, తేజం కొప్పరపు కవుల సొంతం


ఎనిమిది సెకన్లలో ఒక పద్యాన్ని ఆశువుగా సృష్టించడం... అది కూడా ‘నీలాంబుజారామ కేళీమరాళమై’... వంటి ప్రబంధతుల్యమైన పద్యాలను అప్పటికప్పుడు గుప్పించడం కొప్పరపు కవుల గొప్పతనం. ప్రకాశం జిల్లా మార్టూరులో ఒకసారి అరగంట వ్యవధిలో మూడు వందల అరవై పద్యాలతో మనుచరిత్ర ప్రబంధాన్ని కొప్పరపు కవులు ఆశువుగా చెప్పారు. అది అల్లసాని వారు రచించిన మనుచరిత్ర కాదు. కొప్పరపు వారు అప్పటికప్పుడు అల్లిన కావ్యరాజం. గుంటూరులో పాటిబండ్ల వారింట్లో భోజనం చేసే సమయంలోనే మూడు శతకాలు ఆంజనేయస్వామిపై చెప్పారు. వీరవాసరంలో చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు అధ్యక్షత వహించిన ఒక సాహిత్య సభలో మూడు గంటల్లో నాలుగు వందలకు పైగా పద్యాలతో ‘శకుంతల కథ’ను అద్భుతమైన ప్రబంధవర్ణనలతో పూర్తి చేశారు. కొమరరాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి సమక్షాన నిర్వహించిన సభలో గంటలో నాలుగు వందల ఎనభై పద్యాలు చెప్పారు. గన్నవరంలో జార్జ్ ద ఫిఫ్త్ కారోనేషన్ హాల్ అనే పేరుతో నిర్మించిన టౌన్‌హాల్ వార్షికోత్సవం జరిగింది. ఆ సభలో షేక్‌స్పియర్ రచించిన సింబలిస్ నాటకాన్ని గంటన్నర కాలంలో నాలుగు వందల పద్యాలతో ఆశువుగా సృష్టించారు.



ఇటువంటి సంఘటనలు కొప్పరపు వారి ఆశుకవితా ప్రస్థానంలో ఎన్నోసార్లు జరిగాయి. సభాస్థలిలో ఎప్పుడు ఎవరు ఏ కథను ఇచ్చి దానిని కావ్యంగా మలచమన్నా ఉన్న తడవున వందల పద్యాలతో ఆశువుగా చెప్పడం ఆ కొప్పరపు కవులకే చెల్లింది. ఒక్కరోజు వ్యవధిలోనే రెండేసి శతావధానాలు చేయడం, గంటకొక ప్రబంధాన్ని ఆశువుగా సృష్టించడం ప్రపంచ సాహిత్యంలో అత్యాశ్చర్యకరమైన ప్రతిభ. గద్వాల్ నుండి మద్రాసు వరకు వీరి అవధాన, అశుకవిత్వ సభలు కొన్ని వందలు జరిగాయి. గజారోహణ. గండపెండేర సత్కారాలు, బిరుదభూషణ వరప్రసాదాలు కొల్లలుగా జరిగాయి. అయితే అనేక సందర్భాల్లో వీరు ఆశువుగా చెప్పిన వేలాది పద్యాలు రికార్డు కాకపోవడం, వీరు చిన్నవయసులోనే మరణించడం వల్ల గ్రంథస్థం కాకపోవడంతో ఆ సారస్వత సంపదని మనం సంపూర్ణంగా పొందలేకపోతున్నాం.  కొప్పరపు కవులు దైవసంకల్పమ్, సాధ్వీమాహాత్మ్యమ్, శ్రీకృష్ణ కరుణా ప్రభావం, దీక్షిత స్తోత్రమ్, నారాయణాస్త్రం, సుబ్బరాయ శతకం.. మొదలైన రచనలు చేశారు. నేడు కొన్ని అవధాన పద్యాలు, దైవ సంకల్పమ్, సుబ్బరాయ శతకం అందుబాటులో ఉన్నాయి. ఆ కాసిన్ని పద్యాలను కవితా తీర్థంలా భారతీప్రసాదంలా భావించాల్సి వస్తోంది.



కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని, విమలానంద భారతీస్వామి, వేదం వెంకటరాయశాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి, జయంతి రామయ్య పంతులు, కాశీ కృష్ణాచార్యులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తుమ్మల సీతారామ్మూర్తి చౌదరి... వీరంతా కొప్పరపు కవుల సభల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారి ప్రతిభను చూసి పరవశించి ప్రశంసించినవారే. ఇక తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవుల మధ్య జరిగిన వివాదాలు ఆనాడు పెను సంచలనాలు. నాటి పత్రికల్లో ఈ వార్తలు ప్రధాన శీర్షికలుగా అల్లరి చేశాయి. ఈ రెండు జంటల మధ్య సాగిన పోరులో మహాద్భుతమైన పద్యాల సృష్టి జరిగింది. వారి వివాదం సాహిత్యలోకానికి షడ్రశోపేతమైన సారస్వత విందులను అందించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఆ తగాదాలు సమసిపోయాయి. ఆ రెండు జంటలూ అభేద్య కవితా స్వరూపాలుగా ముందుకు సాగాయి.

 కొప్పరపు కవులుగా ప్రఖ్యాతులైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (1885 - 1932), కొప్పరపు వేంకట రమణ కవి (1887-1942) గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఉన్న కొప్పరం వాస్తవ్యులు. వీరిది కవి వంశం. ఆంధ్ర సాహితీ చరిత్రలోనే ఆశుకవిత్వంలో వీరిదే అగ్రస్థానం. తెలుగువారికే సొంతమైన అవధానప్రక్రియలో అసమాన కవివీరులుగా నిలిచిన కొప్పరపు కవులు తరతరాలకు స్ఫూర్తిప్రదాతలు. వీరి చరిత్ర రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు పాఠ్యాంశాలలో చేర్పించి, తెలుగు తేజాన్ని తరతరాలకు అందించే ప్రక్రియ ప్రభుత్వాలు చేపట్టాలని ఆకాంక్షిద్దాం.



 - మా శర్మ

 

(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కొప్పరపు కవుల కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా కొప్పరపు కవుల జయంతి మహోత్సవము జరుగుతున్న సందర్భంగా)

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top