వాలెంటైన్ వైరస్

వాలెంటైన్ వైరస్ - Sakshi


చలికాలం వెళుతూ వెళుతూ ఉండగానే మొదలయ్యే చెలికాలం ఇది. నులివెచ్చని గిలికాలం ఇది. ఎల్లలకు అతీతంగా విస్తరించే ప్రేమికుల కాలం ఇది. యవ్వనానికి వసంతం వచ్చి లవ్వనంగా విరబూసే కాలం ఇది. పాతికేళ్ల కిందటి వరకు ఇలాంటి కాలం కాని కాలం ఒకటి వచ్చిపడుతుందని మన దేశంలో కాలజ్ఞానులెవరూ ఊహించనైనా ఊహించలేదు. చివరకు బ్రిటిష్‌వాడు పరిపాలించిన కాలంలో సైతం ఇలాంటి కాలం ఒకటి ఉంటుందనే విషయమైనా మనవాళ్లకు తెలియదు. కానికాలమని ఆడిపోసుకులేం. అలాగే, అయిన కాలమని మురిసిపోనూలేం. ప్రపంచీకరణ దెబ్బకు భూగోళం స్పీడు పెరిగిందో ఏమో మరి! పడమటి గాలులు బలంగా వీచడం మొదలుపెట్టాయి. వాటి తాకిడికి కాలగతుల్లో నానా మార్పులు వచ్చిపడ్డాయి. అలాంటి మార్పుల్లో మరీ ప్రస్ఫుటంగా కనిపించే మార్పు ఇది. కాలం కాని కాలం వచ్చిపడే సరికి... ఈ పెద్దోళ్లున్నారే... ‘ఇదేం పోయేకాలం’ అని నొసలు చిట్లించి, నోళ్లు నొక్కుకోవడం షరామామూలే. కొత్త కొత్తగా అనిపించే కాలం అడుగుపెట్టే సరికి... ‘కొత్త కొత్తగా ఉన్నదే..’ అంటూ యువతరం హుషారు గీతాలను జోరుగా ఆలపించడమూ అంతే మామూలు.

 

జంటరితనమే రుతుధర్మం


ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఒక్కరోజుకు మాత్రమే పరిమితం కాదిది. ఈ రోజుకు కొన్నాళ్ల ముందు నుంచి, కొన్నాళ్ల తర్వాతి వరకు ప్రభావం ఉండనే ఉంటుంది. అందుకే దీనిని ప్రేమికుల కాలంగా ఎంచవచ్చు. ప్రకృతి సిద్ధంగా వచ్చే కాలాలకు రుతుధర్మాలు ఉన్నట్లే, ఈ కాలానికీ కొన్ని రుతుధర్మాలు ఉన్నాయి. వాటిలో కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం జంటరితనం. ఔను! జంటరితనమే ఈ కాలం రుతుధర్మం. ఈ కాలంలో మూగప్రేమలకు మాటలొస్తాయి. సెల్లుప్రేమలకు బిల్లులొస్తాయి. పార్కు ప్రేమలకు ‘నో పార్కింగ్’ నోటీసులొస్తాయి. ‘చాట్’మాటు ప్రేమలకు మీటింగులొస్తాయి... ఆపై డేటింగులొస్తాయి. కుర్రకారు జోరుకు మాజీ యువకులు బేజారెత్తిపోయే కాలం ఇది. అనుభవ‘జ్ఞాన వృద్ధుల’కు ఫ్లాష్‌బ్యాక్ రీళ్లు కళ్లకు కట్టి, పెదవులపై ముసిముసి నవ్వులు విరిసే కాలం ఇది. ఖానా ఖజానా, గానా బజానా, నయా నజరానా వ్యాపారాలకు కాసుల వర్షం కురిసే కాలం ఇది.

 

కాలానికి తగ్గ అకాల ఉపద్రవాలు

ఎండాకాలంలో ఒక్కోసారి భగభగల జోరు పెరిగి వడదెబ్బల తాకిడి పెరుగుతుంది. ఇంకొక్కోసారి ఉన్నట్టుండి వడగళ్ల వానలు పడతాయి. వర్షాకాలంలో ఒక్కోసారి తుపానులు, వరదలు ఊరూవాడా ముంచెత్తుతాయి. ఇంకొక్కోసారి మబ్బులు ఉరిమినా, చినుకులు నేలరాలడానికి మొహమాటపడతాయి. చలికాలంలో ఒక్కోసారి వెన్నులోంచి వణుకు తన్నుకొచ్చేలా మంచు కురుస్తుంది. ఇంకొక్కోసారి పొద్దున్నే పొగమంచు లీలగా కనిపించినా, మధ్యాహ్నానికి చిరుచెమటలు పడుతూ ఉంటాయి. ఏ కాలానికి తగ్గ అకాల ఉపద్రవాలు ఆ కాలానికి ఉండనే ఉంటాయి. ప్రేమికుల కాలానికి కూడా ఇలాంటివి ఉంటాయి. చెట్టపట్టాలేసుకు సాగిపోయే జంటరులపై జీవితంలో రసికత ఎరుగని ఒంటరుల దాడులు పెరుగుతాయి. అప్రాచ్య పవనాలను ఖండించడానికి ఛాందస ఖడ్గాలు పైకిలేస్తాయి. ప్రేమపక్షుల కిలకిలారావాలను సహించలేని స్వయంప్రకటిత సాంస్కృతిక పరిరక్షకదళాలు ‘శివా’లెత్తిపోతాయి.

 

ప్రేమ రాలు కాలం

వసంతానికి ముందు ఆకు రాలు కాలం వచ్చినట్లే... ప్రేమికుల కాలానికి ముందు ప్రేమరాలు కాలం కూడా వస్తుంది. లవ్వనంలో చాలా ప్రేమలు ఈ కాలానికి కొద్దిరోజుల ముందే పుటుక్కున రాలిపోతూ ఉంటాయి. జంటరులు తిరిగి ఒంటరులవుతారు. ఈ కాలంలోనే ఒంటరులుగా మారిన సెలిబ్రిటీ జంటరుల సంగతులు తరచుగా వార్తలకెక్కుతూ ఉంటాయి. తాజాగా ఈ ఏడాది విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తిరిగి ఒంటరులయ్యారు. ఎవరు ఎవరిని విడిచిపెట్టేశారనేది పక్కనపెడితే, ఇద్దరి నడుమ అల్లుకున్న అనుబంధపు లత నుంచి ప్రేమ రాలిపోయిందనేది వాస్తవం. అయితే, ప్రేమ రాలిపోయినంత మాత్రాన జీవితాలు మోడుబారిపోవు. జీవితంలో ప్రేమ మళ్లీ మళ్లీ చిగురిస్తూనే ఉంటుంది. లవ్వనం మళ్లీ మళ్లీ విరబూస్తూనే ఉంటుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top