బహుజన్ బెహెన్‌జీ

బహుజన్  బెహెన్‌జీ - Sakshi


బి.జె.పి. నేత దయాశంకర్ సింగ్... మాయావతిపై చేసిన అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దళిత బహుజనులకు ఆగ్రహం తెప్పించాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. గుజరాత్‌లో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి  పార్లమెంటు బయట, లోపల తను సంధిస్తున్న ప్రశ్నల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చి, లబ్ధిపొందేందుకే బి.జె.పి. అగ్రనాయకత్వం తనపై ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు, ఆరోపణలు చేయిస్తోందని మాయావతి నిన్న లక్నోలో విమర్శించారు. యు.పి.లో బహుజనులకు అధికారం దక్కనీయకుండా బి.జె.పి. ఎస్.పి. కలసి పన్నుతున్న కుట్రలను భగ్నం చేసేందుకు త్వరలో ఆమె మెగా ర్యాలీలను నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా మాయావతి బయోగ్రఫీ... బ్రీఫ్‌గా.

 

 పంట భూములు ‘పెద్ద’వాళ్లవి. పండించే చేతులు ‘చిన్న’వాళ్లవి. అంతవరకే! పెద్దవాళ్ల బావి దగ్గరికి చిన్నవాళ్లు బిందె పట్టుకుని వెళ్లకూడదు. పెద్దవాళ్ల బడిలోకి చిన్నవాళ్లు పలకాబలపం తీసుకెళ్లకూడదు. పెద్దవాళ్ల  శ్మశానంలోకి చిన్నవాళ్లు పాడెనెత్తుకుని పోకూడదు. అలాంటి ఊళ్లో, ‘చిన్న’వాళ్లింట్లో జన్మించారు మాయావతి. ఊళ్లో ఉంటే పెనం. ఊరు దాటితే పొయ్యి. అదీ దళితుల పరిస్థితి. మాయావతికి ఎనిమిదేళ్లప్పుడు పెనం పై నుంచి పొయ్యిలో పడింది ఆమె కుటుంబం. ఢిల్లీకి చివర్లో ఝుగ్గీజుప్రీ కాలనీలోకి ఆ కుటుంబం మారింది. అదొక పునరావాస నివాసం. అక్కడ కరెంట్ లేదు. శుభ్రత లేదు. మురికిలో, చీకట్లో మాయావతి పెరిగారు. ఇంట్లో నాలుగు బర్రెలు ఉండేవి. వాటిని పెంచడం మాయవతి పని. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఆ ఇంట్లో రెండో సంతానం ఆమె.

 

బడి... బర్రెలు... బండెడు చాకిరీ


మాయావతితో పాటు కలిసి పెరిగిన గంగా వార్సీ (59) ఇవాళ్టికీ అక్కడే ఉన్నారు. మాయావతి బాల్యం గురించి, ఆమె తల్లిదండ్రుల కంటే కూడా అతడే బాగా చెప్పగలడు. ‘‘తననెప్పుడూ ఆడుకుంటుండగా చూడలేదు. బడి, బర్రెలు, బండెడు ఇంటి చాకిరీ.. వీటితోనే ఆమెకు పొద్దంతా గడిచేది. ఇక ఆటలెక్కడా!’’ అని వార్సీ.. చెబుతుంటారు. ఆయన్ని మనం ఒక నికార్సయిన మాయావతి జీవిత చరిత్రకారునిగా గుర్తించవచ్చు. 2012 ఎన్నికలకు ముందు ‘గార్డియన్’ పత్రిక నుంచి వచ్చిన జేసన్ బర్క్ అనే ముఖ్య విలేఖరి మాయావతిపై ఒక సంపూర్ణమైన వార్తాకథనాన్ని రాయడం కోసం వార్సీని కూడా సంప్రదించారు. అప్పటికి మాయావతి ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి. మరో ఐదేళ్ల పాలన కోసం బరిలోకి దిగి ఉన్న బహుజన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షురాలు.

 

ఇంకా ఎన్నాళ్లు?!

మాయావతికి పదమూడేళ్లు వచ్చేటప్పటికి ఝుగ్గీజుప్రీ కాలనీలో దళితులు ఉడికిపోతున్నారు. ‘‘ఈ అంటరానితనం ఇంకా ఎన్నాళ్లు?’’ అని గొణుక్కుంటున్నారు. ఆసక్తిగా చూస్తోంది, ఆసక్తిగా వింటోంది మాయావతి. అప్పుడప్పుడూ తనూ ఉడికిపోతోంది. గ్రాడ్యుయేషన్ అయ్యేనాటికి ఆమెకో స్పష్టత వచ్చింది. ఓట్లకోసమే నాయకులు తప్ప, ఉద్దరించేందుకు నాయకులు కారని! ఓరోజు కాలనీలో ఓ కాంగ్రెస్ లీడర్ స్పీచ్ ఇస్తున్నాడు. అతడో సీనియర్ నేత. అగ్రవర్ణ నేత. అతణ్ని పట్టుకుని ‘‘ఇక చాల్లే కూర్చో’’ అంది మాయావతి! అంతా బిత్తరపోయారు. లోకల్ కాంగ్రెస్ లీడర్లకు చెమట్లు పట్టాయి. ఒక అమ్మాయిని ఆపలేకపోయారంటే పార్టీ హైకమాండ్‌కే అవమానం! ఆమె మీద దాడి చేయబోయారు. ఈలోపే ఎవరో ఆమెను తప్పించేశారు. క్షణాల్లో ఈ వార్త దళిత నేత కాన్షీరామ్‌కు చేరింది. వెంటనే ఆయన.. ‘‘మనకొక ఆయుధం దొరికింది’’ అని తన సహచరులతో అన్నట్లు చెబుతారు.

 

 

బహుజనుల బెహెన్‌జీ


ఢిల్లీ యూనివర్శిటీ నుంచి మాయావతి ఎల్.ఎల్.బి.లో పట్టభద్రురాలయ్యేనాటికి.. పార్టీ ఏర్పాటుకు కాన్షీరామ్ చేస్తున్న వ్యూహ రచనకు కూడా ఒక ఆకృతి వచ్చింది. మాయావతి ప్రవేశంతో ఆ ఆకృతికి పరిపూర్ణత వచ్చింది. 1984లో బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భవించింది. ఇరవై రెండేళ్ల తర్వాత.. కాన్షీరామ్ మరణం అనంతరం కూడా కోట్లాదిమంది దళిత ప్రజలు ఆమెకు కాన్షీరామ్‌తో సమానంగా తమ హృదయాలలో స్థానం ఇచ్చారు.

 

మిరకిల్ ఆఫ్ డెమోక్రసీ!

మాయావతి తొలిసారి 1989తో ఎం.పి. అయ్యారు. 1994లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1995లో యు.పి.కి తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి అయ్యారు! తిరిగి 1997లో, తర్వాత 2002 నుంచి 2003 వరకు, అనంతరం 2007 నుంచి 2012 వరకు పూర్తి ఐదేళ్లకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అగ్రవర్ణాల ప్రాబల్యం, నిరంతర రాజకీయ అనిశ్చితి ఉన్న ఒక పెద్ద రాష్ట్రానికి ఓ దళిత మహిళ ముఖ్యమంత్రి అవడం చిన్న విషయమేం కాదు. మాయావతి తొలినాళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ‘మిరకిల్ ఆఫ్ డెమోక్రసీ’గా ప్రధాని పి.వి. నరసింహారావు అభివర్ణించారు.

 

పూలు... రాళ్లు... ముళ్లు

మాయావతి హయాం బహుజనులకు స్వర్ణయుగం. ప్రత్యర్థులకు నిద్రయోగం లేని కాలం. బెహెన్‌జీ పుట్టినరోజు దళిత నిరుపేదలకు కుటుంబ వేడుక. మద్దతుదారులకు జాతీయ ఉత్సవం. పదవిలో ఉన్నన్నాళ్లూ ఆమె దళిత సంక్షేమంపై శ్రద్ధ పెట్టారు. మహిళాశక్తిని చాటి చెప్పారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఆమెను గుర్తించింది. ప్రతిష్టాత్మకమైన అమెరికన్ ‘న్యూస్‌వీక్’... మహిళా సాధకురాలిగా ఆమెను కీర్తించింది. అదే పత్రిక మాయావతిని ‘భారతదేశపు బరాక్ ఒబామా’ అని వ్యాఖ్యానించింది. భారత్‌కు ప్రధాని కాదగిన అర్హత ఉన్న నాయకురాలు అని ప్రశంసించింది. 15 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ‘టైమ్’ మేగజైన్ కూడా తన జాబితాలో మాయావతి పేరును చేర్చింది.

 

ఐదేళ్ల తర్వాత ఇప్పుడు...

గత ఎన్నికల్లో బి.ఎస్.పి. ఓటమిని చవిచూడడానికి ముందు ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పాలనలో (2007-2012) ఉత్తర ప్రదేశ్‌ను ఉత్తమప్రదేశ్‌గా మార్చేస్తానని చెప్పి మరీ ఆ లక్ష్యంతో మాయావతి పని చేశారు. సామాజిక న్యాయం, ఉపాధి కల్పన, పోలీసు అధికారుల నియామకాలలో సంస్కరణలు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఆమె ముఖ్యప్రాధాన్యాలయ్యాయి.



ఈ క్రమంలోనే... అభివృద్ధి ఫలాలను బహుజనులతోపాటు సర్వజనులకు బుట్టల్లో పెట్టి అందించే ప్రయత్నంలో మాయావతి అగ్రవర్ణాల వారికి దోచి పెట్టేస్తున్నారనే విమర్శ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో దళిత ఓట్లను చీల్చి, ఆమె పార్టీని ఓడించింది. యు.పి. మళ్లీ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం అవుతోంది. అధికార సమాజ్‌వాదీ పార్టీ వైఫల్యాలు ఈసారి బి.ఎస్.పి.ని గెలిపిస్తే కనుక... దళితులు తమ బెహెన్‌జీని అర్థం చేసుకోడానికి ఈ ఐదేళ్ల కాలం సరిపోయి ఉంటుందనే అనుకోవాలి.

 

 

మాయావతి (60) యు.పి. మాజీ సి.ఎం.

పూర్తిపేరు    :    మాయావతి నయన కుమారి ప్రభుదాస్

జన్మదినం    :     15 జనవరి 1956

జన్మస్థలం    :    న్యూఢిల్లీ

తల్లిదండ్రులు    :    {పభుదాస్ (తపాలా ఉద్యోగి) రామ్ రతి (పాలు అమ్మేవారు)

చదువు    :    బి.ఎ., ఎల్.ఎల్.బి., బి.ఇడి.

పార్టీ    :     బహుజన్ సమాజ్ పార్టీ (బి.ఎస్.పి)

ప్రస్తుత పదవి    :    రాజ్యసభ సభ్యురాలు

పూర్వ ప్రతిష్ట    :    యు.పి. ముఖ్యమంత్రి (నాలుగుసార్లు)

వైవాహిక స్థితి    :     అవివాహితురాలు

ప్రస్తుత నివాసం     :   ఢిల్లీ, లక్నో (రెండు నివాసాలు)

 

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top