యమ్మీ యన్వీ

యమ్మీ యన్వీ - Sakshi


పాట్ బిర్యానీ... తెలిసిందే.  కంజు రోస్ట్.... చూసిందే.

కొర్రమీను కర్రీ... తిన్నదే. చిట్టి ముత్యాల బిర్యానీ... విన్నదే.

ఎండు మాంసం కూర... ఇదేదో డిఫరెంట్‌గా ఉందే!

ఇదొక్కటే కాదండీ...

మీకు తెలిసిన, మీరు చూసిన, మీరు తిన్న, మీరు విన్న... మిగతా నాలుగు ఐటమ్స్‌ని కూడా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు.

ఆ ఫార్ములా పట్టుకొచ్చాం. ఫాలో అయిపోండి.


 

పాట్ బిర్యాని

 

కావలసినవి: బాస్మతి బియ్యం - కేజీ; చికెన్ - కేజీ; నూనె - 100 గ్రా; నెయ్యి - 50 గ్రా; వేయించిన ఉల్లిపాయలు - 60 గ్రా; అల్లం పేస్ట్ -  టీస్పూన్; వెల్లుల్లి పేస్ ్ట- టీస్పూన్; కారం - టేబుల్ స్పూన్; గరంమసాల - టీ స్పూన్; ధనియాలపొడి - టీ స్పూన్; లవంగ, దాల్చిన చెక్క, యాలకులు -  3 గ్రా; సాజీరా - 10గ్రా; పుదీనా, కొత్తిమీర - ఒక కట్ట; నిమ్మకాయ - 1; పెరుగు - కప్పు; నీళ్లు - 200 గ్రా; పసుపు - పావు టీ స్పూన్; ఉప్పు - సరిపడా; బిర్యానీ ఆకు.



 తయారీ:  చికెన్ శుభ్రం చేసి దాంట్లో కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్, దాల్చినచెక్క పొడి, లవంగ- యాలకుల పొడి, సాజీరా, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ధనియాలపొడి, ఉప్పు, పసుపు కలిపి, నిమ్మరసం చికెన్‌కు పట్టించి  20 నిముషాలు ఉంచాలి. తర్వాత నూనె, పెరుగు వేసి మళ్లీ 20 నిముషాలు వుంచాలి. పొయ్యి మీద కుండ పెట్టి, సగానికి ఉడికిన అన్నాన్ని ఒక పొరగా వేయాలి. దానిపైన చికెన్ ముక్కలు, ఆ పైన మళ్లీ అన్నం రెండవ లేయర్ వెయ్యాలి. మూడవ పొర కూడా వేశాక పైన నెయ్యి, మిగిలిన కొత్తిమీరా, వేయించిన ఉల్లిపాయ ముక్కులు వేయాలి. పిండితో కుండ మూతను బిగించాలి. 15 నిముషాలు ఉంచి, దించాలి.

 

కంజు రోస్ట్

 

 వలసినవి:  కంజు పిట్టలు - 2; కారం - అర స్పూన్; ధనియాలపొడి - అర టీ స్పూన్; అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్; ఉప్పు - సరిపడా; మైదా - అర టీ స్పూన్; తెల్ల మిరియాలపొడి - పావు టీ స్పూన్; గరం మసాల - కొంచెం; పసుపు - చిటికెడు;  పచ్చిమిర్చి పేస్ట్ - పావు టీ స్పూన్; పచ్చిమిర్చి -  3;  కీమా -  50 గ్రా; కోడిగుడ్డు - 1; కరివేపాకు - కట్ట; కార్న్‌ఫ్లోర్ - అర టీ స్పూన్

 

తయారీ
:   కంజు పిట్టలను శుభ్రం చేసుకుని, కండ వున్న 3 చోట్లలో గాట్లు పెట్టాలి. వాటిపై కారం, ధనియాలపొడి చల్లాలి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు, పసుపు, ఉప్పు, కరివేపాకు, కీమా, కాస్త కొత్తిమీరా, గుడ్డులోని తెల్లసొన అన్నీ కలిపి, కంజు మాంసానికి పట్టించి 15 ని. ఉంచాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్, మైదా, ఫుడ్ కలర్ కలిపి 10 నిముషాలు వుంచి మరుగుతున్న నూనెలో వేసి వేయించాలి. పైన తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి గార్నిష్ చేసుకుని, మిరియాలపొడి, ఉప్పు చేరిస్తే కంజు రోస్ట్ రెడీ.

 

ఎండు మాంసం కూర

 

ఎండు మాంసం (ఒరుగు చేసినది) తో చేసే ఈ రకం కూర సిటీలో మరెక్కడా దొరకదు. 30 కిలోల మాంసాన్ని ఎండపెడితే 6 కిలోలకు చేరుతుంది. ఇలా ఎండ పెట్టిన మాంసంతో చేసే కూరను మాంసాహారులు రుచి చూడాల్సిందే.

 కావలసినవి: ఎండు మాంసం - కేజీ; ఉల్లిపాయలు - 2; టమాటో - 1; పచ్చిమిర్చి -  6; ఎండు కొబ్బరి తురుము -   కప్పు; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్లు; గరంమసాల -  టీ  స్పూన్; ధనియాలపొడి - టీ స్పూన్; కొత్తిమీర, కరివేపాకు - కట్ట; నూనె - కప్పు; దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు - 3 గ్రా!

 

తయారీ:  ఎండు మాంసం, ఉప్పు, పసుపు, నీళ్లు కుకర్లో వేసి ఉడికించాలి. బాణలిలో కప్పు నూనె వేసి వేడిచేసి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు 2 ముక్కలు వేసి వేపాలి. తర్వాత, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి వేపాలి. ఉడికించిన ఎండుమాంసాన్ని 5 నిముషాలు మగ్గనివ్వాలి. అందులో నీళ్లు పోసి, కారం, కొబ్బరిపొడి వేసి ఉడికించాలి. మరో 5 నిముషాలు అయ్యాక గరంమసాల పొడి వేసి, పూర్తిగా అయింది అనుకున్నాక ధనియాల పొడి, కొత్తిమీర వేసి దించేయాలి. రాగి ముద్ద /జొన్నరొట్టె/ అలసంద వడలు ఈ కూరకు మంచి కాంబినేషన్.

 

చిట్టి ముత్యాల బిర్యానీ

 

 కావలసినవి: చిట్టి ముత్యాల బియ్యం -  కేజీ; ఉల్లిపాయలు - 2; చిట్టి ఉల్లిపాయలు - 2; టమాటోలు - 2; పచ్చిమిర్చి (నిలువుగా చీల్చినవి) - 10; అల్లం పేస్ట్ - టీ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; వెల్లుల్లి రెబ్బ లు - 6; కొత్తిమీర - కట్ట; కరివేపాకు - అరకట్ట; దాల్చిన చెక్క, లవంగ, యాలకులు - 3 గ్రా; ధని యాలపొడి - అర టీ స్పూన్; నెయ్యి - 100 గ్రా; నూనె - 50 గ్రా; ఉప్పు- సరిపడా

 

తయారీ :  వండటానికి 20 నిముషాల ముందు బియ్యం నానబెట్టాలి. పాన్‌లో నూనె, నెయ్యి వేడి చేసి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరి వేకు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తర్వాత అల్లంవెల్లులి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేపాలి. తర్వాత బియ్యం మోతాదుకు రెట్టింపు నీటిని చేర్చి మరగనివ్వాలి. దానిలో బియ్యం, ధనియాల పొడి వేసి 15ని. ఉడికించాలి. తర్వాత విడిగా పొయ్యిమీద పెనం ఉంచి దానిపై బిర్యానీ పాత్రను పెట్టి దమ్ చెయ్యాలి. 4 ని. తర్వాత కలిపి దించేయాలి.

 

కొర్రమీను వెల్లుల్లి రోస్ట్

 

కావలసినవి: కొర్రమీను - కేజీ; అల్లం - టీ స్పూన్; వెల్లుల్లి - టీ స్పూన్; పసుపు - టీ స్పూన్; నెయ్యి -  50 గ్రా; కరివేపాకు - ఒక కట్ట; ఎండుమిర్చి -  50 గ్రా; ఉప్పు -  సరిపడా  మసాలాకు:  వెల్లుల్లిపాయలు 150 గ్రా, కొబ్బరి పొడి, 100 గ్రా,  కారం 100 గ్రా,  ధనియాలపొడి - టీ స్పూన్ (వీటన్నిటినీ పొడి చేసి పక్కనుంచాలి).

 

తయారీ :  ఉప్పు లేకుండా, పొలుసులు పోయేలా తోమి కొర్రమీను చేపలు శుభ్రం చేసి, 15కి పైగా ముక్కలు చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి, పసుపు పట్టించి 15 నిముషాలు వుంచాలి. వాటిని ఒక గుడ్డలోకి తీసుకుని నీళ్లు లేకుండా ఒత్తెయ్యాలి. రెండవసారి మళ్లీ ఒక ఎండుగుడ్డలో చేపలను వేసి, గట్టిగా అదిమి, మరుగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేపి పక్కకు పెట్టాలి. మరో పాన్‌లో నెయ్యి వేడిచేసి మసాలా పొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి  వేయించి, సిద్ధం చేసుకున్న చేపల మీద వెయ్యాలి. 10 నిముషాలు అలాగే ఉంచి సర్వ్ చేసుకోవాలి.

 

 కర్టెసీ: కృతుంగ రెస్టారెంట్స్  (హైదరాబాద్, బెంగళూరు)

 kritunga@gmail.com

 ph: 9000633918

 టి. నరేందర్‌రెడ్డి, మాస్టర్ చెఫ్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top