రోహిత్ చట్టం రావాలి - తల్లి రాధిక

రోహిత్ చట్టం రావాలి  - తల్లి రాధిక - Sakshi


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అనంతర పరిణామాలు ఉద్వేగభరితం అవుతున్నాయి. విద్యార్థి నాయకులు రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలన్నిటికీ బస్సు యాత్రలు చేపడుతున్నారు. 23న ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు ‘నా బిడ్డ చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు విశ్రమించేది లేదు’ అని రోహిత్ తల్లి రాధిక అంటున్నారు.

 

రోహిత్ వేముల. ఇప్పుడతనొక చైతన్య కెరటం. సామాజిక ఉద్యమ కాంతి విస్ఫోటనం. వేనవేల సంవత్సరాల వెలివేతల వెతలకి మరణవాంగ్మూలం. రోహిత్‌కి కోటి ఆశలున్నాయి. ఆ ఆశల నక్షత్ర  స్ఫూర్తి ఎవరో తెలుసా? గోరుముద్దలతో కొడుకు గుండెల్లో తెగువ నింపిన అమ్మ.. రాధిక. అమ్మే.. అతనికి రోల్‌మోడల్.



అంటరాని దానివని సమాజం వెలివేసేవరకు..  ముగ్గురు బిడ్డల తల్లిని చేసి కట్టుకున్నవాడు కాలదన్ని వెళ్లే వరకు... అడుగడుగునా ఆంక్షల సంకెళ్లతో సమాజం తన మనసును కుళ్ల పొడిచే వరకు.. రెప్పలమాటున కన్నీటిని దిగమింగుకొని నిశ్శబ్దంగా భరించిన రోహిత్ వేముల తల్లి రాధిక ఏనాడూ పన్నెత్తి మాట్లాడలేదు! తనను వెలివేసిన ఈ సమాజాన్ని నిలదీయనూ లేదు.  పట్టెడన్నం కోసం పదిమందినీ చేయి చాచకుండా పిల్లలకు నాలుగక్షరాలు నేర్పడమే సరియైన దారనుకుంది. రెక్కలకు మిషన్ కట్టుకొని పాతబట్టలను కుట్టుకుని, పాచిపనితో పాటు వెంటవచ్చే తిట్లను తుడిచేసుకొని బతకడం మొదలు పెట్టింది. తన బిడ్డల కోసమే బతకడం మొదలు పెట్టింది రాధిక. రోహిత్ తల్లి రాధిక ఈ సమాజంపై చేసిన నిశ్శబ్ద యుద్ధమే రోహిత్‌కి తిరుగుబాటు నేర్పింది. ఆ మాతృమూర్తితో సాక్షి సంభాషణ.



చుక్కలంటే రోహిత్‌కి చాలా ఇష్టమట కదా!

చిన్నప్పుడు రోహిత్ కి చీకటంటే భయం. అమ్మమ్మతో (రాధికను పెంచిన తల్లి) ఆ విషయం చెబితే చీకటంటే భయమెందుకు చీకటి వెనుక నక్షత్రాల వెలుతురుంది చూడమందట. అప్పట్నుంచి చీకట్లోకి వెళ్లాలంటే నక్షత్రాలను తలచుకునేవాడు. నిత్యం నా గాజులతో ఆటాడుకునే రోహిత్.. పగిలిన గాజులతో నక్షత్రాలను చేసి అందులో రంగుల హరివిల్లుని చూపేవాడు. ఇంట్లో బకెట్లను అడ్డం పెట్టి క్రికెట్ ఆడుతుంటే వచ్చే శబ్దానికి రోహిత్ ఇంట్లో ఉన్నట్టు చుట్టుపక్కల వాళ్లు గ్రహించేవాళ్లే తప్ప రోహిత్ అలికిడి ఎవ్వరికీ తెలిసేది కాదు.

     

ఒంటరి జీవితం, పేదరికం, అస్పృశ్యత ఎలా ఉండేది?

 మీ పిల్లల మనోభావాలు ఏమిటి?


నాకు నా కుటుంబ సభ్యుల తోడు ఉన్నా, ఒంటరిగానే జీవితాన్ని ఈదటం నేర్చుకున్నాను. పిల్లలకూ అదే నేర్పాను. అన్నింటికీ పరిష్కారం చదువొక్కటే అనుకున్నా. కానీ చదువును అంటి పెట్టుకొని వివక్ష నా బిడ్డని వెంటాడుతోందని తెలుసుకోలేకపోయాను. అదే వివక్ష నా బిడ్డని నాకు దూరం చేస్తుందని అస్సలూహించలేదు. అలా ఊహించి వుంటే నా బిడ్డని భద్రంగా దాచిపెట్టుకొందును.  చిన్నప్పుడు తమ్ముడు ఫిజిక్స్ ట్యూషన్‌కెళితే అగ్రవర్ణాలవాళ్లంతా మాష్టారు గది లోపలుంటే, గడపను ఆనుకొని తమ్ముణ్ణి, తమ్ముడి దళిత మిత్రులను, సాయిబుల పిల్లలను బయటే కూర్చోబెడుతున్నారని తెలిసి రోహిత్ ఊరడించాడు. ఎక్కడకూర్చున్నా మనకు చదువు అబ్బుతుంది. అందరికన్నా మరింత కష్టపడితే అందరికన్నా మనమే ముందుంటాం. మంచి స్థానంలో ఉంటాం. అన్నింటికీ పరిష్కారం అదేనని తమ్ముడికి చెప్పేవాడు.



మాది కటిక పేదరికం. నేను రోహిత్ చదువుకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అన్ని చోట్ల జనరల్ క్యాటగిరీలోనే సీట్లు సంపాదించాడు. ఎంఎస్సీ ఎంట్రన్స్‌లో ఆలిండియాలో ఆరో స్థానాన్ని సంపాదించి కన్నతల్లిని గర్వపడేలా చేశాడు. అప్పుడే నా కష్టం వృథా పోలేదని అర్థం అయ్యింది. చిన్నప్పట్నుంచి స్కూల్ కి కానీ, కాలేజీకి కానీ బాక్స్ తీసుకెళ్లే వాడు కాదు. నిజానికి ఇంట్లో ఏమీ ఉండేది కాదు. అందుకే మధ్యాహ్నం కూడా ఇంటికే వచ్చేవాడు. ఉంటే తినేవాడు. లేకుంటే పస్తులుండేవాడు. డిగ్రీలో సైతం పస్తులున్న విషయం నాకింకా గుర్తుంది. స్కూల్లో అయితే టీచర్లే వాళ్ల బాక్సుల్లోది పెట్టేవాళ్లు. అంతటి పేదరికం కూడా రోహిత్ ని కుంగదీయలేదు. అంబేడ్కర్ పుస్తకాలెక్కువగా చదివేవాడు. కన్నా మాష్టారి బడిలో చదువుకునేప్పుడు ఉపన్యాస పోటీల్లో కుల వివక్షలేని సమాజం అవసరమని మాట్లాడినట్లు మాష్టారు చెప్పారు.



రోహిత్ మిమ్మల్ని ఏదైనా కావాలని అడిగేవాడా?

ఇది కావాలని నన్నేనాడూ అడగలేదు. బట్టలు కూడా నేను తెచ్చి కొలతలిచ్చి రమ్మంటే టైలర్ దగ్గరికెళ్లేవాళ్లు రోహిత్, రాజు. చివరకు నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్న రోహిత్‌కి హైదరాబాద్‌లోనే ఒకమ్మాయిని తీసుకొచ్చి చూపించాను. దూరంగా చెట్టుకింద కూర్చున్న అమ్మాయి దగ్గరికి తన మిత్రుడితో కలిసి వెళ్లి నాకు వేరే ఆలోచనలున్నాయని, ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని సున్నితంగా చెప్పి వచ్చాడు రోహిత్.



రోహిత్‌ని టైస్టని, దేశ విద్రోహి అని అంటున్నారు..!

అందరూ సమానంగా ఉండాలనడం దేశ ద్రోహమా? అవమానిస్తే సహిస్తూ కూర్చోక పోవడం టైజమా? నేను పెద్దగా చదువుకోలేదు. కానీ నా బిడ్డలను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దాను. ఎవరికీ ద్రోహం చేసి ఎరుగరు. అన్నింటినీ సహిస్తూ ఉండేవాళ్లు. రోహిత్ ఎప్పుడూ లైబ్రరీల చుట్టూ తిరిగేవాడు. ఏవేవో పుస్తకాలు చదివేవాడు. అతని చదువే అతనికి తెగింపు నేర్పింది. అందుకే అన్యాయాన్ని ప్రశ్నించాడు. బహుశా అదే నా బిడ్డ చేసిన ద్రోహం కాబోలు. అందుకే నా బిడ్డను సాంఘిక బహిష్కరణ చేసి, యూనివర్శిటీ బయటకు, రోడ్డు మీదికి చేర్చారు.

     

మీ భర్త ఎప్పుడైనా బిడ్డల ఆలనా, పాలనా చూశారా?


నా భర్త ఏనాడూ నా బిడ్డల గురించి ఆలోచించలేదు. ఆలోచిస్తే నేనొక్కత్తినే ఎందుకు బిడ్డలను పెంచుకుంటాను. అసలు నా బిడ్డల మొహం కూడా అతనికి సరిగ్గా తెలియదు. మేమిద్దరం విడిపోయిన తర్వాత కూడా నా వెంటపడి వీధి రౌడీలా వేధించేవాడు. నా పేరు చెప్పి చుట్టుపక్కల అప్పులు చేసేవాడు. ఆ అప్పులన్నీ తీర్చుకోలేక నేనూ, నా బిడ్డలూ అష్టకష్టాలు పడేవాళ్లం. టెన్త్‌లో ఉండగా పరీక్ష ఫీజుకి డబ్బుల్లేక మట్టిపనికి వెళ్లిన రోహిత్‌ని అతని క్లాస్‌మేట్ చూడటంతో తట్టుకోలేక మట్టితట్ట అక్కడే పడేసి వచ్చి బోరున ఏడ్చాడు.

     

మీరు దళితులు కాదంటూ మీ గురించి జరుగుతున్న చర్చపై మీరేమనుకుంటున్నారు?

నాకూ, నా బిడ్డలకూ కూడు పెట్టని కులం ఇప్పుడు నా గురించి ఆరా తీస్తోంటే బాధగా వుంది. నా భర్త నా బిడ్డల మూతి కూడా తుడిచి ఎరగడు. అతనికి నా కులం గురించి చర్చించే అర్హత లేదు. ఒక దళిత బిడ్డగా అన్ని అవమానాలను భరిస్తూ, అన్ని అణచివేతలను సహిస్తూ నా బిడ్డలు పెరిగారు. అదీ దళిత వాడలోనే. ఆ దళిత వాడే మమ్మల్ని గుండెలకు హత్తుకుంది. అవే ఆచారాలు, అలవాట్లూ నా బిడ్డలకూ ఉన్నాయి. ఏనాడూ మా గురించి ఆలోచించకుండా, మా ఆలనా పాలనా చూడకుండా ఇప్పుడు నా బిడ్డలు తన కులమేనంటూ నా భర్త మాట్లాడటంలో అర్థం లేదు. నన్ను పెంచింది వడ్డెర కులస్థులే అయినా నా పుట్టుక మూలాలు దళితులవే.

     

రోహిత్ మరణం నేటికీ దేశాన్ని కుదిపేస్తోంది. మీరేం కోరుకుంటున్నారు.

మొన్ననే నా బిడ్డ అిస్థికలు నదిలో కలిపొచ్చాము. మనసు ముక్కలైంది. చెట్టంత బిడ్డను కోల్పోవడం ఎంత నరకమో అనుభవిస్తున్నాను. కానీ అతను ఊరికినే చనిపోలేదు. ఎందుకు చనిపోయాడో యూనివర్సిటీ వాళ్లు నాకు చెప్పాలి. రోహిత్ ఆత్మహత్యకు కారకులెవ్వరో ముందు తేలాలి. ఆమెవరో (స్మృతీ ఇరానీ, సుష్మాస్వరాజ్ అంటూ చిన్న కొడుకు రాజా అందించాడు) నా బిడ్డ దళితుడు కాదని మాట్లాడ్డం కాదు. నా బిడ్డ ఎందుకు చనిపోయాడో చెప్పాలి. నా బిడ్డనే కాదు ఎంతో మంది దళిత బిడ్డల్ని చంపేసి డబ్బులిచ్చి పంపేద్దామనుకుంటున్నారు. కానీ నాకు ఒక్కనయాపైసా కూడా అక్కర్లేదు. నాలాంటి తిరగబడే తల్లులుంటారని వీసీ అప్పారావుకి అర్థం కావాలి. నా బిడ్డ చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు నా బిడ్డ ఆత్మకు శాంతి లేదు. న్యాయం జరిగే వరకు నేను ఊరుకోను.

 - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి

 

రాజకీయ నాయకులు, ఇతర సంఘాలు మీ పక్షాన నిలబడ్డాయి కదా. వారికి మీరేం చెప్పదల్చుకున్నారు?

నా దగ్గరికొచ్చిన మొట్టమొదటి నాయకులు వైఎస్ జగన్. నా ఇంటికొచ్చి ధైర్యం చెప్పారు. ఆయనే అధికారంలో ఉంటే నేను దళిత స్త్రీనన్న నిజాన్ని ఒక్కముక్కలో తేల్చిపడేసేవారు. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా నాకు 5 లక్షలిచ్చినట్టు తెలుగుదేశం ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. నాకూ, నా చిన్న కొడుకు రాజా కి ఉద్యోగం కూడా ఇచ్చామంటున్నారు. కానీ ఎప్పుడిచ్చారో, ఎక్కడిచ్చారో వాళ్లే చెప్పాలి. వైఎస్‌ఆర్ మరణం తరువాత నా బిడ్డలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదేమోనని బెంగపడ్డాను. పెద్దాయన చనిపోయినప్పుడు నేను అన్నం కూడా ముట్టలేదు. నాకు మద్దతిచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నా వెంట ఉండండి. నా లాంటి దళిత బిడ్డలపై వేధింపులు ఆగాలంటే రోహిత్ చట్టం చేయాలి. అందుకు పార్లమెంటులో నా పక్షాన పోరాడండి. ఇదే నేను చెప్పగలిగింది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top