8 పాయింట్స్

8 పాయింట్స్


 సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

 

 

నిద్రలేని రాత్రి



ఓటమి ఎదురైన రోజు నిద్ర పట్టదు. నా కళ్లల్లో నిద్ర కంటే, నా కళ్ల ముందు నేను ఆడిన ఆటే ప్రత్యక్షమవుతుంది. ఆటలో ఓటమికి గల కారణాలను సూక్ష్మంగా విశ్లేషించుకుంటాను. వాటిని పాఠాలుగా గుర్తు పెట్టుకుంటాను. మరోసారి  ఆటలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాను.



 క్రమశిక్షణ



విజయానికి కష్టపడేతత్వంతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యం. ‘క్రమశిక్షణ కలిగిన క్రీడాకారిణి’గా ఉండడానికే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ప్రాక్టీస్ సెషన్‌కు ఎప్పుడూ పదిహేను నిమిషాలు ముందు ఉండే ప్రయత్నం చేస్తాను. రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ప్రాక్టీస్ చేస్తాను.



 ఐస్‌క్రీమ్



ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం సరే, మరి గెలిచినప్పుడు? నాకు నేను విందు ఇచ్చుకుంటాను. అంటే, ఆరోజు షాపింగ్ చేస్తాను. ఐస్‌క్రీమ్ తింటాను.



మంచి ఒత్తిడి



 నేను  ఒత్తిడికి గురైన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ప్రొఫెషనల్ స్పోర్ట్‌లో ఒత్తిడి ఉంటుంది. అయితే ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో పట్టుదలను పెంచి విజయానికి చేరువ  చేస్తుంది.



 నాన్న మాట



‘విజయం తలకెక్కింది’ అనే మాట వింటుంటాం. అయితే ఇది అందరికీ వర్తించదని నా అభిప్రాయం. ఎందుకంటే ‘బేసిక్ నేచర్’ అనేది ఒకటుంటుంది. అది ఎప్పుడూ మారదు. జయాపజయాలకు అతీతంగా అది స్థిరంగా ఉంటుంది.  మా నాన్న ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా నిగర్వంగా ఉంటారు. నన్ను కూడా అలాగే ఉండమంటారు. ఆయన మాటలనే కాదు, నా మేలుకోరి నాలుగు మంచి మాటలు చెప్పేవారి మాటలను తప్పనిసరిగా వింటాను. అంతే తప్ప... విజయాన్ని తలకెక్కించుకొని మారాలనుకోను.

 

రోల్ మోడల్



‘‘మీరే నా రోల్ మోడల్’’ అని ఆడపిల్లలు ఎవరైనా అన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది. అయితే ఈ ‘రోల్ మోడల్’ అనే గుర్తింపు రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దాని వెనుక ఎంతో కష్టం ఉంది. ‘రోల్‌మోడల్’ అని నా గురించి విన్నప్పుడల్లా మరింత బాధ్యత పెరుగుతుంది. మరింత కష్టపడాలనిపిస్తుంది. అందుకే నా మొదటి ప్రాధాన్యత ఓటు ఆటకే!



 డాక్టర్



డాక్టర్ కావాలనుకున్నాను. కానీ నా కలను నెరవేర్చుకోలేకపోయాను. ఆట మీద మరింత ఏకాగ్రత పెట్టి మరిన్ని మెడల్స్ గెలుచుకోవాలనేది నా తల్లిదండ్రుల కోరిక. అలా ‘వరల్డ్స్ నెంబర్ వన్ ప్లేయర్’ కావాలనే పట్టుదల పెరిగింది. నా తల్లిదండ్రులు నాకు బలమైన అండగా నిలబడ్డాడు.



విన్నింగ్ మంత్ర



 కష్టానికి మించిన ప్రత్యామ్నాయం, విజయసూత్రం ఏదీ లేదు. ఇది కేవలం ఆటలకు మాత్రమే వర్తించే సూత్రం కాదు, జీవితంలోని అన్ని కోణాలకు వర్తించే సూత్రం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top