ప్రboss

ప్రboss - Sakshi


ఒక ఛత్రపతి... బాసే కదా.

రారాజు... బాసే కదా.

ఆరడుగుల సమ్‌థింగ్ సమ్‌థింగ్... బాసే కదా.

కండలు తిరిగిన వీరుడు... బాసే కదా.

హృదయాలు దోచిన చోరుడు... బాసే కదా.

విలన్ వెన్నులో మిస్సైల్... బాసే కదా.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్... బాసే కదా.

ఫ్యాన్స్‌కి బాహుబలి... బాసే కదా.


 

ప్రభాస్... ఇవాళ చిన్నపిల్లల్లోనూ, కన్నెపిల్లల్లోనూ క్రేజీ స్టార్. లాస్ట్ రిలీజ్ ‘మిర్చి’ వచ్చి 29 నెలలు నిండుతోంది. అయినా, ఆయన పట్ల జనంలో క్రేజ్ తగ్గలేదు. ఇమేజ్ చెదరలేదు. ‘బాహుబలి’తో ఈ శుక్రవారం మళ్ళీ తెరపై పలకరించనున్న ఈ సిల్వర్ స్క్రీన్ ‘డార్లింగ్’ ఇన్ని నెలల గ్యాప్ తర్వాత తెలుగు మీడియా ముందుకొచ్చి,  ‘బాహుబలి’ కబుర్లు పంచుకున్నారు. ముఖ్యాంశాలు...

 

 తొలి సినిమాకు కూడా ఇంత టెన్షన్ పడలేదు!

 నిజం చెప్పాలంటే, నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజప్పటి కన్నా ఇప్పుడే ఎక్కువ టెన్షన్ పడుతున్నా. తొలి సినిమా ‘ఈశ్వర్’ చేస్తున్నప్పుడు నాకు ఇన్ని విషయాలు తెలీవు. అప్పట్లో షూటింగ్‌లో మానిటరూ లేదు. ఎలా చేశానో చూసుకోవడానికి వీలుండేది కాదు. ఇప్పుడలా కాదు. తాజా అంచనాలు చూస్తుంటే, టెన్షన్‌గా ఉంది. కానీ, ‘బాహుబలి’తో మన సినిమా సత్తా ప్రపంచానికి తెలుస్తుంది.

 

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సినిమా!


 దాదాపు ఆరేళ్ళ క్రితమే ఒక పెద్ద సినిమా చేద్దామని నాతో రాజమౌళి అన్నారు. తరువాత రెండేళ్ళకు బ్రీఫ్‌గా కథ నేరేట్ చేశారు. అంటే, నాలుగేళ్ళుగా ‘బాహుబలి’ కథను తెరపై చూడడానికి నేను ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు! నా కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ సినిమా. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం జీవితంలో పదే పదే రాదు.

 

ఇది రిస్కేమీ కాదు!


రాజమౌళి దర్శకుడు కాబట్టి, కథ తెలుసుకోవడాని కన్నా ముందే ఈ సినిమా ఒప్పుకొన్నా. అత్యధిక బడ్జెట్‌తో తీసిన సినిమా అన్నదొక్కటే తప్ప, జానపద తరహా సినిమా కావడం ‘బాహుబలి’కి రిస్కేమీ కాదు. ఇలాంటి తరహా సినిమాలు తెలుగులోనే కాదు... తమిళంలో, హిందీలో కూడా వచ్చి, చాలా కాలమే అయింది. తెలుగులో ‘మగధీర’లో కొంత భాగం ఈ తరహా జానపదంలో వచ్చింది. జనాదరణ పొందింది. ఈ సినిమా కూడా విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.

 

ఈ సినిమాకు ఈ మాత్రం టైమివ్వాల్సిందే!

 ఈ సినిమా ఏడాదిన్నర, రెండేళ్ళ లోపలే పూర్తవుతుందనుకున్నాం. కానీ, ఇంత భారీ సినిమా తీయాలంటే, డెరైక్టర్‌కీ, టెక్నీషియన్స్‌కీ తగినంత టైమ్ ఇవ్వాలి. దీని కోసం సెట్స్, దుస్తుల దగ్గర నుంచి ప్రతీదీ మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. ముందుగా వర్క్‌షాప్‌లు చేశాం. వార్ సీన్స్‌కి రిహార్సల్స్ చేశాం. లేటైనందుకు ఫ్యాన్స్ ఇబ్బందిగా ఫీలైనప్పటికీ, రేపు సినిమా చూశాక అవన్నీ మర్చిపోయి, తెరపై దృశ్యాల్ని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు ఈ టైమ్ పడుతుందని అర్థం చేసుకుంటారు.

 

ముందు వేరే కథలనుకున్నాం!


 ‘బాహుబలి’ కన్నా ముందు శ్రీకృష్ణదేవరాయలు జీవితం, అల్లూరి సీతారామరాజు, పూర్తిస్థాయి రాజుల కథ - ఇలా అయిదారు కథాంశాలను రాజమౌళి సిద్ధం చేశారు. కానీ, చివరకు ‘బాహుబలి’ చేద్దామనుకున్నాం. తీరా బడ్జెట్ లెక్కలు వేసుకుంటే, అనుకున్నదాని కన్నా రెట్టింపు పైనే అయ్యేట్లు కనపడింది. అందుకే, ఈ కథ బదులు తక్కువ ఖర్చులో, 60 -70 కోట్లలో ఒక బాక్సింగ్ కథ తెరకెక్కించడానికి సిద్ధమని నిర్మాతలు శోభూ యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లకు రాజమౌళి చెప్పారు. కానీ, వాళ్ళు ఖర్చు ఎక్కువైనా సరే, చరిత్రలో నిలిచే ‘బాహుబలే’ తీస్తామని ముందుకొచ్చారు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు.

 

తండ్రి పాత్రకు పెరిగా! కొడుకు పాత్రకు తగ్గా!్గ!

 ఈ సినిమాలో తండ్రి అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం నా బరువును వంద కిలోల దాకా పెంచుకున్నా. ఇక, కొడుకు పాత్ర శివుడు కోసం 80 కిలోల చిల్లరకు తగ్గాల్సి వచ్చింది. షూటింగ్‌కి ముందే 8 నెలల నుంచి ఫిజికల్ ట్రైనింగ్ చేస్తూ వచ్చా. ఒకసారి సెట్ అయ్యాక, పాత్రకు తగ్గట్లు మారుతూ వచ్చా. తండ్రి పాత్ర కోసం కండలు పెంచాల్సి వచ్చింది. కొడుకు పాత్రకు తగ్గట్లు బరువు తగ్గడం కోసం కార్బోహైడ్రేట్లు లేని ఆహారం తినేవాణ్ణి.

 

సరిగ్గా రెండేళ్ళ క్రితం ఫస్ట్‌డే షూటింగ్

 2013 జూలై 6న ఫస్ట్‌డే షూటింగ్ ఇప్పటికీ గుర్తే! కర్నూలు దగ్గర ఈ షూటింగ్ ఏమిటనుకున్నా. తీరా అక్కడకెళ్ళాక ఆ కొండరాళ్ళు, ప్రకృతి చూసి, అదిరిపోయా. రాక్‌గార్డెన్స్‌లో కొండ మీద నుంచి పాతిక సార్లు కిందకు దూకి ఉంటా. చుట్టుపక్కల జనాలంతా మూగడంతో మూడో రోజు షూటింగ్ క్యాన్సిల్. మిగతాపార్ట్ తరువాత స్టూడియోలో చేశాం. ఆ సీన్ ఈ ఫస్ట్‌పార్ట్‌లో ఉంది.

 

రానాకే కాదు... నాకూ ఇంపార్టెన్స్ ఉంది!

 ‘బాహుబలి’ ఫస్ట్‌పార్ట్‌లో అనుష్క లేదనీ, నా కన్నా రానాకే ఇంపార్టెన్స్ ఉందనీ వినిపిస్తున్న మాటల్లో నిజం లేదు. ఇందులో అనుష్క ఉంది, కాకపోతే తమన్నా పార్ట్ ఎక్కువుంటుంది. ట్రైలర్స్‌లో, పోస్టర్స్‌లో రానాతో పాటు నాకూ ఇంపార్టెన్స్ ఉంది. ఒకవేళ విలన్ పాత్రకు కాస్తంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా, ఆ పవర్‌ఫుల్ పాత్ర హీరో ఎలివేట్ కావడానికే ఉపయోగపడుతుందిగా!

 

పర్సనల్ లైఫ్ త్యాగం చేశారు
!

 ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాం. ఒక్కోరోజు 24 గంటలూ షూటింగ్ చేసిన సందర్భాలున్నాయి. నేనొక్కణ్ణే కాదు, రాజమౌళి, ఆయన ఫ్యామిలీ మొత్తం, అలాగే టెక్నీషియన్స్ అందరూ తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి, ఇంత టైమ్ వెచ్చించారు. సినిమా చేశారు. సెట్స్ దగ్గర నుంచి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ దాకా మిగిలినదంతా రాజమౌళి చూసుకునేవారు. మేము బల్గేరియా షూటింగ్‌కు వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 4.30 గంటలకల్లా లేచి, ఎడిటింగ్ చేసి, మ్యూజిక్ సిటింగ్స్ చూసుకొని, మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేసి, మళ్ళీ వెళ్ళి ఎడిటింగ్‌లో కూర్చొని, రాత్రి ఒకటిన్నర దాకా రాజమౌళి పనిచేసేవారు. ఇలా కొన్ని వారాలు జరిగింది.  

 

ఆ మసాజ్‌తో కష్టమంతా పోయేది!


 ఈ సినిమాలో నా వరకు అత్యంత క్లిష్టమైనది - యాక్షన్ పార్టే. షూటింగ్ డేస్‌లో ఎక్కువ భాగం యాక్షన్ పార్టే చేశాం. మామూలు సన్నివేశాల్లో కూడా ఏదో ఒక చిన్న యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం కత్తి యుద్ధం, గుఱ్ఱపుస్వారీ, కిక్ బాక్సింగ్, రాక్ క్లైంబింగ్ - ఇలా అన్నీ నేర్చుకున్నాం. వియత్నామ్ నుంచి ముగ్గురు ఎక్స్‌పర్ట్స్‌ను రప్పించారు. వాళ్లకు అసలు ఇంగ్లీషు రాదు. వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ని బట్టే, వాళ్లేం చెబుతున్నారో అర్థం చేసుకునేవాణ్ణి. తెల్లవారు జామున 4 గంటల నుంచి రకరకాల ట్రైనింగ్ ఇచ్చేవారు. ఓపిక లేక కాస్తంత రెస్ట్ తీసుకుందామంటే, ‘నో’ అనేవారు. అయితే, ట్రైనింగవగానే వాళ్ళు చేసే మసాజ్ బ్రహ్మాండం. కండరాలెంత పట్టేసినా, ఒక్క సెకన్‌లో రిలీజ్ చేసేసి, రిలాక్స్ చేసేసేవారు. పడిన కష్టమంతా మర్చిపోయేవాళ్ళం.

 

రాజమౌళి హాలీవుడ్‌కి వెళ్ళిపోతాడంతే!

 కాలంతో పాటు రాజమౌళి చాలా ఎదిగాడు. పదేళ్ళ క్రితం ‘ఛత్రపతి’ టైమ్‌లో ఆయన ‘ఒకమ్మాయి వెనకాల అబ్బాయి ఎలా పడతాడు? నాకెందుకో అలాంటివి నచ్చవు. ‘వర్షం’ లాంటివి తీయలేను’ అనేవారు. అదే మనిషి ‘మగధీర’లో అలాంటి లవ్ ట్రాకే చూపించాడు. కట్ చేస్తే ‘ఈగ’లో అయిదు నిమిషాల్లో లవ్‌స్టోరీ చూపించేశాడు. లవ్‌స్టోరీలంటే నమ్మనివాడు లవ్ స్టోరీ మేకింగ్‌లో మాస్టరైపోయాడు. రాజమౌళి డెఫినెట్‌గా హాలీవుడ్‌కి వెళ్లిపోతాడు. కావాలంటే మనం ఆపుకోవాలంతే. నాకు ఆయనెంత క్లోజయ్యారంటే ఏదైనా పంచుకుంటా. నాకో గురువులా ఆయన వెరీ రెస్పెక్టబుల్ పర్సన్.

 

నాకు ఆమె మోస్ట్ కంఫర్టబుల్!

 ‘స్వీటీ’ అనుష్కతో సూపర్‌హిట్స్ ‘బిల్లా’, ‘మిర్చి’ తరువాత ఇది మూడో సినిమా. ‘బిల్లా’ టైమ్ నుంచి తను, తన ఫ్యామిలీ క్లోజయ్యారు. ప్రొడక్షన్ బాయ్‌తో కూడా కలుపుగోలుగా మాట్లాడే అనుష్క మోస్ట్ కంఫర్టబుల్ హీరోయిన్. ‘మిర్చి’లో తనను పెట్టమంది నేనే.

 

ఆమెలా హార్డ్‌వర్క్ మనం కూడా చేయలేం!

 తమన్నా చాలా హార్డ్ వర్కర్. ఒక్కోసారి తన హార్డ్‌వర్క్ చూస్తుంటే ఎదుటివాళ్లకి భయమేసేస్తుంది. వర్కవుట్స్ చేస్తున్నపుడూ అంతే, ఓపిక ఉన్నా లేకపోయినా వర్కవుట్స్ చేయాల్సిందే. సిస్టమ్ తప్పకూడదంతే. ‘బాహుబలి’లో ఓ షెడ్యూలుకైతే పదిహేను రోజుల్లో స్విట్జర్లాండ్, మలేసియా, మహాబలేశ్వరం - ఇలా తిరుగుతూనే ఉంది. అంత బిజీలోనూ హార్డ్‌వర్క్ చేస్తుంది. మనం కూడా అంత హార్డ్‌వర్క్ చేయలేం.

 

ఆ రూమర్స్ మరీ పెద్ద టార్చర్!


 నాకు కొంతకాలంగా ఎడమ భుజానికి సమస్య ఉంది. ‘బాహుబలి’ ట్రైనింగ్, యాక్షన్ పార్ట్ వల్ల ఆ సమస్య పెరిగింది. వైద్యపరిభాషలో ‘లేబ్రమ్ టియర్’ అంటారు. దాంతో, సర్జరీ చేయించుకున్నా. ఈ లోపలే బోలెడన్ని పుకార్లు. ఈ సర్జరీ కన్నా ముందు కేరళలో వాటర్‌ఫాల్స్ దగ్గర జారి, కిందపడి, కొద్దిగా గీసుకుపోయింది. ఈ లోపల తలకు దెబ్బ తగిలిందని పుకారు. పెదనాన్న కృష్ణంరాజు గారికి వందల ఫోన్లు. తగిలిన దెబ్బ చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళితే, నాకు క్యాన్సర్ అన్నారు. నేను కోమాలోకి వెళ్ళాననీ పుకారొచ్చింది. బేగంపేటలో కారుకు యాక్సిడెంటైందని మరో పుకారు. సినిమా శ్రమ కన్నా ఈ రూమర్‌‌స మరీ పెద్ద టార్చరయ్యాయి.

 

తమిళంలో సినిమాలు చేస్తా!


 తెలుగు, తమిళం ఏకకాలంలో తీశాం. తమిళ వెర్షన్ షూట్‌లో తమిళ్‌లోనే మాట్లాడేవాళ్లం. మద్రాసులో పెరిగా కాబట్టి, తమిళం నాకొచ్చు. కాకపోతే, కథలో ప్రామాణిక తమిళం కాబట్టి, సరిగ్గా చెప్పకపోతే ఆ ఫీల్ పోతుందని వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాం. తమిళంలో మరిన్ని స్ట్రెయిట్ సినిమాలు చేయనున్నా.

 

‘బాహుబలి’ ప్రభావం ఉంటుంది!

 తరువాత నేను చేసే సినిమాలపై ‘బాహుబలి’ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే, బలమైన స్క్రిప్ట్ ఎంచుకుంటే, ఆడియన్స్ అంచనాలను అందుకోవచ్చు. ‘బాహుబలి’ తరువాత ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో చేసే యు.వి. ప్రొడక్షన్స్ సినిమా, గోపీకృష్ణా మూవీస్ సినిమా - ఇలా చాలా ఉన్నాయి. వాటికెలాంటి కథలు ఎంచుకోవాలో నాకు ఆలోచన, ప్లాన్ ఉన్నాయి.

 

సెప్టెంబర్ నుంచి సెకండ్ పార్ట్


 అసలైతే ‘బాహుబలి’ అంతా ఒకే సినిమాగా తీయాలనుకున్నాం. ఫస్ట్ షెడ్యూల్ స్టార్టయిన కొద్ది రోజులకి మొత్తం కథను ఒకే సినిమాగా కుదిస్తే, ఎమోషన్స్ దెబ్బతింటాయి. దాంతో, రెండు పార్ట్‌లు చేయాలనుకున్నాం. ఫస్ట్‌పార్ట్ రిలీజయ్యాక, సెప్టెంబర్ 15 నుంచే ‘బాహుబలి’ సెకండ్ పార్ట్‌లో మిగతా షూట్ స్టార్‌‌ట. వచ్చే ఏడాది ఫస్టాఫ్ దాకా ‘బాహుబలి-2’తో బిజీ. అప్పటి ఖాళీని బట్టి, కుదిరితే అదే టైమ్‌లో మరో సినిమాలో కూడా నటిస్తా. లేదంటే, సెకండ్ పార్ట్ పూర్తయ్యాకే మరో సినిమా.

 

‘అవతార్’ చూసినట్లుందన్నారు!


 నేనింకా ‘బాహుబలి’ పూర్తిగా చూడలేదు. రెండు, మూడు రీళ్ళే చూశా. అద్భుతం. పని అంతా పూర్తయ్యాక, సినిమా మొత్తం ఒకేసారి చూద్దామని ఆగా. రాజమౌళి ఇంకా చెక్కుతూనే ఉన్నారు. (నవ్వుతూ...) ‘ఇంకొక్క వారం టైమ్ ఉంటే బాగుండేది’ అని నిన్ననే రానాతో రాజమౌళి అన్నారు. అది విని రమా రాజమౌళి ‘ఇంకో ఏడాదిచ్చినా, చివరి క్షణం దాకా ఆయన అలా చెక్కుతూవుంటారు’ అన్నారు. హిందీ దర్శక - నిర్మాత కరణ్ జోహారైతే, కొన్ని సీన్లు చూసి, హాలీవుడ్ ‘అవతార్’ చూసినట్లుందన్నారు. అందుకే, ఇప్పుడిది  తెలుగు సినిమా కాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ‘ఇండియన్ సినిమా’.

 - రెంటాల జయదేవ

 

 

వాళ్ల కోసం పెళ్లి చేసుకోలేనుగా...!

 

సినిమాల్లో మీరు బాగా స్టయిల్ మార్చారు. గోపీచంద్, శర్వానంద్‌లకూ సాయపడ్డారట?

 నాకు హకీవ్‌ుఅలీ హెయిర్‌స్టైల్, బాస్కీ డ్రెస్‌లు చూస్తారు. వాళ్ళకీ ఆ ఇద్దర్నీ సజెస్ట్ చేశా.

 

పిల్లలు మీ సినిమాలను బాగా ఇష్టపడుతున్నట్టున్నారు. కారణం ఏమంటారు?


 ప్రత్యేకంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకు నచ్చే అంశాలతో సినిమాలేం చేయలేదు. మరెందుకు నచ్చుతున్నానో! సాధారణంగా పిల్లలకు ‘రోబో’ లాంటి సినిమాలు, కొత్తదనం నచ్చుతాయి. ‘బాహుబలి’లోని వార్ సీన్లు వాళ్లకు నచ్చుతాయి.

 

అమ్మాయిలైతే మీరంటే పడి చచ్చిపోతుంటారు...!


ఆ విషయం నాకు తెలుసు. కారణం నాకు తెలియదు కానీ, నేను చేసిన ‘వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్’ మంచి లవ్‌స్టోరీస్ కదా. వాళ్లకు బాగా నచ్చివుండొచ్చు.

 

మరి ఇంతకీ మీకు... ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం?

ఒక్కోసారి ఒక్కో రకంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి రెండు, మూడేళ్ళకీ నా అభిరుచి మారుతుంటుంది. ప్రస్తుతమైతే బాగా మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టం.

 

మీ పెళ్ళెప్పుడు? దాని గురించి చాలా రూమర్‌‌స వినిపిస్తున్నాయే!


ఎప్పుడో తెలీదు. టైవ్‌ు రానివ్వండి. (నవ్వేస్తూ) రూమర్లున్నాయని పెళ్లి చేసుకోలేనుగా!

 

ఇంతకీ నిర్మాతలు ‘బాహుబలి’కి మీ రెమ్యూనరేషనిచ్చేశారా?


చాలామందిలా తిప్పించుకోలేదు. నా పారితోషికం నాకిచ్చేశారు. వీళ్ళు బంగారం.

 

మీరిప్పుడు నంబర్ వన్ స్థానంపై దృష్టి పెట్టారనుకోవచ్చా?

 (నవ్వుతూ) అది మనం ఎయివ్‌ు చేస్తేనో, ఒక సినిమాతోనో వచ్చేది కాదు.

 

‘యాక్షన్ జాక్సన్’లో గెస్ట్‌రోల్... ఇప్పుడు ‘బాహుబలి’. హిందీపై దృష్టి పెడతారా?

చిన్న చిన్న ఆఫర్‌‌స చాలా వచ్చినా చేయలేదు. ప్రభుదేవా కోసం ఆ గెస్ట్‌రోల్ చేశా. అదీ హిందీ ‘బాహుబలి’కి కలిసొస్తుందని రాజమౌళిని అడిగే చేశా.

 

‘బాహుబలి’ మీలో మార్పు తెచ్చినట్లుంది. మీడియా ఫ్రెండ్లీగా మారినట్లున్నారే?

ఇదివరకటి కన్నా అనుభవం వచ్చింది. నేనెప్పుడూ మీడియా ఫ్రెండ్లీనే. కాకపోతే, ఇప్పుడింకా ఫ్రీగా మాట్లాడుతున్నా. లైఫ్‌లో ఇప్పటి దాకా మాట్లాడి నంతా... ఈ నెలరోజుల్లో దేశమంతా తిరుగుతూ మాట్లాడేశా(నవ్వు).

 

బాహుబలి’ సినిమా ఓ భారీ గిఫ్ట్‌ప్యాక్ అనుకుంటే.. దాన్ని ఎవరికిస్తారు?

 కష్టసుఖాల్లో వెన్నంటి నిలిచిన మా అమ్మకు, మా అక్కయ్యకు!

 

ప్రముఖ నిర్మాతైన మీ నాన్న గారు ఈ క్షణంలో ఉండి ఉంటే...?

 (ఎమోషనలవుతూ...) నాన్నగారు చాలాసార్లు గుర్తుకొచ్చారు. కనీసం ఒక్కసారైనా ‘బాహుబలి’ సెట్‌కొచ్చి కళ్లారా చూసుంటే బాగుండుననిపించింది. ఆయన లేని లోటు, సినిమా చూడని లోటు నాకు ఎప్పటికీ తీరవు.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top