అత్తగారికి మామిడి ముక్కలు

అత్తగారికి మామిడి ముక్కలు


సమ్‌సారం

సంసారంలో సినిమా




మూడు రోజులుగా రమేశ్‌కి అమీర్‌పేట్‌ కాకతీయ మెస్‌లో భోజనం ఇంత బాగుంటుందని తెలిసొస్తోంది. కొంచెం రష్‌ ఉన్నా, పెరుగులోకి వచ్చిన వాణ్ణి కనిపెట్టి, వాడి వెనుక నిలబడి, టక్కున టేబుల్‌ మీద టోకెన్‌ పెట్టి, వాడు లేచిన వెంటనే సీట్‌ని గ్రాబ్‌ చేసి, భోజనం చేసి ఇంటికి వస్తున్నాడు. వస్తూ వస్తూ భార్యకు కూడా ఒక మీల్స్‌ పార్శిల్‌ తెచ్చి డైనింగ్‌ టేబుల్‌ మీద పెడుతున్నాడు. ‘తిను సుజా’ అని అనడానికి ధైర్యం లేదు. ఆమెకు ఎప్పుడు తినాలని అనిపిస్తే అప్పుడే తింటోంది.



ఇదంతా వేసవి వల్లే జరిగిందా అంటే అవునని చెప్పక తప్పదు. అందరికీ ఎండల కష్టాలు వస్తే రమేశ్‌కి మామిడి పండ్లతో కష్టాలు వచ్చాయి. వారం క్రితం తల్లి ఊరి నుంచి వచ్చి కొన్నాళ్లు ఉందామని ఆశ పడింది. తల్లి స్టేషన్‌లో దిగి ఒక్కతే రాలేదు. వెళ్లి రిసీవ్‌ చేసుకుందామని రమేశ్‌ అనుకున్నాడు కాని అది అత్యుత్సాహంగా ఉంటే సుజా హర్ట్‌ అవుతుంది. అందుకని చాలా క్యాజువల్‌గా ‘అమ్మను ఆటో ఎక్కి రమ్మందామా’ అన్నాడు. ‘ఎందుకులేండి... ఎలాగూ మీరు ఆఫీసుకు వెళ్లే టైమేగా. స్టేషన్‌ దాకా వెళ్లి మీరే ఆటో ఎక్కించి పంపండి’ అని సుజా అంది. అలా అనే అవకాశం ఇచ్చినందుకు, అలా ఉదారంగా వ్యవహరించే చాన్స్‌ ఇచ్చినందుకు సుజా ఈగో శాటిస్‌ఫై అవుతుంటుంది.



ఈ విషయం కనిపెట్టే రమేశ్‌ కాపురాన్ని ‘ఔర్‌ ఏక్‌ ధక్కా... మనశ్శాంతి పక్కా’ నినాదంతో నెట్టుకొస్తూ ఉన్నాడు. చివరకు అమ్మ వచ్చింది. ఇంట్లో దిగింది. ఆమెకు రోజూ నాలుగు రకాల కూరలు చేయడం అలవాటు. పెద్ద చేయి. సుజా ఏమో నాలుగు ముక్కలు క్యారెట్‌ తరిగి ఫ్రై చేసి, ‘పెద్దిరాజు పికిల్‌’ పేరుతో అమ్మే పచ్చడి సీసాను టేబుల్‌ మీద పెట్టి, మనం దుబారాగా జీవించడం లేదు అనేలా హంబుల్‌గా సింపుల్‌గా రమేశ్‌కు కూడా అదే తిండి అలవాటు చేసింది. ఇలాంటి టైములో కూరగాయల బుట్ట అందుకుని అలా రైతు బజార్‌కు వెళ్లి కూరగాయలు తెస్తాను అని రమేశ్‌ అంటే అతడి జీవుడు అనూహ్యమైన పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుంది.



అందుకే రమేశ్‌ ‘అమ్మ నాలుగు రకాల కూరలు చేయమంటుంది కాని నువ్వు పడనీకు. నువ్వు మాత్రం ఎక్కడని చేస్తావు. అస్సలు చేయకు’ అని సుజాతో అంటే ఆమె ఆ మాటకు చివుక్కున చూసి ‘ఏమండీ... మీ అమ్మకు నేను కడుపు నిండుగా తిండి పెట్టట్లేదని అందరూ అనుకోవాలనా? ఆమెకు కూరలంటే ఇష్టమైతే ఏం నేను చారు చేసి పెట్టనా? మిరియాల చారు చేసి పెట్టనా? చింతపండు చారు చేసి పెట్టనా? నిమ్మకాయ చారు చేసి పెట్టనా? ఏం ఆఖరుకు టొమాటా చారు కావాలంటే నాలుగు డబ్బులవుతాయని వెరవక అదీ చేసి పెట్టనా? మనింటికి మనిషి వచ్చినప్పుడు నాలుగు రకాల చార్లైనా చేసి పెట్టకపోతే ఎలాగండీ’ అంటుంది. ఆమెను అలా అననిచ్చినందుకు, అంత ఉదారంగా వ్యవహరించేలా చేసిందుకు ఈగో శాటిస్‌ఫై అయ్యి రమేశ్‌కు డే టు డే లైఫ్‌ స్మూత్‌ ఫంక్షనింగ్‌కు అవకాశం వస్తుంది.



ఇంత తెలివైన రమేశ్‌ మామిడి పండ్ల విషయంలో పప్పులో.. సారీ తొక్కలో.. కాలు వేశాడు. నూజివీడు మామిడిపండ్లు కిలో ఎనభై అనంటే అరవైకి బేరం చేసి రెండు కిలోలు పట్టుకొని వచ్చాడు. తల్లికి మామిడిపండ్లంటే ఇష్టం. చిన్నప్పుడు ఊళ్లో తండ్రి బతికి ఉండగా వందా రెండు వందల కాయలు తెప్పించి గడ్డిలో మాగపెట్టి పిల్లలకు పెట్టడమే కాదు తనూ ఇష్టంగా తినేది. అది గుర్తుంది కాబట్టే తెచ్చాడు. తెచ్చి, ఇన్నోసెంట్‌గా వాటిని డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టి వాటి సంగతి మర్చిపోవాల్సింది. మరుసటి రోజు రాత్రి భోజనం చేస్తూ సుజా తన పక్కన కూర్చుని చాకుతో మామిడి పండు తొక్క తీసి ముక్కలు చేస్తూ ఉండగా నోరు జర్రున జారాడు.



‘అమ్మకు కోసి పెట్టావా?’ అన్నాడు. అంతే. సుజా చివుక్కున చూసింది. పుటుక్కున చాకు కింద పడేసింది. చటుక్కున లేచి నిలబడింది. తటుక్కున డైలాగ్‌ అందుకుంది. ‘అంటే మీరు కోసి పెట్టమంటేనే నేను పెడతానా? నాకు తెలియదా? నాకు ఆ మాత్రం మనసు ఉండదా. ఊరి నుంచి వచ్చిన మనిషి, మీ అమ్మ, మా అత్తగారు ఇంట్లో ఉంటే ఆమెకు రెండు– మూడు ముక్కలు మామిడి పండు కోసి పెట్టాలన్న ఇంగితం కూడా లేని మనిషినా నేను? కావాలంటే రోజూ పెరుగన్నంలో ఒక ముక్క ఆసాంతం పెట్టనా? నిన్న పెట్టానో లేదో అడగండి. ఇవాళ పెట్టనో లేదో మీ నోటితో మీరే అడిగి నిర్థారణ చేసుకోండి. మనిషి మీద విశ్వాసం ఉండాలండీ. నమ్మకం ఉండాలి. నిశ్చింత ఉండాలి. అసలు అది పక్కన పెట్టండి. పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడైనా మీరు నన్ను... ఇదిగో ఇది తిను అన్నారా. అదిగో అది తింటావా అని అడిగారా. ఇదిగో మామిడి పండు కోయనా... మ్యాంగో మిల్క్‌ షేక్‌ చేసి ఇవ్వనా అని ఒక్కటంటే ఒక్కనాడైనా ఎన్నడైనా అడిగారా? మీ అమ్మ ముందు నన్ను తక్కువ చేయడానికి కాకపోతే ఎందుకండీ ఈ మాటలు... మనిషికో మాట కోడలికో ప్రశంస అన్నారు... పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్కరోజైనా అమ్మా సుజా నువ్వు బాగా చేశావు అని మీ అమ్మా కొడుకులు అనగలిగారా అనడానికి నోరొచ్చిందా అలాంటి నాలికను ఆ దేవుడు మీకిచ్చాడా అని...’



ఆమె ఆ మాటలను ఎంతో దుగ్ధతో నొప్పితో జెన్యూన్‌ బాధతో చాలా మెల్లగా లోగొంతుకలో అన్నా రమేశ్‌కి అతని తల్లికి రమేశ్‌ వాళ్ల ఫ్లోర్‌ మీద ఉన్న మరో రెండు ఫ్లోర్లకి కింద ఉన్న ఇంకో ఐదు ఫ్లోర్లకి వీటితో పాటు చందా నగర్, నిజాం పేట్, రామచంద్రాపురం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకి స్పష్టంగా వినపడ్డాయి. ఆ తెల్లవారే రమేశ్‌ తల్లి తన మేనబావగారి చిన కోడలి మరదలు జియాగూడలో గర్భంతో ఉందని ఆమెను చూసి అక్కడే నాలుగురోజులు ఉండి ఊరు వెళిపోతానని ఆటో ఎక్కకుండానే వెళ్లిపోయింది. ఆ వెంటనే ఎక్కడి నుంచో ఒక గండు పిల్లి వచ్చి గ్యాస్‌ బర్నర్‌ మీద పడుకుంది. పిల్లి లేవలేదు. అన్నం ఉడకలేదు.



ఫ్రెండ్స్‌ని సలహా అడిగితే అమీర్‌పేట కాకతీయ మెస్‌ బెస్ట్‌ అని రమేశ్‌కి చెప్పారు. మూడు రోజులుగా ఇది నడుస్తోంది. ఇంకా ఎంతకాలం నడుస్తుందో తెలియదు. అనవసరంగా సుజా మనసును బాధ పెట్టానే అని రమేశ్‌ బాధ పడని క్షణం లేదు. సుజా అలక మాని తిరిగి మామూలు మనిషి అయ్యి ఆ క్యారెట్‌ ఫ్రై ఏదో చేసి తన మొహాన కొడితే తప్ప అతడికి తృప్తి లేదు. అదే జరిగిన రోజున ఇష్టదైవానికి గట్టి కొబ్బరి కాయ కొడతానని గాఢంగా మొక్కుకున్నాడు. అయితే ఆ రోజు ఎంతో దూరంలో లేదు మనందరికీ తెలుసు. ఏం... మరో రెండు మూడు నెలలు కాకతీయ మెస్‌ భోజనం చేస్తే రమేశ్‌ ఏమైనా అరిగిపోతాడా కరిగిపోతాడా... చోద్యం కాకపోతే.





సినిమాలో సంసారం

సినిమా: మల్లీశ్వరి

వెంకటేశ్‌ నటించిన మల్లీశ్వరిలో వెంకటేశ్‌కు అన్న నరేశ్, వదిన రాజ్యలక్ష్మి. వెంకటేశ్‌ ఆ అన్నా వదినలతోనే కలిసి ఉంటాడు. అతడి పెళ్లి గురించి అన్నా వదినలకు పెద్దగా పట్టదు. వెంకటేశ్‌... యువరాణి కత్రినాతో ప్రేమలో పడతాడు. అయినా అన్నా వదినలు పట్టించుకోరు. వెంకటేశ్‌ తిడతాడు. ‘తమ్ముడి బ్యాగ్‌ తీసుకుని ఒకమ్మాయి ఇంటికి ఎందుకొచ్చింది. అసలా అమ్మాయి ఇంటికి వాడెందుకెళ్లాడు. బ్యాగెందుకు మర్చిపోయాడు. అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు. ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డాడా. అందుకే ఇంత కష్టపడ్డాడా. పోనీ ఒకమాటడిగితే నష్టమేమైనా ఉందా’ అని చెడామడా తిడతాడు. చివరకు వెంకటేశ్‌ కత్రినా వాళ్ల ప్యాలెస్‌కు వెళతాడు. అక్కడే నాలుగురోజులు ఉండాల్సి వస్తుంది. మధ్యలో ఇంటికి ఫోన్‌ చేస్తాడు. అది భోజనాల టైము. ‘అన్నయ్యా... వదినను నా బండి అప్పుడప్పుడు తుడుస్తుండమని చెప్పు’ అంటాడు. అప్పుడే ఆ ఒదిన పళ్లెం కడిగిన నీళ్లని ఎత్తి బండి మీద గిరాటు వేస్తుంటుంది.



‘మీ వదిన ఏకంగా బండి కడిగేస్తోంది’ అంటాడు అన్న. వాళ్లకు తొమ్మిదేళ్ల కూతురు ఉంటుంది. ‘పాప నీ గురించి బెంగ పెట్టుకుంది... మాట్లాడు’ అని నరేశ్‌ ఫోన్‌ పాపకిస్తాడు. వెంకటేశ్‌ ఫోన్‌లో ‘ఎందుకమ్మా బెంగ నాల్రోజుల్లో వచ్చేస్తానుగా’ అని అంటే పాప బదులుగా ‘అదేంటి... బాబాయి ఇంక రాడు మనం హాయిగా ఉండొచ్చు అని అమ్మ చెబుతోంది’ అంటుంది. వెంకటేశ్‌ ఖంగు తింటాడు. కాని ఇదంతా వింటున్న బ్రహ్మానందంతో ‘ఏమిటో మా మధ్యతరగతి అనుబంధాలు డబ్బున్నోళ్లకు తెలియవు’ అని నిట్టూరుస్తాడు. సంసారంలో ఇవన్నీ సరిగమలు. పదనిసలు.



అదేంటి.. బాబాయ్‌ ఇంక రాడు.. మనం హాయిగా ఉండొచ్చని అమ్మ చెబుతోందీ..



సినిమా: ఆకాశమంత

తండ్రులు పిల్లలను గారం చేయవచ్చు. కాని తల్లులు నిక్కచ్చిగా ఉంటారు. ‘ఆకాశమంత’ సినిమాలో ప్రకాష్‌రాజ్, ఐశ్వర్యలకు కూతురు పుడుతుంది. ఆ కూతురంటే ప్రకాశ్‌రాజ్‌కు వల్లమాలిన ప్రేమ. కాలు కందకుండా పెంచుకుంటూ ఉంటాడు. పాపకు మూడేళ్లు వస్తాయి. అప్పుడే భార్య బాంబు పేలుస్తుంది. ‘పాపను స్కూల్లో చేర్పించాలి’ అంటుంది. ‘ఇప్పుడే నడవడం నేర్చుకుంది. అప్పుడే స్కూల్‌ ఏమిటి’ అంటాడు ప్రకాష్‌రాజ్‌. నథింగ్‌ డూయింగ్‌ చేర్పించాల్సిందే అంటుంది ఐశ్వర్య. అంతే కాదు ‘పేరెంట్స్‌కు కూడా ఇంటర్వూ్య ఉంటుంది. ప్రిపేర్‌ అవ్వండి’ అని పుస్తకాలు నెత్తిన పడేస్తుంది. ఇంట్లో మాక్‌ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తుంటుంది. ఒక టెస్ట్‌లో ప్రకాష్‌రాజ్‌ జపాన్‌ రాజధాని ‘నోక్యో’ అని రాస్తాడు. ఈ సంగతి తెలిసి అతడు పని చేసే టీ ఎస్టేట్‌లో కార్మికులందరూ ప్రకాష్‌రాజ్‌ను మందలిస్తారు. బాగా చదవమని చెప్తారు. చివరకు స్కూల్‌ అడ్మిషన్‌ రోజు వస్తుంది.



ప్రకాష్‌రాజ్‌ క్యూలో నిలుచుంటాడు. అతని పక్కన ఒకతను చాలా వర్రీతో చదివేస్తుంటాడు. అతడు లాస్ట్‌ ఇయర్‌ ఇంటర్వూ్య ఫెయిల్‌ అయ్యాడట. కారణం ‘భారతదేశంలో బంగారం ఎక్కడ దొరుకుతుంది’ అని అడిగితే ‘ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌’ అని సమాధానం చెప్పాడు. ఈలోపు ప్రకాష్‌రాజ్‌కు ‘అలెగ్జాండార్‌ గుర్రం పేరు ఏమిట’నే డౌట్‌ వస్తుంది. పక్కనున్న అతన్ని అడుగుతాడు. అతను చాలా కంగారుగా ‘ఆ గుర్రం మేలా ఫిమేలా’ అని ప్రశ్నిస్తాడు. చివరకు ఈ ప్రశ్న పెద్ద కలకలమే రేపుతుంది. సంసారంలో పిల్లల చదువు అనేది పెద్ద పిడకల వేట. ఆ వేటకు అంతం లేదు.



అలెగ్జాండర్‌ గుర్రం పేరు?

– కె

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top