సామాజిక సేద్యం విత్తనాల వైద్యం...

సామాజిక సేద్యం విత్తనాల వైద్యం...


విత్తనాన్ని నాటితే మొలకై ఊపిరి పోసుకుంటుంది. పచ్చని చెట్టుగా ఎదిగి పది కాలాలు ప్రాణవాయువు అందిస్తుంది. అదే విత్తనాన్ని నరంపై నిలబెడితే దేహమంతా పచ్చని సారమై ప్రవహిస్తోంది. చెడు కణాలు కనిపిస్తే చీల్చి చెండాడుతోంది. వెంటాడే దీర్ఘ వ్యాధుల్ని తరిమి కొడుతోంది.  సుజో థెరపీ అనే కొరియన్ వైద్య విధానాన్ని ఔపోసన పట్టిన ఓ సంఘసేవకుడు ఉచిత సేవలందిస్తున్నాడు.  వేలాది రూపాయల సొంత డబ్బు వెచ్చిస్తున్నాడు. నడవలేని రోగుల ఇళ్లకు వెళ్లి మరీ సేవలందిస్తున్నాడు. ఆయనే విశాఖపట్నానికి చెందిన జి.రాధాకృష్ణమూర్తి. ఆయన ఇంటికి ఎక్కడెక్కడి నుంచో రోగులు వస్తారు. విత్తనాల వైద్యం పొందుతారు. ఆరోగ్యంతో ఇంటికెళ్తారు. పన్నెండేళ్లుగా ఉచితంగా విత్తనాల వైద్యం చేస్తున్న రాధాకృష్ణమూర్తి సేవలపై ప్రత్యేక కథనం...

 

ఆదివారమైతే చాలు... విశాఖ స్టీల్‌ప్లాంట్ సెంట్రల్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న రాధాకృష్ణమూర్తి ఇల్లు కిటకిటలాడిపోతుంది. హెచ్‌బీ కాలనీలోని స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌కు వెళ్లి ‘విత్తనాల వైద్యుడి ఇల్లెక్కడ?’ అని అడిగితే చాలు.. ఎవరైనా చెబుతారు. ఆయన ఇంటికి ఉదయం ఆరు గంటల నుంచే పొరుగు జిల్లాల నుంచి తరలి వస్తారు. ‘‘మా గురువుగారైన యు.ఎస్.శాస్త్రి ‘రేకి’ వైద్య విధానంలో నిష్ణాతుడు. ఆయన సుజో థెరపీలో నిష్ణాతుడైన జి.బి.లూత్రియాను 2002 లో ముంబయి నుంచి విశాఖ రప్పించారు. ఆయన దగ్గర నాతో సహా 35 మంది సుజో థెరపీలో శిక్షణ పొందాం. ప్రస్తుతం నేనొక్కడినే ఈ వైద్యం చేస్తున్నాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం ఈ వైద్యం ప్రత్యేకత’ అన్నారు రాధాకృష్ణమూర్తి. అక్టోబర్ 13 నుంచి 17 వరకు తిరుపతిలో జరిగిన ఇస్కాన్ అంతర్జాతీయ సదస్సులో డెలిగేట్లకు విత్తనాల వైద్యం అందించేందుకు ఆయనకు ఆహ్వానం అందింది.



వ్యాధిని బట్టి విత్తనం ఎంపిక



కొరియా భాషలో ‘సు’ అంటే చెయ్యి, ‘జో’ అంటే పాదం. చెయ్యి లేదా పాదాలకు చేసే వైద్యం కాబట్టి దీన్ని సుజో థెరపీ అంటారు. చేతి కన్నా కాలి వేళ్లకు విత్తనాలను అంటిస్తే ఎక్కువ ప్రభావం ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు మాత్రం చేతికి వైద్యం చేస్తారు. విత్తనాల వైద్యంలో మిరియాలు, రాజ్మా, మెంతులు, బియ్యం, ఉమ్మెత్త, పెసలు, గిల్డర్ గింజలను ఉపయోగిస్తారు. మధుమేహం, డిప్రెషన్, టెన్షన్, థైరాయిడ్ వ్యాధులకు పెసలు, వాపులు, ఎముకలు విరిగినప్పుడు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు బియ్యం, కిడ్నీ వ్యాధులకు రాజ్మా, నడుం, వీపు నొప్పులకు మిరియాలు, మోకాలి నొప్పులకు మెంతులు, గుండె జబ్బులకు గిల్డర్ గింజలు, కండ్ల కలక నివారణకు బార్లీ గింజలను వినియోగిస్తారు. క్యాన్సర్, ఎయిడ్స్ తప్ప ఏ వ్యాధికైనా విత్తనాలతోనే వైద్యం చేస్తారు.



మార్కింగ్ ముఖ్యం



ముందుగా రోగికి వచ్చిన వ్యాధి గురించి తెలుసుకుంటారు. అనంతరం జిమ్మి అనే పరికరంతో చేతి వేళ్లు లేదా కాలి వేళ్లపై ఒత్తిడి కలిగిస్తారు. విత్తనాలు అంటించాల్సిన ప్రాంతంలో బాల్‌పెన్‌తో మార్కింగ్ చేస్తారు. ఇంటికెళ్లాక రోగికి విత్తనాలను అంటించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వ్యాధిని బట్టి విత్తనాలను ఎంపిక చేస్తారు. వాటిని స్కేలు లాంటి పరికరంపై సన్నగా లోతైన గాడిలో పోస్తారు. దానిపై టేప్ పెట్టగానే విత్తనాలు నిలువుగా గీతలా అంటుకుంటాయి. ఆ టేప్‌ను నరం మీద అంటించి ఊడిపోకుండా మరో టేప్‌తో సీల్ వేస్తారు. నీటిలో తడిసి పాడవకుండా సాక్స్ తొడగడంతో చికిత్స పూర్తవుతుంది. ‘‘విత్తన శక్తి నరాల్లోంచి శరీరంలోకి వెళ్లి వ్యాధిని తగ్గిస్తుంది. ఒకరోజు గడిచాక విత్తనం పనికి రాదు. దాన్ని నాటినా మొలకెత్తదు. రాజ్మా గింజ మాత్రం మూడు రోజులు పనిచేస్తుంది. నెల రోజుల తర్వాత రోగుల్ని రమ్మంటాం’’ అన్నారు రాధాకృష్ణమూర్తి. ఆయన వద్ద సుజో థెరపీ నేర్చుకున్న మరి కొంతమంది, మా దగ్గరకు వచ్చిన రోగులకు సహకరిస్తారు.



ఎంతో ఉపశమనంగా ఉంది



‘విత్తనాల వైద్యంతో నాకు రక్తపోటు, మధుమేహం, నా భార్యకు మోకాలి నొప్పి బాగా తగ్గాయి’ అని చెబుతున్నారు చోడవరానికి చెందిన పి.ఎస్.ఎన్.మూర్తి. ‘చాలాకాలంగా సైనస్, ఆస్తమాతో బాధపడుతున్నాను. రాధాకృష్ణమూర్తి గారి విత్తనాల వైద్యం పొందాక బాగా ఉపశమనంగా ఉంటోంది. ఆయనతో మా ఊళ్లో వైద్య శిబిరం పెట్టిస్తాను’ అని చెబుతున్నారు శ్రీకాకుళం ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన



డి.రమ.



నడవలేని రోగుల ఇళ్ల దగ్గరికే వైద్యం



ప్రతి ఆదివారం దాదాపు 60 మంది వరకూ రోగులు వస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు రోగుల్ని రాధాకృష్ణమూర్తి పరీక్షిస్తారు. మళ్లీ సాయంత్రం 7.30 గంటలకు విత్తనాల సంచితో ఇంటి నుంచి బయల్దేరతారు. నడవలేని రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యం అందించి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకుంటారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు నెలకు రూ.7 వేలకు పైగా వెచ్చిస్తారు.

 విత్తన వైద్యం ద్వారా ఎంతోమందికి రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తున్న రాధాకృష్ణమూర్తి మరింత మందికి సేవలు అందించాలని అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.



-  ఎ.సుబ్రహ్మణ్యశాస్త్రి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

 ఫొటోలు: ఎండి. నవాజ్

 

ఊపిరి ఉన్నంత వరకూ ఉచిత వైద్యం



 పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం. బతికి ఉండగా నలుగురికి మంచి చేయాలి. ఇప్పటి వరకూ 15 వేల మందికి నయం చేశాను. వారి కళ్లల్లో సంతృప్తి చూస్తే రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది. ఊపిరి ఉన్నంతవరకూ ఉచితంగా విత్తనాల వైద్యం చేస్తాను.

 - రాధాకృష్ణమూర్తి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top