ఆ 60 నిమిషాలు...

ఆ 60 నిమిషాలు...


నైన్‌టీ మినిట్ క్యాసెట్ ఎప్పుడూ కొనొద్దని చెబుతారు. టేప్‌రికార్డర్ లోడ్ లాగలేదట. సిక్స్‌టీ ఓకే. అటు తర్టీ మినిట్స్. ఇటు తర్టీ మినిట్స్. అటు ఎనిమిది.. ఇటు ఎనిమిది.. మొత్తం పదహారు పాటలు. ఇష్టమైన పాటలు. మన కోసం మనం సెలెక్ట్ చేసుకొని మేడ మీద సన్నజాజుల పొద దగ్గర చాప పరుచుకుని నెత్తిన చంద్రుణ్ణి చూస్తూ ఆ దాపు నుంచి వచ్చే సముద్రపు గాలికి ‘ఏ రాతే.. ఏ మౌసమ్.. నదీకా కినారా’... వినిపిస్తూ...షావుల్ భాయ్ ఒక పట్టాన ఇవ్వడు.



సిక్స్‌టి మినిట్స్ క్యాసెట్‌కు పది రూపాయలు తీసుకుంటాడు. మనం వెళ్లి క్యాసెట్ సెలెక్ట్ చేసుకోగానే సొరుగులో నుంచి పసుప్పచ్చ, నీలం, పింక్ కలర్ చార్ట్ బుక్కులను ముందు పడేస్తాడు. స్కెచ్ పెన్లతో చేత్తో రాసిన పాటల క్యాటలాగులు. సంకీర్తన, అభినందన, గీతాంజలి... ఎప్పుడు షాపుకెళ్లినా స్టూల్ మీద నిలబెట్టిన రెండడుగుల స్పీకర్ బాక్సుల్లో అదే పనిగా రికార్డయ్యే పాట ఒకటి వినిపించేది. హృదయమనే కోవెలలో... నిను కొలిచానే దేవతగా.... ఇంకో పాట కూడా.



ఒక లైలా కోసం... తిరిగాను లోకం... కోళ్లదిన్నె, తుమ్మలపెంట వైపు నుంచి వచ్చే బెస్తవాళ్లకు ఇవన్నీ పట్టవు. పుట్టింటోళ్లు తరిమేశారు... దీనిని ఎక్కించాక యమగోల, అత్తమడుగు వాగులోనా... లారీ డ్రైవర్లు, ట్రాక్టర్ కూలీలూ, హెయిర్ కటింగ్ సెలూన్ ఓనర్లూ... షావూల్ భాయ్ ఎంతమందికని జవాబు చెప్తాడు? అందరికీ పాటల క్యాసెట్లు కావాలి. వాళ్లు ఎంచుకున్న పాటలతో నిండిన క్యాసెట్లు. మొగుడు మారడు. పెళ్లాం టేస్ట్ పట్టించుకోడు. ఆమెకు కూడా తనకంటూ ఇష్టమైన పాటల క్యాసెట్ ఒకటి చేయించుకోవాలని ఉంటుంది కదా.



మసాలాలో, మిరప్పొడిలో రూపాయి రూపాయి దాచి... షావుల్ భాయ్‌ని బతిమాలి... ఒకవైపు న్యాయం కావాలి... ఒకవైపు పుణ్యస్త్రీ.... ఈ రోజే ఆదివారము... అందాకా పడుచువారము... చాలాస్నేహాలు సర్వనాశనం అయిపోయాయి. వాడా... ఇళయరాజా క్యాసెట్ అడిగితే ఇవ్వనన్నాడు... అరిగిపోతాడా... కరిగిపోతాడా.... అవును. అరిగిపోతాడు. తెగిన క్యాసెట్లను అతికించి ఇమ్మని ఇచ్చినవి ఒక వైపు గుట్టగా పడి ఉంటాయి షావుల్ భాయ్ షాపులో. మనం అతికించలేము. పెన్ను పెట్టి రివైండ్ చేసి ప్లాస్టిక్ టేపుతో సరిగ్గా ఈ అంచునూ ఆ అంచునూ జతచేయలేము.కాకపోతే కొంచెం జంపవుతుంది. పల్లవిలో ఒక తుంటపోతుంది. లేకుంటే చరణంలో. గాలివానలో... వాన... కర్‌‌‌రరర్... తెలియదు పాపం...



ఉంగరాలు, బంగారు బొంగరాలు... ఇవి ఉన్నవాడు కాదు ఐశ్వర్యవంతుడు. స్పైన్ మీద మన పేరు ఉన్న క్యాసెట్లు డజన్... అలా అల్మారాలో కనిపిస్తూ... కింద ఎల్లో శాటిన్ క్లాత్ కప్పిన టూ ఇన్ ఒన్ మిడిసిపడుతూ... వాడూ వీధిలో గౌరవనీయుడు. ఎప్పుడైనా సరదా పుడితే రెడ్ కలర్ రికార్డ్ బటన్, బ్లాక్ కలర్ ప్లే బటన్ ఒక్కసారే నొక్కి పిల్లల మాటలు రికార్డ్ చేసి వాళ్ల మాటలు వాళ్లకే వినిపిస్తూ మెరుస్తున్న కళ్లతో వాళ్లు చూస్తుంటే గర్వపడుతూ... అదీ వైభోగం.



రేడియో పాత చుట్టం. టేప్ రికార్డర్ కొత్త అతిథి. సోనీ నైన్‌టీ కొనే డబ్బులు ఎప్పుడూ ఉండవు. సిక్స్‌టీ కూడా. ఖరీదు ఎక్కువ. టి-సిరీస్ చీపేగాని తొందరగా నలిగిపోతాయని కటింగ్ చేసే మాల్యాద్రన్న చెప్పేవాడు. ఇక మధ్యస్తంగా మిగిలింది టిడికె క్యాసెట్లే. నల్లగా, బరువుగా టి..డి...కె.. అనే అక్షరాలతో ఆకర్షిస్తూ... అలాంటి ఒక క్యాసెట్ కొని... ఇష్టమైన రఫీ పాటలు చేయించుకొని... కాని ఎలా? సంవత్సరమంతా వడగాడ్పులు వీచినా రంజాను నెలలో అత్తరు వానలు కురుస్తాయి.



పిల్లల చేతుల్లో కుర్రాళ్ల జేబుల్లో నాలుగు డబ్బులు కదలాడతాయి. షావుల్ భాయ్... ఇక నీ షాప్‌కు వచ్చి ఉత్త చేతులతో తిరిగెళ్లే సమస్యే లేదు. గోడలకు వేళ్లాడగట్టిన శంకరాభరణం, ఆనందభైరవి ఎల్.పి కవర్లను చూస్తూ ఒక టిడికె క్యాసెట్ కొని... రఫీ పాటలు కావాలంటే... ఏ సినిమాల్లోని పాటలు అన్నాడు షావుల్ భాయ్. పేర్లేం తెలుసు. ఆ సినిమాలు చూస్తే కదా. రేడియోలో వినడమే. సరే... నీకు నచ్చిన నాలుగు పాటలు చెప్పు... నీ టేస్ట్ కనిపెట్టి మిలిగిన పాటలు చేసిస్తాను అన్నాడు షావుల్ భాయ్.

 

కౌన్ హై జో సప్‌నోమే ఆయా...

చాహుంగ మై తుజే సాంజ్ సవేరే...

లిఖ్ఖేజో ఖత్ తుఝే ఓ తేరి యాద్ మే....

ఆజారే ఆ జరా...


చాలు. అర్థమైంది. వారం తర్వాత రా. క్యాసెట్ అందుకుని దానికి ఒక కాగితం చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి పైన పేరు రాశాడు.

వారం వరకూ నిద్రే లేదు. ప్రేమలో పడ్డవాడు కూడా అంత విరహం అనుభవించడు.

వారం తర్వాత పాటలను అలంకరించుకున్న ఆ నిరుపమాన సౌందర్యవతి చేతుల్లో పడింది. షావుల్ భాయ్ టేస్ట్ కనిపెడతానన్నాడు. ఎలా కనిపెడతాడు.

 ప్లే బటన్ నొక్కితే మొదటి పాట-

 ఏక్ థ గుల్ ఔర్ ఏక్ థి బుల్‌బుల్...

 రెండో పాట-

తేరే మేరే సప్‌నే అబ్ ఏక్ రంగ్ హై....

వాటిని వింటూ అనేక రాత్రులు నిద్రపోలేదు.

ఆ రోజులు పోయాయి. క్యాసెట్లూ పోయాయి. అమాయక ముఖాలతో మూగే జన సందోహం మాయమయ్యింది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రికార్డులను ఎవరికో ఇచ్చేసి షావుల్‌భాయ్ నెల్లూరు వెళ్లిపోయాడు.జ్ఞాపకాలు మాత్రం కావలిలో ఉండిపోయాయి.ఈ ఎండల్లో ఎప్పుడైనా నిద్రపట్టకపోతే ఆ తలపులే కాసిని నిద్రమాత్రలు.

 - ఖదీర్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top