శివకాశి వెలుగుల వెనుక చీకటి సాక్ష్యం...

శివకాశి వెలుగుల వెనుక చీకటి సాక్ష్యం... - Sakshi


నిన్నటికి నిన్న తూర్పు గోదావరిలో జరిగిన బాణాసంచా ప్రమాదంలో ఎందరో అమాయకులు అసువులు బాశారు. దీపావళి అనగానే గుర్తుకు వచ్చే శివకాశిలో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో. కన్నీళ్లు ఎన్నో. దీపావళి వెలుగుల వెనుక ఉన్న... శివకాశి గురించి చాలామందికి తెలుసు. కానీ, ఆ వెలుగులకు కారణమైన శివకాశి కార్మికుల కష్టాల జీవితం, కన్నీటి జీవితం కొద్దిమందికే తెలుసు. దక్షిణ కాశిగా పేరొందిన శివకాశి బాణాసంచా తయారీ కార్మికుల కన్నీటి కథ గురించి తెలుసుకుందాం...

 

దీపావళి పండగ రోజు మనం ఇష్టపడి, పోటీ పడి కాల్చే టపాసులు ఎక్కడ తయారవుతున్నాయి? ఆ తయారీ వెనుక కార్మికుల కష్టాలేమిటి? ప్రమాదాలేమిటి?  ప్రాణ నష్టాలేమిటి...మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే  శివకాశికి వెళ్లాల్సిందే.  మనం ఏడాదికోసారి వేడుకగా జరుపుకునే దీపావళి కోసం వారు ఏడాదంతా కష్టపడతారు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురై, మృత్యువాత పడతారు. తమిళనాడు రాష్ట్ర  రాజధాని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో ఉంది శివకాశి పట్టణం. విరుదునగర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణం వందేళ్ల కిందట అటవీ ప్రాంతం.

 

పేరు ఎలా వచ్చింది?

 

అసలు ఈ ప్రాంతానికి శివకాశి అనే పేరెందుకు వచ్చింది? దాని వెనుక చరిత్రేమిటి? అక్కడే ఎందుకు బాణాసంచా కర్మాగారాలు కొలువయ్యాయి? దీని వెనుక పెద్ద కథే ఉంది.

 

ప్రచారంలో ఉన్న పౌరాణిక గాథ ఏమిటంటే, క్రీ.శ.1428లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హరికేసరి పరశురామ పాండ్యన్ అనే రాజు పరమ శివ భక్తుడు. మహాశివుడిని తమ ప్రాంతంలో కొలువు దీర్చాలనే ఆలోచనతో ఉత్తర కాశి పట్టణంలో  ప్రత్యేక పూజలు చేసిన శివలింగాన్ని దక్షిణ కాశి (తెన్ కాశి)కి తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సతీసమేతంగా బంధుగణంతో కాశి నుండి శివలింగాన్ని తీసుకొని తెన్ కాశికి బయలు దేరారు. మరో రోజులో తెన్ కాశి వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం శివకాశిగా చెబుతున్న ప్రాంతంలో చీకటి పడింది. మారేడు చెట్లతో ఆ ప్రాంతం అరణ్యంలాగా  ఉండటంతో, శివుని ఇష్టమైన ప్రాంతంగా భావించి రాత్రికి అక్కడ బస చేశారు. తెల్లవారు జామునే శివలింగానికి పూజ చేశారు.  త్వరగా వెళ్లి తెన్ కాశిలో ప్రతిష్ఠించాలని బయలు దేరేందుకు సిద్ధమయ్యార పరుశురామ పాండ్యన్.  కానీ... వారు వెళ్లాల్సిన గుర్రాలు కాలు కదిపేందుకు మొరాయించాయి. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఏం జరిగిందోనని రాజు ఆరా తీశారు.

 

ఆయన సతీమణి నెలసరి అయినట్టు తెలిసింది. దీంతో మూడు రోజులపాటు అక్కడ నుండి కదలలేని పరిస్థితి. అంతేకాకుండా ఆ రోజుతో శివలింగాన్ని ప్రతిష్ఠించాల్సిన బ్రహ్మ ముహూర్తం గడువు ముగియనుంది. దాంతో, ఇక ఆ విగ్రహాన్ని వారు బస చేసిన ప్రాంతంలోనే ప్రతిష్ఠించారు.  కాశి నుండి వచ్చిన విగ్రహం కావడం,  శివుడు తమ దైవం కావటంతో ఆ ప్రాంతానికి పాండ్య రాజు  ‘శివకాశి’ అని నామకరణం చేసి, పెద్ద ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది. ఆలయం నెలకొనటంతో తదనంతర కాలంలో  అదో గ్రామంగా మారింది.

 

మొదటి, చివరి అక్షరాలతో పుణ్యస్థలి!

 

దైవానికి సంబంధించి మొదటి అక్షరం, చివరి అక్షరం కలిసి ఉండే పేరుతో ప్రపంచంలోనే రెండు దైవాంశ ప్రాంతాలున్నాయి. ఒకటి ‘తి’తో ప్రాంరంభమై ‘తి’తో ముగిసే శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి తిరుపతి అయితే, ‘శి’తో మొదలై ‘శి’తో ముగిసే శివకాశి.

 

ఇలా మొదలైంది....

 

శివకాశి పేరు వెనుక  రాచరికపు చరిత్ర ఉన్నట్లే,  బాణాసంచా తయారీకి దాదాపు వందేళ్ళ పైగా చరిత్ర ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన షణ్ముగ అయ్యర్ నాడార్ 1908లో 30 మందితో చిన్నపాటి బాణాసంచా తయారీ కుటీర పరిశ్రమను  ఏర్పాటు చేశారు. అది రెండేళ్లలో 12 యూనిట్లుగా అభివృద్ధి చెందింది. అది చూసి కొందరు ఇదే వ్యాపారం మొదలు పెట్టారు. అలా వేలాదిగా కర్మాగారాలు, కుటీర పరిశ్రమలుగా మారి  లక్షల మందికి ఉపాధి కలిగించడంతో  ప్రపంచంలోనే బాణాసంచా తయారీలో ప్రముఖమైన ప్రాంతంగా శివకాశి నిలిచింది. 20వ శతాబ్దంలో 30 మందితో ఇక్కడ ప్రారంభమైన టపాసుల తయారీ కేంద్రాలు కాలక్రమేణా 1100 భారీ కర్మాగారాలు, 8 వేల కుటీర పరిశ్రమలుగా విస్తరించాయి. ప్రస్తుతం దాదాపు ఆరు లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి. బాణసంచా తయారీయే అక్కడి ప్రజల జీవనం, జీవనాధారం అయ్యింది.

 

కారణం ఏమిటి?

 

అసలు ఇక్కడే ఎందుకు బాణాసంచా కర్మాగారాలు ఏర్పడ్డాయి? ఎందుకు ఇక్కడే వాటిని తయారు చేయాల్సి వస్తోంది? వేరే వృత్తిని ఎందుకు ఎంచుకోరు? దీనికి భౌగోళిక కారణాలూ ఉన్నాయి.

 

శివకాశి పూర్తిగా మెట్టప్రాంతం. చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల దూరం వరకు నీటి నిల్వలు లేవు. సారవంతమైన భూమి తక్కువ. భూమిలో రసాయనాలు కలుస్తుండడంతో వ్యవసాయానికి పనికిరాని పరిస్థితి. నదులు, సాగునీరు లేకపోవడంతో  చేతి వృత్తులు, ఉపాధి పనులు తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు. అందుకే ఇక్కడ ప్రజలు బతుకుతెరువు  కోసం ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్లేవారు.

 

అలాంటి చోట షణ్ముగ నాడార్ టపాసుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించడంతో ప్రజలు టపాసులు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. ఒకప్పుడు బయటి ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండగా ఇప్పుడు బయట ప్రాంతాల నుండి ఇక్కడికి ఉపాధికి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో శివకాశి చుట్టూ పుట్టగొడుగుల్లా బాణాసంచా కర్మాగారాలు పుట్టుకొచ్చాయి.

 

మూడు పువ్వులు ఆరు కాయలు



ఇక్కడ బాణసంచా వ్యాపారం  మూడు పువ్వులు  ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఇక్కడ తయారీ ఎంత ముఖ్యమో వ్యాపారమూ అంతే! కర్మాగారాల్లో తయారయ్యే బాణాసంచాను ఆయా యాజమాన్యాలు నేరుగా శివకాశి పట్టణంలో తమ ఏజెన్సీల ద్వారా విక్రయాలు జరుపుతారు. తయారీ ఖర్చు,  లాభనష్టాలను బేరీజు వేసుకుని విక్రయాలు జరుపుతారు. ఇక విక్రయాలకు ముందే తయారీ సమయంలో బాణాసంచా కవర్‌పై ధరలను నిర్ణయిస్తారు. అయితే కొనుగోలుదారులకు ఆ ధరపై 50 నుండి 60 శాతం తగ్గింపుతో భారీగా విక్రయాలు జరుపుతారు.

 

గత ఏడాది కంటే ఈసారి ధరలు 20 శాతం పెరిగినా ఒక్కో తయారీదారు సుమారు 25 నుండి 30 కోట్ల వ్యాపారం చేస్తున్నారని అంచనా. ఇక ఇక్కడి నుంచి ఏటా 30 నుండి 45 శాతం బాణాసంచా దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలకు, విదేశాలకు ఎగుమతి అవుతుండటం గమనార్హం. జపాన్, చైనాల తర్వాత ఇంత భారీ ఎగుమతులు శివకాశి నుంచే జరుగుతుండటం ఈ ప్రాంతపు ఘనతగా చెప్పవచ్చు.

 

 చీకటి కోణం




దేశంలోని అతిపెద్ద పరిశ్రమ ఇది.. కానీ ఈ పరిశ్రమలోనూ చీకటి కోణాలున్నాయి. కొలిమితో చెలగాటం  ఈ పరిశ్రమలో పని చేసే కార్మికుల  జీవితం. కడుపునిండా తినాలంటే రోజూ చస్తూ బతకాల్సిందే. ప్రమాదమని తెలిసినా ఏడాదికి పది నెలలు వీటిపైనే ఆధారపడతారు. మిగిలిన పనుల కన్నా ఇక్కడ పనికి కూలి కూడా కాస్తంత అధికంగా దొరకడమే అందుకు కారణం.

 

 ‘‘మా బతుకుల్లో కన్నీళ్లున్నా ప్రపంచానికి వెలుగుల ఆనందాన్ని పంచుతాం’’ అంటూ అంటూ కర్మాగారాలకు క్యూలు కడతారు. దినదినగండంగా ముందుకు సాగుతారు. అయితే, ఆంక్షలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటే ప్రమాదాలు ఉండవనేది అక్కడి కార్మికుల వాదన.

 

‘‘కర్మాగారాల్లో ప్రమాణాల కోసం.. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లో డొల్లతనమే మా పాలిట శాపంగా మారింది’’ అని వారంటారు. బాణసంచా కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం సుమారు 30 కోట్లతో భద్రత బోర్డును ఏర్పాటు చేసినా, పట్టించుకునే నాథుడే లేక నిరుపయోగంగా మారింది. అధికారుల పనితీరూ అంతంతే!  

 

వెరసి, శివకాశి వాసులకు మరో పని దొరకదు.  వ్యవసాయం లేదు. ఆదుకునే నాథుడు లేడు. అన్నీ కన్నీటి కష్టాలే. నిత్యం బతుకు పోరాటంలో మరణంతో చెలగాటమే. మరి, ఈ దీపావళి అయినా వారి కష్టాల చీకటిని తొలగించి, జీవితాల్లో వెండి వెన్నెల విరబూయిస్తుందా?

 

 - సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి

 సాక్షి టీవి, చెన్నై బ్యూరో


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top