విశ్వగీతం ఆలపిస్తాను - దేవిశ్రీ ప్రసాద్

విశ్వగీతం  ఆలపిస్తాను - దేవిశ్రీ ప్రసాద్


ది గ్రేట్ మాన్‌డలిన్ :  నేడు మాండలిన్ శ్రీనివాస్ జయంతి. ఈ సందర్భంగా, చెన్నై మ్యూజిక్ అకాడమీలో  ‘ది గ్రేట్ మాండలిన్’ కార్యక్రమం జరుగుతోంది. హరిహరన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, విక్కు వినాయక్‌రామ్, ఇళయరాజా వంటి ప్రముఖ గాయకులంతా పాల్గొంటున్నారు.  

 

మాండలిన్ మనోహరుడు... శ్రీనివాస్.

మెలడీల మాంత్రికుడు... దేవిశ్రీ ప్రసాద్.

ఆయన గురువు.

ఈయన శిష్యుడు.

ఇవాళ గురువుగారి తొలి జయంతి.

నివాళిగా దేవిశ్రీ ఇవ్వబోతున్నదేమిటి?

ఈ సాయంత్రం...

చెన్నై మ్యూజిక్ అకాడమీ హాల్‌లో...

ఒక విశ్వ గీతాన్ని ఆలపించబోతున్నారు.

అది గురుదక్షిణ.

గురువుగారి చుట్టూ భక్తిగా ఓ ప్రదక్షిణ.

ఈ సందర్భంగా... దేవిశ్రీ స్మృతించుకున్న కొన్ని శృతులు, గతులు...

‘ఫ్యామిలీ’ పాఠకులకు ప్రత్యేకం.

 -డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై

 

మహోన్నత వ్యక్తిత్వం: చెన్నైలో మా ఇంటి దగ్గరే మాండలిన్ శ్రీనివాస్ గారి ఇల్లు. నేను ఆయన దగ్గర సుమారు ఇరవై సంవత్సరాలు సంగీతాభ్యాసం చేశాను. ఆయనను ‘అన్నయ్యా!’ అనే పిలిచేవాడిని. ఆయన మాతో పాటు సరళీ స్వరాల దగ్గర నుంచి అన్నీ వాయించేవారు. మా ఇంటి దగ్గర చిన్న వినాయకుడి గుడి ఉంది. ఆ గుడికి అన్నయ్య వస్తుంటే, ఆ వీధిలోని పెద్దపెద్ద వారంతా లేచి నిలబడి అన్నయ్యకు నమస్కారం చేసేవారు. అంతటి మహోన్నత వ్యక్తి, మాతో ఎంతో సామాన్యంగా ఉంటున్నారంటే అందుకు కారణం ఆయన ఔన్నత్యమే.



ప్రముఖులు సైతం: అన్నయ్య కచేరీ ఉందంటే చాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజిఆర్, ఆ రోజు తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకునేవారు. రాజీవ్ గాంధీ అయితే మాండలిన్ కచేరీ పూర్తయ్యే వరకు నిరీక్షించి, అన్నయ్యను కలిసేవారు. ఒకసారి నారదగాన సభలో... ప్రముఖ హిందుస్థానీ విద్వాంసులు పండిట్ భీమ్‌సేన్ జోషీ సంగీతానికి సంబంధించిన ఎన్నో విషయాలు అన్నయ్యతో చర్చించారు. అప్పటికి నాకు ఆయనంటే ఎవరో తెలియదు. కేవలం ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ లో చూశాను! అంతే!  అలాగే తబలా కళాకారులు జాకీర్ హుస్సేన్... ఇలా ఎందరెందరో ఉద్దండ పండితులు అన్నయ్యను కలవడానికి వస్తుండేవారు. కంచి పీఠంలో జరిగిన కచేరీకి సైతం నేను అన్నయ్య వెంట ఉన్నాను.



ఓడ్ టు గురు: అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక గీతం రూపొందించాను. ఇది ఒక గురువుకి శిష్యుడు అంకితం చేసే పాట. అన్నయ్యగారిలో నేను ఏయే మంచి లక్షణాలు చూశానో, వాటినే పాట రూపంలో చూపబోతున్నాను. ఏ శిష్యుడైనా ఈ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా గురుదక్షిణగా చెల్లించుకునేలా ఉండేలా రూపొందిస్తున్నాను. ఇది ‘ఓడ్ టు గురు’ లాంటిది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ పాట యూనివర్సల్‌గా ఉండాలి. ఏదో ఒక ప్రాంతీయ భాషలో చేయడం వల్ల దేశవ్యాప్తంగా అందరికీ చేరదు. అందువల్ల సంస్కృతంలో చేయాలని నిశ్చయించుకున్నాను. సంస్కృతంలో రచించగలిగే శక్తి నాకు లేదు కనుక, ప్రముఖ రచయిత, పండితులు అయిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారితో రాయించుకున్నాను. అయితే పాటంతా నా సూచనల మేరకే ఆయన రచించి ఇచ్చారు.



కీరవాణి రాగంలో...: అన్నయ్యకు కీరవాణి రాగం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ క్లాస్ అయిపోయాక ఆయనను మాండలిన్ మీద కీరవాణి రాగం వాయించమని అడిగేవాడిని. ఆయన ఆ రాగాన్ని భారతీయ, పాశ్చాత్య... బాణీలలో అలవోకగా వాయించి వినిపించేవారు. ఆ రాగానికి అన్నయ్యకు నాకు అలా ఒక కనెక్షన్ ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు నేను రూపొందించిన గీతాన్ని కూడా కీరవాణి రాగంలోనే స్వరపరిచాను. మేం రూపొందిస్తున్న ఈ కార్యక్రమానికి ‘ద గ్రేట్ మాండలిన్’ అనే పేరుపెట్టాం. ఇందులో ద గ్రేట్ మాన్ అనీ, గ్రేట్ మాండలిన్ అనీ రెండూ చేరాయి. ఇందులో మాండలిన్ ప్రముఖంగా ఉపయోగించాం. కానీ ఎక్కువ సేపు గాయకుల గళాలే ఉంటాయి. ఈ రోజు ఈ కార్యక్రమానికి వస్తున్న గాయకులందరూ ఈ గీతం ఆలపిస్తారు. ఇంతటి సత్కారం ఇంతవరకు ఏ గురువుకూ జరగలేదు.



శివోం అవార్డులు: అన్నయ్య కుటుంబ సభ్యులు సంగీతానికి సంబంధించి రెండు అవార్డులు ఇవ్వబోతున్నారు. సంగీతంలో ప్రముఖులైన విద్వాంసులకు, అలాగే ఇప్పుడిప్పుడే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రతిభను ప్రదర్శిస్తున్న చిన్నారులకు...  ఈ అవార్డులు అందజేస్తారు. పెద్ద వారికి లక్ష రూపాయలు, కొత్తవారికి 50 వేల రూపాయలు నగదు బహుమతి,  ప్రశంసా పత్రం బహూకరిస్తారు.   ‘శివోమ్ శ్రీనివాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ మ్యూజిక్’ అని అన్నయ్య ఒక సంస్థ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా  సంగీతాభిలాషులకు ఆ సంస్థ ద్వారా పాఠాలు నేర్పేవారు. ఆయన ఎప్పుడూ ‘మ్యూజిక్ ఈజ్ డివైన్’ అనేవారు. అన్నయ్యగారు ఏ ఒక్క విద్యార్థి దగ్గర ఒక్క పైసా కూడా ఫీజు పుచ్చుకోలేదు. అందరికీ ఉచితంగానే నేర్పారు. మనం ఆయన దగ్గర నేర్చుకోవడానికి వెళ్లగానే, మన కళ్లలోకి చూసి ‘నీకు సంగీతమంటే ఇష్టం ఉందా’ అని అడిగేవారు. వాళ్ల భావాలను కళ్లతోనే కనిపెట్టేసేవారు!http://img.sakshi.net/images/cms/2015-02/41425058132_Unknown.jpg

 









బియాండ్ హ్యూమన్



నా జీవితంలో నాకు ఇష్టులు ముగ్గురు... మైకేల్ జాక్సన్, ఇళయరాజా, అన్నయ్యగారు. అన్నయ్య కష్టమైన రాగాలు ఎంత అందంగా వాయిస్తారో, సులువుగా ఉండేవి కూడా అంతే అందంగా వాయించేవారు. ‘రఘుపతి రాఘవ రాజారాం’ ఆయనకు చాలా ఇష్టం. అన్నయ్య కాలం చేసినప్పుడు గురుదక్షిణగా 13వ రోజున నేను అదే వాయించాను. ఆయన బియాండ్ హ్యూమన్! ఆయన దేవుడు! అంతే! సంగీతం అంటే ఏమిటో చెప్పడానికి వచ్చారు! చెప్పారు! వెళ్లిపోయారు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top