'అమ్మ.. నన్ను పిన్నికి అమ్మేసింది'

'అమ్మ.. నన్ను పిన్నికి అమ్మేసింది'


షీ అలర్ట్ !

మహిళలూ జాగ్రత్త!


 

 సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు  సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...

 

 నిదుర తెరలు మెల్లగా తొలగుతున్నాయి. సూర్యుని లేలేత కిరణాలు ఎక్కడి నుంచో సూటిగా వచ్చి నా ముఖమ్మీద పడుతున్నాయి. నన్ను లేపే ప్రయత్నం చేస్తున్నాయి. బాగా తెల్లవారిపోయినట్టుంది అనుకుంటూ లేవబోయాను. కానీ లేవలేకపోయాను. కనురెప్పలు భారంగా ఉన్నాయి. తెరవాలని ప్రయత్నించినా తెరచుకోన ని మారాం చేస్తున్నాయి. ఎందుకిలా ఉంది? ఏమీ అర్థం కావడం లేదు. నా శరీరం నా వశంలో లేదనిపిస్తోంది. నేనా అవస్థను జయించే ప్రయత్నంలో ఉండగానే మెల్లగా ఓ పిలుపు నా చెవిన పడింది... సాధనా! ఎవరో పిలుస్తున్నారు.


 


ఆ స్వరం ఎప్పుడూ విన్నది కాదు. నాకు పరిచయమున్నదీ కాదు. మరి ఆ వ్యక్తి ఎవరు? నన్ను అంత అనునయంగా ఎందుకు పిలుస్తున్నాడు? ఎలాగో తంటాలుపడి బరువెక్కిన కనురెప్పల్ని బలవంతంగా తెరిచాను. అంతా మసక మసకగా ఉంది. క్షణం తర్వాత కళ్లముందు దృశ్యం స్పష్టమయ్యింది. ఓ వ్యక్తి నా పక్కన నిలబడి నా ముఖంలోకే చూస్తున్నాడు. చప్పున లేవబోయాను. చేతికి ఏదో చురుక్కున గుచ్చుకుంది. చూస్తే సూది. నా చేతికి సెలైన్ ఎక్కుతోంది. ఒళ్లంతా కూడా ఏవో వైర్లు అమర్చి ఉన్నాయి. అంటే నేను... నేను హాస్పిటల్‌లో ఉన్నానా?! ఎదురుగా ఉన్నది డాక్టరా? దుఃఖం తన్నుకొచ్చింది. కళ్లగుండా పొంగుకొచ్చింది. ఆపుకోలేక భోరుమన్నాను.

 డాక్టర్ కంగారుపడ్డాడు. ‘భయపడకమ్మా... ఇక నీ ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదు’ అన్నాడు. అంత ఏడుపులోనూ నవ్వొచ్చింది.


 


ప్రాణాలకు ప్రమాదం లేదా? అంటే నేను చచ్చిపోతానేమోనని భయంతో ఏడుస్తున్నానని అనుకుంటున్నాడా? అవునులే. ఆయనకెలా తెలుస్తుంది! నేను చావు అంచుల దాకా వెళ్లినందుకు కాదు... వెళ్లి తిరిగొచ్చేసినందుకు బాధపడుతున్నాని. బతుకు అంతమైపోబోయినందుకు కాదు.... మళ్లీ బతకాలా అన్న భయంతో ఏడుస్తున్నానని! చావు పేరు చెబితేనే అందరూ వణికిపోతారు కానీ అంతకన్నా భయంకరమైనదొకటుంది. అదేమిటో తెలుసా? బతకడం. అవును. చావడం కంటే బతకడమే కష్టం. అందులోనూ జీవచ్ఛవంలా బతుకు సాగించడం ఇంకా కష్టం. అనుక్షణం నరకం అనుభవిస్తూ, గుండె చిక్కబట్టుకుని జీవించడం ఎంతో ఎంతో కష్టం. అది అనుభవించినవారికే తెలుస్తుంది. మరి నాకెలా తెలిసిందనా? నేను అనుభవించాను కాబట్టి. కొండంత బాధను గుండెల్లో దాచుకుని... అర్థం చేసుకునేవారు లేక, ఆదుకునేవారు కానరాక కుళ్లి కుళ్లి ఏడ్చాను కాబట్టి!

     

‘లక్ష్మి పిన్నికి ఒంట్లో బాలేదు కదా! నువ్వు కొన్ని రోజులు తనకి సాయంగా ఉండు. నేను నాలుగు రోజులు పోయాక వచ్చి నిన్ను తీసుకెళ్తాను.’ అమ్మ అలా అనగానే ఎక్కడ లేని సంతోషం వేసింది నాకు. పదో తరగతి పరీక్షలు అయిపోయాయి. సెలవులు ఎలా గడపాలా అనుకుంటుంటే... తన స్నేహితురాలు లక్ష్మికి ఒంట్లో బాలేదు, చూడ్డానికి వెళ్లాలి అంది అమ్మ. హుషారొచ్చేసింది నాకు. ఎప్పుడూ బడి, ఇంట్లో అమ్మకి బట్టలు కుట్టడంలో సాయం చేయడం... ఇదే పని. ఇన్నాళ్లకి సరదాగా గడిపే చాన్స్ వచ్చింది. అందుకే ఆనందంగా అమ్మతో పాటు బయలుదేరాను. కానీ ఇప్పుడేమో అమ్మ నన్ను ఇక్కడే ఉండమంటోంది. లక్ష్మి పిన్ని నన్ను బాగానే చూస్తుంది కానీ, అమ్మని వదిలిపెట్టి నేనెప్పుడూ ఉండలేదు. అందుకే బెంగనిపించింది. కానీ నాలుగు రోజులే కదా అని సరే అన్నాను. కానీ అలా అనడం ఎంత తప్పో అప్పుడు నాకు తెలియలేదు.



రెండు రోజులు సంతోషంగా గడిచిపోయాయి. పిన్నికి పనుల్లో సాయపడుతూ.. టీవీ చూస్తూ.. మంచి మంచి మిఠాయిలు తింటూ ఎంజాయ్ చేశాను. కానీ మూడో రోజు అన్నీ మారిపోయాయి. ఆ రాత్రి నేను నిద్రపోతుంటే... ఉన్నట్టుండి నా ఒంటిమీద ఓ చేయి పడింది. పిన్ని అనుకున్నాను. కానీ కాదు. ఆ చేయి  పిన్నిది కాదు. అది నన్ను ఎక్కడెక్కడో తడుముతోంది. తాకరాని చోటల్లా తాకుతోంది. నాకు కంపరంగా ఉంది. అసహ్యంగా ఉంది. నరాలకు నిప్పు సోకినట్టు బాధగా ఉంది. భరించలేకపోయాను. సహించలేకపోయాను. చప్పున లేచి కూర్చున్నాను. చీకట్లో ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూసి కెవ్వున కేక పెట్టాను.


 


అంతే... ఆ చేయి నా నోరు మూసింది. నన్ను బలంగా తోసింది. ఆ ఆకారం నా తనువును బలవంతంగా ఆక్రమించుకుంది. నా బతుకును క్షణాల్లో బుగ్గిపాలు చేసి వెళ్లిపోయింది. భయంతో కంపించిపోయాను. పిన్ని దగ్గరకు పరుగు తీశాను. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగినదంతా చెప్పాను. ఆమె కంగారుపడుతుందనుకున్నాను. నన్ను ఓదారుస్తుందనుకున్నాను. కానీ అలా చేయలేదు. పైగా ఊహించని ఒక మాట అంది. ఆ మాట నన్ను నిలువెల్లా వణికించింది. ‘ఏం కాలేదు. వెళ్లి స్నానం చేసి పడుకో. అనవసరంగా అరిచి గోల చేయకు’.



ఏమంటోంది పిన్ని! ఎవడో నా జీవితాన్ని పాడు చేశాడు. వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు.. ఏమీ తెలుసుకోదా! పైగా వెళ్లి పడుకోమంటుందేంటి! అదే అడిగాను. కానీ ఆమె మాట్లాడలేదు. అప్పుడే కాదు, ఎప్పుడూ మాట్లాడలేదు. రోజుకొక కొత్తఆకారం వచ్చి చీకటిలో నా తనువును నలిపేస్తున్నా ఆమె మాట్లాడలేదు. మా అమ్మ దగ్గరకు పంపించెయ్యి అని నేను కాళ్లు పట్టుకుని ఏడ్చినా మాట్లాడలేదు. అవమానంతో, సిగ్గుతో, బాధతో కుమిలిపోతుంటే కనికరంతో అయినా మాట్లాడలేదు.


 


కానీ ఓ రోజు ఫోన్లో మాత్రం ఎవరితోనో మాట్లాడింది. అప్పుడే తెలిసింది అసలు నిజం. మా అమ్మ నన్ను పిన్నికి యాభై వేలకు అమ్మేసిందన్న వాస్తవం నన్ను పిచ్చిదాన్ని చేసింది. నాతో వ్యాపారం చేసేందుకే పిన్ని కొనుక్కుందన్న కఠోర సత్యం నాకు బతుకు మీద ఆశను చంపేసింది. కన్నతల్లే నాకు వెల కట్టింది. కొనుక్కున్న మనిషి రోజుకో కామాంధుడికి కానుకగా నన్ను అందిస్తోంది. నా మానాన్ని, అభిమానాన్ని అమ్మి కాసులు కూడగట్టుకుంటోంది. నా వల్ల కాలేదు. నాకిక భరించే శక్తి లేదు. అందుకే చావాలనుకున్నాను. ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. కానీ కన్నతల్లికే లేని కనికరం నాకెందుకనుకుందో ఏమో... మృత్యుదేవత కూడా ముఖం తిప్పుకు పోయింది.



నన్ను తెచ్చి ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయిన పిన్ని, మూడు రోజులైనా నన్ను చూడ్డానికి రాలేదు. నా కథ తెలుసుకున్న డాక్టర్ పోలీసుల్ని పిలిచాడు. వాళ్లు వచ్చి నా జీవితాన్ని కాలరాసినవాళ్ల మీద కేసు రాసుకున్నారు. కటకటాల్లోకి తోశారు. నన్ను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఇక్కడ నేను సురక్షితంగానే ఉన్నాను. సంతోషంగా మాత్రం లేను. ఇప్పటికీ నన్నొక ప్రశ్న వేధిస్తూనే ఉంది. ఓ కన్నతల్లి పాపిష్టి సొమ్ము కోసం తన కూతుర్ని పాపపు రొంపిలోకి ఎలా దించుతుంది? తన స్వార్థానికి సొంత బిడ్డను ఎలా బలి చేయగలుగుతుంది? అలా చేయగలిగింది అంటే అమ్మ అనే మాటకు అర్థమేముంది?!




 - సాధన (గోప్యత కోసం పేరు మార్చాం)

 ప్రెజెంటేషన్: సమీర నేలపూడి


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top