శంభుని కొండపై చదువుల తల్లి

శంభుని కొండపై చదువుల తల్లి


పుణ్య తీర్థం



సకల దేవతలు సంచరించిన ప్రదేశం.. మహాత్ములు నడచిన నేల, మునులు, తపోధనులు తపమాచరించిన మహిమాన్విత స్థలం.. సప్తస్వరాల గుండు పక్కన.. స్వయంభువుగా శంభుదేవుడు వెలసిన శంభుని కొండ విద్యాసరస్వతి ఆలయానికి నెలవైంది. పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి సంకల్పం, సత్యపథం సేవాసమితి సహకారంతో 1989లో వసంత పంచమిన ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.1992లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతీ స్వామి వారు ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు.



ఉత్సవాల తోరణం..

వర్గల్‌ క్షేత్రంలో ప్రతి నిత్యం అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు, కుంకుమార్చనలు ఉంటాయి. ప్రతి నెల అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజు విశేష అర్చనలు, చండీ హోమం జరుగుతాయి. ప్రతి మాఘ శుద్ధ త్రయోదశి రోజున దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, చండీ హోమం జరుగుతాయి.



దేవీ శరన్నవరాత్రోత్సవాలు

ప్రతియేటా ఆశ్వయుజ మాసంలో  మూలనక్షత్రం రోజున అమ్మవారికి లక్ష పుష్పార్చన, చండీహోమం, మహర్నవమి రోజున అష్టోత్తర శతకలశాభిషేకం, విజయ దశమిరోజున విజయ దర్శనాది కార్యక్ర మాలు, కళాకారుల కళాప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వం చేస్తాయి.



వసంతపంచమి మహోత్సవం

శ్రీవిద్యాసరస్వతి అమ్మవారి సన్నిధిలో మాఘ మాసంలో వసంత పంచమి మహోత్సవం జరుగుతుంది. మాఘ శుద్ధ పంచమి సందర్భంగా విశేష పంచామృతాభిషేకం, చండీహోమం, లక్ష పుష్పార్చన, 56 రకాల భోగాలతో నివేదన, విద్యాజ్యోతి దర్శనం తదితర కార్యక్రమాలు నేత్రపర్వం చేస్తాయి



నిత్యాన్నదాన .. మహాప్రసాదం

ప్రతి భక్తునికి అమ్మవారి మహా ప్రసాదం అందించాలనే సంకల్పంతో 2001లో అన్నదాన సత్రం ఆరంభమైంది. విశాలమైన వంటగదిలో ఆధునిక యంత్రాలతో వంటకాలు కొనసాగేలా భారీ కుకర్లు, రుచికరమైన భోజనం, చక్కని డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేసారు. ప్రతి సంవత్సరం ఐదు లక్షలమంది భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది.



టవర్‌ లిఫ్ట్‌..

కొండ మీద ఉన్న సరస్వతీ మాతను దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్లలేని వికలాంగులు, వయో వృద్ధులు, అనారోగ్య పీడితులకు ఉపయుక్తంగా టవర్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేసారు. లిఫ్ట్‌ నుంచి ఆలయ గర్భగుడికి చేరేందుకు వీల్‌చైర్లు సమకూర్చారు.



భక్తులు బస చేసేందుకు సత్రాలు

క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులు బసచేసేందుకు 22 సత్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా కల్యాణ మండపం, శారదీయమ్‌ తదితర అనేక విశాలమైన భవనాలు అందుబాటులో ఉన్నాయి.

 

ఆకట్టుకునే వీణాపాణి విగ్రహం..

కొండ మీద భక్తులు వెళ్లే మెట్ల మార్గంలో ఎల్తైన వీణాపాణి విగ్రహం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన ద్వారం ముందర వాటర్‌ ఫౌంటేన్, స్వాగత మహా కలశం, పచ్చదనంతో అలరారే  గిరులు, పచ్చని తివాచీలను మరిపించే పచ్చిక బయళ్లు భక్తులను ఆకట్టుకుంటాయి.



అక్షర సారస్వత మండపం

చదువుల తల్లి సన్నిధిలో వేలాదిగా చిన్నారుల అక్షర స్వీకారాలు జరుగుతాయి. ప్రత్యేకంగా విశేష పర్వదినాల్లో రద్దీ మరింత పెరుగుతుంది. ఈ రద్దీని తట్టుకునేందుకు భక్తులకు సౌకర్యవంతంగా రూ.15 లక్షల వ్యయంతో సారస్వత మండపం నిర్మించారు. పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక ప్రసంగాలకు వీలుగా వేదికను ఏర్పాటు చేసారు. అమ్మవారి ఆలయానికి వచ్చే చిన్నారులకోసం చిల్డ్రన్స్‌ పార్క్‌ ప్రత్యేక ఆకర్షణ. ఈ పార్కులో  పెద్దలు కూడా సేదతీరుతారు.



గోశాల.. కొబ్బరి తోట

ఆలయానికి భక్తులు దానరూపంలో ఇచ్చిన గోవుల సంరక్షణకు ఇక్కడ ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేసారు. దాదాపు 10 వరకు గోమాతలు ఇక్కడ సేదతీరుతున్నాయి. అదే విధంగా ఆలయం దిగువన కొబ్బరితోట పెంపకం చేపట్టారు. ఈ తోటలో కొబ్బరి చెట్లతోపాటు అరటి చెట్లు కూడా ఉన్నాయి.



క్షేత్రం సందర్శించిన ప్రముఖులు

వర్గల్‌ క్షేత్రాన్ని కంచి కామకోటి, శృంగేరి, పుష్పగిరి, హంపీ, తొగుట తదితర పీఠాధిపతులు, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు తదితర ప్రముఖులు సందర్శించారు. అమ్మవారి సేవలో పునీతులయ్యారు.



ఈ క్షేత్రానికి ఇలా వెళ్లాలి

వర్గల్‌ విద్యాధరి క్షేత్రానికి తరలి వచ్చే భక్తులకు ఆర్టీసీ సౌకర్యాలు ఉన్నాయి. సికిందరాబాద్‌ గురుద్వార్‌ నుంచి ఉదయం 8.00 గంటలకు, 10.00 గంటలకు, మధ్యాహ్నం 12.00 గంటలకు, సాయంత్రం 2.00 గంటలకు, 4.00 గంటలకు బస్సులు వర్గల్‌ క్షేత్రానికి వచ్చి వెళతాయి. సికిందరాబాద్‌ నుంచి సిద్ధిపేట, కరీంనగర్‌ మార్గంలో రాజీవ్‌ రహదారిపై వర్గల్‌ క్రాస్‌రోడ్డు వరకు గజ్వేల్, సిద్ధిపేట, కరీంనగర్‌ రూట్‌లో వెళ్లే ఆర్టీసీ బస్సులలో చేరుకోవచ్చు. క్రాస్‌రోడ్డు నుంచి క్షేత్రానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి.



మార్గమధ్యంలో రత్నాలయం

సికిందరాబాద్‌ నుంచి వర్గల్‌ సరస్వతి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యంలో  రాజీవ్‌ రహదారిపై అలియాబాద్‌ చౌరస్తా వద్ద వెంకటేశ్వరుడు కొలువుదీరిన రత్నాలయాన్ని సందర్శించవచ్చు.  

– గౌరారం విజయ్‌కుమార్,  సాక్షి, వర్గల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top