అలా... ఆ అడవిలో ఆమె పెళ్లయిపోయింది!

అలా... ఆ అడవిలో  ఆమె పెళ్లయిపోయింది!


‘టార్జాన్’’ సినిమాల్లో చూస్తుంటాం... పాష్‌గా, జోష్‌గా ఉండే పట్టణ ప్రాంత అమ్మాయి...అమాయకంగా, మొరటుగా కనిపించే టార్జన్ ప్రేమలో పడుతుంది. ‘సినిమాలో సాధ్యం కానిదేముంది’ అని వెక్కిరింపుగా అనుకుంటాంగానీ...నిజజీవితంలో కూడా అలాంటివి జరుగుతుంటాయి అని చెప్పడానికి అందమైన యువతి శారా బేగం గురించి మనం తప్పక చెప్పుకోవాలి. ఇంచుమించుగా టార్జాన్ సినిమా కథల్లా ఉండే నిజజీవితంలోని ఓ ఆసక్తికరమైన కథ ఇది...

 

బ్రిటిష్  ఫిల్మ్ మేకర్  శారా బేగంకు తొమ్మిదేళ్ల వయసు నుంచి ఒక కోరిక ఉండేది... అమెజాన్ అడవుల్లో ఉండే ఆదివాసులను చూడాలని. ఆ కోరిక తనతో పాటు పెరిగి పెద్దయిపోయింది. ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో లండన్‌లో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని  హురోని తెగ ప్రజల జీవనశైలి గురించి అధ్యయనం చేయడానికి ఈక్వేడర్ అడవుల్లోకి వెళ్లింది శారా.  ఆ అడవిలో హురోని తెగకు చెందిన వాళ్లు మూడు వేల వరకు ఉంటారు. వారు శారాకు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడికి వెళ్లిన తరువాత... బయటి వ్యక్తిగా శారా ఎప్పుడూ ప్రవర్తించలేదు. వాళ్లలో భాగమైపోయింది. అల్లికల నుంచి వేట వరకు అన్నీ నేర్చుకుంది. ఈలోపు కథలో చిన్న ట్విస్ట్....



ఉన్నట్టుండి ఒకరోజు తెగ పెద్దలు శారాను ఒక గుడిసెలోకి పిలిచి వివస్త్రగా మార్చివేసి తమ సంప్రదాయ దుస్తులను ధరింప చేశారు. తమ సంప్రదాయానికి  సంబంధించిన  మంత్రాలు చదవడం ప్రారంభించారు.  ఏం జరుగుతుందో శారాకు  అర్థం కాలేదు. ‘‘నువ్వు మాకు రాణిలాంటిదానివి.  మా తెగ యోధుడు జింక్టోతో నీకు వివాహం జరిపిస్తున్నాం. లైంగిక అవసరాల కోసం నిన్ను వాడుకోవడానికి ఇలా చేయడం లేదు. మా తెగ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారిని, ఇష్టమైన అమ్మాయిలను ఇలా గౌరవిస్తాం’’ అన్నారు పెద్దలు. వారి అమాయకత్వానికి  ఆశ్చర్యపడిందో, ముచ్చటపడిందో, తనకు తాను రాజీ పడిందో తెలియదుగానీ... జింక్టోతో జరిగిన తన పెళ్లి తంతును ఆమె ప్రతిఘటించలేదు. విశేషం ఏమిటంటే, జింక్టో కూడా తనకు బాగా నచ్చాడు.  ‘‘జింక్టో బలశాలి,  నేర్పరి అయిన వేటగాడు మాత్రమే కాదు... మంచి హృదయం ఉన్నవాడు’’ అని జింక్టో గురించి మెచ్చుకోలుగా మాట్లాడింది శారా.  రెండు వారాలు తరువాత తిరిగి లండన్‌కు చేరుకుంది శారా. ఈ రెండు వారాల్లోనే హురోని తెగల ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకుంది. వారి మనసులో చోటు సంపాదించకుంది.



లండన్‌కు వచ్చిన తరువాత తన అడవి అనుభవాలను ‘అమెజాన్ సోల్స్’ పేరుతో డాక్యుమెంటరీగా నిర్మించింది. ఇది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రశంసలు అందుకొంది. ఆమె సాహసాన్ని అందరూ కొనియాడారు.  శారా అడవికి దూరమై పోవచ్చుగానీ, ఆమె హృదయంలో హురోని తెగ ప్రజలు ఉన్నారు. వారి గురించి కబుర్లను ఇప్పటికీ ఫేస్‌బుక్‌లో ఆసక్తికరంగా  రాస్తూనే ఉంది శారా బేగం. ‘‘వెనక్కి వెళ్లి అందరినీ చూసి రావాలని ఉంది’’ అని కూడా ఆమె అంటోంది.   

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top