ఉప్పునీటి దీపం... ఊరంతా వెలుగు!

ఉప్పునీటి దీపం...  ఊరంతా వెలుగు!


ప్రయత్నం


 


కరెంట్... ఇది లేకుండా ఇవాళ మనం జీవితాన్నే ఊహించలేం. కరెంట్ బిల్లులు ఎంత తడిసి మోపెడవుతున్నా, విద్యుచ్ఛక్తి లేకుండా రోజు గడవని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే, విద్యుచ్ఛక్తితో సంబంధం లేకుండా కారు చౌకగా వెలుతురునిచ్చే దీపం ఒకటి ఈ మధ్య తయారైంది. కిరోసిన్, గ్యాస్ లాంటివి ఏవీ అవసరం లేని ఈ దీపం ఫిలిప్పైన్స్‌లో చాలామంది ఇళ్ళలో వెలుగు పంచుతోంది. 


 

ఫిలిప్పైన్స్‌కు చెందిన టీనేజ్ అక్కా తమ్ముళ్ళు ఐసా మిజెనో, రాఫెల్ మిజెనోలు ఈ కారుచౌక దీపాన్ని తయారుచేశారు. ఇంధనంతో పని లేని ఈ దీపాన్ని కేవలం కొన్ని లోహపు పలకలు, కాస్తంత ఉప్పు నీటితో వారు రూపొందించారు. చేతితో ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళే వీలుండడం ఈ ల్యాంప్‌కు ఉన్న మరో వెసులుబాటు.


 


ఈ ప్రయోగానికి ప్రేరణ ఏంటి?

అసలు ఈ దీపం తయారు చేయాలనే ఆలోచన రావడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఫిలిప్పైన్స్‌లో ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి సౌకర్యం లేదు. ఆ కొరతే ఈ అక్కాతముళ్ళను ఈ నూతన ఆవిష్కరణకు పురిగొల్పింది. కంప్యూటర్ ఇంజనీర్ అయిన ఐసా మిజెనో కొంతకాలం క్రితం ‘గ్రీన్‌పీస్’ అనే సంస్థ తరఫున ఒక గ్రామీణ ప్రాంతంలో బుట్‌బుట్ అనే తెగ వారితో కలసి పనిచేశారు. ఆ సమయంలో అక్కడి మారుమూల కలింగా పర్వతశ్రేణుల్లో జనం విద్యుచ్ఛక్తి లేక పడుతున్న అవస్థలు ఆ అమ్మాయిని కదిలించాయి. విద్యుచ్ఛక్తి లేకపోవడంతో అక్కడి జనం వెలుగు కోసం ఎక్కువగా కిరోసిన్ దీపాలను ఆశ్రయించేవారు. అయితే, రవాణా సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. ఒక్క సీసా కిరోసిన్ కొనుక్కోవడానికి వాళ్ళు కనీసం 12 గంటలు నడిచి వెళ్ళాల్సిన దుఃస్థితి. అలా కిరోసిన్ తెచ్చుకోవడం కూడా అక్కడ పెను సవాలే. అంతే! ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనీ, అది వ్యాపా రాత్మకంగా కూడా ఉండాలనీ ఆమె భావించారు. విద్యుత్ సమస్యకు ప్రత్యామ్నాయంగా సోదరుడు రాఫెల్‌తో కలసి చౌకరకం దీపం రూపకల్పనకు ఐసా నడుం బిగించారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రుడైన ఆ కుర్రాడు కూడా అక్కతో కలసి అడుగేశారు. 


 


అక్కాతమ్ముళ్ళ అనుబంధం

ఈ అక్కాతమ్ముళ్ళ బంధం ఈ స్టార్టప్ ప్రయోగానికి విజయం తెచ్చిపెట్టింది. ‘‘‘సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్’ (ఎస్.ఎ.ఎల్‌టి - ‘సాల్ట్’) అనే ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం వెనుక మా తమ్ముడి సహకారం చాలా ఉంది. ‘ఐడియాస్పేస్ ఫౌండేషన్’లో ఈ కొత్త ఆవిష్కరణ తాలూకు ప్రయోగం చేస్తున్నప్పుడు ఒకానొక దశలో నేను చేతులు ఎత్తేశాను. మానసిక ఒత్తిడి, డెడ్‌లైన్స్, అంచనాలను అందుకోవాలనేవి నేను మోయలేని బరువయ్యాయి. ఆ సమయంలో తమ్ముడు నాకు అండగా నిలిచి, మానసికంగా నాకు ధైర్యం చెప్పాడు’’ అని ఐసా వివరించారు.


 

నిజానికి, ఈ అక్కాతమ్ముళ్ళది చిన్నప్పటి నుంచి విడదీయరాని బంధం. తమ్ముడు రాఫెల్ మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్. పుస్తకాలు బాగా చదువుతాడు. పుస్తకాలు చదవడంతో వచ్చిన విజ్ఞానం, వినయం, పెరిగిన ఆలోచన కూడా ఈ ఉప్పునీటి దీపం రూపకల్పనకు దోహదపడ్డాయి. మరోపక్క ఐసా ప్రశ్నల పుట్ట. ఏదైనా సరే క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకొనే రకం. ప్రతి విషయంలోనూ అమితమైన ఆసక్తి. ఇలా ఒకరికొకరి భిన్నమైన నైపుణ్యాలు తోడవడంతో ఈ సాల్ట్‌వాటర్ ల్యాంప్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది.


 


అద్భుతమన్న అమెరికా

విశేషం ఏమిటంటే, ఈ దీపాల తయారీ, వీటి వినియోగం గురించి ఇప్పుడు మన భారతదేశంలోనూ, ఆగ్నేయాసియాలోనూ ఎంతో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆసియా ప్రాంతంలో ‘సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్’ (ఎస్.ఎ.ఎల్‌టి - ‘సాల్ట్’) పేరిట ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళుతున్నారు. రాగల రోజుల్లో ఇంటి మొత్తానికీ విద్యుత్‌ను సమకూర్చేలా ఉప్పునీటితోనే పనిచేసే జనరేటర్‌ను రూపొందించాలని ఈ టీనేజ్ సోదర సోదరీమణులు భావిస్తున్నారు. అటుపైన ఏకంగా ఉప్పునీటి విద్యుత్కేంద్రాన్నే నెలకొల్పినా ఆశ్చర్యం లేదు.


 

ఇప్పటికైతే, ఈ ఉప్పునీటి దీపాల్ని పెద్ద సంఖ్యలో తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తూర్పు ఆసియా ప్రాంతంలోని వివిధ సంస్థల సహాయ సహకారాల్ని తీసుకుంటున్నారు. మరో విశేషం ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈ ప్రయత్నాన్ని ‘‘మహత్తరమైన ఆలోచన’’ అని పేర్కొన్నారు. ఇటీవల అనేక దేశాల్లో సరికొత్త సాంకేతిక విజ్ఞానంతో ముందుకొస్తున్న యువ వ్యాపారవేత్తలకు ఐసా లాంటి అమ్మాయిలు సరైన ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి, ఈ సాల్ట్‌వాటర్ ల్యాంప్‌లు పెద్దయెత్తున మన దేశానికి కూడా విస్తరిస్తే, ప్రతి మారుమూల పల్లె కాంతులీనుతుంది కదూ!


 


 


ఈ ‘ఉప్పునీటి దీపం’ కథేంటి?

ఫిలిప్పైన్స్‌లో దిగువ ఆదాయ వర్గానికి చెందిన ఇళ్ళలో కూడా నీళ్ళు, బియ్యం, ఉప్పు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉప్పు నీళ్ళు పుష్కలం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఈ సోదర సోదరీమణుల జంట అడుగు ముందుకేసింది. వారు రెండు వేర్వేరు రకాలైన లోహపు పలకల్ని తీసుకొని, ఉప్పునీటిలో మునిగేలా చేశారు. ఈ క్రమంలో అదనపు ఎలక్ట్రాన్‌లు ఒక లోహపు పలక నుంచి మరొకదానికి తీగ గుండా ప్రయాణిస్తాయి. ఆ రకంగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయి, ‘ఎల్.ఇ.డి’ దీపాన్ని వెలిగేలా చేస్తుంది. విశేషం ఏమిటంటే, ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని, దానిలో రెండు టీ స్పూన్ల ఉప్పు కలిపి, ఆ ద్రావణాన్ని లోహపు పలకలతో వినియోగిస్తే చాలు. ఆ దీపం ఏకంగా 8 గంటల పాటు నిర్విరామంగా వెలుగుతుంది. కాంతిని ప్రసాదిస్తుంది. మరో విశేషం ఏమిటంటే, కిరోసిన్ దీపాల లాగా ఈ ఉప్పునీటి దీపాలు ప్రమాదభరితమైనవి కావు. హాయిగా ఇంట్లో వీటిని తగిలించి, ఉంచుకోవచ్చు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఇళ్ళలో తయారు చేసిన ఉప్పునీటి ద్రావణంతో కూడా ఈ దీపాల్ని మళ్ళీ నింపుకోవచ్చు. సముద్రతీరంలో నివసించేవారైతే, సింపుల్‌గా సముద్రపు నీటిని వాడుకోవచ్చు. అయితే, ఈ ల్యాంప్‌లలోని ఎలక్ట్రోడ్ పలకల్ని మాత్రం దాదాపు ఏటా రెండుసార్లు మార్చాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూసినప్పటికీ, ఫిలిప్పైన్స్‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ దీపాలు తక్కువ ఖర్చుతో, వెసులుబాటుగా మారాయి.


 


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top